పాలమూరు అడవిదారిన-2

మర్నాడు పొద్దున్నే అయిదింటికల్లా మేము రెడీ అయిపోయాం. ఆ తెల్లవారు జామున అక్కడకి దగ్గరలో ఉన్న బయ్యన్న గుట్ట ఎక్కించి అక్కణ్ణుంచి సూర్యోదయం చూపించాలని వీణావాణి గారి ప్లాను. ఆ గుట్ట కూడా అడవినే. ముందు ట్రెక్కింగు చేద్దామనుకున్నాం. కాని మేము కొండ ఎక్కేలోపే సూర్యుడు ఉదయించేస్తాడని తొందర తొందరగా జీపు మీదనే గుట్టమీదకు వెళ్లిపోయాం.

3

ఊరు దాటి గుట్ట దారి పట్టగానే తంగేళ్ళు పూచిన అడవి స్వాగతమిచ్చింది. అప్పటికే తూర్పు తెల్లవారుతూ ఉంది. అడవిదారిన అడుగుపెట్టగానే తియ్యని వాసన. మహావీర మొక్కల ఆకులు నేలంతా రాలి రాత్రంతా మంచుకు తడిసి ఉండటంతో పుల్లగానూ, తియ్యగానూ గాలంతా ఒక విచిత్రమధురపరిమళం. ‘ఈ సుగంధం బానే ఉందిగాని, ఇది చాలా ఇన్వేజివ్ స్పీషిస్. అందుకనే దీన్ని గ్రామాల్లో భూతరాకాసి అంటారు’ అన్నారు వీణావాణి. ‘మనం పులికంప అని పిలిచే లంటానా, ఈ మహావీర- ఈ రెండు తుప్పలూ చేరిన చోట ఇంక మరే మొక్కా బతకదు’ అని కూడా అన్నారు.

మేము ఆ గుట్ట మీదకు చేరేసరికి తూర్పుసముద్రం మీద తేలుతూ గులాబి రంగు సూర్యగోళం. నిన్న వెన్నెల కడలిగా కనిపించిన అడవి ఇప్పుడు అనేక లోహవర్ణాలు సంతరించుకుని కనిపిస్తూ ఉంది. అటువంటి అడవిని వర్ణించడానికి నా రంగుల పెట్టెలో రంగులైతే ఉన్నాయిగాని, గొంతులో మాటలే లేవు. రంగుల్లోని లేతదనం స్థానంలో ఒక మంజిష్ట ఛాయ వచ్చి చేరితే అక్కడి కొండల రంగు లాగా ఉంటుందని చెప్పవచ్చు. పత్రహీన, హరితహీన తరులతాగుల్మాల చుట్టూ మాఘమాసం వ్యాపించి ఉంది. అడవిని వసంతకాలంలో చూడటంలో ఒక ఆనందం ఉంటుంది. నింగీ నేలా ముసురుదుప్పటి కప్పుకున్నప్పుడు మరొక అందం. హేమంతఋతువు సౌందర్యం మరొక విధం. కానీ మాఘమాసపు అడవి అందం ఎన్నో ఏళ్ళుగా చూస్తే తప్ప పోల్చుకోలేనిది.

నెల రోజుల కిందట ఇక్కడకి వచ్చి ఉంటే, ఆకులు పసుపురంగులోకి తిరిగిన పుష్యమాసపు అడవి గోచరించి ఉండేది. మరొక నెలరోజులకి, వసంతాన్ని స్వాగతమిస్తూ పూల గర్భాల్లోనూ, పత్రవృంతాల్లోనూ ఫాల్గుణమాసం తేనెలూరిస్తూ ఉండేది. కాని మాఘమాసపు అడవి ఉందే, అది పూర్తిగా అంతర్ముఖీన భావుకత. తనలోకి తాను ఒదిగిపోయి ఉండే ఒక జెన్ సాధువు అంతరంగంలాంటిది, అంతదాకా ఏడాది పొడుగునా తాను నేర్చుకున్నదీ, కూడబెట్టుకున్నదీ నిర్లిప్తంగా వదిలిపెట్టి కొత్త జీవితాన్ని కలగనే కాలం. ఇది ఒక యోసా బూసన్ హైకూ లాంటిది, సంజీవ దేవ్ పేస్టల్స్ చిత్రలేఖనం లాంటిది. ఏక్ తార మీటుకుంటూ పాడుకునే బైరాగి తత్త్వం లాంటిది.

ఆ గుట్ట మీద ఒక బయ్యన్న గుడి ఉంది. మరొక పక్క చాముండేశ్వరి గుడి కూడా ఉంది. గుడి అంటే రెండు చోట్లా రెండు రాళ్ళు అడ్డంగా పెట్టి పైన ఒక రాయి కప్పుగా పెట్టిన ఒక నమస్కారసమానమైన నీడ అంతే. ఎవరో ఆర్కియాలజిస్టు ఆ మధ్య ఈ గుట్ట ఎక్కి చూసి ఇవి కాకతీయుల కాలం నాటి శిల్పాలు అని చెప్పాడట. వందల ఏళ్ళుగా ఈ గుట్ట మనుషుల్ని మామూలు జీవితం నుంచి కొంతసేపేనా తన దగ్గరకి లాక్కుంటోందని అర్థమయింది. ఆ కొండ ఎక్కిన తరువాత నీ చూపులు కిందకి మళ్ళడం అసాధ్యం. ఎంతసేపు చూసినా నువ్వు మళ్ళీ మళ్ళీ ఆ దిగంతం వైపే చూస్తుంటావు. ఆ కొండల పరదాలు తప్పించి ఆ దిగంత మందిరంలోంచి ఏ సుప్రభాతవదనమో, లేదా ఏ చంద్రికా సౌందర్యమో సాక్షాత్కరిస్తుందని అటే కళ్ళప్పగించి ఉంటావు.

కాని అప్పుడూ, ఆ తర్వాత మరొక మూడు గంటల పాటు మేము వెతుక్కున్నదీ చూసిందీ సూర్యకాంతినే కాదు, కనబడ్డ ప్రతి మొక్కనీ, మూలికనీ కూడా. ఎందుకంటే అక్కడ మొత్తమ అటవీ శాఖ ఉంది. అలాంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి. వారందరిలోనూ నిజమైన ‘కాంతారకోవిదుడు’ ఎవరంటే నర్సింహులు అనే వాచర్. అతడికి తెలియని మొక్క లేదు. అతడు నిరక్షరాస్యుడు. కానీ మొక్కల శాస్త్రీయనామాలు కూడా అతడికి తెలుసు. ఎన్నో మొక్కలు మూలికలుగా కూడా తెలుసు అతడికి. అతడి అడుగుజాడల్లో అనుసరిస్తూ ఉంటే, జువ్వి, బిల్లుడు, నర్లింగ,  పాలగొట్టి, పిండ్రుగ, కుంకుడు, సండ్ర, నక్కెర, పొన్న, తుమికి, నెమలి లాంటి చెట్లనీ, నవరత్నాలు, వెలుతురు చెట్టు, ఆలగొట్టి, చేకొరిస, భూతరాకాసి, ఆవు పుట్నాలు, తెల్లపులిచెరి, మంగ, పంచాంగం చెట్టు లాంటి పొదల్నీ, బోయగాంధారి, ఉప్పి, సొప్పరి లాంటి పొదల్నీ, ఊరు అలం, చిత్రం అలం, నల్ల అలం లాంటి మూలికల్నీ, వెంపలి, నక్కగడ్డ, గునుగులాంటి తుప్పల్నీ, యాదితీగలాంటి తీగల్నీ పరిచయం చేస్తూ ఉన్నాడు. అతడితో ఆ రోజంతా ఇంకా చెప్పాలంటే రోజుల తరబడి ఆ మొక్కల గురించి తెలుసుకుంటూ గడపాలనిపించింది.

అయితే ఆ రోజు మర్చిపోలేని మరీ ముఖ్యంగా మూడు మొక్కలు. మొదటిది, ఆ కొండ మీద బండల మధ్య సున్నాలు చుట్టినట్టుగా ఎండిపోయి కనిపిస్తున్న గడ్డిని చూపించి వీణావాణి ‘ఇది పిట్టకాలు. దీని గురించే నా పుస్తకంలో రాసాను. హనుమంతుడు తెచ్చిన సంజీవని మొక్క ఏమై ఉండవచ్చునా అని పరిశోధిస్తుంటారు కదా, ఆ సంజీవనికి ఇది కూడా ఒక పోటీదారు’ అన్నారు. ‘ఇలా ఎండిపోయి కనిపిస్తున్నదా, చుక్క నీళ్ళు పొయ్యండి, ఇంతలోనే పచ్చగా మారిపోతుంది’ అని కూడా అన్నారు. అక్కడ కొండ మీద బండల మధ్య సహజంగా ఏర్పడ్డ దోనెల్లో అక్కడక్కడా ఇంకా నీళ్ళు నిలబడి ఉన్నాయి. పక్షులు గొంతుతడుపుకోడం కోసం ప్రకృతి అమర్చిపెట్టిన నీటితొట్టెలవి. ఆ నీళ్లల్లో పిస్టియా అనే ఆకుపచ్చని మొక్క అక్కడక్కడా తేలియాడుతూ కనిపిస్తున్నది. మేము ఆ దొన్నెలు ఎక్కడెక్కడున్నాయో చూసుకుంటూ వెళ్తూ ఉండగా ఒకచోట పొడవైన గోలెం లాగా నీళ్లతో నిండిన దొన్నె మొత్తం ఆ పిస్టియా వ్యాపించి కనిపించింది. దాని పేరుకి నీటియోధుడు అని అర్థమట. అంత హరితహీన శిలాసముదాయం మధ్య పచ్చదనం అంతలా ఊటలూరుతున్న ఆ తావు మాకు విభ్రాంతి కలిగించింది. ఆ రాళ్ళ మధ్య ఎవరికీ కనబడకుండా, ఎవరికీ తెలియకుండా ఎవరో పచ్చటిపాట పాడుకుంటున్నట్టు ఉందది. వీణావాణికి ఆ దృశ్యం చూస్తే కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. ‘నా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది’ అన్నారామె.

ఒక్క లేత చిగురు కూడా కనిపించని ఆ చెట్ల మధ్య ఎండిన ఒక చెట్టుకొనల్లో తెల్లని పూలరేకలు కనిపించడంతో అక్కడే ఆగిపోయాం. ‘అది పాలకొడిసె’ అన్నాడు నర్సింహులు. పాల కొడిసె! ఎన్నేళ్ళ తరువాత చూస్తున్నాను ఈ మొక్కని! ఎప్పుడో శ్రీశైలం నుంచి చెంచువారితో కలిసి పాలుట్ల కొండ ఎక్కుతున్నప్పుడు పరిచయం చేసారు ఈ మొక్కని. దాని ఆకులు లేదా కాయలు తెంపితే పాలు కారతాయి. అడవిలో మేకలు కాసుకునేవాళ్ళు ఆకలయినప్పుడు చిన్న దొప్పలో పాలు పిండుకుని ఆ పాలల్లో ఈ చెట్టు ఆకులో, కాండమో తెంపితే కారే పాలు పిండుకోగానే క్షణాల మీద ఆ పాలు పెరుగ్గా మారిపోతాయనీ, ఆ పెరుగు తిని ఆకలి తీర్చుకుంటారనీ చెప్పారు వాళ్ళు. అప్పటికి నేను అటువంటి ఒక మొక్క గురించి హోమర్ ఇలియడ్ లో రాసింది చదివాను. ఎక్కడి హోమర్! ఎక్కడి పాలుట్ల! ప్రాచీన మానవుడు ఎక్కడున్నా సరే మొక్కలకి దగ్గరగానే ఉండేవాడు కదా అనుకున్నాను. ఇన్నాళ్ళకి మళ్ళా ఆ చెట్టు చూసాను. కాని ఈ సారి ఆ చెట్టు ఆకులు తెంపనక్కర్లేకుండానే కొమ్మల కొనల్లోంచి పాలు కారుతున్నట్టుగా తెల్లని పూలు.

మేమట్లా ఆ కొండ అంచులమ్మటే నడుస్తూ ఉండగా మరొకచోట నిండుగా విరబూసి కనిపించింది మరొక పాలకొడిసె చెట్టు. ఆ చెట్టు వెనగ్గా మరొక రెండు చెట్లు. అన్నిటికన్నా వెనగ్గా ఉన్నది బిల్లుడు చెట్టు. పసుపు రంగు తిరిగిన ఆకుల్తో హేమంత ఋతువులాగ ఉంది. దానికీ పాలకొడిసె చెట్టుకీ మధ్య పూర్తిగా ఆకులు రాల్చేసిన మరొక చెట్టు శిశిర ఋతువులాగా ఉంది. నిండుగా లేతపూలతో పాలకడవలాగా కనిపిస్తున్న పాలకొడిసె చెట్టు అప్పుడే వసంత ఋతువు అడుగుపెట్టేసినట్టే ఉంది. ఆ పూలచుట్టూ సూక్ష్మ సుగంధం. ఆ గుత్తుల్లో అప్పుడే ఒక తుమ్మెద భ్రమిస్తూనే ఉంది. ఆ పూలు అక్కడ పూసాయని ఆ తుమ్మెదకి ఎవరు చెప్పారు? ఆ మాటకొస్తే మాకు మాత్రం ఎవరు చెప్పారు? పూసిన ప్రతి పువ్వూ రసజ్ఞులకి ఎలాగేనా చేరే రహస్య ప్రేమలేఖ.

ఆ చెట్టు పక్కన పొదల్లో ఏవో కాంతులు మమ్మల్ని పిలుస్తుంటే ఆగి చూసాం. నెమలీకలు! ఇది ఆకులు రాలే కాలం మాత్రమే కాదు, నెమలీకలు రాలే కాలం కూడానా అనుకున్నాను. నర్సింహులు ఆ నెమలీకలు ఏరి పూలగుత్తిలాగా పేర్చి, మరొక నెమలీకతో వాటిని చుట్టి వైష్ణవి చేతుల్లో పెట్టాడు. నిన్న తన బొమ్మ గీసినందుకు అడవి ఈ రోజు ఆమెకి తిరిగి ఇచ్చిన కానుక అన్నమాట.

అప్పటికే పది దాటింది. దాదాపు నాలుగ్గంటలు ఆ కొండమీదనే గడిపామని అర్థమయింది. బ్రేక్ పాస్ట్ అక్కడే పూర్తి చేసి కొండ దిగాం.

4

మన్నెం కొండని ఒకప్పుడు మునుల కొండ అనేవారట. ఆ కొండ మీద దేవుడు ప్రత్యక్షమయ్యాడంటే ఆశ్చర్యం లేదు. అక్కడ ప్రతి ఒక్క కొండమీదా ఏదో ఒక రూపంలో దైవం సాక్షాత్కరించేట్టే ఉంది. మహబూబ్ నగర్ జిల్లా లో అంతమంది సాధుకవులు, భక్తకవులు సంచరించారని నాకు ఇంతకు ముందు తెలియదు. గద్వాల, వనపర్తి లాంటి సంస్థానాలు కొంత సాహిత్యసేవ చేసాయని తెలుసుగాని, అందరు దాసకవులు, వైష్ణవకవులు, శివయోగులు ఆ నేలమీద తిరుగాడారని తెలియదు.

మేము ఆ కొండకి చేరుకునేటప్పటికి మధ్యాహ్నం పన్నెండు దాటింది. ఎక్కడా చెప్పుకోదగ్గ పచ్చదనం లేని ఆ దారిలో మాఘమాసపు ఎండ వేసవి వేడిని తలపిస్తూ ఉంది. ఎక్కడేనా ఒకటీ అరా చెట్లు కనిపిస్తే అవి తెల్లపొలికి చెట్లే. తెల్లటి మొగ్గల్తో పూలు ఇంకా విప్పీ విప్పారకుండా ఉన్నాయి. కాని బ్రహ్మోత్సవాల కోసం తెరిచిన దుకాణాలూ, కాలినడకన దారిపొడుగునా కనిపిస్తున్న యాత్రీకులూ ఆ లాండ్ స్కేప్ కి రంగులు అద్దుతున్నారు. మాకు తొందరగానే దర్శనం లభించింది. కొండ మీద గర్భాలయం కన్నా ముందు ఒక మందిరంలో హనుమద్దాసు మందిరం ఉంది. గోడమీద ఆయన చిత్రపటం కూడా ఉంది. పక్క మందిరంలోనే దేవుడు. ఆ కవి ధన్యుడు. జీవించి ఉండగానూ, తర్వాతా కూడా దైవసన్నిధి దొరికినవాడు.

మన్నెంకొండ హనుమద్దాసు

దేవుడి దర్శనం చేసుకున్నాం. బయట అంత ఎండ ఉన్నా లోపల గర్భగుడిలో తామరపూల కొలనులాంటి చల్లదనం. మేము వట్టి చేతుల్తో దేవుడి ముందు నిల్చున్నాం. కాని అర్చకుడు బంగారు పూలతో మా పేరున అర్చన చేసాడు.

తిరిగి వచ్చాక హనుమద్దాసు కీర్తనల కోసం నెట్ వెతికాను. రామడుగు రాంబాబు అనే ఆయన రాసిన ‘మన్నెంకొండ హనుమద్దాసు కీర్తనలు, ఒక పరిచయం’ (1991) అనే సిద్ధాంతవ్యాసం కనిపించింది. అందులో ఆయన సంకీర్తన స్వరూప స్వభావాల గురించిన విపుల పరిచయం తో పాటు, హనుమద్దాసు జీవితవిశేషాలు కూడా రాసారు. హనుమద్దాసు మొత్తం 148 కీర్తనలు రాసాడని చెప్తూ,  చాలా కీర్తనల్ని కూడా ఆ పుస్తకంలో అందించారు. ఒక కీర్తన చూడండి:

రామ దయానిధె రామదయానిధె

రామదయానిధె రామదయాళొ

నా ముద్దులయ్య నీ ముద్దుమోమిటు

ప్రేమతొ జూపార రామదయాళొ

రామ దయానిధె రామదయానిధె

రామదయానిధె రామదయాళొ

నిముషము యుగమాయె నినుబాసినే నర

నిముషమోర్వగలేను రామదయాళొ

రామ దయానిధె రామదయానిధె

రామదయానిధె రామదయాళొ

మనసు నిబ్బరమాయ మదికి యగ్గలమాయ

తనువు భరించాదు రామదయాళొ

రామ దయానిధె రామదయానిధె

రామదయానిధె రామదయాళొ

బంగారుకొండ నీ శృంగారమగుమోము

సంగాతి సేవింతు రామదయాళొ

రామ దయానిధె రామదయానిధె

రామదయానిధె రామదయాళొ

ఘనత మన్నెముకొండ ఘనమందిర నివాస

హనుమద్దాస వరద రామదయాళొ

హనుమద్దాసు జీవితానికీ, రామదాసు జీవితానికీ మధ్య పోలికలు ఉన్నట్టే ఆ కీర్తనల్లో కూడా పోలికలు కనిపిస్తున్నాయి అని వివరిస్తో ఆ పుస్తకంలో హనుమద్దాసు కీర్తనల మీద భద్రాచల రామదాసు ప్రభావాన్ని లోతుగా వివరించారు. కాని ఆ వివరణ, ఆ పోలికలు చదివిన తర్వాత హనుమద్దాసు కవిత్వం రామదాసుకు అనుకరణ అని అనుకోలేకపోయాను. స్ఫూర్తి రామదాసుది అయి ఉండవచ్చు. కాని హనుమద్దాసు మౌలికత ఏమీ తక్కువ కాదు అనిపించింది.

ఏల దయరాదో రామయ్య

ఏలదయరాదో రామయ్య నీకు

శ్రీమేలుకై పాటుపడితినని యేల

యీ యభాండము చాలు చాలును

అని రామదాసు రాస్తే

ఏల నీకు దయరాదురా! సీతారామ!

ఏల నీకు దయరాదురా!

ఏల నీకు దయరాదు నీలమేఘశ్యామసుందర

మేలుగ నన్నేలుటకు చాల భారమాయెనేమొ

అని హనుమద్దాసు అంటున్నప్పుడు దాన్ని అనుకరణ అనలేము. ఇంప్రొవైజేషన్ అని మాత్రమే అనగలం. మరొక ముచ్చటైన ఉదాహరణ:

గరుడగమన రారా నను నీ కరుణనేలు కోరా

పరమపురుష యే వెరపు లేక నీ

మరుగు జొచ్చితిని అరమర సేయకు

-అని రామదాసు

గరుడగమన కరివరదయానిధె!కాకుస్థకులతిలకా!

పరమపురుష నతపాలన శౌరి నా

మొరవినకున్నావేరా ఓ రామా

-అని హనుమద్దాసు.

5

మధ్యాహ్న భోజనం పిల్లలమర్రిలో. అక్కడ మర్రిచెట్టు ఇంతకు ముందు చూసాను. పదేళ్ళయ్యుటుంది. అప్పుడు అది టూరిజం శాఖ ఆధీనంలో ఉండేది. కాలక్రమంలో అక్కడికి వచ్చే పర్యాటకులు ఆ చెట్టుకింద వంటలు, ఆ బెరడు మీద పేర్లు చెక్కుకోవడం, ఆ ఊడలతో ఉయాల ఆడుకోవడంతో నెమ్మదిగా ఆ చెట్టు కృశించడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ చెట్టుని మళ్ళా అటవీ శాఖ తీసుకుంది. ఏడెనిమిది వందల ఏళ్ళ ఆ చెట్టులో ఏవి ఊడలో ఏది మూలతరువో గుర్తుపట్టలేనంతగా విస్తరించిన ఆ వృక్షవ్యవస్థని కాపాడే బాధ్యత అటవీ శాఖ తీసుకున్నాక మళ్ళా ఆ చెట్టుకి కొత్త జీవితం  మొదలయ్యింది.

అక్కడ ఫారెస్టు రేంజి ఆఫీసరు నారాయణరావుగారు, డిప్యూటీ రేంజరు సుమలతగారు ఆ చెట్టుని తమ శాఖ ఎట్లా పరిరక్షించుకుంటూ వస్తోందో వివరంగా చూపించారు. వందా, నూటయాభై ప్రాప్ రూట్స్ గుర్తుపట్టి అవి నేలవైపు ప్రయాణించి పాదుకోడానికి వీలుగా పివిసి పైపులు అమర్చి, ఆ పైపుల్లో ఆ సన్నని ఊడలచుట్టూ మట్టీ, పోషకపదార్థాలూ పోగుచేసి క్రమం తప్పకుండా నీళ్ళుపెట్టి కాపాడుకుంటూ వచ్చాక ఇప్పుడు మళ్ళా ఆ చెట్టు మరొక అయిదువందల ఏళ్ళు కొనసాగే సామ్రాజ్యాన్ని సముపార్జించుకుంది. ఆ హరిత యజ్ఞంలో భాగస్వాములైన హరితయోధులు పాండులాంటివారిని కూడా పరిచయం చేసారు. ఒక మూగజీవిని వాళ్ళు ప్రేమతో సాకిన తీరు నిజంగా నమస్కరించదగ్గది.

అక్కడే అటవీ శాఖ నిర్వహిస్తున్న హరిణవనం కూడా ఉంది. ఎక్కడెక్కడో అడవి బయట తప్పిపోయిన జింకల్నీ, కృష్ణజింకల్నీ తీసుకొచ్చి అక్కడ పెంచుతున్నారు. ఆ మధ్యాహ్నం దూరంగా తుమ్మచెట్ల కింద పెద్ద గుంపు లేళ్ళు కనిపించాయి. మేము నిలబడ్డ దగ్గర గోడని ఆనుకుని ఒక నీలుగాయి విశ్రాంతి తీసుకుంటూ ఉంది. మరొకపక్క చిన్న లేడి కూన విహ్వలనేత్రాలతో అటూ ఇటూ తిరుగాడుతూ ఉంది. ఆ లేడి కూన అనాథగా ఎక్కడో దొరికితే, ఏ రైతులో పోలీసులకి అప్పగిస్తే, వారు ఇక్కడికి చేర్చారట. తన తల్లినీ, అడవినీ, మందనీ పోగొట్టుకున్న ఆ కూనని ఆ మధ్యాహ్నవేళ అట్లా చూస్తూ ఉంటే ఏవో చెప్పలేని జాలి తలుపులు మనసంతా ఆవరించాయి. ఇంకో పక్కన కృష్ణజింక ఒకటి ఠీవిగా పచార్లు చేస్తూ ఉంది. అది గ్రీకు పురాణ గాథల నుంచి నేరుగా వచ్చినట్టుంది. ‘నారాయణపేట పొలాల్లో ఈ కృష్ణ జింకలు మందలు మందలుగా తిరుగుతుంటాయి. పొలాల మీద పడుతుంటాయి. అయినా ఒక్క రైతు కూడా వాటి మీద ఒక్కసారి కూడా కనీసం కర్ర అయినా ఎత్తలేదు. అందరూ బిష్ణోయీల గురించి చెప్తారు కానీ మా నారాయణపేట రైతులు కూడా బిష్ణోయీల వంటివారే’ అన్నారు వీణావాణి.

భోజనం అయ్యాక అక్కడి జంతుప్రదర్శనశాలతో పాటు వస్తు ప్రదర్శన శాల కూడా చూసాం. నేనింతకుముందు వెళ్ళినప్పుడు ఆ మూజియం చూసిన గుర్తు లేదు. కాని ఇప్పుడు దాన్ని మహబూబ్ నగర్ జిల్లా మూజియంగా చాలా శ్రద్ధతో తీర్చిదిద్దారు. ఏడు ఎనిమిది శతాబ్దాల కాలం నుండీ మహబూబ్ నగర్ జిల్లాలో దొరికిన వివిధ రకాల శిల్పాల్ని అక్కడ ప్రదర్శించారు. ప్రధానంగా చాముండి, గణపతి, బుద్ధ, జిన ప్రతిమలు ఉన్నాయి. వీరగల్లులు ప్రత్యేక ఆకర్షణ. ఒక వైపు పాత, కొత్త రాతియుగాలకు చెందిన గొడ్డళ్ళు, ఆభరణాలు, మట్టిపాత్రలు కూడా ప్రదర్శనలో ఉన్నాయి. మరొకవైపు ఆయుధాలు, నాణేలు కూడా ప్రదర్శనలో ఉన్నాయి. కావటానికి అది చిన్న ప్రదర్శన శాలనే అయినప్పటికీ సమగ్రమైన ప్రదర్శన శాల అనే చెప్పాలి.

అక్కడి శిల్పాల్లో నన్ను మరీ ఆకట్టుకున్నది చాముండి శిల్పాలే. ప్రదర్శన శాల లో అడుగుపెట్టగానే మూడు చాముండ శిల్పాల్ని ప్రముఖంగా దర్శనమిస్తున్నాయి. ఒక పక్కగా అంత ప్రముఖంగా లేని మరొక చాముండి శిల్పం అచ్చు శిల్పశాస్త్రం చెప్పినట్టే చెక్కి ఉంది. ఏళ్ళ కిందట అట్లాంటి చాముండిని అదిలాబాదులో గురూజీ ఆశ్రమంలో చూసాను. ఆ చాముండి దేహంలో ఎముకలు తప్ప మరేమీ లేవు. అది చూపిస్తూ రవీంద్రకుమార శర్మ ‘ఆమె పేదవాళ్ళ ఆగ్రహం’ అన్నాడు. పేదవాళ్ళ రోదనం మూర్తీభవిస్తే ఎలా ఉంటుందో పిల్లలమర్రి మూజియంలో కనిపించిన చాముండి శిల్పం గుర్తు చేసింది.

కాని ఆ మూజియం గురించి గాని, అందులో ఉన్న ఆర్టిఫాక్ట్స్ గురించి గాని వివరాలు తెలిపే బ్రోచరు ఏదీ అక్కడ లేదు. ఆ కార్యాలయంలో తాళం వేసి ఉన్న షోకేసులో ఆర్కియాలజీ శాఖ ప్రచురణలు కొన్ని ఉన్నాయి గాని, అవన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నాటి ప్రచురణలు. మూజియం ను తీర్చి దిద్దడం మీద పెట్టిన శ్రద్ధలో కొంత ప్రచురణలమీద కూడా పెడితే బాగుణ్ణనిపించింది. అలానే ఆ శిల్పాల్ని వివరిస్తూ చిన్న గైడెడ్ టూర్ డిజిటైజ్ చేయవచ్చు. లేదా ఒక కియోస్కు పెట్టి సందర్శకులు ఆ కియోస్కు దగ్గరే ఆడియో విజువల్ రూపంలో ఆ చరిత్ర గురించి తెలుసుకునే అవకాశం కూడా కల్పించవచ్చు.

ఆ మూజియం ఆవరణలోనే రాజరాజేశ్వర స్వామి గుడి కూడా ఒకటి ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు బాక్ వాటర్స్ కింద ఈర్లదిన్నె అనే గ్రామం మునిగిపోయినప్పుడు అక్కడి దేవాలయాన్ని తీసుకొచ్చి ఇక్కడ పునర్నిర్మించారు. ఆ గుడి చుట్టూ ఒక కారిడారులాగా కట్టి అక్కడ ఎన్నో వీరగల్లుల్నీ, భగ్నప్రతిమల్నీ నిలబెట్టారు. నేను వేంగివెళ్ళినప్పుడు అక్కడ ఇలాంటి ప్రతిమలే ఎండకి ఎండి వానకి తడుస్తూ ఉన్న దృశ్యం చూసాను. దానితో పోలిస్తే ఈ ప్రతిమల అదృష్టం బాగానే ఉంది. కాని ఇక్కడా ఇదే లోటు. ఆ ప్రతిమల్ని అలంకారంగా నిలబెట్టడంకన్నా అవి ఏమిటి, వాటి చరిత్ర ఏమిటి, ఇప్పుడు వాటిని చూస్తున్న సందర్శకులు వాటినుంచి ఏమి నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు-అలాంటివి రాసి ఉన్నా, లేదా ఎవరో ఒకరు చెప్తూ ఉన్నా, ఆ ప్రదర్శనశాల నిజమైన పర్యాటకస్థలం అయి ఉండేది.

సాయంకాలం నాలుగయింది. నేను కర్నూలు వెళ్ళవలసి ఉంది. జడ్చర్లలో వెంటనే బస్సు అందుకుంటే మరీ చీకటి పడకుండా కర్నూలు చేరుకోగలుగుతాను. వీణావాణిగారినుండి, వారి శ్రీవారినుండి, ఆమె చిన్నారిబిడ్డనుంచి సెలవు తీసుకున్నాను. అప్పటిదాకా మా కూడా ఉన్న అటవీ శాఖ సిబ్బంది నుంచి కూడా సెలవు తీసుకున్నాను. ఎన్ని సార్లు ఈ దారిలో ప్రయాణించి ఉంటాను! కాని ఇవాళే మొదటిసారి ఈ ప్రాంతానికి నిజంగా చేరువయ్యాను.

10-2-2023

11 Replies to “పాలమూరు అడవిదారిన-2”

 1. శుభోదయం సర్

  మొత్తం ప్రయాణం సరిగ్గా 24 గంటలు

  అయితే మాకు జీవితకాలానికి సరిపడినంత అమూల్యమైన సహచరత్వం..

  మా అందరి తరఫున
  ధన్యవాదాలు సర్

 2. Chala baga vivarincharu aa adhrusham maku epudu vasthundi intha baga vivarinchinavariki dhanyavadhalu🙏🙏

 3. 1970 ప్రాంతాల్లో మినమలూరి చుట్టూ అడవుల్లో తిరిగాక మళ్లీ ఇదే అడవుల్లో ప్రయాణం. మధ్యలో కథనానికి తగినట్లు మీరు పెట్టిన ఫోటోలు మమ్మల్ని అడవికి మరింత దగ్గర చేశాయి.

 4. మాఘాటవీ పర్యటనానుభవం మనసుకెక్కించగలిగిన మీ రచనాపాటవం మాటల్లో చెప్ప లేనిది.
  1976 లో కాగజ్ నగర్ లో వేంపల్లి ప్లాంటేషన్ ( ఫారెస్ట్ రిసార్టు) పిక్నిక్ స్పాట్ గా ఉండేది.వెదురు బొంగులతో నిర్మించిన రెండతస్తుల మెట్లమేడ ఎక్కి వన సౌందర్యం తిలకిస్తుంటే పొందిన అనుభవం
  వెనక్కి తిరిగి వచ్చి పలుకరించింది.
  అప్పుడు రాసిన గీతం పల్లవి మళ్లీ పెదవులపై
  తుమ్మెదయై పరిశ్రమించింది.

  ఏమని వర్ణించను ఈ వనవాటిక సౌందర్యం
  ఏ ముని నివసించినాడొ ఈ వని వాకిట పూర్వం

 5. అడవిని చూడటమే ఒక అందం,అందులో మరెంతో ఆనందం.
  అడవిని చదివించడం లో ఆ ఆనందం రెట్టింపు (ద్విగుణీకృతం)అయ్యింది.

  “పాలకొడిసే” పేరు వినగానే మా చిన్ననాటి దళిత మిత్రులు మాకు దగ్గరలో ఉన్న అడవికి తీసుకొని వెళ్ళి మేకల పాలు పిండి ఆకు దొప్పల్లో ఈ పాలకొడిసే పాలు పిండి అప్పటికప్పుడే తయారైన పెరుగును తినిపించిన అనుభవం యాదికి (ఙ్ఞప్తికి)వచ్చింది.

  మావి ఉట్టి కళ్ళు మాత్రమే.మీ రాతలు మా కళ్ళకు కళ్లద్దాలు.స్పష్టంగా కనిపింప చేసే ఉపకరణాలు.
  ధన్యవాదాలు sir.

Leave a Reply

%d bloggers like this: