వాక్ ఫర్ బుక్స్

వాక్ ఫర్ బుక్స్, విజయవాడ, 13-2-2023

విజయవాడ పుస్తక ప్రదర్శనలో అయిదవ రోజు అంటే నిన్న వాక్ ఫర్ బుక్స్ కార్యక్రమం. ప్రతి పుస్తక ప్రదర్శనలోనూ ఇది ఒక ప్రత్యేక కార్యక్రమం. 33 ఏళ్ళ కిందట విజయవాడలో పుస్తక ప్రదర్శన ప్రారంభించాక, కొందరు ప్రచురణ కర్తలు కలకత్తా పుస్తక ప్రదర్శనకు వెళ్ళారు. అక్కడ ఆ ఏడాది సత్యజిత్ రే పిలుపు మేరకు కలకత్తా పౌరులు పుస్తకాలకోసం నడక మొదలుపెట్టడం వారు చూసారు. నగరం నలుమూలలనుండీ పుస్తకప్రేమికులు పుస్తక ప్రదర్శనదగ్గరికి తరలి రావాలని సత్యజిత్ రాయ్ పిలుపునిచ్చాడు. అంతే, ఎక్కడికక్కడ పౌరులు ప్లకార్డులు పట్టుకుని నిశ్శబ్దంగా ప్రతి కూడలి దగ్గరా కలుసుకుని పుస్తక ప్రదర్శనకు చేరుకున్నారు. ఆ రోజు నడకలో దాదాపు నలభై వేలమంది పాల్గొన్నారని అంచనా. అప్పటినుంచి గత 32 ఏళ్లుగా విజయవాడ పుస్తక ప్రదర్శనలో కూడా వాక్ ఫర్ బుక్స్ ఒక తప్పనిసరి కార్యక్రమంగా నడుస్తూ ఉంది.

విజయవాడ పుస్తక ప్రదర్శనల్లో నేను 1996 నుంచి క్రమం తప్పకుండా పాల్గొంటూ ఉన్నాను. ఈ సారి వాక్ ఫర్ బుక్స్ ని ప్రారంభించే అవకాశం నాకు దక్కింది. నిన్న సాయంకాలం నాలుగింటికి సిద్ధార్థ కళాశాల ప్రాంగణం నుంచి పుస్తక ప్రదర్శన ప్రాంగణం దాకా సుమారు మూడున్నర కిలోమీటర్ల మేరకు పుస్తకప్రేమికులు, ప్రచురణకర్తలు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, పిల్లలు ఆ వాక్ లో పాల్గొన్నారు. దాదాపు కిలోమీటరు పొడవు వున్న ఆ పుస్తకప్రేమికుల వరస, ఆ నడక, మధ్యలో పిల్లల, పెద్దల నినాదాలు-మొత్తం నగరం దృష్టిని ఆకర్షించాయి.

కాని నా దృష్టిలో ఆ వాక్ అసంపూర్ణమే. ఎందుకంటే తక్కిన పౌరసమాజం కేవలం ప్రేక్షక పాత్ర వహించడం నాకు సంతోషాన్నివ్వలేదు. పట్టణంలో ఎంత మంది విద్యాధికులు ఉండిఉంటారు! ఎందరు డాక్టర్లు, లెక్చెరర్లు, ఇంజనీర్లు, ఉద్యోగులు ఉండి ఉంటారు! మొత్తం అందరూ తరలి రావద్దా అనిపించింది. ఒక సత్యజిత్ రే ఒక పిలుపునిస్తే మొత్తం కలకత్తా స్పందించిందే! వేలాదిగా పౌరులు తరలివచ్చారే! అటువంటి సత్యజిత్ రే మనకి ఎందుకు లేడు? అటువంటి చలనం మన పౌర సమాజానికి ఎందుకు కలగదు?

ఇలా నాలో నేను గొణుక్కుంటూ ఉన్నప్పటికీ, ఈ సారి విజయవాడ పుస్తక ప్రదర్శన నాకు సంతోషాన్నే ఎక్కువ ఇచ్చింది. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ వారు నన్ను పదిరోజులూ తమతో పాటు ఉండిపొమ్మని అడిగారు. అన్నాళ్ళు ఉండలేనని చెప్పి కనీసం మూడురోజులు ఉంటానంటే, ఉన్నంతసేపూ నన్ను ఏదో ఒక కార్యక్రమంలో తమతో కలుపుకుంటూనే ఉన్నారు.

‘ఐ యాం దట్’ నిసర్గదత్త మహారాజ్ సంభాషణలు ఆవిష్కరణ

ఆదివారం మల్లంపల్లి సోమశేఖర శర్మగారి వ్యాస సంపుటాల ఆవిష్కరణ సభలో సోమశేఖర శర్మగారి గురించి మాట్లాడే అవకాశంతో పాటు, ఆ తర్వాత జరిగిన రష్యన్ సాహిత్య సదస్సుకి అధ్యక్షత వహించే అవకాశం కూడా లభించింది. సాహితి ప్రచురణలూ, కుమార్ కూనపరాజూ ఏర్పాటు చేసిన ఆ సభలో చెహోవ్ కథల గురించి, డోస్టవస్కీ ‘కరమ్ జోవ్ సోదరులు’ గురించీ గుంటూరు లక్ష్మీనరసయ్య, ఉమా నూతక్కి, కాకుమాను శ్రీనివాసరావు, అనిల్ బత్తుల మాట్లాడేరు. ఆ సాహిత్యసభలో నేను రష్యన్ రచయితల సేల్స్ రిప్రజెంటేటివ్ గా మారేను. ఆ పుస్తకాలు కొనుక్కుని వెళ్ళండి అని శ్రోతల్ని, ప్రసంగానికీ, ప్రసంగానికీ మధ్య యాడ్ లాగా అభ్యర్థిస్తోనే ఉన్నాను. ఆశ్చర్యం! మా సభ ముగిసేటప్పటికి స్టాల్ నం.148 లో ఆ రెండు పుస్తకాలూ ఒక్క కాపీ కూడా మిగల్లేదు!

రష్యన్ సాహిత్య సదస్సుకు అధ్యక్షత వహిస్తూ

నిన్న వాక్ ఫర్ బుక్స్ తర్వాత జరిగిన సమావేశంలో డా.కేదార నాథ్ సింగ్ కవిత్వానికి కిలాడ సత్యనారాయణ అనువాదం ‘ఆత్మచిత్రం’ను ఆవిష్కరించి మొదటి ప్రతి ఉండవల్లి అరుణ కుమార్ కి ఇచ్చే అవకాశం లభించింది. ఆ పుస్తకం మీద ఇంతకుముందే ఇక్కడ మీతో నా భావాలు పంచుకున్నాను. నిన్న నలుగురిముందూ సభాముఖంగా పంచుకునే భాగ్యం లభించింది.

డా. కేదార్ నాథ్ సింగ్ కవిత్వం ఆత్మచిత్రం ఆవిష్కరిస్తూ

నిన్న రాత్రి చివరి సభ అనువాద సాహిత్యం మీద సదస్సు. గోళ్ళ నారాయణ రావు నిర్వహణలో జరిగిన ఆ సభలో ప్రసిద్ధ అనువాదకులు డా.వెన్నా వల్లభ రావు ప్రారంభ ప్రసంగం చేసారు. నాతో పాటు మరొక వక్త కూడా ప్రసంగించవలసి ఉంది. కాని ఆయన రాకపోవడంతో అనువాదసమస్యల గురించి దాదాపు గంటసేపు మాట్లాడే అవకాశం లభించింది. సాహిత్యాన్ని ప్రతి తరంలోనూ మళ్ళీ మళ్ళీ అనువదించుకోవలసిన అవసరం గురించీ, సాహిత్యేతర వాజ్ఞ్మయం, అంటే, సైన్సు, తత్త్వశాస్త్రం, సాంకేతిక శాస్త్రాల్ని తెలుగులో అనువదించవలసిన అవసరం గురించీ వివరంగా చెప్పాను. ఇక ఇప్పుడు తెలుగులోకి విస్తారంగా అనువాదమవుతున్న వ్యక్తిత్వ వికాస సాహిత్యం, మానేజిమెంటు, ఇతర ఇంగ్లిషు బెస్ట్ సెల్లర్స్ లో కనవస్తున్న అనువాద దోషాల గురించి కూడా వివరంగా మాట్లాడేను.

ఎప్పట్లానే అనల్ప బుక్స్ లో కొత్త పుస్తకాలు దొరికాయి. ఈ సారి కొనుక్కున్న పుస్తకాలు: The Big Red Book of Chinese Literature (2016), Armistice, A Laureate’s Choice of Poems of War and Peace (2018), The Bright Book of Life, Novels to Read and Reread, Harold Bloom (2020), 365 Tao, Daily Meditations (1992), The Hidden Life of Trees (2016),The Secret Network of Nature (2017) The Inner Life of Animals (2018), The Vagabond’s Way, 365 Meditations on Wanderlust Discovery, and the Art of Travel (2022)

మొన్న సాహిత్య అకాదెమీ స్టాలు దగ్గర నిలబడి ఉండగా ఎవరో ఈ పుస్తకం మంచిదేనా అని ఆ స్టాలు వాళ్ళని ఏదో పుస్తకం గురించి అడుగుతున్నాడు. నేను అతడికి ‘అమృత సంతానం’, ‘యయాతి’ చూపించి- ఈ రెండు పుస్తకాలూ చదవండి, గొప్ప అనుభూతి లభిస్తుంది అని చెప్పాను. ఆ స్టాలు నిర్వాహకుడు నా మాటలు విని నా గురించి వాకబు చేసినట్టున్నాడు, నా దగ్గరకొచ్చి మీరూ ఏమీ అనుకోకపోతే బెంగుళూరు నుంచి ఒక రచయిత మీతో మాట్లాడాలనుకుంటున్నాడు అని ఫోన్ కలిపి ఇచ్చాడు. ఆయన కన్నడ భాషా సాంస్కృతిక శాఖకి కార్యదర్శిగా పనిచేసి పదవీవిరమణ చేసిన అధికారి. తాను పాల్ కారస్ నీ, విల్ డురాంట్ నీ కన్నడంలోకి అనువదించానని చెప్పాడు. అమృత సంతానం మహిమ అటువంటిది. తనని ఒక కొత్త పాఠకుడికి పరిచయం చేసిన ప్రతిసారీ నాకో కొత్త రచయితని పరిచయం చేస్తుంది!

14-2-2023

9 Replies to “వాక్ ఫర్ బుక్స్”

 1. మన విజయవాడలో పుస్తక ప్రేమికులు చాలామంది వున్నారు. వారినందరినీ “వాక్” లో పాల్గొనేలా చేయడంతో బాటు బుక్ క్లబ్ లు యేర్పాటుకు ప్రయత్నం చేస్తే పుస్తక పఠనంపై ఆసక్తి కలుగుతుంది. పాఠకుల సంఖ్య పెరిగేకొద్దీ పుస్తక మహోత్సవాలు, పుస్తకం కోసం నడక వంటి అంశాల పై అవగాహన కలిగి సమాజంలో వాటి విలువ పెరుగుతుంది. మీలాంటి లబ్ద ప్రతిష్టలైన రచయితలు పూనుకుంటే యీ పని సులువౌతుంది.

  1. అవును. పుస్తకాలున్నాయి. వాటిని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. ఆ రెండింటిని కలిపే వాళ్లే కావాలి.

 2. మీ నిత్య సాహిత్య సల్లాపపు ముచ్చట్లు చదువుతుంటే ముచ్చటగా ఉంది. కాల్పనిక రచనలకంటే అనుభవాల వింగడాలే ఆనందాన్నిస్తాయనిపిస్తుంది. సత్యజిత్ రే పుస్తకాలకై పిలుపు స్ఫూర్తిదాయకం.అది ఇక్కడ కొనసాగించడం సత్సంప్రదాయం. ఈ పోస్టులో చదవదగ్గ పుస్తకాల జాబితా చోటు చేసుకోవడం అస్మదీయులకు ఆనందకారకం. నమస్సులు.

 3. మీలాంటి వారితో ఆ ర్యాలీలో కాలు కదిపి కలిసి నడిచినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్

 4. అమృత సంతానం కోసం నేను బుక్ ఫెయిర్ (కరోనా కు ముందు సంవత్సరం లో)
  లో అడిగినప్పుడు కాపీలన్ని అయిపోయాయి.
  మొన్న హైదరాబాద్ లో నిర్వహించిన బుక్ ఫెయిర్ అప్పుడు తీర్థ యాత్ర లో ఉన్నాను.

  ఈసారి కాచిగూడ కు వెళ్ళినపుడు తప్పకుండా
  తీసుకుంటాను.

Leave a Reply

%d