ఊర్వశీయం

కాళిదాసు విక్రమోర్వశీయం నాటకానికి అక్క చేసిన అను సృజన ‘ఊర్వశి’ నవల వెలువడిన వెంటనే నేను ఆ పుస్తకాన్ని ఇక్కడ పరిచయం చేశాను. ఆ పుస్తకాన్ని ఈరోజు విజయవాడలో అక్కా వాళ్ళింట్లో ఓల్గా గారు, కుటుంబరావు గారు ఆవిష్కరించారు. కాకినాడ నుంచి వచ్చిన మిత్రులు డా.కాళ్లకూరి శైలజ, జగన్నాథరావు, శుభశ్రీ, బెంగుళూరునుంచి వచ్చిన మిత్రుడు మురళీ శంకర్, విజయవాడ మిత్రులు కొప్పరపు లక్ష్మీనరసింహారావు, నాదెండ్ల అనురాధ, కళ్యాణి నీలారంభం, పల్లిపాలెం నుంచి వచ్చిన మధునాపంతుల చలపతి, రామచంద్రపురం నుంచి వచ్చిన సంధ్య గారు ఆ పుస్తకం మీద మాట్లాడారు. ఓల్గా గారు అందరి ప్రసంగాల సారాంశాన్ని సమీక్షిస్తూ కొత్త ఆలోచనలు ఆ పుస్తకం మీద ప్రసరింపచేశారు. చివరగా అక్క ఈరోజు జరిగిన సమీక్ష మీద తన ప్రతిస్పందన పంచుకుంది.

దాదాపు మూడు గంటల పైగా జరిగిన ఈ చర్చ చాలా వాడిగాను, వేడిగాను, లోతుగాను జరిగింది. ఒక ప్రాచీన సంస్కృత నాటకాన్ని తెలుగులోకి అందించిన కృషి అనే ప్రశంసతో మొదలైన చర్చ చివరికి వచ్చేటప్పటికి కాళిదాసు ఈ నాటకంలో వేసిన ప్రశ్నలు, ఇచ్చిన సమాధానాలు ఈనాటి సామాజిక జీవితానికి కూడా ఎంతో రిలవెంట్ గాను, ఆ ప్రశ్నలు ఎంతో సూటిగాను, ఆలోచించ దగ్గవిగానూ ఉన్నాయనే దాకా విస్తరించింది. మూడు గంటల పాటు చర్చ నడిచిన కొద్ది కొత్త కొత్త ప్రశ్నలు పుడుతూనే ఉన్నాయి.

ఒక రాజు తన నడివయసులో ఒక దేవకాంతతో ప్రేమలో పడడం, దాన్ని చూసి కూడా అతని పట్టపురాణి దాన్ని మౌనంగా అంగీకరించడం అన్న ఒక్క అంశం మీదనే ఎంతో చర్చ జరిగింది. తాను ఆ రచన చదువుతున్నంత సేపూ ఆ రాణి వైపు నుంచే ఆలోచించకుండా ఉండలేకపోయాననీ, ఆమె ఒక మనిషి, ఆమెకి కూడా ఇష్టాయిష్టాలు ఉంటాయి అన్న విషయాన్ని నాటకర్త దాదాపుగా విస్మరించినట్టుగానూ, కేవలం పురూరవుడు, ఊర్వశి అనే ఇద్దరు ప్రేమికుల ప్రేమ గురించే రాసుకుంటూ పోవడం తనని ఎంతో డిస్టర్బ్ చేసిందని శుభశ్రీ చాలా గట్టిగా విమర్శించింది.

కానీ సరిగ్గా ఆ విషయంలోనే కాళిదాసులోని పరిణతి తనకు కనబడుతోందని కళ్యాణి నీలారంభం గారు ఆ అంశాన్ని పూర్తిగా భిన్నమైన కోణంలో వివరించడానికి ప్రయత్నించారు. ఆమె చెప్పిన దాని ప్రకారం పురూరవుడు ఊర్వశితో ప్రేమలో పడటం తన సామాజిక రాజకీయ భద్రతను ఏ విధంగానూ ప్రభావితం చేయలేనిదని రాణి స్పష్టంగా గ్రహించిందని, కాబట్టి ఆమె సాధ్యసాధ్యాలని పూర్తిగా బేరీజు వేసుకుని ఆ అంశాన్ని ఎంతో హుందాగా అంగీకరించింది అన్నారు. అలా అంగీకరించడంలో ఆమె మానసిక పరిణితి కనిపిస్తుందని, మనిషి మలి వయసులో పొందగల మానసిక పరిణతికి రాణి పాత్ర నిండైన ఉదాహరణ అని ఆమె ప్రతిపాదన.

అలాగే, ఊర్వశి తన ప్రేమ కోసం తన పిల్లవాడిని దూరంగా ఎక్కడో ఆశ్రమంలో పెంచడం అన్న అంశం మీద కూడా చర్చ జరిగింది. ఒక స్త్రీ తన ఇష్టపడ్డ పురుషుడి సాన్నిహిత్యాన్ని కోరుకునే క్రమంలో పిల్లలకి ఇవ్వవలసిన స్థానం, చూపించవలసిన శ్రద్ధ, లేదా చూపించలేకపోతున్న శ్రద్ధ-వీటికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఈ నాటకంలో ఉన్నాయన్నది కొందరు వక్తలు ఎత్తి చూపిన విషయం. ఈ సందర్భంగా మైదానంలో రాజేశ్వరి తనకు పిల్లలు వద్దనుకున్న అంశం కూడా చర్చకు వచ్చింది.

ఇందులో పురూరవుడు ఊర్వశి పట్ల చూపించినది మోహమా ప్రేమనా అన్న విచికిత్స కూడా చర్చలో చాలా సేపు నడిచింది. మోహాన్ని ప్రేమ కన్నా తక్కువ చేసి చెప్పవద్దని ఒకరిద్దరు అభిప్రాయపడ్డారు. అయితే ఇది మోహానికి ప్రేమకి మధ్య సమస్య కన్నా ఒక మనిషి తీవ్రాతి తీవ్రమైన ప్రేమలో కూరుకుపోయినప్పుడు, తన్ను తాను విస్మరించినప్పుడు, పూర్తి వివశత్వానికి లోనైనప్పుడు సంభవించగల పరిణామాల గురించిన చిత్రణగా ఈ నాటకాన్ని నేను భావిస్తున్నాను అని చెప్పాను. కానీ గాఢాతిగాఢమైన ప్రేమలో పడ్డప్పుడు, వివశత్వానికి లోను కాకుండా తమను తాము నిభాయించుకోగల లేదా నిభాయించుకున్న ప్రేమ కథలు ఏమైనా ఉన్నాయా అని మురళీ శంకర్ అడిగాడు. నాకు వెంటనే ఏదీ స్ఫురించలేదు. ప్రేమలో గాఢంగా కూరుకుపోయినప్పుడు వివశత్వానికి లోను కావడం ఆ ప్రేమానుభవంలో భాగమేననీ, దానిలో వియోగమూ, విషాదమూ తప్పనిసరిగా ఉంటాయనీ, అలా ఉంటాయని చెప్పడమే బహుశా నాటకకర్త అభిప్రాయం కావచ్చు అని అక్క అంది.

డా. శైలజ గారు ఆ పుస్తకంలో ప్రధానమైన అంశం సమప్రణయమనీ, ఆ అంశాన్ని విస్మరించి ఆ నాటకాన్ని చదవలేమని అన్నారు. మురళి శంకర్ అక్క చేసిన అనువాదాన్ని ఇంగ్లీష్ మూలంతో పోల్చి చూసానని చెప్తూ, ఆమె తన అనువాదంలో ఎంతో ఔచిత్యాన్నీ, శ్రద్ధనీ కనపరిచిందని ఉదాహరణలతో వివరించారు.

ఈ నాటకం పైకి కనిపిస్తున్నంత సరళంగానూ సులభంగాను ఉన్న కథ కాదనీ, ఈ నాటక ఇతివృత్తంలో సార్వజనీన, సార్వకాలిక సమస్యలు లోతుగా సంక్లిష్టంగా ఉన్నాయని ఓల్గా గారు అన్నారు. సార్వజనీనత ఉన్నందువల్లనే ఈ క్లాసిక్స్ ఇంత కాలం తర్వాత కూడా చర్చకు నిలబడుతున్నాయని ఆమె అన్నారు.

ఏమైనప్పటికీ నలుగురు మిత్రులు కూర్చుని ఒక పుస్తకం గురించి లోతుగా, నిజాయితీగా మాట్లాడుకున్నప్పుడు, వారి వారి జీవితానుభవాలమీంచి, అవగాహన మీంచి, దృక్పథం నుంచి పంచుకునే అభిప్రాయాలు కేవలం ఆ పుస్తకం దగ్గరే ఆగిపోకుండా ఒకరిని మరొకరు వికసింప చేసుకోవడానికి ఉపకరించేవిగా మారతాయని ఈ సాయంకాలం అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికీ అర్థమైంది.

11-2-2023

10 Replies to “ఊర్వశీయం”

  1. కుతూహలంగా ఉంది చదవాలని. త్వరలో చదువుతాను. మంచి రసవత్తర చర్చ .

  2. మీరంతా ఒకచోటికి వచ్చి సమీక్షలో పాలుపంచుకోవడం నవగ్రహ కూటమి సంభవించడం లాంటిది. శుభశ్రీ గారి ఆలోచనతో నేను ఏకీభవిస్తాను. సరిగ్గా, చలం గారిలో కూడా నాకు ఈ కోణమే బాధగా ఉంటుంది…ఆయన స్త్రీ స్వేచ్ఛని ఎంత ఉదాత్తంగా ప్రతిపాదించీ కూడా ఆయన భార్యని చాలా సార్లు బాధించి ఉంటారు కదా, అని. వీడియో ఉంటే కూడా పెట్టగలరు సార్.

  3. పాత మధురాలు కొత్త ప్రశ్నలకు పునాదులు, కొత్త సమాధానాల అన్వేషణలకు తెర తీతలు

    చదవాలి sir

  4. ఇద్దరు వ్యక్తుల మధ్య పరిచయం తొలిదశ. మోహం మలిదశ. ప్రేమ మహోత్కృష్ఠమైన అంత్యదశ. “విక్రమోర్వశీయం” కావచ్చు, చలం గారి “రాజేశ్వరి” కావచ్చు. ఎవరైనా, వాళ్ళ అస్థిత్వాన్ని పూర్తిగా కోల్పోయే ఒకానొక అలౌకిక దశ అది. ఉత్కృష్టమైన ప్రేమను సామాజిక, ఆర్ధిక భద్రతకు యితర భౌతికాంశాలకు ముడి పెట్టి చూడడం సరైనదిగా నాకనిపించదు.

  5. మీ చర్చ చదవాలన్న ఇంట్రెస్ట్ ని కలిగించింది తప్పకుండ చదువుతాను సర్

Leave a Reply

%d bloggers like this: