సాహిత్యం, సృజన నీలోని అద్వితీయతను వెలికి తీస్తాయి

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక, సంస్కృతి గ్లోబల్‌ స్కూల్‌ కలిసి నిర్వహిస్తున్న ఈ సాహిత్యోత్సవంలో పాల్గొంటున్న రచయితలకు, చిన్నారి రచయితలకు నా స్వాగతం.

మిత్రులారా, పిల్లలారా!

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏడేళ్ళు పూర్తి చేసుకుని ఎనిమిదవ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా బడిపిల్లల్నీ, రచయితల్నీ ఒకచోట చేర్చి ఒక కార్యశిబిరం నడపబోతున్నామనీ, దాన్ని ప్రారంభించడానికి రమ్మనీ మల్లీశ్వరిగారు నన్ను పిలిచినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. సంస్కృతి గ్లోబల్‌ పాఠశాల అయిదేళ్ళ కిందనే ఇటువంటి ప్రయత్నం మొదలుపెట్టారనీ, ఇది రెండవ సదస్సు అని తెలిసినప్పుడు కూడా చాలా సంతోషం కలిగింది. ఇటువంటి ప్రయోగాలు నిజానికి విరివిగా, ఏడాది పొడుగునా, రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ జరగవలసినవి.

చదువు, సాహిత్యం వేరు వేరు కావు. ఒకప్పుడు మన గురుకులాల్లో విద్య అంటే కొన్ని ఉత్తమ సాహిత్యకృతుల్ని పిల్లలకు బోధించడంగానే ఉండేది. మన దేశంలో ఆధునిక విద్య మొదలై, పాఠశాల అనే ఒక సంస్థ ఏర్పడి, వార్షిక సిలబస్‌, కరికులం వంటివి వచ్చాక కూడా భాషాబోధనలో సాహిత్యానికి పెద్ద పీట ఉంటూనే వచ్చింది. కేవలం చదవడం మాత్రమే కాదు, పిల్లలు తమంత తాము రచనలు చెయ్యడానికీ, కళారూపాలు సాధన చెయ్యడానికీ, స్కూల్‌ టైమ్‌ టేబుల్‌ లో సృజనాత్మక కార్యక్రమాలు అనే అంశం మీద ప్రతి రోజూ ప్రతి తరగతికీ కనీసం ఒక పీరియడేనా కేటాయించాలని కూడా నేషనల్‌ కరికులం ఫ్రేమ్‌ వర్క్‌ చెప్తున్నది.

నేను తాడికొండలో చదువుకున్నప్పుడు మా ప్రిన్సిపాలుగారు పాఠశాలలో స్టూడెంట్‌ క్లబ్బులు ఏర్పాటు చేసి ప్రతిరోజూ మధ్యాహ్నం ఒక గంటపాటు క్లబ్‌ యాక్టివిటీస్‌ నడిపేవారు. అందులో సైన్స్‌ క్లబ్‌, స్పోర్ట్స్‌ క్లబ్‌ మొదలైనవాటితో పాటు రైటర్స్‌ క్లబ్‌ కూడా ఉండేది. నేను అదిలాబాదు జిల్లా గిరిజన సంక్షేమాధికారిగా పనిచేసినప్పుడు గిరిజన సంక్షేమ పాఠశాలలకి ఒక వార్షిక ప్రణాళిక రూపొందించినప్పుడు తాడికొండ అనుభవాలు ఆధారంగా ఆ ప్రణాళికలో ప్రతి రోజూ గంటన్నర సమయం క్లబ్బు యాక్టివిటీస్‌కీ, కామన్‌ యాక్టివిటీస్‌కి కేటాయించాను. పిల్లలంతా తరగతి వారీగా కాక క్లబ్బుల వారీగా వివిధ క్లబ్బుల్లో చేరి రకరకాల కార్యక్రమాలు చేస్తారు. ఆ తర్వాత వాళ్ళంతా ఒకచోట చేరి వివిధ క్లబ్బుల్లో చేసిన కార్యక్రమాల్ని అందరిముందూ ప్రదర్శిస్తారు. ఇప్పటికి ముప్పై ఏళ్ళ కింద రూపొందిన ఆ ప్రణాళికలో రాసుకున్నట్టే ఆప్పట్లో ఆ కార్యక్రమాలు జరగడం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. సరైన మార్గదర్శకత్వాన్ని ఇవ్వగలిగితే పాఠశాలలు సృజన కేంద్రాలుగా విలసిల్లడానికి ఉత్సాహం చూపిస్తాయని అర్థమయింది.

కాని గత రెండు దశాబ్దాలుగా మన పాఠశాలల తీరుతెన్నులు మారిపోయాయి. ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ చదువులకి పిల్లల్ని సంసిద్ధం చెయ్యడమే పాఠశాలల ముఖ్య ప్రయోజనం అని తల్లిదండ్రులు భావించడం మొదలుపెట్టాక, పాఠశాలల్లో సృజన వెనకబడిపోయింది. ఒక్క సాహిత్యం మాత్రమే కాదు, ఆటలు, పాటలు అన్నీ కనుమరుగైపోయాయి. కాని రీసెర్చ్‌ ఏం చెప్తోందంటే రాయడం, రాసే నైపుణ్యాలు నేర్చుకోవడం అన్నిటికన్నా ముందు సైన్స్‌ ఎడుకేషన్‌కి ఎక్కువ అవసరం అని. సైన్సులో సమానంగా ప్రతిభ చూపగలిగిన ఇద్దరు విద్యార్థుల మధ్య ఒక్కరినే ఎంచుకోవలసి వస్తే అది వారి సైన్స్‌ మార్కుల్ని బట్టి కాక, వారి భావప్రసార నైపుణ్యాల్ని బట్టి ఎంచుకుంటున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు, ఒక ఇంజనీరుగా, సైంటిస్టుగా, సాంకేతిక నిపుణుడిగా నువ్వు రూపొందించే కొత్త ప్రొడక్ట్‌, కొత్త సాఫ్ట్‌ వేర్‌, కొత్త యాప్‌- ఏదైనా గానీ, తక్కిన వాటిమీద మిన్నగా ఉండాలంటే అది సృజనాత్మకంగా ఉన్నత స్థాయిలో ఉండాలి. అంతిమంగా నీ సృజనాత్మకత ఒక్కటే నిన్ను తక్కినవారి నుంచి వేరు చేసి నిలబెడుతుంది. నువ్వు ఎంత సృజనాత్మకంగా ఉంటే అంత అద్వితీయురాలుగా ఉంటావు.

అద్వితీయత అంటే ఏమిటి? అంటే నువ్వు నీ తోటివారికన్నా భిన్నంగా ఉన్నావని పట్టిచ్చే గుణం. ఈ లోకంలోకి ప్రవేశించిన ప్రతి ఒక్క శిశువూ తనదే అయిన ఒక అద్వితీయతను వెంటపెట్టుకుని వస్తుంది. అదేమిటో తెలుసుకోవడమే విద్య. దాన్నే మన పెద్దవాళ్ళు ‘నిన్ను నువ్వు తెలుసుకో’ అన్నారు. సాహిత్యవేత్తలు దాన్ని ఆత్మావిష్కరణ అంటారు. నీలో నీదే అయిన ఆ ప్రత్యేక లక్షణాన్ని నువ్వు గుర్తుపట్టుకోవాలి. దాని ఆధారంగా నీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఆ ప్రయాణానికి సాహిత్యం, సృజనాత్మక కార్యకలాపం సాయం చేసినంతగా మరేమీ సహకరించలేవు. ఈ రోజు ఇక్కడ మీతో గడపబోతున్న రచయితలు తమలోని ఆ అద్వితీయతను గుర్తుపట్టగలిగారు కాబట్టే వాళ్ళు రచయితలుగా మారారు. మీముందుకు వచ్చారు.

సాహిత్యం అంటే ఏమిటి? చదవడం: పుస్తకాల్నీ, ప్రపంచాన్నీ. చదివినదాని గురించి నలుగురితో మాట్లాడుకోవడం, మీలో కలుగుతున్న భావాలను, ఆవేశాలను పైకి చెప్పటానికి ప్రయత్నించడం. వీటివల్ల మీకు మీరు మరింత బాగా దగ్గరవుతారు. సమాజానికీ దగ్గరవుతారు. మిమ్మల్ని మీరు స్పష్టంగా చూసుకోగలుగుతారు. నిజానికి ఈ అవసరం పూర్వకాలం కన్నా ఇప్పుడు మరింత అత్యవసరంగా మారింది. ఎందుకంటే పూర్వం నలభై యాభై ఏళ్ళ కిందట మేమేదైనా పుస్తకం చదివితే దాన్ని అర్థం చేసుకోవడానికీ, దాని గురించి మాట్లాడుకోడానికీ చాలా వ్యవధి ఉండేది. ఒక సినిమా చూస్తే మా పల్లెల్లో కనీసం ఆరునెలల పాటు ఆ సినిమా గురించి మాట్లాడుకునేవాళ్ళు. ఏ పండగలకో, తిరణాలకో మాత్రమే నాటకాలు వేసేవారు, చూసేవాళ్ళం. కాబట్టి చూసిందీ, విన్నదీ, చదివిందీ మాలోకి ఇంకడానికీ, నెమరువేసుకోడానికి మాకు చాలా సమయం ఉండేది. కాని ఇప్పుడు మనం సర్ఫింగ్‌ యుగంలో ఉన్నాం. ఇక్కడ మనం టెలివిజన్‌ మీద ఏ ఒక్క ఛానల్‌ కూడా పట్టుమని పదినిమిషాలు కూడా చూడని కాలం. మన కళ్ళముందు మనుషులూ, పాత్రలూ త్వరత్వరగా కదిలిపోతున్న యుగం. దీనివల్ల అన్నిటికన్నా ముందు మన వ్యక్తిత్వవికాసానికి ఎక్కువ ఇబ్బంది కలుగుతోంది. మనకి దేనిపట్లా నిశ్చయమైన అభిప్రాయాల్ని ఏర్పరచుకునే వ్యవధిలేకపోతోంది. కాబట్టి పిల్లలు గాని, యువతీయువకులు గాని ఒక విధమైన liquid identity లోనే ఎక్కువ కాలం గడపవలసి వస్తున్నది. నువ్వెవరు? ఎందుకు పుట్టావు? నీ అద్వితీయ లక్ష్యం ఏమిటి? ఈ సమాజానికి నువ్వు మాత్రమే ఇవ్వగల కాంట్రిబ్యూషన్‌ ఏమిటి? వీటి గురించి ఆలోచించడానికి మీకు వ్యవధి లేదు, మీ తల్లిదండ్రులకి వ్యవధి లేదు, కాబట్టి మీ పాఠశాలలకి కూడా వ్యవధి లేదు.

ఇటువంటి పరిస్థితుల్లో పెరిగిపెద్దవారయి సమాజంలో అడుగుపెడుతున్న యువతీయువకులు ట్రాలర్లు కాకుండా ఎలా ఉంటారు? మన సోషల్‌ మీడియా చూడండి. మీరు మీలోని సృజనాత్మకతను వ్యక్తపరుచుకోడానికి అంతకన్నా గొప్ప ప్లాట్‌ ఫాం మరొకటి లేదు. కాని అత్యధిక సంఖ్యాకులైన యువతీ యువకులు ఆ మీడియాలో చేరి ఏం చేస్తున్నారో చూడండి. తమకి తెలీకుండానే వివిధ రకాల విచ్ఛిన్నకర, విద్వేషవాద శక్తుల ప్రభావానికి లోనవుతున్నారు. ట్రాలింగ్‌ తో, హేట్‌ స్పీచ్‌ తో ఏదో ఒక సినిమాకో, రెలిజియన్‌ కో, రాజకీయ పార్టీకో సబ్‌ స్క్రైబర్లు గా మారుతున్నారు.

దీనికి కారణం liquid identity ని దాటి పిల్లల వ్యక్తిత్వాలు crystallize కాకపోవడం. మీరంతా టీనేజి పిల్లలు. మేమంతా ఆ దశ దాటి వచ్చాం కాబట్టి మీలో ఆ వయసులో ఎటువంటి కుతూహలం వెల్లివిరుస్తూ ఉంటుందో మాకు తెలుసు. ప్రపంచం గురించి ఎన్ని ప్రశ్నలు చెలరేగుతూ ఉంటాయో తెలుసు. నిజానికి మీ వయసులో ఈ ప్రపంచం పట్ల కలిగే innocent love మళ్ళా ఎప్పటికీ సాధ్యం కాదు. నిష్కళంకంగానూ, నిష్కారణంగానూ మీలో పొంగిపొర్లే ఆ ప్రేమని గుర్తుపట్టాలంటే మీకు సాహిత్యం, సృజనాత్మక కార్యకలాపం చేసే మేలు అంతా ఇంతా కాదు. మా టీనేజిలో మా అన్నదమ్ములో, అక్కచెల్లెళ్ళో, గురువులో, మిత్రులో ఎవరో మా పక్కన నిలబడి మాలోని సృజనాత్మక ప్రతిభని గుర్తుపట్టి ప్రోత్సహించబట్టే మేము ఇంతదూరం రాగలిగాం.

మీరు నిజంగా చాలా అదృష్టవంతులు. ఒక పాఠశాల మొత్తం ఇప్పుడు మీ వెనక నిలబడి ఉంది. ఇంతమంది రచయితల్ని మీముందుకు తీసుకు వచ్చింది. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. నాకు తెలుసు, ఈ వర్క్‌ షాప్‌ కి రమ్మని పిలవగానే మీలో ఎన్నో ప్రశ్నలు, సందేహాలు రేకెత్తి ఉంటాయి. మా ఇంట్లో ఎవరూ చదువుకున్నవాళ్ళూ, రాసేవాళ్ళూ లేరే, అయినా కూడా నేను రాయవచ్చా?నాకు రాయడం నిజంగా వచ్చునా? అసలు నేను రచయితనేనా? రాయడానికి ప్రత్యేకమైన రూల్స్‌ ఉంటాయా? ఉంటే అవి నాకు ఎలా తెలుస్తాయి? నేను తప్పులు రాస్తే ఎలా? నేను రాసింది మంచిదో కాదో ఎవరు చెప్తారు? రాయడానికి ఏవైనా ఐడియాలు ఉండాలా? ఎలాంటి ఐడియాలూ లేకపోతే, రాకపోతే రాయకూడదా? ఈ ప్రశ్నలు, ఇలాంటివే ఎన్నో ప్రశ్నలు మీరిప్పటిదాక ఎవరినీ అడగకలేకపోయినవి ఉంటాయి. ఈ వర్క్‌ షాపు లో మీకు మెంటర్లుగా తోడునిలబడబోతున్న రచయితల్ని ఆ ప్రశ్నలు అడగండి. వారితో మనసు విప్పి స్వేచ్ఛగా మాట్లాడండి.

రాయడానికి, నాకు తెలిసి, ఏ ప్రత్యేక అర్హతా అక్కర్లేదు. మిమ్మల్ని మీరు ఎక్స్‌ ప్రెస్‌ చేసుకోవాలన్న బలమైన కోరిక ఒక్కటుంటే చాలు. కాని చదవడం మాత్రం తప్పనిసరి. ఎన్ని పుస్తకాలు వీలైతే అన్ని పుస్తకాలు చదవండి. మేము పరీక్షలకు చదువుకోడానికే సమయం చాలటం లేదు, ఈ పుస్తకాలు ఎప్పుడు చదవాలి అంటారా? రోజూ అరగంట కేటాయించుకోండి. అది కూడా దొరక్కపోతే ఆదివారం ఒక గంటనో, రెండుగంటలో కేటాయించుకోండి. ప్రతి ఆదివారం కనీసం గంట సేపేనా మీ దగ్గర లైబ్రరీలో గడపండి.

మీరు స్క్కూలో చదువుకునే చదువు మీరు డిగ్రీ తెచ్చుకోడంతో, ఉద్యోగం సంపాదించుకోవడంతో అయిపోతుంది. కాని సాహిత్యవిద్య జీవితం పొడుగునా నడుస్తుంది. అది life long learing. జీవితకాల అభ్యాసకులు ఈ సమాజం నుంచి ఎంతో తీసుకోగలుగుతారు, తిరిగి మరెంతో ఇవ్వగలుగుతారు అని గుర్తుపెట్టుకోండి.

అటువంటి గొప్ప ఆకాంక్షతో ఈ కార్యశాల ప్రారంభిస్తున్నాను.

4-2-2023

5 Replies to “సాహిత్యం, సృజన నీలోని అద్వితీయతను వెలికి తీస్తాయి”

 1. మువ్వ
  ఆసక్తిని
  అనుభవం వెన్ను తడితే
  అద్వితీయమౌతూ

 2. ఇలాంటి ప్రయత్నాలకు మీ వంటి విజ్ఞల తోడు ఉండడం కూడా పిల్లల అదృష్టమే సార్.

 3. మీ మార్గ దర్శకత్వం ద్వారా నాడు అంటే ముప్పదేళ్ళ క్రితం AHS,keslapur లో సంఘ విజ్ఞాన సభ ద్వారా విద్యార్థులకు ప్రయోజనం కలిగించే ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము. మాసాంతపు వేడుకల్లో భాగంగా మొట్టమొదటి సిల్వర్ మెడల్ గెలుచుకున్న మా పాఠశాలలో “భారత దేశం పేద ప్రజలు నివసిస్తున్న సంపన్న దేశం”అనే విషయం పై ఒక రూపకాన్ని విద్యార్థినులచేత నిర్వహించాము. జిల్లా కలెక్టర్ పాల్గొన్న ఆ సమావేశం లో మేము నిర్వహించిన కార్యక్రమానికి ఎన్నో ప్రశంసలు పొందడం నాకు ఒక ముఖ్యమైన మధురమైన అనుభూతి.అప్పటి DEO agency , ప్రముఖ విద్యావేత్త prof.శేషగిరి రావు గారి అభినందనలు పొందడం కూడా ఎప్పటికీ మరచిపోలేము.
  ఆనాటి ఆ ప్రశంసల వెనుక మీ ఆలోచనలే కదా కారణం sir.
  ధన్యవాదాలు.

Leave a Reply

%d