తెలుగుచరిత్రకు నిలువుటద్దం

విజయవాడ పుస్తక ప్రదర్శనలో భాగంగా నిన్న, మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి వ్యాసాలు రెండు సంపుటాలు, పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించారు. ఎమెస్కో సంస్థ ప్రచురించిన ఆ సంపుటాల్లో సోమశేఖర శర్మగారు చరిత్ర, సంస్కృతి, భాష, సాహిత్యం మొదలైన ఎన్నో విషయాల పైన రాసిన వ్యాసాలు రెండు వేల పుటలకు పైగా ఉన్నాయి. ఆ సంపుటాల ఆవిష్కరణ సందర్భంగా సోమశేఖర శర్మ గారి గురించి రెండు మాటలు మాట్లాడే అవకాశం నాకు లభించింది.

మల్లంపల్లి సోమశేఖర శర్మ (1891-1963) తెలుగు జాతికి, భాషకు, సంస్కృతికి నిలువుటద్దం. ఆంధ్రులు అంటే ఎవరు అనే ప్రశ్నకు ఆయన చేసిన అన్వేషణ, రాబట్టిన సమాధానాలు, సంపాదించిన ఆధారాలు, వివరించిన విశేషాలు తెలుగుజాతికి ఒక సమగ్ర వారసత్వాన్ని అందించాయని చెప్పవచ్చు. మనం మన గతం గురించి, మన భాష గురించి, మన సాహిత్యం గురించి, సంస్కృతి గురించి ఈనాడు చెప్పుకుంటున్న ఎన్నో అంశాలకు ప్రాతిపదిక ఆయన సమకూర్చిందే. ఒక విధంగా చెప్పాలంటే మల్లంపల్లి సోమశేఖర శర్మ లేకపోయి ఉంటే మన జాతి గురించి, మన భాష గురించి, మన సంస్కృతి గురించి మన అవగాహనలో సమగ్రత ఉండి ఉండేది కాదు.

కానీ అటువంటి మహనీయుడి ఋణం తెలుగుజాతి ఏ విధంగానూ తీర్చుకోలేకపోయింది. ఆయనకు ఒక్క విశ్వవిద్యాలయం కూడా డాక్టరేటు ఇవ్వలేకపోయింది, ఒక జిల్లాకు గాని, ఒక విశ్వవిద్యాలయానికి కానీ, కనీసం ఒక కళాశాలకు కానీ, చివరికి ఒక వీధికి గాని, ఒక భవనానికి కూడా ఆయన పేరు పెట్టుకోలేకపోయింది.

సోమశేఖర శర్మ గారి గురించి నిన్న పరిచయం చేయవలసి వచ్చినప్పుడు ఆయన గురించి ఏమి చెప్తే ఇప్పటి తెలుగు వాళ్ళకి, ఇప్పటి తెలుగుజాతికి ఆయన వ్యక్తిత్వాన్ని రూపు కట్టించగలనా అని ప్రశ్నించుకున్నాను. ఎందుకంటే ఆయన అన్వేషించి ప్రతిపాదించిన ఆంధ్రజాతి, ఆంధ్ర సంస్కృతి ప్రస్తుత ఆంధ్ర సంస్కృతి, ఆంధ్రుల ఆరాటం ఒకటి కావు. ఆంధ్ర రాష్ట్రం 1953లో పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ వల్ల ప్రభవించిందని మనకు తెలుసు. భారతదేశంలో మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం అది. అయితే దాని వెనక కనీసం నలభై ఏళ్ల చరిత్ర ఉంది. బాపట్లలో ప్రథమాంధ్ర మహాసభ సమావేశమైనప్పుడు ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని తీర్మానం చేశారు. అప్పటికే ఎన్నో ఏళ్లుగా ఆంధ్రులకు స్వయం పాలన గురించిన ఒక ఆరాటం, ఆవేదన రగులుతూ ఉన్నాయి. 1913 తర్వాత తెలుగు నాట కవులు, రచయితలు, చరిత్రకారులు, పరిశోధకులు ఆంధ్రుల తరతరాల చరిత్రని సంస్కృతిని అన్వేషించడం మొదలుపెట్టారు. గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావు, విశ్వనాథ సత్యనారాయణ వంటి కవులు, శాసన పరిశోధకులు ఒకపక్క, గిడుగు రామ్మూర్తి, కొమర్రాజు లక్ష్మణరావు చిలుకూరి వీరభద్రరావు వంటి వాజ్మయ పరిశోధకులు మరొక పక్క, వీరేశలింగం, చిలకమర్తి, రఘుపతి వెంకటరత్నం నాయుడు వంటి సంస్కర్తలు మరొకవైపు ఆంధ్రుల చరిత్ర గురించి, సంస్కృతి గురించి, భాష గురించి, సాహిత్యం గురించి మాట్లాడుతూ ఉన్న కాలంలో వారి ప్రతిపాదనలకు శాసనపరమైన ఆధారాల్ని అన్వేషించడంలో సోమశేఖర శర్మ గారు చేసిన కృషి నిరుపమానమైంది.

శాసనాల ఆధారంగా నన్నయకు పూర్వపు తెలుగు సాహిత్యం గురించి, ముసునూరి నాయకుల చరిత్ర గురించి, ముఖ్యంగా రెడ్డి రాజుల చరిత్ర గురించి వారు చేసిన పరిశోధన తెలుగుజాతి గతాన్ని, చరిత్రను ఎంతో ఎత్తున నిలబెట్టింది. తెలుగు నేలమీద బౌద్ధం, జైనం పాశుపతం వంటి మతాలు ఏ విధంగా విలసిల్లాయో ఆయన చెప్పిన ఆధారాలే ఇప్పటికీ మనకి మూల సూత్రాలుగా నిలబడ్డాయి. కేవలం సాహిత్యం, చరిత్ర మాత్రమే కాదు శాసనాల ఆధారంగా, సాహిత్య కృతుల ఆధారంగా ఒకప్పటి తెలుగు సామాజిక జీవితాన్ని ఆయన పునర్నిర్మించిన తీరు అద్వితీయం. అటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి మరే దేశంలో నైనా పుట్టి ఉంటే ఆయన్ని నెత్తి మీద పెట్టుకుని ఉండేవారు. మన పక్కన తమిళనాడులో యు.వి.స్వామినాథ అయ్యర్ అటువంటి కృషి చేసినందుకు ఆయన్ని తమిళానికి తండ్రిగా కొనియాడుతున్నారు. కానీ తెలుగు నాట ఈరోజు సోమశేఖర శర్మ ఎవరో దాదాపుగా ఎవరికీ తెలియదు.

ఆంధ్రులు అంటే ఎవరు? నేను 30, 40 ఏళ్ల కిందట ఆంధ్రుల చరిత్ర పైన సోమశేఖర శర్మ గారి పుస్తకంచదివాను. ఆంధ్రుల చరిత్ర గురించి ఆ రచన నాకు ఇచ్చిన అవగాహన ఇప్పటివరకు నాకు మరే రచయిత ఇవ్వలేకపోయాడు. నాకు అర్థమైంది ఏమిటంటే సగం తమిళ దేశ చరిత్ర ఆంధ్ర చరిత్రనే. ముప్పాతిక భాగం కళింగదేశ చరిత్ర ఆంధ్ర చరిత్రనే. కన్నడ దేశ చరిత్ర దాదాపుగా ఆంధ్రుల చరిత్రనే. ఇక ఇప్పుడు మనం తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ అని రెండు రాష్ట్రాలుగా విభజించి చూస్తున్న చరిత్ర మొన్నటి దాకా ఒకే చరిత్ర. ఇంత మహోన్నత చరిత్ర కలిగిన ఆంధ్రులు తమ గతాన్ని తలుచుకుని, ఒక ఉజ్వల భవిష్యత్తు కోసం కలలు కనడం బహుశా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుతో ఆగిపోయింది అనుకుంటాను. గత 50 ఏళ్లుగా ఆంధ్రుల చరిత్ర వ్యాపార చరిత్ర మాత్రమే. ఆంధ్రుల సంస్కృతి సినిమా సంస్కృతి మాత్రమే. ఇప్పటి ఆంధ్రులకి తమ కళల పట్ల, తమ ఇతిహాసం పట్ల, తమ భాష పట్ల, తమ చరిత్ర పట్ల ఏమాత్రం ఆసక్తి లేదు. ఇప్పుడు ఆంధ్రులు తమ వినోదం కోసం, ఉత్తేజం కోసం, స్ఫూర్తి కోసం సినిమానటుల వైపు చూస్తున్న కాలం.

మొన్న ఒక ఇంటర్వ్యూలో ఒక విశ్లేషకుడు ఎంతో వివరంగా చెప్తూ ఉండడం విన్నాను. ఆయన చెప్పిందేమంటే తక్కిన రాష్ట్రాల్లోనూ, తక్కిన దేశాల్లోనూ ఒక మనిషి ఒక సమయంలో ఒక సినిమా చూశాడు అనుకుంటే ఆంధ్రదేశంలో ఆ మనిషి అదే సమయంలో 20 సినిమాలు చూస్తున్నాడని. నా మిత్రులు ఒకాయన ఈ మధ్య అమెరికా వెళ్లి వచ్చారు. అక్కడ ఆయన్ని మిత్రులు అవతార్-2 సినిమాకి తీసుకెళ్లారుట. ఆ సినిమా టికెట్ 25 డాలర్లట. ఆ మిత్రులు ఆయనతో అమెరికాలో ఒక హాలీవుడ్ సినిమా మీద పెట్టగల అతిపెద్ద టిక్కెట్ ధర అది అని చెప్తూ అదే అమెరికాలో ఒక తెలుగు సినిమా టిక్కెట్టు వంద డాలర్ల వరకు ఉంటుందని చెప్పారట. తెలుగు నేల సినిమాల పట్ల అబ్సెసివ్ గా మారడం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే మొదలయ్యింది. ఎనభైలతర్వాత మరింత బలపడింది. ఇప్పుడు తెలుగు వాళ్ళ చరిత్ర, సంస్కృతి, కళలు, కవిత్వం మొత్తం సినిమానే కాబట్టి తెలుగు ప్రజలు తమ పరిపాలకులుగా కూడా సినిమా నటులే ఉండాలని కోరుకోవడంలో ఎంత మాత్రం ఆశ్చర్యం లేదు.

ఒకప్పుడు బ్రిటిష్ పాలనా కాలంలో బానిసలుగా జీవించవలసి వచ్చినప్పుడు మన పూర్వీకులు మన చరిత్ర సంస్కృతి ఎంతో ఉన్నతమైనవని తలుచుకుని అటువంటి ఉజ్వల యుగాలు తిరిగి రావాలని కలగన్నారు. అటువంటి కలలే ఒక సోమశేఖర శర్మను సృష్టించాయి. ఇప్పుడు మనం పరపాలన కింద లేము. కాని అత్యంత అనుత్పాదకంగా మన కాలాన్ని వెళ్లబుచ్చగల సినిమా వ్యామోహానికి బానిసలుగా ఉన్నాం. కాబట్టి ఇటువంటి కాలంలో ఒక సోమశేఖర శర్మ ప్రభవించడం అలా ఉంచి ఆయన్ని తలుచుకోవడం కూడా అసంభవం కావడంలో ఆశ్చర్యం లేదు.

నిన్నా, ఈరోజూ సోమశేఖర శర్మ గారి వ్యాస సంపుటాలు తిరగేస్తూ ఉన్నాను. ఆ దీక్ష, ఆ తపన, ఆ పరిశోధన, ఆ పరితాపం వాటిని చూస్తూ ఉంటే నాకు ఎంతో దిగులుగానూ, సిగ్గుగానూ కూడా ఉంది. దిగులు ఎందుకంటే అటువంటి మహనీయులు సంచరించిన కాలంలో నేను పుట్టలేదే అని. సిగ్గు ఎందుకంటే- వారు పనిచేసిన రోజుల్లో కన్నా ఇప్పుడు మరింత మెరుగైన సమాచార ప్రసార సాధనాలు, రవాణా సాధనాలు అందుబాటులో ఉండి కూడా, మరింత విజ్ఞానం అందుబాటులో ఉండి కూడా వారు చేసిన కృషిలో శతాంశం కూడా చేయలేకపోయేమే అని.

సోమశేఖర శర్మ గారి ఋణం తెలుగుజాతి తీర్చుకోగలది కాదు. అసలు తాము అటువంటి ఒక మానవుడికి ఋణపడ్డామన్న ఎరుక కూడా లేని కాలం ఇది. ఇటువంటి దౌర్భాగ్యకాలంలో ఆయన ఋణాన్ని ఎంతో కొంత తీర్చుకోవడానికి ప్రయత్నించిన ఎమెస్కో సంస్థను ఎంత ప్రశంసించినా చాలదు.

ఈసారి పుస్తక ప్రదర్శనలో తెలుగుజాతికి లభించిన గొప్ప బహుమానం శర్మ గారి వ్యాసాల రెండు సంపుటాలూనూ. అటువంటి బహుమానం తనకి అయాచితంగా లభించిందని కూడా తెలుసుకోలేని దురవస్థలో తెలుగుజాతి ఉందన్నది నాకు మరింత దిగులు కలిగిస్తున్న విషయం.

13-2-2023

12 Replies to “తెలుగుచరిత్రకు నిలువుటద్దం”

 1. మీరు చేస్తున్న సాహిత్య పరిశోధనాత్మక సేవ తక్కువేం కాదు

 2. మహనీయుల్ని పరిచయం చేశారు సార్. వారి పుస్తకాలు దొరికే లింక్ పెట్టగలరు.

 3. చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో వీరి వ్యాసాలుండేవి. ఇప్పటి పాఠ్య పుస్తక నిర్మాతలకు వీరి పేర్లు కూడా తెలిసి ఉండవనే మాట అతిశయోక్తి కాదు. తెలిసినా గుర్తు పెట్టుకునే సంయమనం లేదు. మొన్న ఒక అపరిచిత మిత్రుడు వనస్థలిపురా నుండి ఫోన్ చేసి నా మానేరు ముచ్చట్ల గురించి విన్నాననీ నాకు తనదగ్గరా ఉన్న The glory of Elgandal by Prof.Nagabhushanam of Nagarjuna University పంపించారు. అది మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి స్మారక సంచిక
  Dept. of Archeology , Andhrapradesh 1976 లో ప్రచురించింది. అది చదివి,అందులో నాకు తెలియని కొన్ని కొత్త విషయాలు చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆయన ప్రత్యేకంగా మా ఊరిని సందర్శించి రాసిన వ్యాసం. ఇది మల్లంపల్లా వారి స్ఫూర్తి ప్రభావం అని స్పష్టంగా తెలుస్తున్నది.
  మీ వ్యాసం చదువుతుంటే మారిన మన చదువుల దిశ, గమ్యం గోచరిస్తున్నాయి.
  ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు
  అనిపిస్తున్నాయి .

 4. మల్లంపల్లి గారి ‘చారిత్రక వ్యాసమంజరి, రెడ్డి రాజులు, ముసునూరు నాయకులు… ఈ పుస్తకాల తర్వాత ఇంకేవీ లేవా అని చాలా కాలంగా చూస్తున్నాను. ఎమెస్కో చేసిన పని చాలా గొప్పది. ఈ పుస్తకాల ద్వారానైనా… మల్లంపల్లి వారిపైన మరింత వెలుగు ప్రసరించాలని కోరుకుంటున్నాను.
  మీరు కూడా సమగ్రమైన సమీక్ష రాయాలని నా విజ్ఞప్తి! అసలు తెలుగు చరిత్ర పరిశోధకుల గురించి ఓ సిరీస్ రాసినా గొప్పగా ఉంటుంది. ఆలోచించగలరు…

Leave a Reply

%d bloggers like this: