జ్ఞాపకమై పరిమళిస్తున్నావు తల్లీ!

భైరి ఇందిర

భైరి ఇందిర గారిని ఒకసారన్నా చూశానా? చూసినట్టే ఉంది హైదరాబాదులో ఎప్పుడో ఏదో ఒక సమావేశంలో ఆమె తనంతట తానే నన్ను పలకరించిన అస్పష్టమైన జ్ఞాపకం ఒకటి మనసులో కదలాడుతూ ఉంది.

ఆమె మూడేళ్లుగా క్యాన్సర్ తో పోరాడేరనీ, ఇప్పుడు ఈ లోకం నుంచి సెలవు తీసుకున్నారనీ విన్నాను. కానీ ఆ వార్తతో పాటే మిత్రులు ఈ కవిత కూడా షేర్ చేశారు. ఎటువంటి కవిత ఇది! ఎంతగా ప్రజ్వలిస్తున్న కవిత! ఒక రేవతి దేవి, ఒక సావిత్రి మాత్రమే బహుశా ఇటువంటి కవిత రాయగలరు. ఆమె మృతి ఈ కవితని వెలిగిస్తున్నదో, ఈ కవిత ఆమె మృతిని వెలిగిస్తున్నదో చెప్పలేకపోతున్నాను, కాని, వెయ్యేళ్ల తెలుగు సాహిత్యంలో ఇటువంటి కవిత చదవడం ఇదే మొదటిసారి అని మాత్రం చెప్పగలను.

అమ్మా! ఇప్పుడు మీరు లేరు కానీ మీ పాట ఉంది. ఈ పాట ఉన్నంతకాలం మీరు బతికే ఉంటారు. ఈ నేల మీద పరిమళిస్తూనే ఉంటారు.


నేను పోయినప్పుడు

నేను పోయినప్పుడు
వస్త్రానికి బదులు
ఓ కాగితాన్ని కప్పండి
కవిత రాసుకుంటాను

సిరాబుడ్డినీ, పెన్నునొకదాన్ని
బ్యాగులో వుంచండి
మనసులో ముల్లు గుచ్చుకున్నప్పటి పాటో
గాయపడిన గజలో
గుండెలోయలనుండి జాలువారొచ్చు
సెల్ మర్చిపొయ్యేరు
బోర్ కొట్టి చస్తాను

పసుపూ-కుంకుమ పులిమి
భయానకంగా మార్చకండి
నన్నందరూ గుర్తుపట్టాలి మరి!
దండలతో మూసెయ్యకండి
నాకు ఎలర్జీ!!
ఆ రేకులతో ఏదార్నైనా
మెత్తగా పరవండి

పుణ్యస్త్రీ, పాపపు స్త్రీ అని
పేర్లు పెట్టకండి
నచ్చదు
సామాన్లేవీ పారేయొద్దు అడిగినవాళ్లకిచ్చేయండి
బ్యాండ్ వాళ్ళను
ఓల్డ్ మెలొడీస్ వాయించమనండి
డ్యాన్సులాడి లేట్ చెయ్యకండి
టైమంటే టైమే!

మంగళవారమో! అమంగళవారమో!!
పాడెకు కోడిపిల్లను కట్టి హింసించకండి
బడికి కబురు పెట్టండి
నే బతికిన క్షణాలు తలుచుని
వాళ్లు సెలవిచ్చుకుంటారు

దింపుడుకళ్లం దగ్గర
చెవులు గిల్లుమనేలా పిలవకండి
తలుచుకునేవారెవరో నాకు తెలుసు

డబ్బుకు ఇబ్బందక్కరలేదు
పక్కవాళ్ల కొట్లో ఖాతాఉంది
అన్నిరోజులూ ఇక్కడే ఉండండి
మళ్లీ మళ్లీ చస్తానా ఏంటి!

మట్టిలో కప్పెట్టకండి
పురుగూ పుట్రా భయం!
కాస్త చూసి తగలబెట్టండే…
చుట్టుపక్కల మొక్కలుంటాయేమో!
గంధపుచెక్కలతో కాలడం కంటే
జ్ఞాపకమై పరిమళించడమే ఎక్కువ నాకు

పనిలో పని!
నా నవ్వులూ కన్నీళ్ళు ఆవిరైపోతున్న కాష్టం దగ్గర
కవిసమ్మేళనం పెట్టండి
నేనూ ఉన్నట్టుంటుంది
తనివితీరా విన్నట్టుంటుంది.


ఈ కవితతో పాటు ‘ఉదయాలను తిలకించే హృదయాలకు వందనం’ అని ఆమె రాసిన గజల్ డాక్టర్ గజల్ వాసుదేవ్ గానం చేయగా విన్నాను. ఇంత ఆశ గుండెల్లో నింపుకున్న ఇలాంటి వాళ్ళు కదా ఈ లోకంలో జీవించవలసింది!

వినండి ఆ గానం:

ఉదయాలను తిలకించే హృదయాలకు వందనం

20-2-2023

24 Replies to “జ్ఞాపకమై పరిమళిస్తున్నావు తల్లీ!”

 1. కవిత్వాన్ని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించడం అంటే ఇదేనేమో.
  సమున్నతమైన భావాలున్న కవిత.
  తమ ఇష్టాయిష్టాలను ఎలాంటి సంకోచం లేకుండా
  వ్రాసుకున్నారు ఇందిర గారు.

  మృతిలోనూ ధీరోదాత్తత ….

  ఓం శాంతి శాంతి శాంతిః.

 2. కవిత చదువుతూంటే కళ్ళల్లోకి అప్రయత్నంగా నీళ్లు వచ్చాయి అండీ

 3. ఇందిర గారు సామజిక స్పృహ తో కూడిన కవిత్వం రాసేవారు.. ఒకసారి కాల్ చేసి మాట్లాడారు బాగా చైతన్యం తో ఉండాలి రాజకీయంగా అన్నారు. ఖమ్మం లో హాస్పిటల్ లో వున్నారని తెలిసీ వెళ్లి కలిసి వచ్చాను ఎంత ప్రేమగా మాట్లాడారో…. చివరి చూపుకి వెళ్లలేక పోయాను… అమ్మ కి నివాళి

 4. అవును సర్.నిన్న ఎవరో ఆ కవిత షేర్ చేసారు. అప్రయత్నంగా బాధతో మిళితమైన ఒక అనిర్వచనీయ ఆశ్చర్యమో అద్భుతభావనో కలిగింది.ఆమె మృత్యు భయాన్ని జయించింది.
  అందుకే అంత గొప్ప కవిత రాయగలిగింది.ఆమె ఒక గజల్ కవుల సమ్మేళనంలో పరిచయం.ఇది చదివిన వెంటనే నాకిలా తోచింది
  నివాళి
  ******
  ఒక గజల్ కలం
  భూమిలోకి దూరింది
  మళ్లీ కొత్తకలమై మొలవాలని

  తన మరణ సన్నివేశం
  ముందే నిర్దేశించుకుంది
  తన అంత్యక్రియల కార్యక్రమం
  తానే రూపొందించుకుంది
  బడికి తెలిపితే సెలవిస్తారని
  పురుగూ పుట్రా చెట్టూ చేమా
  లేకుండా కాల్చమని
  కాష్ఠం వద్ద కవిసమ్మేళనమని
  అందరూ ఊహించుకుని భయపడే చావుని
  ఆమె అలవోకగా ఆహ్వానించింది

  ఎన్ని కలాలు కలకలమయ్యాయో
  ఎన్ని గజళ్ల షేర్లు కన్నీళ్లు వర్షించాయో
  ఇందిరా భైరి చిరునామా
  నిన్నటిదాకా ఖమ్మం
  ఇకపై ప్రతి కవి గుండె గుమ్మం

  అశ్రు నయనాలతో 🙏

  (ఒక్కసారే కలుసుకున్నాం
  గజల్ కవి సమ్మేళనంలో )

 5. డాక్టర్ గజల్ వాసుదేవ్ గారూ చాలా బాగా పాడారు 🙏

 6. ఈ కవిత నిన్న చూసినప్పటి నుండి కష్టపెట్టింది కన్నీళ్లు పెట్టించింది
  విరిసి విరియని నవ్వుని తెప్పించింది
  మళ్లీ మళ్లీ చదివించింది బాధించింది వేధించింది
  తన సమాధి మీద తనే కప్పుకున్న పూలదండ లాగా మెరిసింది
  అక్షర నిజం
  తెలుగు సాహిత్యంలో ఇదో గొప్ప కవిత

 7. చాలా చక్కని గజల్. గజల్ లో ముక్తపదగ్రస్తం సాధించిన ఆమె కలానికి జోహార్లు. గాయకులుగా గానంతో ఆమెకు అమరత్వ సిద్ది కల్పించారు.

 8. అశ్రుపూల నివాళి అని తప్ప మరో మాట అనలేని పరిస్థితి నాది

 9. జీవితానికి వీడ్కోలు చెప్పే ఘడియలోనే రాయగలిగిన చివరి కవిత, చిరస్మరణీయ కవిత. 🙏

 10. భైరి ఇందిర గారి మరణవార్తా, ఆ వెంటనే ఈ కవితా ఒక్కసారే చదివి విషాదాన్నీ విభ్రాంతినీ ఒకేసారి అనుభూతి చెందాను. ఇంతకుముందు చదివిన కవిత ఇంకా క్రిస్ప్ గా ఉంది. ఇందులో కొన్ని సవరణలు చేశారేమో అనిపించింది.

  అప్పటిదాకా ఆమెతో పరిచయం లేదు కానీ అప్పటికప్పుడు కలిగిన ఆత్మీయతతో కళ్లు చెమ్మగిల్లాయి. ఇంతవరకు ఇంత పదునైన లేజర్ వంటి కవితని (ఈ సబ్జెక్టు పైన) చదవలేదు. తోటి జీవరాశులపట్ల ఆమెకున్న కరుణా, మూఢాచారాల పట్ల విముఖతా, కవిత్వం పట్ల ప్రేమా స్ఫటిక స్వచ్ఛతతో కనిపిస్తున్నాయి ఈ కవిత లో.
  ఆమెకు నివాళి.

Leave a Reply

%d bloggers like this: