కొత్త గీతాంజలి

ఫాల్గుణ మాసం వస్తూనే టాగోర్ మళ్లా నా తలుపు తట్టాడు. గంటేడ గౌరునాయుడు గీతాంజలి స్వేచ్ఛానుసృజన నా బల్ల మీద వచ్చి వాలింది. వెంటనే పుస్తకం ఆమూలాగ్రం చదువుకున్నాను. చిరపరిచితమైన ఆ కవిత్వం కొత్తగా కనిపించింది.

అనువాదం దూరాన్ని దగ్గరచేయడమే కాదు, మనకి మరీ దగ్గరగా ఉన్నదాన్ని కొత్తగా, దూరంగా చూపించాలి కూడా.సన్నిహితమైందాన్ని సరికొత్తగా చూపించడమే కవిత్వ ప్రయోజనం. ‘నిన్నలేని అందమేదో నిదురలేవడమే ‘ కవిత్వం మనకిచ్చే కానుక. రోజూ జీవించే జీవితమే, కవి చూసినప్పుడు, కొత్తగా కనిపించినట్టే, మనం ఇంతకుముందు ఎన్నో సార్లు, ఎన్నో అనువాదాల్లో చదివిన కవిత్వమే, మళ్ళా కొత్తగా కనిపించడం మంచి అనువాదం లక్షణం.

గౌరునాయుడు గీతాంజలిని గానయోగ్యంగా అనువదించానని చెప్పుకున్నాడు. కాని ఈ అనువాదంలో నాకు నచ్చింది, అతడు ఈ కవిత్వాన్ని కొత్తగా సమీపించిన తీరు. ఈ కవిత చూడండి:

నా నామధేయాన నాలోని నేను
తిమిరకూపంలోన చిక్కి కుమిలేను

ప్రాకారమెత్తాలనే నిత్య యత్నం
ఆ ప్రయత్నంలోనె గడిపేను కాలం.

ఆకసమునంటేను ఆ చుట్టుగోడ
దాచింది దానిని దాని చీకటి నీడ

బీటవారక చేస్తి మేటినిర్మాణము
గోడ చూడగ నాకు గర్వాతిశయము

నాతోనె ఉంటాడు నేనైన వాడు
ఇంతచేసిన నాకు వాడు కనరాడు.

ఈ కవిత చదవగానే దీన్ని ఇంతకుముందు ఇంగ్లిషులో చదివేనా లేక గౌరునాయుడు పూర్తిగా తన పద్ధతిలో అనువదించాడా అని అనుమానమొచ్చింది. ఇంగ్లిషు మూలం చూసాను. 29 వ కవిత. ఇలా ఉంది.

HE WHOM I ENCLOSE with my name is weeping in this dungeon. I am ever busy building this wall all around, and as this wall goes up into the sky day by day I lose sight of my true being in its dark shadow.

I take pride in this great wall, and I plaster it with dust and sand lest a least hole should be left in this name; and for all the care I take I lose sight of my true being.

అనువాదం యథాతథంగా ఉంది. కాని, కవిత చాలా కొత్తగా, నేను ఇంతకుముందు చదవలేదేమోనన్నంత కొత్తగా ఉంది.

చలంగారి అనువాదం తీసి చూసాను. ఇలా ఉంది:

నా పేరుతో నేనెవర్ని ఇముడ్చుకున్నానో
వాడీ చీకటి కారాగారంలో పడి ఏడుస్తున్నాడు
నా చుట్టూ చాలా శ్రద్ధగా ఈ గోడని కడుతోవుంటాడు
అది ఆకాశానికంటుతో పైకి లేచిన కొద్దీ
దాని చీకటినీడలో రోజు రోజూ
స్వస్వరూపం నా కళ్ళనుంచు మరుగు ఔతోంది.

ఈ పెద్దగోడని చూసుకుని నాకు చాలా గర్వం!
నా పేరులో ఎక్కడన్నా ఓ పగులు మిగిలిపోతుందేమోనని
దుమ్ముతో ఇసికతో
ఈ గోడని బాగా అలుకుతో వుంటాను
ఇంత శ్రద్ధ తీసుకుంటున్నప్పటికీ
నా స్వరూపం నా చూపుకి ఇంకా దూరమౌతోంది.

లేదు. గౌరునాయుడు అనువాదం ఎక్కడా చలంగారిని గుర్తుచేయడం లేదు. అనువాదకుడిగా గౌరునాయుడు ఉత్తీర్ణుడయ్యాడనిపించింది. ఇటువంటి ఆశ్చర్యాలు ఈ పుస్తకంలో చాలానే ఉన్నాయి. ఈ కవిత చూడండి, 75 వ కవిత:

స్వామీ మా మానవుల ఎన్నెన్నో అవసరాలు
ఫలవతం చేసి తిరిగె నిన్నె చేరు నీ వరాలు.

