భాష, భక్తులు, భగవంతుడు

తిరూరు నది ఒడ్డున

తుంచెన్ పండగలో ఈరోజు సాహిత్య అకాడమీ సెమినారు. భారతీయ భాషల్లో కవిత్వ సంప్రదాయం, కథన పద్ధతుల పైన గోష్ఠి. ఈరోజు తుంచెన్ పరంబుకి వెళ్లే ముందు తిరూరు పక్కన ఉన్న త్రికండియూర్ దేవాలయానికి వెళ్లాను. ఎజుత్తచ్చన్ త్రికండియూర్ లో పుట్టాడని చెప్తారు. ఆ త్రికండియూరే ఇప్పుడు తిరూరుగా మారిందని చెప్తున్నారు. ఆ శివాలయానికి వెళ్ళిరావడంతో తిరూరు యాత్ర సంపూర్ణమైంది.

ఇక్కడ దేవాలయాలు చాల నిరాడంబరమైన మందిరాలుగా కనిపిస్తాయి. దేవాలయ శిల్పం గురించి వివరించేటప్పుడు నాగర, వేసర, పల్లవ శైలుల గురించి మాట్లాడారు కానీ ఈ శైలి గురించి ఎవరూ మాట్లాడలేదు. నా మటుకు నాకు ఇలా విశాలమైన ప్రాంగణంలో ఒక చిన్న మందిరంలో దేవుడు కొలువై ఉండడం చూడటానికి చాలా సంతోషంగా అనిపించింది. ఇలాంటి దేవాలయాల్లో దేవుడు ఆశ్రమవాసం చేస్తున్నట్లు కనిపిస్తాడు.

త్రికండియూర్ దేవాలయం

ఈరోజు గోష్ఠి ఒక మలయాళీ యువతి ఆలపించిన అద్భుత గీతంతో మొదలయ్యింది. అది ఓ.ఎన్.వి. కురుప్ అనే మలయాళీ మహాకవి రాసిన సరయు విలక్కు అని అక్కడి మిత్రులు నాకు వివరించారు. ప్రారంభ సమావేశం ప్రసిద్ధ మలయాళీ కవి ప్రభా వర్మ అధ్యక్ష ఉపన్యాసంతో మొదలైంది. ఆయన వైదుష్యం, ప్రాక్పశ్చిమ కవిత్వాల గురించి, ఆలంకార శాస్త్రాల గురించి ఆయనకు ఉన్న పాండిత్యం ఆ ప్రసంగానికి వన్నెతెచ్చింది. ఆయన తన సుదీర్ఘ ప్రసంగంలో ఆక్టేవియో పాజ్, హాప్కిన్స్, బోదిలేర్, డికిన సన్ వంటి కవులతో పాటు, కాళిదాసు, మహాభారతం, ధ్వన్యాలోకం నుంచి కూడా విస్తారంగా కోట్ చేస్తూ మాట్లాడాడు. త్యాగరాజ స్వామి ‘నిధి చాల సుఖమా’ కూడా ఆ ప్రసంగంలో చోటుచేసుకుంది.

ప్రారంభ సమావేశం తర్వాత జరిగిన మొదటి సదస్సులో తమిళ కన్నడ సాహిత్య ప్రతినిధులు తమ తమ భాషా కవిత్వ సంప్రదాయాల గురించి వివరించారు. కన్నడ భాషా కవిత్వం గురించి వివరించిన వక్త ప్రధానంగా కన్నడ కవులు వివిధ రకాల కన్నడ ఛందస్సుల్ని ఏ విధంగా ఉపయోగించారు అన్నదానిపైన ఎక్కువ దృష్టి పెట్టింది. తమిళ సాహిత్యం గురించి మాట్లాడిన వక్త ఆధునిక తమిళ కవిత్వంలోని వివిధ రకాలైన వ్యక్తీకరణ పద్ధతుల గురించి వివరించాడు. ముఖ్యంగా తమిళ వాడుక భాషను కవిత్వ భాషగా మారుస్తున్న సమకాలిక కవుల కవితల్ని ఎక్కువ ఉదాహరించాడు.

మధ్యాహ్న భోజనం తర్వాత రెండవ సదస్సులో హిందీ తెలుగు సాహిత్యాల గురించిన ప్రసంగాలు నడిచాయి. హిందీ సాహిత్యానికి ప్రతినిధిగా వచ్చిన ఓం ప్రకాష్ ద్వివేది వృత్తిరీత్యా ఇంగ్లీషు సాహిత్య ఉపాధ్యాయుడు. ఇంగ్లీషు హిందీ సాహిత్యాలను తులనాత్మకంగా అధ్యయనం చేయడంలో ఆసక్తి ఉన్నవాడు. ఆయన తన ప్రసంగాన్ని ఒకే ఒక్క రచయితకు, అది కూడా ఆ రచయిత రాసిన ఒకే ఒక్క నవలకు పరిమితం చేశాడు. టీవీ మహాభారతం చిత్రానువాద రచయిత రాహీ మాసూమ్ రజా రాసిన ‘ఆథా గావ్ ‘ అనే హిందీ నవల లో కాలం గురించి రజా వెలిబుచ్చిన దృక్పథాన్ని ఆయన విపులంగా చర్చించాడు. ఇలియట్ రాసిన The Four Quartets లో కాలం గురించి ఇలియట్ ప్రకటించిన అభిప్రాయాలను, రజా తన నవలలో కాలం గురించి ప్రకటించిన అభిప్రాయాల్తో పోల్చి ఆసక్తికరమైన ప్రసంగం చేశాడు.

ఈరోజు గోష్ఠి లో చివరి ప్రసంగం నాది. నేను తెలుగు సాహిత్యానికి ప్రతినిధిగా ఈ సదస్సు లో పాల్గొనడం ఒక గౌరవంగా భావిస్తున్నానని చెప్పాను. ఎడుతచ్చన్ కు నివాళిఘటించి, తుంచన్ పండగ నన్ను ఎట్లా ఉత్తేజపరిచిందో చెప్పుకొచ్చాను. ఎం.టి. వాసుదేవన్ నాయర్ కృషి అద్వితీయమని కూడా పేర్కొన్నాను.

తెలుగు భాష దక్షిణాదిన అతిపెద్ద భాష అని, భారతదేశంలో జనసంఖ్య రీత్యా మూడవ అతిపెద్ద భాష అని చెప్తూ, చారిత్రకంగా తెలుగు భాష ఉత్తర దక్షిణాల మధ్య, మార్గ -దేశి సంప్రదాయాల మధ్య ఒక సేతువుగా తన బాధ్యత నిర్వహిస్తూ వచ్చిందని చెప్పాను. ప్రాచీన కాలంలో మార్గ, దేశి సంప్రదాయాల మధ్య సమన్వయం సాధించిన తెలుగు భాష ఇప్పుడు గ్లోబల్, లోకల్ ధోరణుల మధ్య సమన్వయానికి ప్రయత్నిస్తున్నదని వివరించాను.

తెలుగు కవిత్వ సంప్రదాయం కథన పద్ధతుల మీద ప్రసంగిస్తూ

ఈరోజు పొద్దున్న స్వాగతం ఉపన్యాసం చేసిన సాహిత్య అకాడమీ ప్రాంతీయ కార్యదర్శి డా. రాజమోహన్ ఒక భాషలో కవిత్వానికి ఒకటే సంప్రదాయం ఉండనవసరం లేదనీ, ఆ భాష మాట్లాడే వివిధ ప్రాంతాలకు చెందిన వివిధ సంప్రదాయాలు ఉండొచ్చునని పేర్కొంటూ తెలుగుని ఉదాహరించాడు. నేను ఆ వాక్యాన్ని మరింత విస్తరించాను. తెలుగు సాహిత్యంలో ప్రధాన భూభాగాలు తీరాంధ్రం, రాయలసీమ, తెలంగాణ ఏ విధంగా తమతమ సాహిత్య సంప్రదాయాలతో తెలుగు సాహిత్య నిర్మాణం చేశాయో వివరించాను. తొమ్మిదవ శతాబ్దం నుండీ కూడా ఆయా ప్రాంతాల సాంఘిక రాజకీయ ధార్మిక అవసరాలను బట్టి ఆయా ప్రాంతాలు తమ కవిత్వాన్ని ముందుకు తీసుకువచ్చినప్పుడు, ఈ మూడు సంప్రదాయాల పట్ల మధ్య ఒక అంతర్గతమైన టెన్షన్ ఏర్పడుతూ వచ్చిందనీ, ఆ సంఘర్షణను వివిధ కవులు వివిధ పద్ధతుల్లో సమన్వయిస్తూ వచ్చారు అని వివరించాను. అందుకుగాను నన్నయ, శివ కవులు, తిక్కన- ముగ్గురూ మూడు పద్ధతుల్లో కవిత్వ వ్యక్తీకరణకు చేపట్టిన పరిష్కారాలను స్థూలంగా వివరించాను.

పొద్దున్న ప్రభా వర్మ తన అధ్యక్ష ఉపన్యాసంలో హాప్కిన్స్ మాట ఒకటి కోట్ చేశాడు. హాప్కిన్స్ ఇలా అన్నాడట:

The poetical language of an age should be the current language heightened, to any degree heightened and unlike itself, but not…an obsolete one.

మధ్యాహ్న భోజన విరామం లో నేను ప్రభావర్మతో ‘మీరు ఎక్కడ వదిలిపెట్టారో నేను నా ప్రసంగాన్ని అక్కణ్ణుంచి ముందుకు తీసుకు వెళ్తాను’ అని చెప్పాను. అందుకని నా ప్రసంగంలో నేను ప్రధానంగా ఒక ప్రశ్న వేశాను. Current language ని heighten చేయటం కవిత్వం అవుతుంది అన్నంతవరకు నిజమే కానీ ఆ heightening దేని ద్వారా సాధ్యమవుతుంది? అది మరింత నిశితంగా పరిశీలించవలసిన విషయం అని చెప్పాను. ఒక కాలంలో ఒక కవి శబ్దశక్తి వల్ల సామాన్య వ్యవహార భాషను ఉన్నతీకరించగలరని భావిస్తాడు. మరొక కాలంలో మరొక కవి తన భావోద్వేగాల వల్ల భాషకు జవసత్వాలు సమకూర్చగలనుకుంటాడు. ఇంకో కవి ఈ రెండిటి వల్ల కాక అర్థగౌరవం వల్ల మామూలు భాషను కవిత్వ భాషగా మార్చగలనుకుంటాడు. ముగ్గురు చెప్పేదీ నిజమే. కానీ వారు దేనికి ప్రాధాన్యమిస్తారనేది వారి కాలం నాటి సామాజిక రాజకీయ అవసరాలను బట్టి ఆధారపడి ఉంటుంది అని నేను నా ప్రసంగంలో వివరించాను.

తెలుగు కవిత్వం పైన ప్రసంగిస్తూ

నా ప్రసంగంతో సదస్సు కూడా పూర్తయిపోయింది. నిన్న గంట వెంకటరెడ్డి నన్ను ఎం.టి. వాసుదేవన్ నాయర్ తో తీయించుకున్న ఫోటో షేర్ చేయమని అడిగాడు. నిన్న ఆయనతో ఫోటో తీసుకోలేదు కాబట్టి ఈరోజు వాసుదేవన్ నాయర్ దగ్గరికి వెళ్లి ఫోటో తీసుకున్నాను. ఆయన చేస్తున్న కృషి గురించి అభినందించాను. ‘తెలుగులో కూడా మీకు లానే సాహిత్యంలోనూ, సినిమాలోనూ సమానమైన ప్రతిభ కనబరుస్తున్న కళాకారులు లేకపోలేదు కానీ వాళ్లకి ఎవరికీ మీకు కలిగిన తలపు కలగలేదు. ఇటువంటి విషయాల మీద వాళ్లకు దృష్టి లేదు. అని చెప్పాను. నాయర్ చాలా వినయంగా ‘మేము చాలా చిన్నపాటి ప్రయత్నం మొదలుపెట్టాము. దాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నాము.అంతే ‘ అని అన్నాడు.

ఎం.టి. వాసుదేవన్ నాయర్ తో

సదస్సు తొందరగా ముగిసిపోవడంతో నాకు మరి కొంత సమయం అందుబాటులో ఉండడంతో మేల్పత్తూరు నారాయణ భట్టాతిరి పుట్టిన మేల్పత్తూరు గ్రామానికి వెళ్లాలని అనుకున్నాను. ఆ గ్రామం తిరూరు దగ్గర్లోనే ఉందని ఒక మిత్రుడు చెప్పాడు. నేను ఒక ఆటో మాట్లాడుకుని వెళ్లాను కానీ, ఆటో అతను నన్ను చందన కావు గ్రామం దగ్గర వదిలి వెళ్ళిపోయాడు. నేను అతి కష్టం మీద ఎవరినో గుర్తులు అడిగి ఆ ఊరి లోపల ఉండే ఒక ఒంటరి బాటలో కొంత దూరం ముందుకు వెళ్లాను. అక్కడ ఒకాయన నా ఇబ్బంది గమనించి ఆ దారంట పోతున్న ఒక ప్రయాణికుడికి నన్ను అప్పగించి నారాయణభట్టాతిరి స్మారక మందిరం దగ్గర దింపమని అడిగాడు. దింపడం వరకు బాగానే ఉంది కానీ తిరిగి రావటానికి ఏమి ఏర్పాటు అని ఆలోచిస్తూ ఉన్నాను. ఆ ప్రయాణికుడు నన్ను మేల్పత్తూరు గ్రామం దగ్గరకు తీసుకువెళ్లి అక్కడ మరొక ఆటో మాట్లాడి పెట్టాడు. నేను ఆటోలో నారాయణ భట్టాతిరి స్మారక మందిరం దగ్గరికి వెళ్లేటప్పటికి ఆ ప్రాంగణం మూసి ఉంది. ఆటో డ్రైవర్ స్థానికులతో మాట్లాడితే ఆ తాళం చెవి అక్కడకు దగ్గర్లోనే ఎవరి దగ్గరో ఉందని తెలిసింది. మేము వెళ్లి వాళ్ళని అభ్యర్థించి స్మారక మందిరానికి తీసుకు వచ్చాం. వాళ్ళు ఆ తలుపు తెరిచి నన్ను ఆ ప్రాంగణంలోకి తీసుకువెళ్లారు. అది గురువాయూర్ దేవస్థానం వారు నారాయణ భట్టాతిరికి నిర్మించిన స్మారక మందిరం. లోపల ఆ కవీశ్వరుడి పాలరాతి విగ్రహం, ఆయన వెనక గురువాయూరప్ప పటం ఉన్నాయి. ఆ ప్రాంగణంలో రేలచెట్టు తొలి మొగ్గలు వికసిస్తూ ఉన్నవి. సాయం సంధ్యా కాంతి ఆ ప్రాంగణమంతా బంగారు తాపడం చేస్తున్నది. గురువాయూరప్పను స్తుతిస్తూ నారాయణ భట్టాతిరి ‘నారాయణీయం’ కావ్యం చెప్పినందుకు గురువాయూరప్ప ఆయనకిలా ఒక శాశ్వతస్మారకం నిర్మించి పెట్టాడన్నమాట అని అనుకున్నాను.

నారాయణ భట్టాతిరి స్మారక మందిరం, మేల్పత్తూరు

నారాయణ భట్టాతిరి గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు, వ్యాకరణ వేత్త , పూర్వ మీమాంసికుడు. ఆయన ఒకప్పుడు తన గురువు గారి అనారోగ్యాన్ని చూడలేక ఆ గురువుగారి అనారోగ్యాన్ని తన మీద వేసుకున్నాడు. గురువు ఆరోగ్యం మెరుగుపడింది కాని అనారోగ్యం తనను హింసించడం మొదలుపెట్టింది. దాన్నుంచి బయట పడటానికి మార్గం కోసం వెతుకుతుండగా ‘ముందు చేపతో మొదలు పెట్టు’ అని ఎడుత్తచ్చన్ సలహా ఇచ్చాడట. శాకాహారి, శ్రోత్రియుడు అయిన నారాయణ భట్టాతిరికి ఆ సలహా ముందు అర్థం కాలేదు. తర్వాత ఆలోచిస్తే బహుశా మత్స్యావతారంతో మొదలుపెట్టమని చెప్తున్నాడు అని భావించి విష్ణు సంకీర్తన మొదలుపెట్టాడు. అదే నారాయణీయం కావ్యంగా ప్రసిద్ధి చెందింది.

భట్టాతిరికి గురువాయురప్ప ప్రత్యక్షమైనప్పుడు తన రెండు చేతులు చూపించి అతడి అనారోగ్యం నయం చేయడానికి ఒక చెయ్యి చాలని చెప్పాడట. తన రెండో చేతిలో కారుణ్యం ఉంది అని చెప్పి ఆ రెండిట్లో ఏది కావాలో కోరుకోమన్నాడట. ఆరోగ్యమా, కారుణ్యమా ఏది ఎంచుకోవాలి? నారాయణభట్టాతిరి మరి ఏమీ ఆలోచించకుండా కారుణ్యాన్ని ఎంచుకున్నాడు. ఎందుకంటే భగవంతుడి కరుణ లభిస్తే అనారోగ్యాన్ని ఎట్లాగైనా నెట్టుకోవచ్చు అని. కానీ భగవంతుడి కరుణ లభించగానే అనారోగ్యం తక్షణమే అంతరించిందని వేరే చెప్పాలా?

చాలా ఏళ్ల కిందట కల్లూరి భాస్కరం గారు వాళ్ళ నాన్నగారు తెలుగులో అనువదించిన ‘నారాయణీయం’ పుస్తకం నాకిచ్చి దాని మీద ఒక వ్యాసం రాయమని అడిగారు. భాస్కరంగారి తండ్రి కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గొప్ప కవి, పండితులు. బూర్గుల రామకృష్ణారావు గారు ఆయన్ని కోరి మరీ నారాయణీయం తెలుగులోకి అనువాదం చేయించుకున్నారట. కానీ నేను ఆ పుస్తకం మీద వ్యాసం రాయలేకపోయాను. అయినా కూడా భగవంతుడు నన్ను కరుణించాడు. నారాయణీయకవి పుట్టిన చోటుకే నన్ను ఇలా తీసుకువచ్చాడు.

నారాయణ భట్టాతిరి

భాష, భక్తులు, భగవంతుడు- ఈ రెండు రోజుల నా కేరళ పర్యటన ఈ మూడింటి చుట్టూతానే తిరిగింది. నేను ఈ రోజు గోష్ఠి లో ఉండగా ఎవరో నాకు ఒక మెసేజ్ పంపారు. ‘మీ నుంచి మీరు ఏమి కోరుకుంటున్నారు’ అని. ‘సాహిత్యానికి యావచ్ఛక్తి కృషిచెయ్యాలనీ, అందుకు కావలసిన నైతిక బలం దేవుడు అనుగ్రహించాలనీ కోరుకుంటున్నాను’ అని జవాబు ఇచ్చాను. భగవద్భక్తులు తిరుగాడిన ఈ నేల మీద నిలబడి నేను ఇలా కాక మరోలా ఎలా కోరుకోగలను?

19-2-2023

6 Replies to “భాష, భక్తులు, భగవంతుడు”

  1. సర్…మీతో మీ వెంటే తిరుగాడిన అనుభూతి! ఏమీ వర్ణన! ఎంత అనుగ్రహం!

  2. మీ రచన అది చదివినా, విజ్ఞాన ప్రదాయినిగా ఉంటుంది.వివేచనాలోచనులుగా చేస్తుంది.వివేకమార్గం సూచిస్తుంది. చక్కని జీవనగమ్యాల దిశానిర్దేశం చేయిస్తుంది. ముఖ్యంగా కరితవ్యోన్ముఖులుగా మారుస్తుంది. మహనీయుల సంస్మరణ మానవతా దీప్తికి మహిత మణిదీపప్రజ్వలనం అవుతుంది.

  3. మీ ట్రావెలోగ్ గొప్పగా ఉంది. యాదృచ్చికంగా శివరాత్రి ముందు రోజు రాత్రి మా తమిళ్ కొలీగ్ తో నారాయణీయం మీద ఒక చర్చ నడిచింది. వాళ్ళ అమ్మ గారు చెన్నైలో ప్రఖ్యాత భరతనాట్యం టీచర్. ఐదేళ్ళ క్రితం ఆమెకి కూడా ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఏదో వచ్చి నడవలేని స్థితికి చేరుకుంటే, ఎవరో చెప్పారుట గురువాయూర్ దర్శించుకోమని. గురువాయూరు వెళ్లి కృష్ణుడి మీద ఒక దృశ్యరూపకం చేస్తానని దానికి తగ్గ ఆరోగ్యం, నైతిక బలం అనుగ్రహించాలని వేడుకున్నారుట. చెన్నై తిరిగి వెళ్లి వాళ్ళ స్క్రిప్ట్ రైటర్ కి విషయం చెప్తే, ఆయన నారాయణీయం కథంతా చెప్పి వేరే స్క్రిప్టెందుకు నారాయణీయాన్నే మూలంగా తీసుకుని ఒక రూపకంగా మలిచేరుట. మెల్లగా ఆ వ్యాధి నుండి బయటపడి శిష్యుల చేత సాధన చేయించి శివరాత్రి రోజు మొదటి ప్రదర్శన బెంగుళూరు చౌడయ్య మెమోరియల్ హాల్లో ఇస్తున్నారని దానికోసమే ఇప్పుడు తాను వెళ్తున్నానని చెప్పాడు. నారాయణీయం రూపొందుతున్నప్పుడు నారాయణ భట్టాతిరి జీవితంలో జరిగిన సంఘటనల్ని ఎంతో ఆర్తితో అతను చెప్తుంటే వింటూ కూచున్నాం.
    ఆ రాత్రి పాలక్కాడ్ రైల్వే స్టేషన్ కి అతణ్ణి దింపడానికి వెళ్తుంటే కారులో ఈసారి మనం కలిసి నారాయణ భట్టాతిరి పుట్టిన మేల్పత్తూరు గ్రామానికి వెళ్దామని కూడా అన్నాడు. మీరు తిరూరు వచ్చారని తెలిసి గూగుల్ మ్యాప్ చూస్తుంటే మేల్పత్తూర్ పాలక్కాడ్ కీ, తిరూరుకీ మధ్యలో అని తెలిసింది. ఒకవేళ మీరు రెండ్రోజులు ఉంటే మీతో కలిసి వెళ్తే బావుంటుందని కూడా అనుకున్నాను. ఇప్పుడు చూస్తే మీ వ్యాసం!

    1. ఈ విషయాలు వినడం చాలా సంతోషంగా ఉంది. పూందానం అనే మరొక కవి కూడా గురువాయూరప్పను కొలిచాడని ఆయన కూడా మల్లప్పురం దగ్గరలోని పెరిందల్మన్న అనే చోట పుట్టాడని తెలుసుకున్నాను. మీరు మేల్పత్తూరు వెళ్లినప్పుడు ఆ స్మారకమందిరం కూడా చూడగలరు.

Leave a Reply to Vadrevu Ch VeerabhadruduCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading