
ఎప్పుడో నెట్ లో ఒక ఫొటో చూసాను. నిండుగా వికసించిన కలవపూలమధ్య, తామరపూల మధ్య పడవలు. అది ఏ వియత్నామో, కంబోడియానో అనుకున్నాను. కానీ అది అనకాపల్లి దగ్గర కొండకర్ల ఆవ అని తెలిసినప్పుడు ఆశ్చర్యపోవడం ఎలానూ తప్పలేదుగాని, ఎలాగేనా వెళ్ళాలన్న కోరిక కూడా వెంటనే కలక్కుండానూ ఉండలేదు. కాని ఇన్నాళ్ళకు ఆ సరసు నన్ను అనుగ్రహించింది.
మొన్న సాహిత్యోత్సవానికి వెళ్ళినప్పుడు ఆ ముందురోజే నరుకుర్తి శ్రీధర్ అక్కడికి వెళ్ళివచ్చారని తెలిసి మళ్ళా నన్ను తీసుకువెళ్తారా అని అడిగాను. శ్రీధర్ ఆరోగ్యవంతమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయనా, ఆయన శ్రీమతి బిందు ఈ జీవితాన్ని ఎలా సంతోషమయం చేసుకోవాలో తెలిసినవాళ్ళు. నేను అడగ్గానే శ్రీధర్ సరే అన్నాడు కానీ, సూర్యాస్తమయ దృశ్యం చూడాలంటే మనం నాలుగూ, నాలుగున్నరకల్లా ఇక్కణ్ణుంచి బయల్దేరాలి అన్నాడు.
సూర్యాస్తమయం చూడటం సరే కాని నాకు వెన్నెల్లో పడవమీద తిరగాలని ఉంది అని అన్నాను. చతుర్దశి అంటే దాదాపుగా పున్నమికదా, పున్నమిరాత్రి పడవప్రయాణం చేసి ఎన్నేళ్ళయిందో అనుకున్నాను, వెన్నెల్లో ఒకప్పుడు చేసిన పడవ ప్రయాణాల్ని తలుచుకుంటూ.
ఒక కాముని పున్నమి రాత్రి శ్రీశైలం రిజర్వాయర్ లో చేసిన పడవప్రయాణం, ఒక రాత్రి గోదావరిలో చంద్రోదయవేళ పడవప్రయాణం చేస్తూ ఉండగా, పడవవాళ్ళు నా మనసుని కనిపెట్టినట్టు, ఆ వెన్నెల్లో పడవని శబరి గోదావరి సంగమం వైపు నడిపించిన సమయం గుర్తొచ్చాయి.
సాయంకాలం పూట ఎక్కడ నీళ్ళు కనిపిస్తే అక్కడ కొంతసేపు కూచుని వెళ్ళండి, అంతకన్నా మించిన ధ్యానం లేదు అని చెప్పారు మన పెద్దవాళ్ళు. నీళ్ళతో మనకి ఉన్న అత్యంత ప్రాచీన, అనాది ఆత్మీయత స్ఫురించే క్షణాలవి. అటువంటిది, వెన్నెల రాత్రి పడవలో పయనిస్తే? నువ్వు ఏకకాలంలో భువికీ, దివికీ కూడా దగ్గర కాగల మహత్తరమైన సందర్భం అది.
మేము ఆ తటాకం దగ్గరకి చేరుకునేటప్పటికి సూర్యుడు దాదాపుగా అంతర్హితుడవుతూ ఉన్నాడు. సూర్యుడు ఇంకా దిగంతరేఖ మీద ఉండగానే మేము అక్కడికి చేరుకోగలమో లేదో అని శ్రీధర్ ఆందోళన పడుతూనే ఉన్నాడు. కాని అక్కడికి చేరుకోగానే నా దృష్టి ఆకాశం మీద లేదు. తెల్లకాగితం మీద నీటిరంగుల మొదటి పలచని పూతలాగా కనిపిస్తున్న నీలి-లేతాకుపచ్చల మిశ్రమంలాంటి జలరాశి, దానిపైన ఒకటీ రెండూ పడవలు, అల్లిబిల్లిగా అల్లుకుని, ఎవరి ప్రేమలేఖలో నీటిమీద తేలుతున్నట్టు తామరాకులు- త్వత్వరగా అక్కడికి అడుగుపెట్టాం. శ్రీధర్, హిమబిందు, అనిల్ బత్తుల, నందకిశోర్, నేనూ.
ఆ ఒడ్డున కేనోలు- canoes. అచ్చు విన్ స్లో హోమర్ నీటిరంగుల చిత్రాల్లో కనిపించినట్టే. వాటిని చూడగానే నా నీటిరంగుల పెట్టె తెచ్చుకుని ఉంటే ఎంత బాగుణ్ణు అనిపించింది. అపార జలరాశి పక్కన ఒక తెప్ప మనలో రేకెత్తించే ఉద్వేగాల్ని మనకి మనం స్పష్టం చేసుకోవడం అంత సులభం కాదనుకుంటాను. బహుశా ఆ తెప్ప, ఆ డింగీ, ఆ దోనె, ఆ తాటిదొన్నె అది ఎక్కడో ఒక ఆశగా, ఆసరగా, బాసటగా స్ఫురిస్తుందనుకుంటాను.
మేం వెళ్ళే ముందే శ్రీధర్ బోటింగు ఏర్పాట్లు చేసినట్టున్నాడు. మా కోసం పడవవాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అది రెండు జంటపడవల్ని ఒక తెప్పగా కలిపి కట్టిన నావ. అందులో అడుగుపెట్టాం. ‘అటు చూడండి, అటు చూడండి’ అంటున్నాడు శ్రీధర్, దూరంగా కొండవెనక అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూపిస్తూ. కాని అక్కడ సూర్యుడు లేడు, ఆయన నడచివెళ్తుండగా రేగిన దుమ్ము మాత్రం ఉంది. సూర్యాస్తమయాన్ని చూపించలేకపోయానన్న చింత ఇంకా శ్రీధర్ ని విడవట్లేదు. ‘పర్వాలేదు, మంచి సమయానికే వచ్చాం. సన్ సెట్ తర్వాత అల్లుకునే వెలుగుని చూడొచ్చు. మీలాంటి ఫొటోగ్రాఫర్లకి ఎంతో ఇష్టమైన గోల్డెన్ అవర్ కదా అది’ అన్నాను.
పడవ కదిలింది. అప్పుడు నెమ్మదిగా నాలుగు దిక్కులా పరికించి చూసాను. దూరంగా కొండలు. ‘చిలక సరస్సులాగా ఉంది కదా’ అన్నాను. ‘కాని, చిలకసరస్సుదగ్గర ఎటుచూసినా నీళ్ళే. ఈ గ్రీనరీ ఎక్కడుంది అక్కడ? ‘ అన్నాడు శ్రీధర్. ఈసారి చెరువునిండా తామరలు పుయ్యలేదని, ఆ ఋతువు కొంత వెనకబడ్డదనీ ముందే నందూ చెప్పడంతో పూలు లేని ఆ చెరువు నన్ను నిరాశ పర్చలేదు. పూలు లేకపోయినా ఒకప్పుడు పూలు పూసిన జాడలు, రేపు మళ్ళా పూల వెల్లువ ముంచెత్తుతుందనే ఊసులు అక్కడ కనిపిస్తూనే ఉన్నాయి.
కాని ఈసారి పూలు లేని లోటు పక్షులు తీర్చాయి. పూలు కొమ్మకి మటుకే ఊగే పిట్టలు. పక్షులు ఎగిరే రెక్కలుండే పూలు. ఆ చెరువు నిండా ఎన్నో రకాల పక్షులు- పడవనడిపే మహేంద్రని ఆ పక్షుల పేర్లు చెప్పమన్నాను. కొన్ని పేర్లు చెప్పగలిగాడు. చాలా పేర్లు తనకీ తెలీవన్నాడు. ఆ మధ్యలో సన్నని కొమ్మమీద వచ్చి సుతారంగా వాలింది ఒక లకుముకి పిట్ట. నీలిరంగు దుపట్టా. నారింజరంగు ముక్కు. బంగారు మీద నారింజ చిలకరించిన నడుం. Kingfisher అన్నారెవరో. కింగ్ ఫిషర్ లో నిజంగానే ఒక రాచఠీవి ఉంది. నీలం వన్నె తగ్గిన నీళ్ళకీ, ఆకాశానికీ ఆ నీలిరంగుపిట్ట ఆ క్షణాన ఎంత నీలకాంతిని ధారపోసిందో చెప్పలేను. చిత్రకారులకి తెలుస్తుంది. Making colors sing అంటే ఏమిటో. తక్కిన బాక్ గ్రౌండ్ అంతా పలచటి పూత పూసి దాని మధ్య ఒక Prussian blue dab తాకిస్తే, ఆ చిత్రలేఖనం ఎట్లా ఎగిరి గెంతుతుందో ఊహిస్తూ ఉన్నాను.
ఇంతలో దూరంగా ఒక లంకమీద కొంగల బిడారు కనిపించింది. పడవ అటువైపు నడపమన్నారు మిత్రులు. కానీ ‘వాటిని డిస్టర్బ్ చేయకండి’ అన్నారు బిందు, సున్నితమనస్కురాలు. ఆ చెరువు మధ్యలో చిత్తడినేలమీద అల్లిబిల్లుగా అల్లుకున్న తుంగచేలల్లో వందలు, వేలు కొంగలు. వాటిని పోల్చడానికి రూపకాలంకారాలు వెతుక్కుంటున్నాను. యుద్ధానికి ముందు సముద్రం దగ్గరకి చేరుకున్న వానరసమూహాల్ని వర్ణిస్తూ వాల్మీకి అవి విరగపండిన గోధుమ చేలలాగా ఉన్నాయంటాడు. అట్లాంటి ఉపమానం నాక్కూడా స్ఫురిస్తే ఎంతబాగుణ్ణు అనుకుంటూ ఉన్నాను.
పడవ ఆ లంకదగ్గరగా సాగుతున్నప్పుడు పడవవాడు ఏదో చప్పుడు చేసాడు. అంతే, ఒక్కసారిగా, సుడిగాలి రేగినట్టుగా కొంగలన్నీ ఒక్క ఉదుటున గాల్లోకి లేచాయి. అవి ఆ లంకని కూడా పెళ్ళగించి లేపుతున్నాయా అన్నంత సంచలనం. గాల్లోకి రేగిన ఆ పక్షి సమూహం గాల్లో ఒక చుట్టు తిరిగాయి. అవి ఎవరో వీరుడు సంధించిన శరపరంపరలాగా ఉన్నాయి. ఆ బాణాలు ముందు సూటిగా, ఆ తర్వాత వాలుగా, ఆ తర్వాత వట్టి నీడగా మళ్ళా వచ్చి నేలని నాటుకున్నాయి. సరసునీ, అకాశాన్నీ కలిపి కుట్టిన పూల అల్లికలాగా ఉన్నాయి. ‘మరోసారి ఆ చప్పుడు చెయ్యకూడదా మళ్ళా లేస్తాయి’ అన్నారొకరు. పడవమనిషి కొన్ని క్షణాలు ఆగి మళ్ళీ చప్పుడు చేసాడు కాని, ఈ సారి మరీ పెద్ద సంచలనం లేదు. మరికొంతసేపటికి కొంగలు మమ్మల్ని కూడా తమలో కలిపేసుకున్నట్టున్నాయి, ‘రవ్వంత సడి లేని రసరమ్యగీతాలు’గా మారిపోయాయి.
కొంగలు సద్దుమణిగే వేళకి చంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. కథానాయకుడు రంగస్థలం మీద ప్రవేశించాక ఇక మన దృష్టి వేరేవాటి మీద ఎలా ఉంటుంది? ఒకరు కాదు, ఇద్దరు కథానాయకులు-ఒకరు నింగిలో, మరొకరు నీళ్ళల్లో. నిజానికి గగగనసీమలోని చంద్రుడికన్నా, సరోవరంలోని చంద్రుడే ఎక్కువ గ్లామరస్ గా ఉన్నాడు. పడవ కదుల్తూ సన్నని నీటి అలలు ఆ చంద్రబింబాన్ని తాకినప్పుడు నీళ్ళల్లో చంద్రుడు కుంచెతో గీసిన తెల్లగీతలాగా గజిబిజిగా అవుతున్నాడు. మళ్ళా ఇంతలోనే తనను తాను సర్దుకుని మాతో మాటలు మొదలుపెడుతున్నాడు.

‘అవిగో అమ్మా, తామర పూలు కోసి తీసుకోండి’ అన్నాడు బిందుతో పడవనడుపుతున్న మహేంద్ర . ఆమె నీళ్ళల్లోకి చేతులు చాపి ఒక తామరమొగ్గ పైకి లాగింది. తామరతూడులాంటి ఆ చేతిలో ఏది తామరపువ్వో, ఏది ఆమె కోమలహస్తమో తెలియడం లేదు.
ఆ పూలకేసి చూడ్డానికి ఇటు తిరుగ్గానే అప్పుడు కనిపించింది ఆ సూర్యాస్తమిత తేజోదిగంతం. ఏమి వెలుగు! ఆ కొండవెనకనుంచి ఎవరో కుండల్తో ధారపోస్తున్నట్టు రాగిరంగు కాంతి. ఆ కాంతిని శిరసావహిస్తున్నట్టు నిలబడ్డ ఆ కొండ. అవి నేపథ్యంగా మా ముందు నీళ్ళల్లో ఎర్ర్రటికాంతి పొరమీద అల్లిబిల్లిగా అల్లుకున్న తిప్పతీగల గీతలు. ప్రకృతి దృశ్యాలు గియ్యాలనుకునే నీరంగుల చిత్రకారులకి ఇలాంటి దృశ్యాలు ఇచ్చే స్ఫూర్తి చెప్పలేనిది. సాధారంగా horizontals ప్రశాంతభావాన్ని రేకెత్తిస్తాయి, verticals ఉద్విగ్నతని సూచిస్తాయి. ఆ రెండూ కలిస్తేనే జీవితం. ఆ శాంతగంభీర దిగంతం నేపథ్యంగా ఆ తుంగచేల వంకరటింకర గీతలు ఏదో అపూర్వగానానికి ప్రకృతి రాసుకున్న నొటేషన్ లా ఉన్నాయి.

వాటిని చూడగానే ఏదో వినాలన్న కోరిక కలక్కుండా ఎలా ఉంటుంది? అందుకని దేశదేశాల కవిత్వం తెలిసిన అనిల్ ‘నందూ, ఒక పాట పాడు’ అన్నాడు. అప్పటికే నందూ గుండె అతనిలో గొంతులో కొట్లాడుతూ ఉంది. వెంటనే పాట ఎత్తుకున్నాడు.
కోటీపల్లీ రేవులో -నా బావ
కొల్లంక డొంకలోన -నా బావ
కోరంగి మడఅడవిలో -నా బావ
కోరింది మాటడర -నా బావ
ఆహా అనుకున్నాను. కోరంగి మడ అడవిలో ఆ బావామరదళ్ళు ఇద్దరే ఉన్నప్పుడు కోరింది మాట్లడటమే కదా కావాలి!
తెడ్డేసె నీకేసి తేలుద్ది ఆ మబ్బు
వలవేసె ఒడుపుకి వొంగుద్ది ఆ మబ్బు
పాటెత్తి నువ్ లేస్తె ఆడుద్ది ఆ మబ్బు
సారాయి సీసెత్త అలుగుద్ది ఆ మబ్బు
నీళ్ళమీది మబ్బు- నీలి నీలి మబ్బు
నీ కాళ్ళు తగలంగ- చెదిరి వానైతాది
నందు పాటలు రాస్తాడని తెలుసు, పాడతాడని కూడా తెలుసు. కాని ఇలా వళ్ళంతా గొంతుగా మారి పాడతాడని చూడటం ఇదే మొదలు. అలా గొంతెత్తి పాడుతున్న అతడి వెనక ఆకాశం కూడా ఆగిపోయి వినడం మొదలుపెట్టింది.
రొయ్యలా మీసాలు కన్నులు మీనాలు
సొరచేపలా పళ్ళు సోయిలేని ఒళ్ళు
తాబేలు తల ఎత్తి పీతలు వేళ్ళెత్తి
ఇద్దరం కూడంగ ఇసుకలో తాపాలు
కోపాలు తాపాలు- కొనగోటి మోహాలు
ఎరగుచ్చి నువు పోతె- ఎన్నెలే పడతాది
‘ఎరగుచ్చి నువు పోతే ఎన్నెలే పడతాది!’ ఇలాంటి కవిత్వం ఈ పాతికేళ్ళల్లో నేను వినలేదు. ఇంకా పాడుతున్నాడు:
కట్టుకున్నా చీర కప్పదు నీలాగ
ముడులేసినా రైక నిలవదు నీలాగ
వొదులైన సిగపువ్వు జారదు నీలాగ
తెగిపారె యేరైన తడపదు నీలాగ
అటు తిరిగి ఇటు తిరిగి- హైలెస్స హైలెస్స
నాటు పడవెక్కిన- ఊపదు నీలాగ
అహా! అన్నమయ్య కవిత విని శ్రీ వేంకటేశ్వరుడు ‘ఇదీ కవిత్వం’ అన్నాడట. ఈ మాటలు విని నీళ్ళూ, నింగీ, చంద్రుడూ, చంద్రికా సమస్తం తలూపుతూ ‘ఇదీ కవిత్వం’ అంటున్నాయి.
పూతేసె పువ్వుల్ని పూరేడు మేస్తుంటె
నాటేసి చేలన్ని సూరీడు కాస్తుంటె
పోటెత్తె గోదారి పొమ్మనీ తోస్తుంటె
నీటిలో గంగమ్మ నీ సిగ్గు దాస్తుంటె
ఆ మాట ఈ మాట అస్సలొద్దే వొద్దు
నేరేడు నీ పెదిమలంటించిపోవద్దు
నందు పాట ముగించాడు కాని, సంధ్యాకాశం ఇంకా తలవాల్చి శ్రద్ధగా అతడివైపే చెవి ఒగ్గి ఉందని తెలుస్తున్నది. ‘నందూ, మరో పాట’ అన్నాడు అనిల్. అనిల్ బహుశా అడవిలో కోకిలతో కూడా ఇలానే పాటలు పాడించగలడనుకుంటాను.
ఇంతలో ఒక మొవ్వుదోనె మీద ఒక పిల్లవాడు మా వైపు దూసుకొచ్చాడు. గడకర్ర పట్టుకుని తెప్పవేసుకు సాగిపోయే మనిషి నా కళ్లకెప్పుడూ ఒక జానపద కథానాయకుడిలానే కనిపిస్తూ ఉంటాడు. ఎందుకొచ్చాడు ఆ వీరుడు? ఆ పాట అయస్కాంతంలాగా అక్కడికి లాక్కొచ్చిందా?

నందూ మరో పాట ఎత్తుకున్నాడు:
మసకపల్లి
ఇసుకరేవు
కొర్రమీను
మీసగాడా
గాలమేసే నా కొంగు
పట్టుకోవేరా
ఎక్కడి మసకపల్లి! ఎక్కడ అనకాపల్లి! బహుశా ఈ మడ అడవి ఆ మడ అడవిని తలుచుకుంటున్నట్టుంది.
సిగ్గులేదు
నీకు నాకు
బొగ్గు మొకపు
అందగాడా
నీలాటి రేవుసాటు
కూడుకోవేరా
అహా!బొగ్గు మొకపు అందగాడట! ఆ బొగ్గు మొకం ఆ వెన్నెల్లో ఎంత అందంగా కనబడుతోంది!
అత్త పోరు సవితిపోరు
నోరునాది పెచ్చినాది
మామ కోరే మరిదికోరె
మనసునాది విరిగినాది
అగ్గిపుట్టి పాముకుట్టి
ఒళ్ళునాది మండినాది
ఏరు పొంగి నీరుపొంగి
చీరనాది తడిసినాది
దిబ్బ మీదీ దుబ్బ తోడు
పోటు మీదీ గంగతోడు
గంగలో నన్ను ముంచిపో
గట్టు తేల్చిపో బావా
ఓ బావ ఇటు రావా
ఎగదోసెయి పడవా
కవిత్వమంటే ఇది. గంగలో ముంచిపోవడమే గట్టుతేల్చడమట. ఏమి గంగ అది? ముందు వాక్యాలు గుర్తుతెచ్చుకోండి. ‘ఏరుపొంగి నీరుపొంగి/ చీరనాది తడిసినాది.’
కాయకష్టం మాయకష్టం
కాలు రెక్కా లేవకుంది
లంక దారి డొంక దారి
ఎన్నెలంతా రాలుతోంది
ఊరు వాడ నిద్దరోయి
ఊటబావి పొంగుతోంది
మొరటుగున్న మొగునిజేరి
వయసునాది వల్లకుంది
అమ్మతోడు అయ్యతోడు
అల్లనేరడు నవ్వుతోడు
మత్తుగా గుండె నిండిపో
నాతో ఉండిపో బావా
ఓ బావ నా బావా
సుక్కలన్నీ ఏరుకోవా
కొంగలు ముందే మాటుమణిగాయి, నందు పాట ముగించేటప్పటికి, కొండలు కూడా మాటుమణిగాయి. దూరంగా కనిపిస్తున్న రాత్రి దీపాల రెప్పలు కూడా వాలిపోతున్నాయి. చంద్రుడూ, చంద్రికా తప్ప మరెవ్వరూ మెలకువగా లేరు.

మాతో ఉన్న నందకిశోరుడు ఈ కాశవనాన్ని బృందావనంగా మార్చేసాడు. తన గుండెని పిల్లంగోవిగా వంచి మరొక పాట ఎత్తుకున్నాడు.
గూడకొంగ మెడకింద
నల్ల నల్ల సుక్కవోలే
నీ వొంపు మెడకింద
నల్లా పూసల గొలుసు పిల్లా
పొట్టకొచ్చె మొక్కజొన్నా
పాలుగారె పొత్తులోలే
నీ చెవుల దుద్దులూగితే
ఆగం ఆగం అయితనె మల్ల
తుమ్మపూల అందామంతా
దాసుకున్న కళ్ళాకింది
ముళ్ళు ఉన్న సూపు నాకు
ముద్దిస్తే కాదనకు
తూరుపు ఒళ్ళంతా
పొద్దు పొడిచే యాల
మబ్బొచ్చి మీదపడితె
పోపో పొమ్మని అనకు
ఓ పిల్లా నీతో మనసు చెప్పేదెట్లా
ఓ..పిల్లా నీతో తనువూ తప్పేదెట్లా
మూడుముళ్ల పసుపుతాడు
యేలాడవచ్చుగానీ
మూగఎన్నెల తోడు
కాళ్ళనెవడు కట్టలేడు
సోలెడంత సొగసుకొరకు
జోలెపట్టి కూసున్నా
నిన్నుమించి సోపతిలేదని
పాట పాడీ అడుగుతున్నా
తుళ్ళిపడె ఈడూ ఉంది
తూలిపోయే దారీ ఉంది
చిన్న చిన్న అడుగు
వేయరాకపోతే సాయమడుగు
తుంటి ఎముకలు రెండు
జాజిరాడే వేళా
కాలిపోయేదెందూకంటే
కామున్నే యెళ్లడుగు
ఓ పిల్లా నీతో మనసు చెప్పేదెట్లా
ఓ..పిల్లా నీతో తనువూ తప్పేదెట్లా
ఇంత అత్యున్నతమైన కవిత్వాన్ని మేము ఆ వెన్నెలవేళ ఆ నీటి ఊయెలలూగుతూ వినాలని రాసి ఉంది కాబోలు. ఆ మాటలే పదే పదే చెవుల్లో మోగుతూ ఉండగా కొంతసేపు అంతా నిశ్శబ్దంగా ఉండిపోయాం. దిక్కులన్నీ నిద్రలోకి జారుకున్నాయి. పడవ మీద ఆరుగురం, ఆకాశంలో ఏడవవాడు.
చంద్రుడికి కూడా నాలానే పాత హిందీ పాటలంటే ఇష్టం. ఏవన్నా వినిపించరాదా, ఈ నిశ్శబ్దం మరీ బరువుగా ఉంది అన్నాడు. యూట్యూబ్ తెరిచాను. ఒకటీ, ఒకటీ పాత హిందీ పాటలు, మధ్యలో ‘మనసున మల్లెల మాలలూగెనే ‘, ఇంతలో శ్రీధర్ ‘తోటలో నా రాజు తొంగిచూసెను నాడు ‘- కానీ నందూ పాటలు చల్లిన సుగంధం ఇంకా మత్తుగా, చల్లగా, వెచ్చగా, బరువుగా మామీద రాలే ఉందని అర్థమయింది.
యూట్యూబ్ కట్టిపెట్టి శ్రీధర్, బిందు కలిసి ఒక పాట ఎత్తుకున్నారు. ‘ఆజారే పర్ దేశీ..’ వాళ్ళిద్దరూ కలిసి పాడుతుండగా తేనెరంగు వెన్నెల వాళ్ళ మీద రాలుతూ ఉంది. ఆ ఇద్దరూ మామూలుగానే ఏదో మంత్రనగరానికి చెందినవాళ్లల్లా ఉంటారు. ఆ రాత్రి ఆ మంత్రనగరం మాకు బాగా చేరువగా జరిగినట్టనిపించింది. వాళ్ళు పాట ముగించేటప్పటికి,
‘తగ్గేద్యేలా ‘
అన్నారెవరో. ఉలిక్కిపడ్డాం. మాకు తెలియని కొత్త గొంతు!
తీరాచూస్తే అది పడవనడిపే మహేంద్ర ఫోన్ లో బీప్.
పాటలు ముగిసిపోయాయి. మాటలు ఆగిపోయాయి. పడవ కూడా దాదాపుగా నెమ్మదించింది. దూరంగా కొండ ఒక వెన్నెల నీడగా మారిపోయింది. పడవమనిషి తెడ్డు పక్కన పెట్టి ఆ నిశ్శబ్దాన్ని భంగపరచకుండా తన చేతుల్తోనే నీళ్ళల్లో తెడ్డువేస్తున్నాడు. మా విహారం పతాక స్థాయికి చేరుకున్న క్షణాలవి. బహుశా ఒక లి-బాయి లాంటి చీనా కవి అప్పుడు మాతో ఉండి ఉంటే, ఆ అనుభవాన్ని ఒక కవితగా మనకి అందించగలిగి ఉండేవాడు. నేనయితే మాటల్లో పెట్టలేను. నీకు నువ్వు చేరువై, నీ ముందు నువ్వు మోకరిల్లే క్షణాలవి.
పడవ ఒడ్డుకి చేరుకుంది. ఒడ్డు దగ్గర మా కోసం ఎదురుచూస్తున్న వాళ్ళు రెండుగంటలపాటు బోటింగు చేసారు అన్నారు. రెండు గంటలా? మాకైతే నందూ మూడుపాటలే లెక్క.
గట్టుమీద అడుగుపెట్టగానే సరసు వైపు తిరిగి చేతులు జోడించి నమస్కరించాను. అంతదాకా మాతో కలిసి విహరించిన దేవతలనుంచి సెలవుతీసుకున్నాను. విద్యుద్దీపాలు దగ్గరలోలేని ఆ చెరువు గట్టుమీద చెట్లమీంచి వెన్నెల కారుతూండడం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నందూ పాటలో నాయికలాగా మేము కూడా ఆ రాత్రి పూర్తిగా మునిగి, గట్టున తేలామని అర్థమయింది.
7-2-2023
ఎన్నాళ్లకు ఏమి స్వాంతన! మీకు మీరే సాటి…సర్. భావోద్వేగ ప్రదాత!
ఇంతటి భావుకతను ప్రసాదించిన మీ ఎదుట మోకరిల్లి ప్రణమిస్తూ..
మీ భాషా సౌరభ బానిస,
రాం భాస్కర్ రాజు
రాజుగారు! నేనే మీ అభిమానానికి బానిసను.
ఎర గుచ్చి నువు పోతే ..ఎన్నెలే పడతాది.. తేనె తాగిన పాట..నందు గారికి అభినందనలు..మీ అనుభూతి ని చదివి మేమె సరస్సు లో విహరించినట్టు అనిపించింది సర్.
మీ స్పందనకు ధన్యవాదాలు
అద్భుతం!!
నమస్కారం సర్. కళ్లకు కట్టినట్లు వివరించారు సర్.
థాంక్యూ వెరీ మచ్
కట్టుకున్నా చీర కప్పదు నీలాగ
ముడులేసినా రైక నిలవదు నీలాగ
వొదులైన సిగపువ్వు జారదు నీలాగ
తెగిపారె యేరైన తడపదు నీలాగ
అటు తిరిగి ఇటు తిరిగి- హైలెస్స హైలెస్స
నాటు పడవెక్కిన- ఊపదు నీలాగ
ఏ జానపదగీతంలోనూ కనపడని పచ్చిదనం, కవ్వింపు, సరసం ఈ పాటల్లో వినపడి గిలిగింతలిచ్చినట్టుంది. ఈ పాట మొన్న మీరు పోస్ట్ చేసినప్పుడు విని, ఆ ముందు వాక్యాలకి ఊ కొట్టినట్టు, ఆఖరు వాక్యానికి ఏమనలేదు కదా..మీరు నమ్మరు, నాకప్పుడే ఎందుకో అనిపించింది, ఈ మాట మీకు మరింత నచ్చి ఉంటుందని, అందుకే ఆగిపోయారని.:) ఎర గుచ్చి నువు పోతే ఎన్నెలే పడటం ఇంకో క్లాసిక్. మీరిట్లా రాశాకా ఆ పాదాల్లోని అందం ఇంకాస్త తెలిసింది.
గూడ కొంగ మెడ కింది నల్ల నల్ల సుక్క లాంటి నల్లపూస, నేరేడు పెదిమలు, పొట్టకొచ్చే మొక్కజొన్న…, ముళ్ళచూపు ముద్దు, తుంటి ఎముకల జాజిరాట – ఎంత కవిత్వమో ఇంత పాటయ్యింది.
Thank you for writing this.
Thank you Nandu.
ఎంకి పాటలు, బంగారి మామ పాటల కోవలో ఉన్నా ఈ పాటలు వాటికన్నా మరింత చిక్కగా, మరింత సొగసుగా ఉన్నాయి. వాటిని ఆ వెన్నెల రాత్రి వినటం నిజంగా ఒక అనుభవం.
మేమూ మునిగితేలాం.మీ రచనా స్రవంతిలో
ధన్యవాదాలు!
వెన్నెల వేళ విహారం.. నందకిషోర్ వంటి జానపద కవి మాటా..పాటా.. అమోఘమైన మీ వర్ణన; ములిగి తేలాం. ధన్యవాదాలు.
ధన్యవాదాలమ్మా!
వావ్…. ఈ ముచ్చట కాస్త లేట్ గా చదివాను. నందూ పాట మీకు లేట్ గా చేరిందైతే. ఇక్కడ గుర్తుచేసుకున్న మసకపల్లి ఇసకరేవు, కోరంగి మాడఅడవి పాట నా birthday లకు రాసినవి. అటొచ్చిన ప్రతిసారీ ఒక పాట కడతాడు నందూ.
ఇది నిజంగానే కొత్త విశేషం. మరింత సంతోషకరమైన విశేషం. ధన్యవాదాలు
వావ్…. ఈ ముచ్చట కాస్త లేట్ గా చదివాను. నందూ పాట మీకు లేట్ గా చేరిందైతే. ఇక్కడ గుర్తుచేసుకున్న మసకపల్లి ఇసకరేవు, కోరంగి మడఅడవి పాట నా birthday లకు రాసినవి. అటొచ్చిన ప్రతిసారీ ఒక పాట కడతాడు నందూ
ఇది కదా ప్రయాణమంటే..ఇదే కదా యాత్రా రచన అంటే..
మీ స్పందనకు ధన్యవాదాలు అమరేంద్ర గారు!
మీ అక్షరాలతో చతుర్దశి వెన్నెలలో మునకలేయించారు. ఆ అద్భుత ప్రయాణం కొంత నాదీ అయిందిప్పుడు.. నీరూ నందూ వెన్నెలా నావే! మిమ్మల్ని మోస్తున్న పడవనేమో నేనిప్పుడు!!
మీ రస సహృదయ స్పందనకు నమోవాకాలు!
ఎప్పటిలాగే అద్భుతం sir
గొప్ప ప్రేమ యాత్ర
నదీ , వెన్నెలా , నందూ కవిత్వం దేనికదే స్వఛ్ఛమైనవి.
మూడు ఒకచోట కూడటం … అది ఓ మాజిక్
ఓ యువ కవికి మీ లాటి వారి ప్రశంస దక్కటం చాలా సంతోషం గా ఉంది ..
ఇలాటి ప్రయాణాలు మరిన్ని చేయాలని
మనఃస్ఫూర్తి గా కోరుకుంటున్నాను
మీ ఆత్మీయ స్పందనకు నమో నమః