పల్లెలను,పొలాలను పలకరించి సాగేటి
నదినడకలు నీ పదములు కడిగేటందుకే కదా.

సౌరభాలు విరజిమ్మి గాలికి గంధం పూసే
విరికన్నియ తానున్నది నీ అర్పణకొరకే గద.

కవి గీతంలో భావం ఎవరికెట్లు తోచినా
ఆ మాటల తుది అర్థం నిన్నే సూచించదా

విశ్వసుమం నీలోనే కదా విచ్చుకుంటున్నది
జగతిని నీ పూజకింక వచ్చే కొరతేమున్నది.

అనువాదంలో శబ్ద విచ్ఛిత్తి సంభవిస్తుంది. అంటే మనకు తెలిసిన పదాల్నే మహాకవీ, అనువాదకుడూ ఇద్దరూ కూడా పగలగొట్టి చూస్తారు. అప్పుడు ఆ పదాలు తమ భారాన్ని త్యజించి ఎగరడం మొదలుపెడతాయి. మంచి అనువాదకుడిమీద అదనపు బాధ్యత ఏమిటంటే, అతడు తనకు ముందు వచ్చిన అనువాదాల్ని మనం మర్చిపోయేటట్లు చెయ్యవలసి ఉంటుంది. భగవద్గీతకు బార్బరా స్టోలర్ మిల్లర్ చేసిన అనువాదం చదివినప్పుడు నాకు ఇలాంటి అనుభూతినే కలిగింది. చిరపరిచితమైన సంస్కృత పదాలు, ఆ చిరపరిచయం వల్ల కొత్త స్పందనలు నాలో రేకెత్తించడం మానేసిన వేళ, అవే భావాలు ఇంగ్లిషులో చదివినప్పుడు, ఆ పదాలు సరికొత్త స్ఫురణల్తో నా ముందు ప్రత్యక్షమయ్యాయి.

గౌరునాయుడు గీతాంజలికి చేసిన ఈ అనువాదం, ఒకవైపు మూలవిధేయంగా ఉంటూనే, ఈ కవితలు గౌరునాయుడు రాసుకున్న సొంత కవితల్లాగా కనిపించడం నన్ను ఆశ్చర్యపరిచింది. 97 వ కవితకు ఈ అనువాదం చూడండి:

అడగలేదు నీవెవరని నేను ఎన్నడు
క్రీడాంగణమున నీతో ఆటలాడు నాడు
వెరపు బిడియాలెరుగని గతమొక విరిజల్లు
ఆ జీవితోత్సవమొక ఆనందపు హరివిల్లు.

వేకవనే నిదురలేపి కొండాకోనల తిప్పి
నేస్తంలా ఆడించేవాడివి నేనడగకనే
గొంతు కలిపి నా ఎడద లయకు నాట్యమాడేది
ఆ రోజు ఆ పాటల అర్థాలు అడగకనే.

ఆటాపాటల గతమది, ఆనందపు లోకమది
నేడు నా కనులముందు కదలాడే దృశ్యమేది?
నీ చరణాంకిత దృక్కుల అవనత వేదనమున
నిశీధి నీరవ తారా నివహ భయద ప్రపంచం.

ఇది టిక్కబాయి రోజులు తలుచుకుంటూ గౌరునాయుడు రాసుకున్న కవితలాగా ఉంది తప్ప టాగోర్ కవితలాగా లేదు.

ఇటువంటి భావుకులు అనుసృజనకు పూనుకున్న ప్రతిసారీ టాగోర్ మళ్లా కొత్తగా పుడుతూనే ఉంటాడు.

22-2-2023

10 Replies to “కొత్త గీతాంజలి”

  1. శుభోదయం సార్.మీ భావ ఝరి లో ప్రతిఉదయం కొత్తగా గోచరమవుతుంది

  2. కవిత్వ భావాన్ని…దానిలో కొత్తదనాన్ని వెతకడం లోని అనుభూతిని బాగా చెప్పారు సర్ thank you

  3. నేనెప్పుడూ అనుకుంటాను ,గీతాంజలి ఓ అద్దంలాంటిది ,దాన్లో ఇంకో కవి తొంగి చూసుకున్నప్పుడు గీతాంజలితో మమేకమైన స్వరూపం కనిపిస్తుంది .అందుకే ప్రతీ అనువాదం కొత్తగా కనిపిస్తుంది.

  4. ఇచ్చిన రెండు ఉదాహరణలూ దోసిటి మల్లెల్లా ఉన్నాయి.సరళసుందరం .వారికి అభినందనలు.

  5. నా మనసులోని మాట మీరు గ్రహించినందుకు చాలా సంతోషంగా ఉంది. *మరలనిదేల గీతాంజలియన్న* 🙏

Leave a Reply to Vadrevu Ch VeerabhadruduCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading