దేవుడి సొంత దేశంలో

ఎడుత్తచ్చన్ ఘంటం పూజలందుకుంటూ

ఇన్నాళ్లకు దేవుడి సొంత దేశం లో అడుగు పెట్టాను. ఎన్నో ఏళ్లుగా అనుకుంటున్నది ఇవాల్టికి నెరవేరింది. వాస్కోడిగామా తర్వాత 525 ఏళ్లకు ఈరోజు పొద్దున్న నేను కూడా కాలికట్ లో అడుగుపెట్టాను. విమానం దిగుతూనే నేరుగా చరిత్ర పాఠంలో ప్రవేశించానని అనుకున్నాను.

ప్రతి ఏటా కేరళలో నిర్వహించే నిర్వహించే తుంచన్ పండగలో తెలుగు సాహిత్యం గురించి ప్రసంగించడానికి సాహిత్య అకాడమీ నా పేరు ప్రతిపాదించిందనీ, నాకు రావడానికి అంగీకారమేనా అని రెండు వారాల కిందట బెంగుళూరు నుంచి ఫోన్ వచ్చింది. ఎప్పటిలానే నా బద్ధకం నాకు అడ్డుపడుతూ ఉండగా, ఇప్పుడు అంత దూరం ఎక్కడ వెళ్తాను అని అనుకున్నాను కానీ, కేరళ చూసే అవకాశం రాకరాక లభించింది అన్న ఉద్దేశంతో సరే అన్నాను.

నేను వెళ్తున్న పండగ ఏమిటో, దాని గురించిన వివరాలేమిటో నేను సాహిత్య అకాడమీనీ అడగలేదు, నెట్ లోనూ చూడలేదు. ఎందుకంటే ఇటువంటి చోట్లకి ఏమీ తెలియకుండా అడుగుపెట్టినప్పుడు ఎన్నో విషయాలు మొదటిసారి తెలుసుకోవడంలో గొప్ప ఆశ్చర్యం, ఆనందం ఉంటాయి. ముందే అన్నీ తెలుసుకుని వచ్చినప్పుడు ఆ సర్ప్రైజ్ దూరమైపోతుంది. అలా ఏమీ తెలుసుకోకుండా ఇక్కడ అడుగు పెట్టినప్పుడు ఈరోజు నన్ను ముంచేత్తిన ఆశ్చర్యం, ఆనందం అంతా ఇంతా కాదు.

కాలికట్ నుంచి తిరూరు వెళ్లడానికి ఏర్ పోర్ట్ లో టాక్సీ మాట్లాడితే 1500 చెప్పాడు. అది ఎక్కువో, తక్కువో నాకు అర్థం కాలేదు. అందుకని ఒక ఆటో మాట్లాడుకున్నాను. 45 కిలోమీటర్ల దూరం ఒక ఆటోలో ప్రయాణించడంలో నేను కోరుకున్న సంతోషం మరొకటి ఉంది. అది మొదటిసారిగా కేరళ లాండ్ స్కేప్ ని దగ్గరగా చూసే అవకాశం. నా ఆశ నిరాశ కాలేదు. సముద్రతీరానికి సమాంతరంగా చేసిన ప్రయాణం నాకు గోదావరి జిల్లాల సముద్ర తీర ప్రయాణాన్ని, రెండు మూడేళ్ల కిందట తమిళనాడులో నాగపట్నం మీదుగా కరైకల్ దాకా చేసిన ప్రయాణాన్ని గుర్తుకు తెచ్చింది. కొబ్బరి, పోక, మామిడి, టేకు, పనస, కానుగ, నేరేడు లాంటి చెట్ల దారుల్లో కేరళ గ్రామ సీమలను చూస్తూ పొద్దుటపూట చేసిన ప్రయాణం నాకు నా సొంత ప్రాంతానికి వెళ్లినట్టే అనిపించింది.

తిరూరులో సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసిన బస కి చేరుకున్నాక కేరళ సాహిత్య వేత్త, అనువాదకుడు వెంకటచలం గారికి ఫోన్ చేసాను. ఆయన హోటలు దగ్గరే ఉన్నారు. నన్ను వెంటబెట్టుకుని తుంచన్ తీసుకువెళ్లారు.

తుంచెన్ అనేది తుంచెన్ రామానుజన్ ఎడుత్తచ్చన్ అనే ఒక మలయాళ భక్తి కవి పేరు. 16వ శతాబ్దంలో ఆ భక్తి కవి తిరూరు దగ్గర, ఇప్పుడు తుంచన్ పరంబుగా పిలవబడుతున్న చోట కొన్నాళ్లు నివసించాడు. అప్పటి సామాజిక పరిస్థితుల్లో నిమ్న కులంగా పరిగణించబడే కులానికి చెందిన కవి అతడు. ఆ కులాలకు చెందిన పిల్లల కోసం అక్కడ ఒక గురుకులం నడిపాడు. అక్కడ ఉన్నప్పుడే ఆయన మలయాళ భాషను నవీకరించి రామాయణాన్ని ఒక స్వతంత్ర కావ్యంగా మలయాళంలో వెలువరించాడు. మలయాళ లిపికి, భాషకి, సాహిత్యానికి ఆయన చేసిన కృషికి గుర్తుగా ఈరోజు మలయాళ సమాజం ఆయన్ని మలయాళ భాషా పితామహుడిగా కొనియాడుతున్నది.

తుంచెన్ పరంబు అంటే తుంచను బంజరు అని అనుకోవచ్చు. నాలుగు ఐదు శతాబ్దాల కిందట మలయాళ సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఆధార భూమిగా నిలబడ్డ ఆ ప్రాంతం కాలక్రమంలో ఒక బీడు నేలగా, ఎవరికీ పట్టని ప్రదేశంగా మారిపోయింది. అది మలయాళ సాహిత్య ప్రేమికుల్ని బాధించింది. 1906 లో జామరిన్ రాజవంశీకుడైన విద్వాన్ మనవిక్రమన్ ఎట్టన్ రాజా రచయితల్ని, సంఘసేవకుల్ని సమావేశపరిచి ఆ స్థలాన్ని పునరుద్ధరించడం కోసం ఏమి చేయవచ్చో సూచించండి అని అడిగాడు. దాదాపు 50 ఏళ్ల తర్వాత, 1954లో, కె.పి. కేశవ్ మీనన్ అధ్యక్షతన ఒక సంఘం ఏర్పాటు అయి పునరుద్ధరణ కార్యక్రమాలు మొదలుపెట్టింది. 1961 లో కేరళ ముఖ్యమంత్రిగా పనిచేసిన పట్టం థానుపిళ్లై అక్కడ ఒక భవన సముదాయానికి శంకుస్థాపన చేశాడు. 1964లో ఆ భవనాలను ఆయనే ప్రారంభించాడు. ఆ ఏడాది ప్రభుత్వం ఆ తుంచన్ స్మారక భూమిని మరింత అభివృద్ధి చేయడానికి, నిర్వహించడానికి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసింది. అయితే 1993లో ఎం.టి. వాసుదేవన్ నాయర్ ఆ సంఘానికి చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తుంచెన్ పరంబు రూపురేఖలు మారిపోయాయి.

తుంచెన్ పరంబు

గత ముప్పై ఏళ్లుగా ఎం.టి. వాసుదేవన్ నాయర్ తన యావచ్ఛక్తిని ఈ క్షేత్రం అభివృద్ధి కోసమే ధారపోసాడని చెప్పవచ్చు. ఆయన చేసిన కృషి వల్ల ఈరోజు ఈ క్షేత్రం మలయాళ సాహిత్య సాంస్కృతిక రంగాలకు కేంద్ర బిందువుగా మారింది. అంతర్జాతీయ సాహిత్య పర్యాటకస్థలిగా మారింది. ప్రతి ఏడాది ఫిబ్రవరిలో జరిగే తుంచన్ పండుగ మలయాళ సాహిత్య సాంస్కృతిక వికాసానికి, వైభవానికి ఒక చిరునామాగా మారింది.

తుంచెన్ పరంబు క్షేత్రం నిండా పిల్లలు

అటువంటి ఒక వేడుకలో పాలుపంచుకునే అవకాశం నాకు కూడా కలిగినందుకు నా హృదయం చాలా ఉప్పొంగింది. వెంకటచలం గారు పొద్దున్న నన్ను తుంచెన్ క్షేత్రానికి తీసుకువెళ్లి, అన్నిటికన్నా ముందు, ఎడుత్తచ్చన్ ఏ ఘంటంతో తాళపత్రాల మీద కవిత్వం రాశాడో ఆ ఘంటాన్ని చూపించారు. ఆశ్చర్యం ఏమంటే ఎడుత్తచ్చన్ కి సంబంధించి ఒక విగ్రహం కానీ, చిత్రపటం కానీ, మరే గుర్తూ లేదు. ఆయన చేత్తో పట్టుకుని రాసిన ఆ ఇనప ఘంటాన్ని మాత్రమే నేడు మళయాల సమాజం ఆయన చిహ్నంగా కొలుస్తున్నది. ఇలా ఒక కవి కలానికి పూజలు అర్పించే తావు ప్రపంచంలో మరి ఎక్కడా లేదని వెంకటచలం గారు ఎంతో గర్వంగా చెప్పుకున్నారు. ఆ మాట నిజమే. ఈరోజు పొద్దున్న ఆ ఘంటాన్ని మలయాళ సాహిత్యవేత్తలు అంతా పెద్ద ఎత్తున ఊరేగింపుగా తీసుకువెళ్లి పూజలు చేశారు. అనంతరం అక్కడ నిర్మించిన ఆడిటోరియంలో సాహిత్య సమావేశాలు మొదలుపెట్టారు.

తుంచెన్ పరంబు ఆడిటోరియం

ఆ ప్రాంతంలో ఒకప్పుడు ఎడుత్తచ్చన్ పిల్లలకు చదువు చెప్పిన గురుకులానికి గుర్తుగా, అక్కడ ఆయన పూజించిన దేవతలకు గుర్తుగా చిన్న దేవాలయం ఉంది. ఆ దేవాలయం పక్కన ఒక ముషిడి చెట్టు ఉంది. మామూలుగా ముషిడి చెట్టు ఆకులు చేదుగా ఉంటాయి. కానీ ఆ భక్తికవి చదువు చెప్పడానికి నీడనిచ్చిన చెట్టు కాబట్టి దాని ఆకులు తీయగా ఉంటాయి అని వెంకటచలంగారు చెప్పారు. అక్కడ ఆ ముషిడి చెట్టు చూడగానే నాకు మా ఊర్లో మా జాగరాలమ్మ గుడి ముందట ముషిడి చెట్టు గుర్తు వచ్చింది. ఎంత దూరం ప్రయాణించు, నా చిన్నప్పటి నా ఊరు నాకన్నా ముందే అక్కడికి చేరుకుని నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కదా!

అక్షరాలు దిద్దించిన చోట

ఆ రోజుల్లో పిల్లలకి ఇసుకలో అక్షరాలు దిద్దించిన దానికి గుర్తుగా ఇప్పుడు కూడా అక్కడ ఆ చెట్టు నీడన పవిత్రమైన ఇసుక ఉంది. ఆ తావుకి వెళ్ళిన ప్రతి ఒక్కరు మళ్లా ఆ ఇసుకలో తమ చూపుడు వేలితో అక్షరాలు దిద్దడం సంప్రదాయంగా మారింది. అలాగే నన్ను కూడా అక్షరాలుదిద్దమన్నారు. నేను ఇన్నాళ్లుగా చదువుకున్న చదువుని, నేర్చుకున్న అక్షరాల్ని పక్కనపెట్టి, నా అరవయ్యవ యేట, ఈ మహాశివరాత్రి నాడు మళ్లా అక్కడ అక్షరాభ్యాసం చేశాను.

అక్షరాభ్యాసం చేస్తూ

మరో ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే ఇక్కడ మలయాళ సాహిత్య వేత్తలు పిల్లలతో అక్షరాభ్యాస కార్యక్రమం చేయిస్తారట. ఇలా ఒక సాహిత్యకారుడి స్మారక భూమి మీద అతను పిల్లలతో అక్షరాలు దిద్దించిన చోట పిల్లల్తో అక్షరాలు దిద్దించడమనే ఊహనే ఎంతో గొప్పగా ఉంది కదా!

వెంకటచలం గారితో

తుంచన్ పరంబు ఇంతా చేస్తే నాలుగున్నర ఎకరాల స్థలం. అందులో ఒక ఆడిటోరియంతో పాటు మలయాళ భాషా సాహిత్య వికాసాలను వివరించే ఒక మ్యూజియం కూడా ఉంది. అటువంటి మ్యూజియం తెలుగు భాషకీ, ఆ మాటకొస్తే ప్రతి ఒక్క భాషకీ కూడా ఉండాలనిపించే లాగా ఉంది. మలయాళ సాహిత్యాన్ని రెండు చేతులా నిలబెట్టిన మహనీయ సాహిత్య వేత్తలు, కవులు, రచయితలు, పండితులు, విమర్శకులు, మిషనరీలు మొదలైన వారందరి ఫోటోలు, వారి గురించిన వివరాలు ఆ మ్యూజియంలో ఉన్నాయి.

మళయాల సాహిత్య మ్యూజియం

ఆ పక్కన ఒక పెద్ద గ్రంథాలయం కూడా ఉంది. ఆ గ్రంథాలయంలో దాదాపు 125 ప్రాచీన మలయాళ తాళపత్ర గ్రంధాలు ఉన్నాయి. దానితోపాటు మహాకవి ఉళ్లూరు పరమేశ్వరయ్యర్ దానం చేసిన ఆయన సొంత గ్రంథాలయం కూడా ఉంది.

మళయాల సాహిత్య మ్యూజియం

తుంచన్ పండుగ సందర్భంగా ఏర్పాటుచేసిన పెద్ద పుస్తక ప్రదర్శన కూడా ఆ ఆవరణలో ఉంది. దాదాపుగా అవన్నీ మలయాళ గ్రంథాలే కానీ ఆ గ్రంథాల శీర్షికలని పోల్చుకుంటూ చూస్తే, నిన్నా, మొన్నా ప్రపంచంలో వెలువడ్డ ఉత్తమ గ్రంథాలు, నోబెల్ పురస్కారం పొందిన గ్రంథాలు, బెస్ట్ సెల్లర్స్ అన్నిటికీ మలయాళ అనువాదాలు వచ్చినట్టుగా కనబడుతున్నది.

వెంకటచలం గారు నన్ను ఎం.టి. వాసుదేవన్ నాయర్ కు పరిచయం చేశారు. అదొక ఉద్విగ్నక్షణం. 1981లో మొదటిసారి ‘సమష్టి కుటుంబం’ నవల చదివాను. అది దాదాపుగా మా కుటుంబాల కథ లానే అనిపించింది. ఆ రచయితని నలభయ్యేళ్ల తర్వాత కేరళలో ఇలా కలుసుకుంటానని నేను ఎప్పుడూ ఊహించలేదు.

తుంచన్ పరంబు క్షేత్రంలో నడుస్తున్నంత సేపు నేను తెలుగు భాష గురించి, తెలుగుజాతి దైన్యం గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాను. ఏమి? నాలుగున్నర ఎకరాలు తెలుగు నేలమీద ఒక కవి కోసం ఎక్కడా దొరకదా? ఒక తిక్కనక్షేత్రం, ఒక గురజాడ క్షేత్రం, ఒక కందుకూరి క్షేత్రం, ఒక వేమనక్షేత్రం, ఒక గిడుగు క్షేత్రం మనం ఏర్పాటు చేసుకోలేమా? ఒక గురజాడ పండగ, ఒక నన్నయ పండగ, ఒక పెద్దన పండగ జరుపుకోలేమా? అటువంటి ఒక పండగ తెలుగు సాహిత్య ప్రేమికులందరికీ అంతర్జాతీయ పర్యాటక స్థలంగా మారడం అసాధ్యమా?

మధ్యాహ్నం అక్కడే భోజనం చేశాను. ఉత్తర కేరళ పొలాల్లో పండిన కురవ బియ్యంతో వండిన అన్నం, సాంబారు- మలయాళ స్త్రీ పురుషులతో కలిసి ఆరగించినందువల్ల మరింత రుచికరంగా తోచింది.

నా సెషన్ రేపు మధ్యాహ్నం కాబట్టి ఈ మధ్యాహ్నం కేరళలో మరికొంత ప్రాంతం చూద్దామా అనుకున్నాను. ఉన్నంతలో దగ్గరగా ఉన్నవి త్రిశూరు, గురువాయూరు కనిపించాయి. త్రిశూర్ కేరళ సాంస్కృతిక రాజధాని. అక్కడికి వెళ్లి రావాలంటే ఒక పూట సరిపోదు. అందుకని గురువాయూరు వెళ్లి రావాలి అనుకున్నాను. వెళ్లి రావటానికి టాక్సీ చూసి పెట్టమని హోటల్ వాళ్లని అడిగితే హోటల్లో టెక్నీషియన్ గా పనిచేస్తున్న అభీష్ అనే పిల్లవాడు తానే వస్తానన్నాడు. కారులో మేమిద్దరం గురువాయూరు వెళ్లి వచ్చేటప్పటికి బాగా పొద్దుపోయింది.

తిరూరు మలప్పురం జిల్లాలో ఉన్న ముఖ్య పట్టణం. గురువాయూరు త్రిశూర్ జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రం. మధ్యలో 50 కిలోమీటర్ల మేరకు సాగర తీరం వెంబడి ప్రయాణం. కాలికట్ నుంచి గురువాయూర్ దాకా లెక్కేసుకుంటే మొత్తం వందకిలోమీటర్లు. ఉత్తర కేరళలో అధిక భాగం ఈ రోజు ప్రయాణించినట్టైంది.

గురువాయూరు సందర్శన నేను ఊహించని భాగ్యం. భగవద్కృప నన్ను ఇట్లా కరుణించింది. ఆ దేవాలయంలో చుట్టూ గోడల పైన ఎంతో రమణీయమైన వర్ణ చిత్రాలు. లోపల సాంప్రదాయిక కేరళ సాక్షాత్కరించినట్టుగా ఉంది. ఆ ప్రాంగణమంతా నారాయణీయం వినిపిస్తున్నది. గర్భగుడిలో గురువాయూరప్పని చూస్తే నేను గోకులంలో ఉన్నానా, కేరళలో ఉన్నానా తెలుసుకో లేకపోయాను. బృందావనం, జగన్నాథం, శ్రీరంగం, పండరిపురం, ఇప్పుడు గురువాయూర్ – శ్రీకృష్ణుడు ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఆ ఊరు, ఆ వీథి, ఆ మనుషులు, ఆ ప్రపంచం రూపురేఖలే మారిపోతాయి కదా!

దేవుడి సొంత దేశం అన్నందుకు ఈరోజు అంతా అడుగడుగునా నాకు దేవుడు కనిపిస్తూనే ఉన్నాడు. అలా కనబడ్డ ప్రతిచోటా ఆయన కూడా నాకోసం ఎదురు చూస్తున్నట్టే ఉన్నాడు.

18-2-2023

14 Replies to “దేవుడి సొంత దేశంలో”

  1. మలయాళ సాహిత్య పుణ్యక్షేత్రాన్ని మీ అక్షరాల్లో దర్శింప చేసినందుకు ధన్యవాదాలు సర్ 🙏

  2. నేను మొదట కేరళకు వెళ్ళినపుడు చూసింది మన దేశంలో మొట్టమొదటి చర్చ్ ,అడవి మధ్యలో మట్టి గోడలు ,చెక్క కప్పు .
    మీరు ఉడుపి ఇంకా చూడాల్సివుందా సర్ ?భక్తుల పై అలిగిన కృష్ణుడు అక్కడ.

    1. “విద్వాన్ సర్వత్ర పూజ్యతే..” అన్నది నిజమండీ. మీవంటి సాహితీవేత్తకు లభించే సత్కారం మన తెలుగు వారి అందరిదీ.
      సాహితీ వేత్తల చేత అక్షరాభ్యాసం అంటే గుర్తుకు వచ్చింది మా తాతగారు, మా అన్నయ్య కు ఓలేటి పార్వతీశం గారిచేత అక్షరాభ్యాసం చేయించారు అప్పట్లో.. అదో గర్వకారణం.

  3. కేలికట్ లోనే బస్ స్టాండ్ కు కాలినడక దూరంలో “తళి” అనే చక్కని దేవాలయం ఉంది. ప్రసిద్ధి పొందలేదేమో కానీ మనోహరంగా ఉంటుంది.

    నా చిన్ననాటి వేసవి సెలవుల్లో కోఝికోడ్ కు 3,4 సార్లు మేనత్త ఇంటికి వెళ్ళాను. ఇంటికి కాస్త దూరాన రళి దేవాలయం, పెరట్లో మర్రిచెట్టు సైజులో కాయలు పోగేసుకున్న పనసచెట్టు, 10 అడుగులలో నీళ్ళు ఉన్న చేదబావి, దాని నిండా చేపలు, తాబేళ్ళు, కొబ్బరి చెట్లు, సాయంత్రం 4 గంటలకు సముద్రంలో బయలుదేరే వందలకొద్దీ గూటిపడవలు – ఇదీ నా మదిలో మెదిలే కేలికట్ రూపం అండి. 🙂 ఆ గురువాయూర్ దారిలో ఉన్న బీచ్ లోనే చెమ్మీన్ సినిమా తీశారు.

    మన ఇళ్ళలో పోతన భాగవతం ఎలాగో కేరళలో నారాయణీయం అలాగ. సామాన్య గృహిణి మా అత్తయ్య కు మొత్తం నారాయణీయం కంఠతా వచ్చు.

  4. మీతో అక్కడ తిరుగుతున్నట్లు అనిపించింది సర్.
    థాంక్యూ

  5. మీర రాసిన ప్రతి అక్షరం దృశ్యంగా మారిపోవటం మీ రచనలోని పోడిమికి సాదృశ్యం. ఒక్కసారిగా మీరు విమానం దిగినట్లుగానే పాఠకులను నేరుగా
    సందర్శన స్థలంలో దింపుతారు.ఒక మహాకవి పూజలందుకాునే చోటు మామూలు చోటు కాదు. ఏ తల్లి సరస్వతిని చదువుల తల్లిగా భావిస్తున్మామో ఆ తల్లిని చూపేవాడే కదా కవి. కొలంబస్ కనుక్కోక ముందు అమెరికా లోకానికి తెలియనట్టేన కవి స్థానం ప్రపంచంలో అగ్రస్థానం. మీరు కొలిచే సరస్వతి తన విశ్వరూపం మీకు చూపిస్తున్నది.పూలవెంట దారప్పోగులా మీ వెంట మాకూ ఆ ఆనందం లభించడం సంతోషదాయకం.
    ఇక ఎక్కడికి వెళ్లినా మీకంటే ముందే మీఊరు అక్కడికి చేరుకుంటుందన్న మాట నాకు అనుభవైక వేద్యం. మొన్న పోతన జన్మస్థలానికి వెళ్లి మోయలేనంత నిరాశను వీపున మోసుకు రావడమే గాక, భాగవతం పన్నెండు స్కంధాలలో చివరి రెండు రాసిన మా వెలిగందల నారయ ఊసు కూడా మా ఊరిలో లేనందుకు పుట్టాడు దిగులు గూడుకట్టుకుంగి. దాని తోడు విదేఏశ పర్యటనల్లో కవులు కళాకారులపట్ల గౌరవాదరాలను స్వయంగా చూసిన కారణం అంతర్లీనంగా వేదన మెదలుతూనే ఉంటుంది.
    మీరన్నట్ల మన మహాకవులు పుట్టిన తావులు ఏనాటికి సాంస్కృతిక నిలయాలుగా మారేనో.

  6. ఎంత విలక్షణంగా ఎంత గొప్పగా ఉంది కవికి లభించిన ఈ గౌరవం!! నిజమే, తెలుగు కవులకు మీరన్నట్టు అలాంటి గౌరవం లభించేలా చేయాలి, మీరు చేయగలరు… మీ పూనికతో.

  7. అయ్యో… తిరూరు మాకు రెండుగంటలే. ఇంత దగ్గరగా వస్తున్నారని తెలిస్తే తప్పకుండా కలిసేవాడిని సార్. ఎన్నాళ్ళు ఉంటున్నారు?

Leave a Reply

%d bloggers like this: