జయగీతాలు-20

పాతనిబంధన గ్రంథంలోని Psalms నుంచి జయగీతాలు పేరిట నేను చేసిన అనువాదాల చివరి భాగం ఇది. మొత్తం 150 గీతాలకు గాను, 59 గీతాలు అనువాదం చేసాను. ప్రధానంగా 10 లేదా 12 ద్విపదలకు మించని గీతాల్నే ఎన్నుకోవడంతో సుదీర్ఘమైన గీతాల్ని అనువాదం చెయ్యలేదు. కాని పాతనిబంధన కాలం నాటి భక్తి గీతాల స్వరూప స్వభావాల్ని తెలుసుకోవడానికి ఈ సముచ్చయం చాలనుకుంటున్నాను. మరీ ముఖ్యంగా, సామగీతాలు అనగానే అందరికీ గుర్తొచ్చే 23 వ కీర్తన, 137 వ కీర్తన ఇందులో ఉన్నాయి కాబట్టి, ఆ గీతాల సారాంశం ఈ అనువాదాల ద్వారా పరిచయమయినట్టే అనుకుంటున్నాను.

తెలుగులో అచ్చయిన మొదటి గ్రంథం బైబిలు అని మనకు తెలుసు. పాతనిబంధనను పద్ధెనిమిదో శతాబ్దంలో తెలుగు చేసిన తొలితరం అనువాదకులు హీబ్రూ భాషలోని పవిత్రతకూ, కింగ్ జేమ్స్ వెర్షన్ లోని సూటిదనానికీ సమానమైన తెలుగును అన్వేషించడంలో చేసిన కృషి నిరుపమానమైనది. కాని అనువాదాలు ప్రతి వందేళ్ళకూ కాదు, ప్రతి పదేళ్ళకూ ఒకసారి రావలసి ఉంటుంది. గత రెండువందల ఏళ్ళల్లో తెలుగు భాష స్వరూప స్వభావాలు ఊహించలేనంతగా మారిపోయాయి. మరీ ముఖ్యంగా, తెలుగులో ఆధునిక కవిత్వం వికసించిన తరువాత, ఆ భాషా వికాసాన్ని దృష్టిలో పెట్టుకుని బైబిలుకు మరికొన్ని కొత్త అనువాదాలు వచ్చి ఉండవలసింది.

చాలాకాలం కిందట నేను రాజమండ్రిలో ఉండగా ఒక కొత్త అనువాదం చూసాను. పాతనిబంధనను ‘కొత్త ఒప్పందం’ పేరిట చేసిన అనువాదం. కాని నా దురదృష్టం కొద్దీ ఆ పుస్తకం పోగొట్టుకున్నాను. ఇన్నాళ్ళ తరువాత అటువంటి కొత్త అనువాదమేదైనా నాకు దొరికితే ఈ గీతాల్ని అనువదించడం సులభంగా ఉండేది కదా అనుకున్నాను

కాని ఆశ్చర్యం! నా చేతుల్లోకి మరొక సరికొత్త అనువాదం వచ్చింది. ఈ గీతాల్ని అనువదించడానికి సహకారిగా ఏ గ్రంథాలైనా దొరుకుతాయేమోనని సికింద్రాబాదు లో ఒక పుస్తకాల షాపులో అడుగుపెట్టినప్పుడు, అక్కడి పిల్లవాడు, బైబిలు ప్రచురణల ఎగ్జిబిషను ఒకటి నడుస్తూ ఉందనీ అక్కడ నాకు ఉపకరించే గ్రంథాలు దొరకవచ్చుననీ చెప్తే, ఆ మధ్యాహ్నవేళ వడివడిగా ఆ ఎగ్జిబిషన్ కి పరుగెత్తాను. అక్కడ ‘వ్యాఖ్యాన సహిత పవిత్ర గ్రంథం’ కనిపించింది. గ్రేస్ మినిస్ట్రీస్ వారూ, ఇండియా బైబిలు లిటరేచర్ వారూ కలిసి ప్రచురించిన ఈ వ్యాఖ్యాన సహిత పవిత్ర గ్రంథం 1993 లో మొదటిసారి ప్రచురించబడింది అనీ, పదిహేడవ ముద్రణ 2022 లో వచ్చిందనీ తెలిసింది. అన్నిటికన్నా ఆశ్చర్యమేమిటంటే ఈ కొత్త అనువాదాన్ని చేసింది ఒక అమెరికన్. జార్జి రాబర్ట్ క్రో (1924-2007) అనే ఆ అమెరికన్ హీబ్రూ, గ్రీకు బైబిలు మూలాగ్రంథాలనుంచి ఈ తెలుగు అనువాదాన్ని రూపొందించాడు. తెలుగు అనువాదం పూర్తిచేసిన రెండువారాలకి ఆయన పరమపదించాడు. ‘బాబ్ క్రో దేవుని పొలంలో విత్తబడిన గోధుమ గింజ. అత్యుత్తమంగా ఫలించారు’ అని గ్రేస్ మినిస్ట్రీస్ పుస్తకానికి రాసిన ముందుమాటలో ఆయనకు నివాళి అర్పించారు.

బాబ్ క్రో అనువాదం నన్ను అడుగడుగునా ఆశ్చర్యపరుస్తూ వచ్చింది. ఎన్నో పదాలకు ఆయన సాధించుకున్న తెలుగు సమానార్థకాలు దైవస్ఫురణ తప్ప మరేమీ కాదని అనిపించింది. తెలుగు మాతృభాషగా, అపారమైన తెలుగు సాహిత్యం చదివి, అనువాద రంగంలో ఇరవై ఏళ్ళకు పైగా కృషి చేస్తున్న నాకు స్ఫురించని ఎన్నో అద్భుత పదప్రయోగాలు, వాక్యసంయోజనాలు ఆయన అనువాదంలో కనబడి నన్ను విభ్రాంతికి గురిచేసాయి. భాష, ఒక నైపుణ్యం కన్నా ముందు, ఒక భావావేశం అనీ, దివ్యావేశం అనీ నాకు మరో మారు ఎరుకపడింది. స్వర్గస్థుడైన ఆ భగవద్భక్తుడికి ఈ సందర్భంగా నమోవాకాలు చెల్లించుకుంటున్నాను.

చదివినప్పుడు చాలా సరళంగానూ, సూటిగానూ కనిపిస్తూ అనువదించడానికి పూనుకున్నప్పుడు కొత్త కొత్త సమస్యలు కనిపించడం ప్రాచీన గ్రంథాలు, ముఖ్యంగా దైవగ్రంథాలు మనకు పెట్టే పరీక్ష. వేదసూక్తాల విషయంలో ఇది ఎన్ని అభిప్రాయభేదాలకు తావిచ్చిందో మనకు తెలుసు. పాతనిబంధనలోని కీర్తనల విషయంలో కూడా ఈ సమస్య జటిలంగా ఉందని నాకు అనువాదం మొదలుపెట్టేక తెలిసింది. హీబ్రూగానీ, గ్రీకు గానీ రాని నాబోటి వాడికి, ఆ కీర్తనలోని కొన్ని పదప్రయోగాల, కొన్ని వాక్యనిర్మాణాల అంతరార్థం అంత సులువుగా బోధపడదు. ఇంగ్లిషు బైబిలు అక్కడ ఏ విధంగానూ సహకరించదు. ఆ సమస్యనుంచి నన్ను బయటపడేసిన గ్రంథం డబ్ల్యు.డబ్ల్యు. నార్టన్ వారు ప్రచురించిన The Book of Psalms. ఆ అనువాదకుడు Robert Alter హీబ్రూ పండితుడు. కీర్తనలకు అనువాదంతో పాటు సమస్యాత్మకమైన ప్రతి ఒక్క పదానికీ ఆయన విపులమైన వివరణలు అందించాడు. అందుకనే ఆ అనువాదాన్ని సీమస్ హేనీ వంటి మహాకవి Godsend అని అభివర్ణించాడంటే ఆశ్చర్యం అనిపించదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న తెలుగు బైబిలు అనువాదాల్లో కీర్తనల అనువాదంలో స్పష్టత కొరవడిన తావుల్లో నా అనువాదం స్పష్టతను సాధించుకుంటే అందుకు కారణం Alter అనువాదమే అని చెప్పగలను.

నా తొలి ఉపాధ్యాయిని మా శరభవరం పంచాయితీ సమితి ఎలిమెంటరీ స్కూల్లో మాకు చదువుచెప్పిన వజ్రమ్మ పంతులమ్మగారు. ఆమె నిజమైన క్రైస్తవురాలు. ఆమె ఇంట్లోనే మొదటిసారి నేను Last Supper బొమ్మ చూసాను. ఆమె మాకు పాఠాల్తో పాటు మహాభారతం కూడా చెప్పారు. పాతనిబంధనలోని యోసేపు, అతడి సోదరుల కథ కూడా చెప్పారు. కాని ప్రతిరోజూ బడి తెరవగానే మాతో చేయించిన ప్రార్థన ఏ సగుణ దేవతా ప్రార్థన కాదు. ‘నమస్తే సతేతే జగత్కారణాయ, నమస్తే చితే సర్వలోకాశ్రయాయ’ అంటో మొదలయ్యే ఒక సర్వేశ్వర ప్రార్థన. ఆ దేవుడు ఏ మతానికీ చెందనివాడు, అన్ని మతాలవారూ స్తుతించదగ్గవాడు. ఈ గీతాల్ని అనువదిస్తున్నప్పుడు, ఇందులో, గీతకర్తలు, పదే పదే ప్రభువనీ, దైవమనీ, భగవంతుడనీ పిలుస్తున్నది ఆ జగత్కారణుణ్ణే, ఆ సర్వలోకాశ్రయుణ్ణే అని నాకు తెలుస్తూ ఉన్నది. ఏమీ తెలియని ఆ పసివయసులో ఆ సర్వేశ్వర స్ఫూర్తిని నాకు కలిగించిన మా వజ్రమ్మ పంతులమ్మగారి దివ్యస్మృతికి ఈ గీతాలు సమర్పిస్తున్నాను.

ఈ గీతాలను ఇట్లా అనువదించడానికి కారణమైన ఫాదర్ అలెగ్జాండర్ గారికి సవినయ నమస్సుమాంజలి.

149


జయగీతంపాడండి ప్రభువుకి
ప్రభువుకోసం సరికొత్త గీతం పాడండి
దేవతాబృందం మధ్య ఆయన్ను ఎలుగెత్తి స్తుతించండి

నా దేశం తన సృష్టికర్తని తలుచుకుని సంతోషమొందునుగాక
దైవనగరజనులు తమ రాజాధిరాజుతలపుల్లో తేలియాడుదురుగాక!
నాట్యమాడుతూ ఆయన్ని తలచుకుందురుగాక
తంబురసితారనాదాలతో కీర్తించుదురు గాక
తన ప్రజలని చూసి ప్రభువు పరవశిస్తాడు
దీనజనుల్ని తన రక్షణతో అలంకరిస్తాడు
సజ్జనులంతా ఉప్పొంగిపోతారు
వాళ్ళింకా తమ శయ్యలమీంచి లేవకముందే
పాటలు అందుకుంటారు

తమని బాధించిన వారిమీద ప్రతీకారానికి
తమని హింసించినవారిని శిక్షించడానికి
తమ రాజుల్ని సంకెళ్ళతో బంధించడానికి, రాజబంధువుల్ని ఇనుపగొలుసుల్తో కట్టిపడెయ్యడానికి
వాళ్ళకి విధించబడ్డ తీర్పుల్ని అమలు చెయ్యడానికి
తమ చేతుల్లో రెండంచులా పదునైన కరవాలాల్తో
వారి గళాల్లో భగవంతుడి స్తుతి మార్మ్రోగుగాక

దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరికీ మనం ఇవ్వగల గౌరవమిది
పాడండి జయగీతాలు ప్రభువుకి.

150


ఆలపించండి జయగీతం ప్రభువుకి
తన రక్షణాలయంలో కొలువైన ప్రభువును స్తుతించండి
మహోన్నత గగనసీమలో నెలకొన్న ప్రభువుని స్తుతించండి
ఆయన మహామహిమలకు స్తుతించండి
ఆయన మహోదార్యాన్ని, మహోత్కృష్టతను స్తుతించండి.

దుందుభినాదాలతో స్తుతించండి
వీణావేణు వాద్యాలతో స్తుతించండి
తంబురతో, నాట్యంతో స్తుతించండి
తప్పెట్లతో, తాళాలతో స్తుతించండి
ఘనరాగపంచకంతో స్తుతించండి
ఊపిరితీస్తున్న ప్రతి జీవీ, ప్రతి ఒక్కరూ ప్రభువుని స్తుతించాలి.
స్తుతించండి, ప్రభువుని, స్తుతించండి.

2-2-2023

3 Replies to “జయగీతాలు-20”

 1. జయ గీతాలకు జయజయహే
  వజ్రమ్మ పంతులమ్మ గారు అమరులయ్యేరు. సర్వేశ్వరుడి కృపకు ఇంతకన్న సాక్ష్యం ఏం కావాలి

 2. మీదొక సత్యసాహిత్య ద్రష్టానుభవసారం
  భక్తి ప్రపత్తి పూరిత ఈశ్వరోపాసనం
  కుంచిత కుడ్యాతీత విశ్వమానవ కల్యాణ కామనం

  చదివించిరి మిము గురువులు
  చదివితిరీరెల్ల శాస్త్ర సంపుటములనున్
  చదివిన చదువుల సారము
  పదుగురికిటు పంచి పెట్టు పరిణతినెంతున్

Leave a Reply

%d bloggers like this: