స్వాతంత్ర్య దర్శనం

స్వాతంత్ర్య దర్శనం, ఫొటో ఎగ్జిబిషన్, విజయవాడ పుస్తక ప్రదర్శన

విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ వారు నిర్వహిస్తున్న 33వ పుస్తక ప్రదర్శనలో ప్రత్యేకమైన ఆకర్షణ ‘స్వాతంత్ర దర్శనం’ పేరిట మా అన్నయ్య వాడ్రేవు సుందర రావు నిర్వహిస్తున్న ఫోటో ఎగ్జిబిషన్.

మా అన్నయ్య సుందర్రావు చిన్నప్పటి నుంచి నాకు స్ఫూర్తి. ఒక విధంగా చెప్పాలంటే నా చదువుకి, ఉద్యోగానికి బాటలు వేసింది వాడే. నన్ను ఒక వక్తగా తీర్చిదిద్దింది కూడా వాడే. నా చిన్నప్పుడు మా అన్నయ్య రాజవొమ్మంగి హైస్కూల్లో వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో పాల్గొంటున్నప్పుడు, ఏకపాత్రాభినయాలు చేస్తున్నప్పుడు, నలుగురిని కూడగట్టి నాటికలు, నాటకాలు వేస్తున్నప్పుడు నేను విభ్రాంతిగా కళ్లప్పగించి చూస్తూ ఉండేవాణ్ణి. నేను హైస్కూల్లో చదువుకునే రోజుల్లో వాడు కాలేజీ విద్యార్థిగా ఆంధ్ర దేశమంతటా వక్తృత్వ పోటీల్లో పాల్గొనేవాడు. ఎక్కడికి వెళ్ళినా మొదటి ప్రైజ్ వాడిదే. వాడి వల్లనే నాకు కూడా చరిత్ర పట్ల, చరిత్ర గ్రంథాల పట్ల ఆసక్తి కలిగింది. వాడి స్ఫూర్తి వల్లనే నేను కూడా నా సాహిత్య పఠనం చరిత్ర పుస్తకాలతోటే మొదలుపెట్టాను.

అయితే నెమ్మదిగా వాడి  ఆసక్తి వక్తృత్వం, వ్యాసరచన లాంటి రంగాల నుంచి నాటక రంగం వైపు మళ్లింది. ముఖ్యంగా కందుకూరి వీరేశలింగం పైన, పొట్టి శ్రీరాములు పైన వాడు రాసిన నాటకాలకి నంది అవార్డులు వరించాయి. చిన్నప్పుడు మేమిద్దరం ఏకపాత్రలు వేయడం నేర్చుకున్నాం . డా. కొర్రపాటి గంగాధరరావు రాసిన సామ్రాట్ అశోక ఏకపాత్రతో మా అభ్యాసం మొదలుపెట్టాం. మా ఊర్లో వి ఎల్ డబ్ల్యు గా పనిచేసిన సంగాని హనుమంతరావు గారు ఏకపాత్రాభినయంలో మాకు గురువు. (వాళ్ళ అబ్బాయి సంగాని శ్రీనివాస జీవన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సమాచార శాఖలో జాయింట్ డైరెక్టరుగా పనిచేసి ఈ మధ్యనే పదవీ విరమణ చేశారు.) నేను ఏకపాత్రాభినయం తాడికొండ స్కూలు తోటే వదిలి పెట్టేసాను. కాని మా అన్నయ్య మాత్రం ఇప్పటికీ ఒక తపస్సు లాగా ఏకపాత్రాభినయం కొనసాగిస్తూనే ఉన్నాడు. అందులో ఇప్పటికి మూడు నాలుగు సార్లు గరుడ అవార్డులు కూడా కైవసం చేసుకున్నాడు.

కానీ వాడు ఇటీవల కాలంలో చేస్తున్న అత్యంత విశిష్టమైన పని కళా రంగానికి సంబంధించింది కాదు. భారత స్వాతంత్ర సంగ్రామం గురించి, మహాత్మా గాంధీ గురించి, స్వాతంత్ర వీరుల గురించి గత పదేళ్లుగా వాడు చేస్తూ వస్తున్న కృషి మామూలు కృషి కాదు. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా వాడు గాంధీ మీద నిర్వహించిన ఫోటో ఎగ్జిబిషన్ అద్వితీయమైన ప్రదర్శన. నాకు తెలిసి అటువంటి ప్రదర్శన జాతీయస్థాయిలో కూడా ఏ సంస్థ కూడా చేసినట్టు లేదు.

నేను పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్నప్పుడు మహాత్మా గాంధీ 150వ జయంతిని పెద్ద ఎత్తున జరిపినప్పుడు బాపట్లలో ఈ ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశాము. అప్పటి విద్యాశాఖ మంత్రి డా. ఆదిమూలపుసురేష్ ఆ ప్రదర్శన చూసి ఎంతో పరవశించిపోయారు. అలాగే గిరిజన స్వాతంత్ర్య వీరుల గురించి వాడు చేసిన కృషి నిరుపమానం. అల్లూరి సీతారామరాజు తో పాటు కలిసి పోరాడిన మన్య వీరుల వివరాలు సేకరించి విశాఖపట్నంలో ఉన్న గిరిజన సాంస్కృతిక శాఖ మిషన్ కార్యాలయంలో ఈ మధ్యనే వారందరి పేర్లు శిలాఫలకాలుగా ప్రతిష్టించడంలో వాడి పాత్ర చాలా ఉంది. ఇప్పుడు ఈ పుస్తక ప్రదర్శనలో భాగంగా వాడు భారత స్వాతంత్ర వీరుల గురించి చేపట్టిన ప్రదర్శన కూడా అటువంటి అద్వితీయమైన కృషి. దాదాపు రెండు వేల మంది విస్మృత స్వాతంత్ర్య వీరుల ఫొటోలు, వివరాలు సేకరించి వారి గురించి పెద్దలకూ, పిల్లలకూ కూడా వివరిస్తూ ప్రదర్శనలు నిర్వహిస్తున్నాడు. ఈ పుస్తకం ప్రదర్శనలో స్థలాభావం వల్ల 300 మంది స్వాతంత్ర్య వీరుల్ని మాత్రమే పరిచయం చేస్తున్నాడు.


పుస్తక ప్రదర్శన ప్రారంభదినోత్సవం నాడు రాష్ట్ర గవర్నరుగారు ఆ ప్రదర్శన చూసి ఎంతో మురిసిపోయారని విన్నాను. ముఖ్యంగా ఒరిస్సాకు చెందిన విస్మృత గిరిజన స్వాతంత్ర్య వీరుల గురించి వాడు ప్రస్తావించడం గవర్నర్ గారికి ఎంతో సంతోషం కలిగించిందని కూడా విన్నాను. ఈరోజు ఆ ప్రదర్శనని పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కూడా చూడటం నాకు చాలా సంతోషం కలిగించింది. ఆయన ఆ సందర్భంగా మా వాడితో ‘ప్రసిద్ధ జాతీయ నాయకుల గురించి మాట్లాడేవాళ్లూ, వారిని పట్టించుకునే వాళ్ళూ ఎవరో ఒకరు ఉన్నారు. కానీ మీరు ఇక్కడ ప్రదర్శిస్తున్న ఈ విస్మృత వీరుల గురించి మాట్లాడడానికి మీరు తప్ప వాళ్ళకి మరెవరూ లేరు’ అన్నారు. అది నిజంగా మా వాడి కృషికి సముచిత ప్రశంసగా నేను భావిస్తున్నాను.


భారత స్వాతంత్ర్య సంగ్రామం గురించి, స్వాతంత్ర్య వీరుల గురించి, వారి త్యాగాల గురించి మా వాడు చేస్తున్న ఈ కృషి ఒక నిస్వార్ధ కర్మయోగి చేసే తపస్సు లాంటిది అని చాలాసార్లు అనుకున్నాను. జాతి విముక్తి కోసం తమ జీవితాలు తృణప్రాయంగా త్యాగం చేసిన వాళ్ల పట్ల ఇంత అంకితభావం, శ్రద్ధ, ఆరాధన భావం కలిగిన మనుషుల్ని నేను నా జీవితంలో చాలా కొద్దిమందిని, అది కూడా వేళ్ళ మీద లెక్కపెట్టగలిగే వారిని, మాత్రమే చూసాను. అందులో మా అన్నయ్య కూడా ఒకడు.

మరి ముఖ్యంగా గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల గురించి వాడు చేస్తున్న కృషికి మేము మా కుటుంబం అందరి తరపున కూడా వారికి ఋణపడి ఉంటాము. ఎందుకంటే మా కుటుంబమంతా గిరిజనులకు ఋణపడి ఉంది. నేను మూడున్నర దశాబ్దాలు గిరిజన సంక్షేమ శాఖలో పనిచేయడం ద్వారా ఆ ఋణం కొంత మాత్రమే తీసుకోగలిమానని అనుకుంటూ ఉంటాను. నేను తీర్చుకోలేక పోయిన చాలా ఋణం మా కుటుంబం తరపున మా అన్నయ్య ఇలా తీర్చుకుంటున్నాడు.

జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల లెక్చరర్ గా మా అన్నయ్య తన ఉద్యోగ జీవితంలో ఎందరికీ విద్యాదానం చేశాడో, ఎందరికి ఒక భవిష్యత్తును అందించాడో అదంతా రాయాలంటే పెద్ద గ్రంథమే అవుతుంది. కానీ స్వాతంత్ర్య సంగ్రామం గురించిన ఈ ప్రదర్శన ద్వారా వాడు ఒక జాతి స్మృతిని బతికిస్తూ ఉన్నాడు చూడండి- అది అన్నిటికన్నా గొప్ప విద్యాదానం అని నేను అనుకుంటాను.

వాడికి నా జేజేలు.

12-2-2023

6 Replies to “స్వాతంత్ర్య దర్శనం”

  1. అవునండీ, ఆయన నిరంతర కృషీవలుడు. తను దేశం కోసం ఏం చేయగలరో అదంతా చేస్తూనే ఉంటారు గొప్ప స్ఫూర్తి ప్రదాత మీ అన్నయ్య గారు.

  2. అన్నయ్య అంటే తండ్రి తరువాత తండ్రి లాంటి వారు కదా అలాంటి అన్నయ్యను “వాడు”అని పేర్కొనడం లోని ఔచిత్యం అర్థం కాలేదు.

    మీరొక్కరే కాదు చాలా చోట్ల ఇలాంటివి చూసాను.
    ఎంతో చనువుగా,ఆప్యాయతతో పిలుచుకొనే అమ్మను “అమ్మ గారు”అని పిలవడం కృతకంగా
    అనిపించదా!
    సందర్భం ఇది కాకపోవచ్చును కాని……

Leave a Reply

%d