ఒక సంగమస్థలి

ఈ రోజు పొద్దున్న హైదరాబాదులో భమిడిపాటి జగన్నాథరావుగారు ఈ లోకం నుంచి సెలవుతీసుకున్నారని వసీరా ఫోన్ చేసి చెప్పాడు. ఆయన్ను చివరి సారి చూసి చాలా ఏళ్ళే అయింది. నేను విజయవాడలో ఉండగా కరోనా రోజులు కావడంతో ఆయన్ని కలవడానికి వెనకాడేను. ఆయన ఈ మధ్యే హైదరాబాదుకు నివాసం మారేరని ఆ మధ్య రాజారామ్మోహన రావు చెప్పినప్పుడు ఇద్దరం కలిసి వెళ్దాం అనుకున్నాం. కాని ఇంతలోనే ఈ వార్త.

ఇప్పుడు ఏమీ రాయాలనిపించడం లేదు. తలుచుకోవలసినవి ఎన్నో ఉన్నాయి, ఎన్నో రోజులు, ఏళ్ళు, సాయంకాలాలు, రాత్రులు, కబుర్లు, కవిత్వాలు, పుస్తకాలు, ప్రయాణాలు.

చాలా ఏళ్ళ కిందట వాసుదేవరావుగారు ఆయన మీద నాతో ఒక వ్యాసం రాయించి సుప్రభాతం పత్రికలో (1996) లో ప్రచురించారు. ‘సహృదయునికి ప్రేమలేఖ’ పుస్తకం (2001)లో పొందుపరిచిన ఆ వ్యాసాన్నే ఈ సందర్భంగా ఆయనకు నివాళిగా ఇక్కడ పంచుకుంటున్నాను.


‘అపరిచితుల్ని పరిచితుల్ని చేశావు. నావికాని ఇళ్ళలో నాకు స్థానం కల్పించావు. దూరాన్ని దగ్గర చేశావు’ అని సర్వేశ్వరుణ్ణి స్తుతించాడు కవి. భమిడిపాటి జగన్నాథరావు గారి గురించిన నా తలపుల్ని కూడా ఈ స్తుతి వాక్యాల్తోనే మొదలు పెట్టనివ్వండి. ఆయనకి ఒకవైపు నవయవ్వనంతో తొణికిసలాడే రసాత్మకహృదయం, మరొకవైపు మహా సంయమనంతో కూడిన వివేకం. కనకనే భిన్న ప్రవృత్తులకీ, భిన్న దృక్పథాలకీ చెందిన మనుషులెందరికో ఆయన ఒక సంగమస్థలి కాగలిగేరు.

జగన్నాథరావుగారితో ఏదన్నా ఒక సాయంకాలం ఎవరన్నా, ఎక్కడన్నా- అది ఒక చిన్న రెస్టారెంట్‌ కావచ్చు, ఏ మిత్రుడి ఇంటివాకిటనైనా కావచ్చు-కొన్ని గంటలే­నా గడిపినాళ్ళు ఆయన్నీ, ఆ క్షణాల్నీ తమ జీవితాంతం ఎన్నటికీ మరవలేరు. ఆ కొద్దిసేపట్లో వాళ్ళు తమలో అంతదాకా నిగూఢంగా, తమకే తెలియకుండా ఉన్న బలమైన జీవనశక్తులు తమలో మేల్కోడాన్ని గమనిస్తారు. గొప్ప ఆధ్యాత్మిక గురువుల దగ్గర మాత్రమే సాధ్యమయ్యే ఇటువంటి పరుసవేది స్పర్శని జగన్నాథరావుగారి దగ్గర ఎంతో సెక్యులర్‌ ఎన్‌విరాన్‌మెంట్‌లో మనం చూడగలగడం చాలా థ్రిల్లింగ్‌గానూ, కన్వీన్సింగ్‌గానూ వుంటుంది.

ఆయనతో మాట్లాడుతున్నపుడు ఆయన మనని చాలా ముఖ్యమైన మనిషిగా గుర్తించినట్టు ఫీలవుతాం. మనకి అటువంటి యోగ్యత ఏదో ఉందని లోపల్నించి ఎవరో బలంగా మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. ఆ కొద్దిసేపూ- మనం గడిచే ప్రతి ఒక్క క్షణాన్ని- బలంగా గాఢంగా హత్తుకుని స్క్వీజ్‌ చేస్తున్నట్టుంటాం. అప్పుడెవరన్నా ఆ గోష్ఠిలో ఓ పాటపాడితే ఆ పాట అనిదంపూర్వమధురంగా ఉంటుంది. ఎవరన్నా నాలుగు వాక్యాల కవిత చదివితే, ఆ నాలుగు వాక్యాలూ ఓ మహాకావ్యపు ఇన్స్పిరేషన్‌తో వూగిపోతాం­. ఆయనతోపాటే ఆయనందించే గోల్డ్‌ఫ్లాక్‌ చిన్నసైజు సిగరెట్‌ తీసుకుని ఒకటి రెండుసార్లు గట్టిగా పొగపీల్చితే లోపల్లోపలి ప్రాకారాలు పునాదుల్తో సహా కదులుతున్నట్టనిపిస్తుంది. ఆయన ఎవరిదేనా ఒక కథ చదివి విన్పిస్తుంటే వినటం నిజంగా ఒక అనుభవం. ఒట్టి సాదాసీదా వాక్యాలనుకున్నవి కూడా-ఆయన విన్పిస్తున్నప్పుడు- బంగారు రంగు కాంతిని అద్దుకుని మరీ బయటపడతాం­.

గత ఇరవయ్యేళ్ళుగా జగన్నాథరావుగారి వల్లే నాకెందరో కవులూ, రచయి­తలూ, కవులూ కాని గొప్ప మిత్రులూ పరిచయమయ్యారు. వింత ఏమిటంటే చాలామంది కవులూ, రచయి­తలూ ఆయనతో కూచున్నపుడు ఎంతో ధగధగలాడుతున్నట్లుండేవాళ్ళు, ఆయన లేకుండా వాళ్ళని కలిసినప్పుడు వెలవెలపోతున్నట్టుండేవారు. ఎన్నోసార్లు ఆయన్ని కలవడానికొచ్చిన మిత్రులు, రచయి­తలు ఒక ఆత్మిక దాహంతోనో, ఆకలితోనో తపించిపోతూ వచ్చినట్టుగా నాకనిపిస్తుంది. ‘మేమేమిటో మాకు చెప్పు. మాలోంచి మమ్మల్ని బయటికి తీసిచూపు. మేం మసకబారి పోతున్నాం, మమ్మల్ని శుభ్రంగా తుడిచి చూపించు’ అన్నట్టుంటాయి వాళ్ళ చూపులు.

నిజమైన కథకుడి సన్నిధి ఇలా ఉంటుంది. కథకుడు కవికీ, శాస్త్రకారుడికీ మధ్యనుండే సన్నని దారిమీంచే నడిచి వస్తాడు. ప్రేమించడమంటే కవి దృష్టిలో ఎగిరిపోవడం. ఏ బంధాలూ, బాధ్యతలూ లేకుండా తన యి­ష్టం వచ్చినప్పుడు తను కోరుకున్న లోకాల్లోకి ఎగిరిపోగలడు కవి. భూమిలోకి వేళ్ళు పాతుకుపోయి­న మనలాంటి మనుషుల్ని చూసి ఎగరలేకపోతున్నందుకు శపించగలడు కూడా కవి. శాస్త్రకారుడు తనని ఏదో ఒక సత్యానికో, క్రమానికో, గమ్యానికో కట్టిపడేసుకుంటాడు. తన దృక్పథం తప్ప తక్కినదంతా ఆయన దృష్టిలో అంధకారమే. తాను నమ్మింది తప్ప అతనికి మరేదీ సత్యంకాదు. కానీ కథకుడు ఇలా కాదు. ఆయన కవిలా బాధ్యతలేని వాడూ కాదు. శాస్త్రకారుడిలా ఏదో ఒక దానికి బందీనూ కాడు. దేన్ని నమ్మాలో, దేన్ని వదలాలో అనుక్షణం తడిమి చూసుకుంటాడు కథకుడు. ఎంతో బాధ్యతతో, ఎంతో ప్రేమతో, ఎంతో కన్‌సర్న్‌తో మనం నడిచేదారి పొడుగునా చేతులు అడ్డుపెట్టి కాచివుంటాడు కథకుడు. అతడు జీవితంలో ఒక్క మంచినో లేదా ఒక్క చెడ్డనో మటుకే చూసివుండడు. మనుషులు ఎంతో ప్రేమాస్పదులుగా ఉన్నప్పుడు కూడా వారి వెనుకపడి వచ్చే బలహీనతల నీడల్ని అతను గమనించగలడు. మనుషులు శాపయోగ్యులయి­నప్పుడు కూడా వారిలోని నిర్మలపార్శ్వాల్ని తన దృష్టినుంచి తప్పిపోనివ్వడు.

జగన్నాథరావుగారు కథకుడు అంటే ఈ అర్థంలో కథకుడు. ఆయన రాసిన కథలు మొ­త్తం రెండుపదులు లేదా పాతికమించి ఉండవు. అయి­నప్పటికీ తెలుగు కథల్లోని అత్యంత శక్తిమంతుల్లో ఆయన్ని తప్పకుండా లెక్కపెట్టుకుంటాను. ఈ శక్తికి ఆధారస్రోతమేది? ‘వంతెన’ (1967) కథలో కథకుడు ఇలా అంటాడు. ‘కలలూ, ఆదర్శాలూ, ఆలోచనలూ ఆత్మగతం చేసుకుని కూడా స్థిరత్వం సంపాదించేందుకు వలసిన వూలసూత్రం నాకు గోచరించింది’ అని. ఆయన మాటల్లో తరచు విన్పించే ‘సమన్వయం’, ‘బాలెన్స్‌’ చాలా లౌకిక పరిభాషలో విన్పించే ఆధ్యాత్మిక సూత్రాలే అన్పిస్తుంది. ఆ కథలోనే ఇంకా ఇలా అంటాడు:

నా జీవితం పరిభ్రమించే పరిధి చిన్నది. ఏ నలుగురో ఆత్మీయు­లైన స్నేహితులు, అందమైన సాయంకాలాలు, నచ్చిన కొద్ది పుస్తకాలు, ప్రశాంతంగా ఉండే ఇల్లు, నా ఇల్లాలు- ఈ పరిధి చిన్నదే. కాని నా చూపుకు అవధిలేదు. లోకమంతా పరిభ్రమిస్తుంది. అన్నీ అవలోకిస్తుంది. పరిమితిలేని నా చూపుకూ, చిన్నదైన నా జీవిత పరిధికీ వంతెన ఎలా కట్టాలో, సరియైన పునాదుల మీద నిలిచిన ఆ వంతెన మీద జీవితం ఎంత ఆనందదాయకమో.

అయితే ఈ వంతెన జీవితావసరాల పట్ల కాంప్రమైజ్‌గా, భౌతిక సుఖాల చూరుపట్టుకు వేలాడటంగా, ఆత్మవంచనగా మారే ప్రమాదాన్ని కూడా ఆయన తొలి నుంచీ గమనించి హెచ్చరిస్తూనే ఉన్నారు. ‘పాపం, దీక్షితులు’, (1955) ‘లౌక్యుడు’ (1959) ‘భావిపౌరులు’ (1959) ‘చేదునిజం’ (1964) ‘పురోగామి’ (1966) కథల్లో ఆయన ఎంతో స్పష్టంగా ఈ ధోరణిని ఎత్తిచూపి ఎంతో మృదువుగా మందలిస్తారు. ‘చేదు నిజం’ కథలో ఇలా అంటారు ‘కానీ కొత్తపద్ధతుల్ని అవలంబిద్దామని ముందుకు అడుగు వేయాలనీ, కొత్త సమాజానికి బాటలు వేద్దామనుకునే ఈ నవీన యువసంస్కారుల మనస్సుల్లోనే వాళ్ళు చెప్పేటంత, నమ్మేటంత సంస్కారానికి నిజమైన పునాది లేదనీ’.. అందుకు కారణం ‘వీటి వెనుక ఎక్కడో బలంగా నిలిచి పాతుకుపోయి­న ఆ అభిప్రాయాల్లో అట్టే మార్పు లేక మనసులు నిజమైన మార్పుకి తట్టుకుని హర్షించి వ్యవహరించలేకపోవడం’ అని అంటాడు. ‘పువ్వులతో పూజించినట్టుండే చూపు’ కలిగిన నవయువకుడే ‘కొత్త పద్ధతిలో పరిశ్రమించి సృష్టించిన ఓ కొత్తరకం గులాబీని, వదనంలో ఎన్నో ఆశయాలు ప్రతిఫలించగా ఆ పుష్పాన్ని అందుకోబోతున్న యువకుడు ఆ అందుకోవడంలో కొత్త సృష్టిలో అనంతంగా వచ్చిన ముళ్ళుగుచ్చుకుంటుంటే చూసి బాధపడుతూ ఆ గులాబి నవీనతనూ, సౌమ్యతనూ, మృదుత్వాన్నీ, మాధుర్యాన్ని గుర్తించి వదలకుండా ఎటూ తేలని మనస్సుతో మధన పడుతున్నట్టుండే ‘జాలి గొలిపేచూపులు’ చూడటాన్ని కూడా ఆయన స్పష్టంగా గుర్తించారు.

జగన్నాథరావుగారి కథల్లో రెండు దశలు ఉన్నాయి. 1952 నుంచి 1967 వరకూ రాసిన కథలు ఒక దశవి కాగా 1979నుంచి రాసిన కథలు రెండోదశవి. ఈ తర్వాత రోజులకు చెందిన ఆ కథకుడు మరీ ఉన్నతుడు. ఈ కాలంలో ఆయన చెప్పిన కథలు మహాప్రేమికులు మాత్రమే రాయగలిగినవి. కాని, ఆ కొన్ని కథలూ, ఆయన జీవనపాత్రిక నుండి నిండు సంతోషంలోంచి, పొర్లిన ఓవర్‌ఫ్లో. ఆ కథా సందర్భాన్ని దగ్గరగా చూసిన నాకు ఆ చిన్ని చిన్న ఓవర్‌ ఫ్లోస్‌ మధురాతి మధురమైన నిశ్శబ్దానికి మరింత నిండుతనాన్ని చేకూర్చుకునేందుకు పలికిన చిన్న చిన్న అనునయవాక్యాల్లా మృదువైన లాలింపుల్లా అన్పిస్తాయి­.

జగన్నాథరావుగారు మోర్‌దేన్‌ ఎ స్టోరీ టెల్లర్‌. కానీ కథకుడు ఎలా ఉంటాడో ఆయన్ని చూస్తేనే తెలిసింది నాకు. పద్మరాజుగారు, చలంగారు, త్రిపురగారి వంటి కథకులూ, కథలపట్ల ఏ ఆసక్తీ లేకుండానే ఆయనపట్ల ఎంతో ఆరాధనని పెంచుకున్న మా సుందర్రావు, రాజా, సోమయాజులూ జగన్నాథరావుగారి వల్లనే మరింత అర్థమయ్యారు నాకు. ఆయన కథలు పుస్తక రూపంలో వస్తే ఆ కొన్ని వాక్యాలు చదివినంత మాత్రాన అందరికీ ఆయన అర్థమవుతారా? కానీ అటువంటి వ్యక్తులుంటారనీ, వాళ్ళని- జీవితానందం యెడల మనుషులు ప్రేమావేశభరితులూ, భక్తి తత్పరులూ కావడం కోసం భగవంతుడు సృజించి మనుష్యబృందాల మధ్యకు పంపుతాడని నా బిడ్డలకీ, మీ బిడ్డలకీ కూడా తెలియడానికి ఆ కథలే అతిచిన్న బలహీనమైన ఆధారం. పృథ్వి అంతా ఆవరించిన మానవత్వపు అడుగుజాడలకు ఆ అచ్చువాక్యాలే మనం కొసాగించగల ఫెయింట్‌ ట్రేస్‌.

6-2-2023

2 Replies to “ఒక సంగమస్థలి”

  1. అక్షరాక్షర నివాళి స్ఫూర్తిదాయక కథారచయితకి

Leave a Reply

%d bloggers like this: