పాలమూరు అడవిదారిన-1

దేవనపల్లి వీణావాణి గారి ధరణీరుహ చదివిన తరువాత ఆమె పనిచేస్తున్న అటవీ ప్రాంతంలో ఒకటిరెండురోజులు గడపాలనిపించింది. ఆమెతో పాటు ఆ అడవిలో కనిపించిన ప్రతి చెట్టుగురించీ, మొక్క గురించీ, మూలిక గురించీ అడుగుతూ, వాటికీ ఆమెకీ మధ్య ఉన్న అనుబంధాన్నీ, వాటికీ తక్కిన ప్రపంచానికీ మధ్య నెలకొన్న సూక్ష్మ అనుబంధాన్నీ తెలుసుకోవాలనిపించింది. అదీకాక, వీణావాణిగారి అమ్మాయి వైష్ణవి ఏడో తరగతి చదువుతోంది. ఆమెకి బొమ్మలు వెయ్యడం మీద ఆసక్తి అని చెప్పారామె. ఆ పాప వేసిన బొమ్మలు కూడా చూపించారు. ధరణీరుహ పుస్తకం అట్ట మీద బొమ్మ కూడా వైష్ణవి వేసిందే. అందుకని ఈసారి అడవికి వెళ్ళినప్పుడు ఆమెని కూడా వెంటబెట్టుకు రమ్మని, ఆ చిన్నారి బిడ్డతో కలిసి ఆ అడవిలో బొమ్మలు వెయ్యాలని ఉందనీ చెప్పాను.

ఆ మాటతో ఆమెతో చెప్పినప్పణ్ణుంచీ గత నెలా రెణ్ణెళ్ళుగా ఆమె ఆ సందర్శన ప్లాన్ చేస్తూనే ఉన్నారు కానీ, ఇప్పటికి వీలయ్యింది. ఒక పున్నమిరాత్రి అడవిని నాకు చూపించాలని ఆమె అనుకున్నారు. కాని ఈ పున్నమి విశాఖపట్టణం నుంచి తిరుగుప్రయాణంలో గడిచిపోవడంతో, విదియనాటికి మా సందర్శనకి వీలు చిక్కింది. మొన్నటికి వీణావాణిగారి భర్త హరికృష్ణ, వారమ్మాయి వైష్ణవిలతో కలిసి మహబూబ్ నగర్ ప్రయాణం కాగలిగాను.

వీణావాణి పదవిరీత్యా జిల్లా అటవీ అధికారి. ప్రస్తుతం జోగులాంబ సర్కిల్ కు ఫ్లయింగు స్క్వాడ్ ఆఫీసరుగా పనిచేస్తున్నారు. నారాయణపేట జిలా అటవీ అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె మమ్మల్ని జడ్ చర్ల దగ్గర ఉన్న మయూరి పార్క్ దగ్గర రీసీవ్ చేసుకున్నారు. ఆ పార్క్ ని ఇప్పుడు కె.సి.ఆర్ అర్బన్ ఇకో పార్కుగా అభివృద్ధి చేసారు. జడ్చర్లనుంచి మహబూబ్ నగర్ వెళ్ళే దారిలో అంత పెద్ద అటవీ ఉద్యానవనం ఉందని నాకిప్పటిదాకా తెలియదు. మేము వెళ్ళేటప్పటికి సాయంకాలం కావొస్తూంది. ఆ పార్కులో అడుగుపెట్టగానే జీడిమామిడి పూల గాలి వెచ్చగానూ, మత్తుగానూ తాకింది. మామిడి పూల గాలి, జీడిమామిడి పూల గాలి మనల్ని తాకితేనే కదా మాఘమాసం మనకి చేరువయినట్టు.

ఆ పార్కులో ఒక బాంబూ గెస్ట్ హవుజ్ ఉంది. మొత్తం నిర్మాణం వెదురుతో చేసి పైన కోపురుగడ్డి కప్పు వేసారు. మా రాత్రి బస అక్కడనా లేక అడవిలోనా ఇంకా తేల్చుకోలేక ‘ముందు మనం బయల్దేరదాం, చీకటిపడేలోపు అడవిలో కొంతదూరమైనా నడుద్దాం’ అన్నారు ఆమె. మా లగేజి అక్కడ వదిలేసి, నా రంగులపెట్టే, ఈజిల్ తీసుకుని బయల్దేరాను. వైష్ణవి కూడా తన రంగులపెట్టె వెంటబెట్టుకుంది. మామూలుగా ఆయిల్ కలర్స్ కాన్వాసులు గియ్యడానికి వాడే ఈజిల్ కాక, నీటిరంగుల చిత్రలేఖనాల కోసం ఆ మధ్య  ప్రత్యేకం గా ఒక ఈజిల్ తెప్పించుకున్నాను. దానిమీద మనం బోర్డుని ఎలా కావాలంటే అలా వాలుగా వంచుకోవచ్చు. ఆ ఈజిల్ తెప్పించినప్పణ్ణుంచీ దాన్ని పట్టుకుపోయి ఆరుబయట నీటిరంగుల బొమ్మలు వెయ్యాలన్న కోరిక చాలా బలంగా ఉంది. ఈసారి అడవికి వెళ్ళడం వెనక ఆ కారణం కూడా బలంగా ఉంది.

జడ్చర్ల-మహబూబ్ నగర్ దారి నుంచి కొద్దిగా పక్కకి తిరిగి అప్పనపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లోకి మా బండి ప్రవేశించింది. మహబూబ్ నగర్ అడవి అంటే నాకు తెలిసింది అమ్రాబాదు అడవులే. అప్పర్ ప్లాటూ, లోవర్ ప్లాటూ లో నల్లమల అడవుల్లో చెంచువారితో పనిచేసినప్పుడు నేను తిరిగిన ఆ అడవులే నాకు గుర్తు. కాని వీణావాణిగారు మహబూబ్ నగర్ దగ్గర అడవికి తీసుకువెళ్తాను అంటే ఆ అడవి ఎక్కడ ఉందో ఊహించలేకపోయాను. కాని రోడ్డుదిగి రెండుమూడు కిలోమీటర్లు ప్రయాణించేమో లేదో ఆకురాలే పెద్ద అడవి ఒకటి మా ముందు ప్రత్యక్షమయింది. ఆ అడవిలో కొంతదూరం పోయేక  ఒక చెట్టుని చూసి ‘ఈ చెట్టు మీకు చూపించాలి, ఇక్కడ దిగుదాం’ అన్నారు. అది తెల్లతుమ్మ చెట్టు. ఆ చెట్టుమీద ఎవరో పసుపు పూసినట్టుగా పచ్చని మరకలు కనిపిస్తూ ఉన్నాయి. ‘చూడండి, ఇంత అందమైన లైకెన్లు మనకి చాలా అరుదుగా కనబడతాయి’ అన్నారు.

Lichens, pc: Veenavani

Lichens మొక్కలమీదా, బండలమీదా, గోడలమీదా అల్లుకునే సూక్ష్మజీవులు. వాటిలో ఫంగై, సయనో బాక్టీరియా రెండూ కలిసి ఉంటాయి. వీణావాణి మైకాలజిస్టు. అంటే శిలీంధ్రాల అధ్యయనంలో నిపుణురాలు. ఆమె ఆ చెట్టుదగ్గర నిలబడి లేతపసుపు, బూడిదరంగు తెలుపుతో అల్లుకున్న ఆ శిలీంధ్రాల్ని మాకు వివరించారు. ఆ తరువాత మేము వేసిన ప్రతి అడుగులోనూ దాదాపుగా ఏదో ఒక చెట్టుమీద ఏదో ఒక రూపంలో ఆ లైకెన్లు మమ్మల్ని పలకరిస్తూనే ఉన్నాయి.

మేము నడుస్తున్నది అటవీ శాఖ అటవీపనుల కోసం వేసుకున్న మట్టిదారి. ఆ దారికి ఒకపక్క అటవీశాఖ పిచ్చి కంపలు కొట్టించి కొత్తగా చేపట్టిన ప్లాంటేషన్ ఉంది. వివిధ వృక్షజాతుల్తో పెంచుతున్న ఆ ప్లాంటేషన్ కు నీళ్ళు పడుతూ ఒక టాంకర్ మాకు ఎదురయ్యింది. ఆ టాంకర్ తో పాటు ఆ పనులు పర్యవేక్షిస్తూ ఫారెస్టు సెక్షన్ ఆఫీసరు రజనీకాంత్ ఎదురయ్యారు. ఆయన్ని ఆ చెట్ల గురించి అడగడం మొదలుపెట్టాను.

మాకు దూరంగా ఎత్తైన కొండమీద ఒక టవర్ కనిపిస్తూ ఉంది. ‘మనం ఈ రాత్రి అక్కడే ఉండబోతున్నాం’ అన్నారు వీణావాణి. అక్కడ నిజాం కాలంలో ఒక వాచ్ టవర్ ఉండేదట. గోల్ బంగ్లా అనే వారు దాన్ని. కాలక్రమంలో శిథిలమయిపోయిన ఆ కట్టడాన్ని అటవీ శాఖ ఈ మధ్యే పునర్నిర్మించింది. అటవీ కార్యకలాపాలు పర్యవేక్షించడంతో బాటు, రానున్నరోజుల్లో ఈ ప్రాంతాన్ని ఇకో-టూరిజం హబ్ గా తీర్చిదిద్దాలన్న ఆలోచన కూడా దానికి కారణం.  ఇప్పుడు అక్కడికి వెళ్ళే దారి పొడుగునా బిల్లుడు చెట్లు. ముదురుపసుపు, బ్రౌన్, ఇంకా కొద్దిగా ఆకుపచ్చ ఆనవాళ్ళతో బిల్లుడుచెట్లు కనిపిస్తున్నంతమేరా అడవి లో కొత్త శోభకనిపిస్తూ ఉంది. ఆ చెట్లమధ్యనుంచి కొంతదూరం ప్రయాణించేక మంకెన చెట్టు పూలతో పలకరించింది. మంకెన మాఘమాసపు జెండా. అక్కడ ఆగి ఫొటోలు తీసుకున్నాం.

Mr. Harikrishna and Vaishnavi

ఆ మట్టిబాట మలుపులు తిరిగి కొండ కొంత ఎక్కాక, ఇప్పుడు బిల్లుడు చెట్ల స్థానంలో నర్లింగ చెట్లు కనిపించడం మొదలుపెట్టాయి. అవి దిరిసెన చెట్ల కుటుంబానికే చెందినవి అని చెప్పారు వీణావాణి. ‘మనం ఎత్తుకుపోయేకొద్దీ ఆ ఇకో సిస్టం కూడా మారుతూ ఉంటుంది. ఒక్కొక్క కాంటూరులో ఒక్కొక్క చెట్టు రాజ్యమేలుతూ ఉంటుంది’ అన్నారామె. ఆ మలుపు కూడా తిరిగి కొండ పైకి చేరుకోబోతూండగా విస్తారంగా తెల్లపొలికి చెట్లు ప్రత్యక్షమయ్యాయి. కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు చెయ్యడానికి పనికొచ్చే ఆ తెల్లపొలికి చెట్లు కాండాలకి వెండి చమురు పూసినట్టుగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే స్కూళ్ళల్లో పిల్లలు ఫాన్సీ డ్రెస్సులకు వేషం వేసుకున్నట్టుగా ఆ చెట్లన్నీ గాంధీరంగు పూసుకుని కనిపిస్తున్నాయి.

ఆ చెట్లమధ్య ఆ మట్టిబాటమ్మటే ఆ కొండ ఎక్కి ఆ వాచ్ టవర్ దగ్గరకు చేరుకున్నాం. అది రెండు అంతస్తుల నిర్మాణం. పైకి చేరటానికి మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు ఎక్కి పైకి వెళ్ళి చూద్దుము కదా, చుట్టూ సముద్రంలాగా అడవి. కెరటాల్లాగా ముదురు పసుపు, ఆకుపచ్చ, ధూమ్రధూసరవర్ణాలు. నాలుగు దిక్కులా పచ్చని కడలి. ఆ అడవిమీద దూరంగా పడమటి దిక్కుకి ఎరుపు రంగు పూస్తూ సూర్యుడు సెలవుతీసుకుంటున్నాడు. ఆలస్యం చేస్తే ఆ క్షణాలు దాటిపోతాయి. గబగబా నా ఈజిల్ విప్పి బిగించాను. కాన్వాసుమీద కాగితం తగిలించాను. ఆ మధ్య మా అక్క కొడుకు రాజా నాకు కానుక చేసిన నీటిరంగులు తెరిచాను. ఎం.గ్రాహంస్ నీటిరంగులు. పిగ్మెంటు స్ట్రెంగ్త్ లో వాటిని మించినవి లేవంటారు. త్వరత్వరగా రంగులు కలిపాను. కాని ఏమి గియ్యడం? ఎలా గియ్యడం? దూరంగా దిగంతాన్ని పడిపోకుండా నిలబెట్టిన ఆ పర్వత శ్రేణి, నా కళ్ళముందు నించి ఆ కొండల వరసదాకా ఆవరించిన బిల్లుడు చెట్ల మహారణ్యం, మధ్యలో ఎండిపోతున్న చెట్లు, కొమ్మలు, రాలుతున్న ఆకులు, వాటిమీద పరుచుకుంటున్న చివరి సూర్యకాంతి. ప్రభో! ఎలా గియ్యడం ఆ దృశ్యాన్ని? ఏమి గీసానో తెలియదు. నా దృష్టి అడవిని గియ్యడం మీద లేదు. మాఘమాసాన్ని చిత్రించడం మీదనే ఉంది. నా రంగుల పెట్టెలో ochers- ముదురు రంగులు అంత వినియోగానికి రాగల క్షణాలు అరుదుగా లభిస్తాయి.

ఇంకా చీకటి పడకముందే బొమ్మ పూర్తిచేసేసాను. ఆ బొమ్మ వేస్తున్నంతసేపూ అక్కడి అటవీశాఖ సిబ్బంది నన్నే చూస్తున్నారు. ఆ బొమ్మ పూర్తికాగానే తలూపారు. అది అడవి అని వారికి అనిపించిందన్నమాట. చెప్పొద్దూ! నాకు సంతోషమనిపించింది. వాళ్ళ ఆమోదానికి కృతజ్ఞతగా ఆ బొమ్మ వారికి కానుక చేసాను.

టీ, స్నాక్స్.  అక్కడి సిబ్బంది నెమ్మదిగా సెలవు తీసుకున్నారు. వీణావాణిగారి కుటుంబం, నేనూ, మాతో పాటు వారి డ్రైవరు ప్రశాంత్. అప్పుడు వైష్ణవి అడవి బొమ్మ గియ్యడం మొదలుపెట్టింది. వృక్షమృగపక్షిసంకీర్ణమైన ఆ అడవిని నేనేదోలాగా negotiate  చేసుకోగలిగి ఒక బొమ్మ గీసాను. ఆ చిన్న బాలిక అంత పెద్ద అడవిని ఎలా తన కుంచెతో ఎత్తగలదా అని కుతూహలంగా చూస్తూ ఉన్నాను. ఆమె చాలా స్తిమితంగా, ఓపిగ్గా, శ్రద్ధగా ఆ అడవిని చిత్రించడం మొదలుపెట్టింది. సూర్యుడు వెళ్ళిపోయాడు. కాంతి మందగించింది. చీకటి పడింది. అయినా ఆమె తన మనోఫలకంలో చిత్రించుకున్న అడవిని ఎక్కడా రాజీపడకుండా తన ఎదట ఉన్న కాగితం మీద పునఃసృష్టిస్తూనే ఉన్నది.

పున్నమి వెళ్ళిన రెండో రోజు కాబట్టి చంద్రుడు కొంత ఆలస్యంగా వస్తాడని తెలుసు. కాని మేము ఊహించినదానికన్నా ముందే వచ్చేసాడు. ముందు ఒక రాగిరంగు మరకలాగా తూర్పువైపు కనబడ్డాడు. అ తర్వాత రాగి-తేనెరంగుల మిశ్రమవర్ణంతో స్ఫుటంగా కనిపించడం మొదలుపెట్టాడు. దూరంగా పాలమూరు-రంగారెడ్డి నీటిపారుదల పథకంకోసం కొండలకు అడ్డంగా కట్టిన మట్టికట్టమీంచి ఆకాశంలోకి ఎక్కడం మొదలుపెట్టాడు. ఇప్పుడు దూరంగా మహబూబ్ నగర్ దీపకాంతులు ధగధగలాడటం మొదలయ్యింది. మహబూబ్ నగర్ కి ఇంతదగ్గరలో ఇంత అడవి ఉండగలదని నేనెప్పుడూ ఊహించలేదు.

2

వీణావాణిగారు మమ్మల్ని ఆ రాత్రి అక్కడ బస చేయించాలా లేక మయూరి పార్కుకి తీసుకువెళ్ళాలా అన్న ఆలోచనలో ఉన్నారు. మర్నాడు మమ్మల్ని ఎక్కడకు తీసుకువెళ్ళాలో కూడా ఇతమిత్థంగా తేల్చుకోలేకుండా ఉన్నారు. తెలంగాణా తిరుపతి అని పేరుపొందిన మన్యం కొండ మహబూబ్ నగర్ కి దగ్గరలోనే ఉందనీ అక్కడ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయనీ, అక్కడికి కూడా తీసుకువెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉన్నారు. ఆ మాటల మధ్యలో ఆమె తెలంగాణా దాసత్రయంలో ఒకరైన మన్నెంకొండ హనుమ్మద్దాసు అక్కడే ఉండేవారనీ చెప్పారు. తెలంగాణాకు ఒక దాసత్రయం ఉందని నాకు అప్పటిదాకా తెలియదు. తక్కిన ఇద్దరూ ఎవరని అడిగాను. ఒకరు రాకమచర్ల వేంకటదాసు, మరొకరు వేపూరి హనుమద్దాసు అని చెప్పారు. వారి మీద తాను రాసిన వ్యాసం కూడా చూపించారు.

మా చర్చ ఆ దాసకవుల మీంచి ఇద్దాసు వైపు మళ్లింది. తెలంగాణా తొలి దళితకవిగా పేరొందిన దున్న ఇద్దాసు (1811-1919) పుట్టింది నల్గొండ జిల్లా లో అయినప్పటికీ  ఎక్కువ కాలం పాలమూరు ప్రాంతంలోనే జీవించారని తెలుస్తున్నది. ఆ మధ్య ఒక ప్రభుత్వపాఠశాలలో ఒక పిల్లవాడు పాడిన ఇద్దాసు తత్త్వం ఒకటి నాకు గుర్తొచ్చింది. ఆ వీడియో యూట్యూబులో అనుకుంటా చూసాను. ఆ గీతం మొదటిసారి విన్నప్పుడు నాకు ఇద్దాసు గురించిగాని, ఆ గీత రచయిత ఇద్దాసు అనిగాని తెలియదు. కాని ఆ పిల్లవాడి గళంలో ఆ గీతం విన్నప్పుడు నాకు ఒక నేల మొత్తం ఆ పాట పాడినట్టు అనిపించింది. ఆ గీతాన్ని ఈశ ఆశ్రమంలో మంగ్లీ పాడిన వీడియో కూడా ఆ తర్వాత చూసాను కాని ఆ పిల్లవాడి కంఠమే నన్నిప్పటికీ వెంటాడుతున్నది.

పాలమూరు అడవిలో ఆ వెన్నెల రాత్రి ఆ గీతం మరొకసారి విందామని ఆ పిల్లవాడు పాడిన యూట్యూబు లింకు తెరిచాను. ఆ మొదటి వాక్యం- ‘జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు’ అని వినబడగానే మళ్ళా అదే గగుర్పాటు. ఆత్మలో అదే ప్రాచీన సంచలనం.

ఆ పాట, మళ్ళా మరొక్కసారి అక్షరం అక్షరం విన్నాము, వీణావాణి ఒక్కొక్క వాక్యాన్ని వివరిస్తూ ఉండగా-

జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు

అజ్ఞానికి ఏమెరుకా- వారుండే స్థలము

సద్గురుడుండే మరుగు-

అజ్ఞానికి ఏమెరుకా- వారుండే స్థలము

సద్గురుడుండే మరుగు-

నానాక రుచులన్నీ- నాల్కకు ఎరుక

నానాక రుచులన్నీ- నాల్కకు ఎరుక

ఇట్లా కుండలెంబడి తిరిగే- తెడ్డుకేమెరుకా-

జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు

అజ్ఞానికి ఏమెరుకా- వారుండే స్థలము

సద్గురుడుండే మరుగు-

వనము సింగారంబు- కోయిలకు ఎరుక

వనము సింగారంబు- కోయిలకు ఎరుక

ఇట్లా కంపాలెంబడి తిరిగే- కాకికేమెరుకా-

జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు

అజ్ఞానికి ఏమెరుకా- వారుండే స్థలము

సద్గురుడుండే మరుగు-

బాటాసింగారంబు- అశ్వానికెరుకా-

బాటాసింగారంబు-అశ్వానికెరుకా-

ఇట్లా గరికా తుట్టెలు తినే- గాడిదాకేమెరుక

జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు

అజ్ఞానికి ఏమెరుకా- వారుండే స్థలము

సద్గురుడుండే మరుగు-

నాగస్వరము మోత- నాగుపాముకేరుకా-

నాగస్వరము మోత- నాగుపాముకేరుకా-

ఇట్లా తుంగాలెంబడి తిరిగే తుట్ట్యాకేమెరుకా-

జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు

అజ్ఞానికి ఏమెరుకా- వారుండే స్థలము

సద్గురుడుండే మరుగు-

మడుగు సింగారంబు- మచ్చానీకెరుకా-

మడుగు సింగారంబు- మచ్చానీకెరుకా-

ఇట్లా కడల కడలా తిరిగే- కప్పాకేమెరుకా-

జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు

అజ్ఞానికి ఏమెరుకా- వారుండే స్థలము

సద్గురుడుండే మరుగు-

ఆ పిల్లవాడి స్వరంలో ఆ గీతం వినబడుతున్నంతసేపూ అడవీ, చంద్రుడూ కూడా తమ తమ హృదయాల్లోకి చూపు సారించుకున్నట్టు చెప్పలేని నిశ్శబ్దం.

‘మచ్చం అంటే మత్య్సం. మత్స్యంతో కప్పని పోల్చాడు చూడండి. ఎంత లోతైన చూపో కదా. ఎందుకంటే కప్ప ఉభయచరం మనకి తెలుసు, గుడ్లు నీళ్ళల్లో పెడుతుంది, నేలమీద తిరుగుతుంది. రెండు ప్రపంచాలు, కాని ఏ ఒక్క ప్రపంచమూ పూర్తిగా లోతు తెలియదు దానికి. అందుకని మడుగు సింగారం తెలియాలంటే మత్స్యానికే తెలియాలి’ అన్నారు వీణావాణి.

ఆమె ఇంకా చెప్తున్నారు. ‘నాగుపాముతో తుట్టెని పోల్చాడు. తుట్టె అంటే మట్టిపాము. మట్టిపాముకి నాగస్వరం ఏమి తెలుస్తుంది? ’

‘వనము సింగారంబు కోయిలకు ఎరుక’  అన్నాడు కవి. ఆ రాత్రి ఆ అడవి సింగారం, ఆ వెన్నెల సింగారం ఆ తత్త్వానికే ఎరుక అనిపించింది. మహనీయ భక్తికవులు, బావుల్ కవులు, సూఫీ కవులు, సిద్ధ కవులు- వారందరి పక్కనా ఇద్దాసు  ఈ ఒక్కపాటతో నిలబడగలడు అనిపించింది.

భోజనాలు చేసాం. చంద్రుడు పూర్తిగా తెలుపెక్కాడు. అడవిమొత్తం గంధం పొడి రాలుతున్నట్టు వెన్నెల. మూడు రోజులకిందట సరోవరం మీద చూసాను ఆ వెన్నెల్ని. ఇప్పుడు ఈ మహారణ్యం మీద. ‘అడవి గాచిన వెన్నెల అంటారు కాని వెన్నెల అందం అడవిలోనే చూడాలి’ అన్నాను. ‘అడవిమీద కాసిన వెన్నెల వృథాకాదు, అదే అత్యంత ఫలవంతమైన వెన్నెల’ అన్నారు వీణావాణి. ‘పండ్లలో రసం, కంకుల్లో పాలు, గింజల్లో పుష్టి ఊరేదంతా వెన్నెల్లోనే’ అన్నారామె.

రెండవ జాము రాత్రి గడిచింది. ఎక్కణ్ణుంచో అడవిపందుల అరుపులు మొదలయ్యాయి. దూరంగా జలాశయం మీంచి తెరలుతెరలుగా చలిగాలులు వీచడం మొదలయ్యింది. ఆ టెర్రేసు మీద చుట్టూ తిరుగుతూ ఆ అడవినీ, ఆ వెన్నెలనీ మార్చి మార్చి చూస్తూ ఉన్నాం. నా హృదయమంతా వెన్నెల కన్నా ఎక్కువ వెలుగుతో ఇద్దాసు గీతమే మెరుస్తూ ఉంది. ఆయన తిరుగాడిన ప్రదేశం అక్కడికి చాలా దూరం అని చెప్పారు వీణావాణి. కనీసం హనుమద్దాసు తిరుగాడిన మన్నెంకొండ వెళ్ళి చూసినా ఆ దాసభక్తుల పాదధూళి ఎంతో కొంత నా శిరసున ధరించుకోవచ్చనుకున్నాను.

మర్నాడు మన్నెంకొండ వెళ్ళాలనుకోగానే మా ఏర్పాట్లు మారిపోయాయి. తిరిగి మళ్ళా ఆ రాత్రికి మయూరి పార్క్ బాట పట్టాం.

9-2-2023

14 Replies to “పాలమూరు అడవిదారిన-1”

  1. మంచి గీతం. ఈ మాఘమాసపు సాయంత్రం చదివే అదృష్టం కలిగింది. మీకు అనేక వందనాలు.

    1. అంతకు ముందు మంగ్లీ గొంతులో పాట విన్నాను ఎదో తెలియని తన్మయ్యత్వం ఉందనుకున్నాను.. మీ అక్షరాల్లో వీణా వాణి గారి మాటల్లోని వివరణ అడవి ని చూసోచ్చినట్లయింది. మా వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పని చేయడం వలన భద్రాచలం, నల్లగొండ, వరంగల్ జిల్లా అడవులతో వున్న పరిచయం ఒక్కసారిగా తాలంపుకొచ్చింది… Nice one మనసు తేలిక పడింది

  2. మీ అక్షరాలతో అడవిని పాఠకుల మనో ఫలకం మీదకు అనువదించారు… We are blessed sir.

  3. Fascinating Sir ,how do you manage to keep every moment of your experience and share it with us ? Thanks for the wonderful journey!

  4. అమృత కిరణుడు. కదా! ఫలపుష్పాలో మకరందము నింపు శీతమయూఖుడు.
    అడవిగాచిన వెన్నెల నుడికారము ఇకపై నిష్ఫలమనే అర్థంలో వాడవద్దనిపిస్తుంది.

  5. వెన్నెల లో అడవి అందాన్ని మీ అక్షరాలలో చూపించారు.. తగినట్టుగా తత్వ గీతం పాలు,నీళ్లను వేరు చేసినట్లు జ్ఞాన బోధ చేస్తూ. మహత్తర మైన ఆ సమయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  6. అడవి దారంట పాఠకుల్ని నడిపించి సుందరమైన ప్రకృతిని పరిచయం చేసి చక్కని పాటని వినిపించి అడవి చూసిన అనుభూతి కలిగించారు.అయినా ప్రత్యక్షంగా చూడాలని కోరికనీ కలిగించారు

Leave a Reply to Vadrevu Ch VeerabhadruduCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading