తల్లికోసం, తల్లిగురించి, తల్లివల్ల

ఇప్పటి తెలుగు కవుల్లో శ్రీకాంత్ నన్ను ఆకర్షిస్తూ ఉంటాడు. కాని అతడి కవిత్వం మీద నేను ఇప్పటిదాకా ఎక్కడా ఏమీ మాట్లాడలేదు. ఆ కవిత్వం నాలో రేకెత్తించే స్పందనలు, మూడ్స్ నాకు నేనింకా స్పష్టం చేసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను ఇన్నాళ్ళూ. కాని, అతడి కొత్త సంపుటి Madre, Poems on M/other (2022) చదివిన తర్వాత అతడి వ్యథలో నా వ్యథతాలూకు పోలికలు కనబడి అతడు చాలా కాలంగా తెలిసినవాడిలాగా అనిపించాడు.

ఈ కవితలు ఒక పిల్లవాడు తన తల్లికోసం, తల్లిగురించి, తల్లివల్ల రాసుకున్న కవితలు. కవితలు చెప్తున్నదాన్ని బట్టి ఇవి దాదాపుగా అతడి నలభయ్యే ఏటనుంచి యాభయ్యో ఏటదాకా పదేళ్ళ మధ్యకాలంలో రాసినట్టుగా తెలుస్తున్నది. కాని అవి రాసిన కవి వయస్సు మాత్రమే అది. ఆ కవితల్లోని కవి ఇంకా బాలుడే, ఎంత పసిబాలుడంటే, అమ్మ తొందరగా తొందరగా ఆఫీసుకు వెళ్ళడానికి తయారవుతూ టైము లేక అన్నం, పప్పు మాత్రమే వండిపెట్టి వెళ్ళిపోతే ఆ అన్నాన్నీ, పప్పునీ అలానే చూస్తూ తినకుండా, తినాలని కూడా తెలియకుండా బెంగగా ఉండిపోయేటంత బాలుడు.

ఈ కవిత చూడండి. పూర్తిగా ఎత్తి రాస్తున్నాను:

నీడ

అమ్మ, ఉద్యోగానికి వెళ్ళేది
అన్నమూ, పప్పు
ఇవి మాత్రమే చేసేది-

మధ్యాహ్నం స్కూల్ నుంచి
వస్తే, నాకు
ఆ వంట గదిలో, ఒక

నీడ కనపడేది, చిరిగిన ఒక
పర్సులాగా
ఉండేది ఆ నీడ నల్లగా

*

అమ్మ, ఉద్యోగానికి వెళ్ళడం
లేదిప్పుడు-
అయినా, అదే పప్పూ

అన్నం. కాని, కర్రీ పాయింట్లో-
అదే నల్లని
ఆ ప్రేమ రాహిత్యపు నీడ

ఇప్పటికీ తన చుట్టూ
చిరిగిన పర్సులో దాచుకున్న
అతని ప్రియమైన ముఖంలాగా!

సింగిల్ పేరెంట్స్ కి ఉండే సింగిల్ ఛైల్డ్ కథ ఇది. నా మిత్రురాలు ఒకామె ఉంది. చాలా పెద్ద ఆర్గనైజేషన్ లో పెద్ద ఉద్యోగం. భర్తకి మరొక దేశంలో మరొక పెద్ద ఉద్యోగం. ఆమె పొద్దున్నే ఎనిమిదింటికి ఉద్యోగానికి వెళ్ళిపోవాలి. చాలాసార్లు బ్రెడ్ కి ఇంత వెన్న రాసి తన బిడ్డ చేతుల్లో పెట్టి ఉరుకులు పరుగుల మీద ఆఫీసుకు వెళ్ళిపోయేది. ఆ బిడ్డ కౌమారంలో అడుగుపెట్టగానే ఆ తల్లిని చాలా వేధించింది. ఆ టీనేజిలో తనకే తెలియని తన అసహనం, అశాంతి, ఉద్వేగం అన్నిటినీ తల్లిమీద చూపించేది. నా మిత్రురాలు తన బిడ్డ తననెట్లా వేధిస్తుందో చెప్పినప్పుడల్లా, ఆ పిల్ల పసితనమే నాకు గుర్తొచ్చేది. బ్రెడ్ కి ఇంత బటర్ పూసి చేతుల్లో పెట్టి తల్లి ఉరుకులు పరుగుల మీద ఉద్యోగానికి వెళ్ళిపోయినప్పుడు ఆ బిడ్డ అనుభవించిన ఆ శూన్యం, ఆ ఒంటరితనం- అవి ఆ బిడ్డని జీవితమంతా వెంటాడతాయని తెలుసు. ఎందుకంటే, నేను కూడా నా చిన్నప్పుడే తొమ్మిదేళ్ళ వయసులో మా అమ్మని వదిలిపెట్టి హాస్టలుకు వెళ్ళిపోయినవాణ్ణి. ఈ యాభై ఏళ్ళుగా ఆ శూన్యం నన్ను వెంటాడుతూనే ఉన్నది కాబట్టి, ఈ యాభై ఏళ్ళుగా నాతో లాలనగా మాట్లాడిన ప్రతి స్త్రీలో మా అమ్మని వెతుక్కుంటూనే ఉన్నాను కాబట్టి, నాకు తెలుసు.

అర్థమవుతున్నది, శ్రీకాంత్ బాల్యం కూడా అటువంటిదే అయి ఉండాలని. ప్రతి కవికీ ఒక రహస్య గాయం ఉంటుంది. అది బాల్యంలోనో, యవ్వనంలోనో కోసుకున్న గాయమై ఉంటుంది. ఆ తర్వాత మీరు మొత్తం ప్రపంచం తీసుకొచ్చి అతడి చేతుల్లో పెట్టండి, అత్యంత సౌకర్యవంతమైన జీవితాన్ని సమకూర్చిపెట్టండి, అహర్నిశలు కంటికి రెప్పలా కాపలా కాయండి. ఉహు. లాభం లేదు. కవి, అక్కడే, ఆ తన చిన్నప్పటి ఆ గాయం దగ్గరే కూచుండిపోతాడు. మోకాళ్లలోకి తలముడుచుకుని. ‘పోయిన బాల్యపు చెరిగిన పదముల చిహ్నల కోసం శాంతము లేక, ఏకాంతముగా గుటకలు వేస్తూ, మెటిక విరుస్తూ’నే ఉంటాడు.

ఈ సంపుటిలోని శ్రీకాంత్ కవిత్వమంతా ఆ అమ్మ కోసం. ఆ అమ్మ ఇప్పటికీ తన కళ్లముందు ఉన్నా, ఆ తన చిన్నప్పటి అమ్మ, రోజంతా తనతోపాటే ఉండిపోతే బాగుణ్ణని ఎదురుచూసాడే, సాయంకాలం తను స్కూలు నుంచి ఇంటికి రాగానే గుమ్మందగ్గరే తనని చేరదీసుకోవాలని కలగన్నాడే, ఆ అమ్మని తలచుకుంటూ రాసిన కవిత్వం ఇది. ఆ అమ్మ అలా తనకి దక్కలేదు కాబట్టి, ఆ అమ్మని అతడు క్షమించలేదు. తాను ఈ ప్రపంచంలో ఎవర్నేనా క్షమించలేకపోయాడంటే, అసలు క్షమించకుండా ఉండవలసిన అవసరమంటూ ఎవరితోనైనా పడిందంటే అది ఆ అమ్మ ఒక్కతె కోసమే కాబట్టి, ఈ ప్రపంచంలో తనకి ప్రాణప్రదమంటూ ఎవరన్నా ఉంటే అది ఆ అమ్మే. దూరంగా తోసేసినా, దగ్గరగా లాక్కున్నా- ఆ అమ్మ మాత్రమే. అమ్మ తప్ప తక్కిన ప్రపంచంతో అతడికి పనిలేదు.

అమ్మే ప్రపంచంగా కవులు జీవించి ఉండవచ్చు, కవిత్వం చెప్పి ఉండవచ్చు గాని, ఇంత ఏకైకమనస్కంగా చెప్పిన కవిత్వం బహుశా ఇదొక్కటే నేమో. నాయని సుబ్బారావు మాతృగీతాలు ఉన్నాయిగాని, ఆ సందర్భం వేరు. కళ్ళముందు అమ్మ ఉండీ, తాను ఎక్కడ, ఎప్పుడు ఆగిపోయాడో ఆ అమ్మ కోసం ఇంతలా కొట్టుమిట్టాడిన కవి తెలుగు కవిత్వంలో మరొకరు కనిపించడం లేదు.

ప్రపంచ కవిత్వంలో మాత్రం అట్టిలా జోసెఫ్ కనిపిస్తున్నాడు. హంగేరీ మహాకవి. ఇంతకు ముందు నేను అతడి కవిత్వం మీకు పరిచయం చేసాను. అతడు వాళ్ళ అమ్మ మీద రాసుకున్న కవితలు మళ్ళా ఇక్కడ ఎత్తి రాయాలని ఉంది గాని కన్నీళ్ళు అడ్డుపడతాయి. ఆ కవిత్వం నాకు మా అమ్మని గుర్తుకు తెస్తుంది. నేను మళ్ళా మామూలు మనిషిని కావాలంటే చాలాసేపు పడుతుంది.

ఇందులో ‘మధ్యాహ్నపు అమ్మ’ అని ఒక కవిత ఉంది. మధ్యాహ్నం వేళల్లో అమ్మ గుడ్డలు ఉతుక్కుంటూ ఉండే దృశ్యం మీద రాసిన కవిత. ఆశ్చర్యం, అట్టిలా కూడా ఇట్లాంటిదే ఒక కవిత రాసాడు. చూడండి:

అమ్మ

వారం రోజులుగా,ఉండీ,ఉండీ
మా అమ్మే గుర్తొస్తోంది నాకు.
ఉతికిన గుడ్డలు నీళ్ళు కారుతుండగా
ఆ బుట్టపట్టుకుని
ఆమె చకచకా మేడపైకి వెళ్తున్నదృశ్యం.

నేనెంత దుడుకు ధైర్యశాలినంటే
కాళ్ళు నేలకేసి తాటిస్తో, అరుస్తో
మారాం చేస్తూనే వున్నాను.
ఆ గుడ్డలెవరికైనా అప్పగించు,
నన్ను మేడమీదకి తీసుకెళ్ళంటూ.

ఆమె ఏమీ మాట్లాడకుండా
ఆ గుడ్డలట్లా ఆరేస్తూనే ఉంది.
నన్ను తిట్టలేదు,కనీసం నా వంక చూడలేదు
ఉతికి ఆరేసిన ఆ గుడ్డలు ఆ గాల్లో
మెరుస్తున్నాయి, గుసగుసలాడుతున్నాయి.

నా గొణుగుడు ఆపేసాను,
కాని అప్పటికే ఆలస్యమైపోయింది.
ఇప్పుడు తెలుస్తోంది, ఆమె ఎంత సమున్నతురాలో.
తన నెరిసిన జుత్తు స్వర్గంలోకీ రెపరెపలాడుతోంది
ఆకాశజలాలకి తాను నీలిమ చేకూరుస్తోంది.

శ్రీకాంత్ ఈ కవిత చదివి ఉంటాడని అనుకోను. చదివివుంటే తను ఆ కవిత ఆ రాసి ఉండేవాడు కాడు. ఈ కవితదగ్గరే కుప్పకూలిపోయి ఉండేవాడు.

ఇటువంటి కవిత్వం బాగుందిగాని, బాగులేదని గాని చెప్పవలసింది కాదు. ఇది నీ మిత్రుడు నీతో మాత్రమే పంచుకున్న ఒక అత్యంత వ్యక్తిగతమైన వేదన లాంటిది. అది నువ్వు విన్నప్పుడు చెయ్యవలసిందల్లా, అన్నిటికన్నా ముందు, మౌనం వహించడం. అప్పుడు వీలైతే అతడి భుజం మీద చెయ్యివేసి చిన్నగా తట్టడం. మళ్లా మరొకసారి అతడు ఇంత వ్యథకీ లోనయినప్పుడు, తన గుండె బరువు దించుకోడానికి ఏ సంకోచమూ లేకుండా మళ్ళా నీ దగ్గరకు రావొచ్చన్న చిన్న భరోసానివ్వడం.

ఇప్పటికి నేను చెయ్యగలిగింది కూడా ఇంతే.

Featured photo: Vincent Van Gogh Mother at the Cradle and Child Sitting on the Floor, 1881

16-2-2023

11 Replies to “తల్లికోసం, తల్లిగురించి, తల్లివల్ల”

 1. కన్నీళ్ళు ఆగలేదు. సున్నితమైన ఈ భావవ్యక్తీకరణ గుండెల్ని పిండివేసింది.

 2. చాలా పరిచితమైన దుఃఖం నాకు కూడా .అమ్మ అని కాదు .ఆ గాయాలు మానవు .
  కవిత్వం ఎప్పుడూ హృదయపు మూలల్లో ఎక్కడో పుడుతుంది అని నమ్ముతాను.

 3. నిజమే,కొన్ని కవితల్లో… మనసు కుప్ప కూలి పోతుంది సర్

 4. విశ్లేషణాత్మకమైన మీ పోస్టులు ఆలోచనీయాలు.

 5. విశ్లేషణాత్మక మైన మీ పోస్టులు ఆలోచనీయాలు.

 6. వాళ్ళ అమ్మ కోపగించినపుడు
  మా దౌహిత్రి ని వూరడించడం
  మాకెవ్వరికీ చేత కాదు
  కోపగించిన వాళ్ళ అమ్మనే వూరడించాలి
  దగ్గరకు తీసుకోవాలి
  ముద్దాడాలి
  అప్పుడే ఆ చిన్నారి కళ్ళల్లో వెలుగు .

  అనిర్వచనీయం అమ్మ ప్రేమ.

  ధన్యవాదాలు sir.

Leave a Reply

%d