
141
దావీదు కృతి
ప్రభూ, మొరపెట్టుకుంటున్నాను, త్వరగా రా
నిన్ను పిలిచినప్పుడు నా మొరాలకించు
నా ప్రార్థన నీ సన్నిధిలో ఒక అగరుధూపంగా వెలగనివ్వు
నేను చేతులు పైకెత్తితే అదే ఒక నైవేద్యంగా భావించు.
ఓ ప్రభువా, నా నోటికి బీగం బిగించు
నా పెదాల దగ్గర ఒక కావలివాణ్ణి నియమించు
నా మనసు చెడుతోవలవైపు మొగ్గకుండుగాక
క్రూరుల్తో, దుర్జనుల్తో చెలిమికోసం
నేను చెడునడతలో మునిగిపోకుందునుగాక
వారి పిండివంటల్ని రుచిచూడకుందును గాక!
సత్యవంతుడు నన్ను దండించాడా- అది దయామయ చర్య
అతడు నన్ను మందలించనీ- అది నా నెత్తిన పరిమళ ద్రవ్యం
నా శిరసువంచి మరీ వాటిని స్వాగతిస్తాను
కాని నా ప్రార్థనలెప్పుడూ చెడు పనులు చేసేవాళ్ళని ధిక్కరిస్తాయి
కొండకొమ్ముమీంచి వాళ్ళ న్యాయాధీశుల్ని కిందకు తోసేసినప్పుడు
అప్పుడు వాళ్ళు నా మాటలు వింటారు, అవి ఆహ్లాదకారకాలు
నాగళ్ళతో నేలదున్ని చాళ్ళు తీసినట్టుగా
మా ఎముకలు మృత్యుద్వారం దగ్గర చెల్లాచెదురవుతాయి.
కాని నా చూపులెప్పుడూ నీ వైపే, ఓ దైవమా, నా ప్రభూ
నిన్నే శరణు వేడుతున్నాను, నా ప్రాణం తోడెయ్యకు.
వాళ్ళు నా కోసం పన్నిన ఉచ్చునుంచి, పన్నాగాలనుంచి
నన్ను తప్పించు
దుర్మార్గులు తాము తవ్వుకున్న గోతిలో తామే పడాలి
నేను సురక్షితంగా ముందుకుపోవాలి.
142
గుహలో దాక్కున్నప్పుడు దావీదు రాసుకున్న కవిత, ఒక ప్రార్థన
ఎలుగెత్తి మరీ ప్రభువుని పిలుస్తున్నాను
గొంతెత్తి మరీ ఆయనని బతిమాలుకుంటున్నాను
నా విన్నపాలు విప్పి పరుచుకుంటాను
కడగండ్లు ఏకరువు పెట్టుకుంటాను
నా ప్రాణం డస్సిపోయినప్పుడు
నా దారి నీకు తెలుసు.
నేను నడుస్తున్న దారిలో
వాళ్ళో ఉచ్చు పన్నారు
పక్కకు తిరిగి చూడు
నన్ను పట్టించుకునే వాళ్లెవరూ కనిపించరు
తలదాచుకోడానికి తావులేదు
నాకోసం పరితపించేవాళ్లూ లేరు
ఓ ప్రభూ, నీకే మొరపెట్టుకుంటున్నాను
నువ్వే నా దిక్కు
సజీవమానవప్రపంచంలో నాకు దక్కిన వాటా నువ్వు
నా మొరాలకించు
నన్ను హింసిస్తున్నవాళ్ళనుంచి విడిపించు
వాళ్ళు నా కన్నా బలవంతులు
నన్ను చెరసాలనుంచి బయటపడెయ్యి
అప్పుడు నీముందు కీర్తన పాడగలుగుతాను
నీ అనుగ్రహం అపారంగా వర్షించినప్పుడు
నా చుట్టూ నీతిమంతులు గుమికూడతారు.
1-2-2023
చాలా మంది సత్యకాముల ఆవేదన దావీదు గీతాల్లో నిండారా ఉన్నది. అనివార్య దుస్థితి నిండి
రక్షించగలవాడు ఈశ్వరుడొక్కడే.’ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ’.అన్న భావం గీతాల్లో ప్రస్ఫుటంగా కన్పిస్తున్నాయి. గజేంద్రుని మొర ‘నీవే తప్ప నితఃపరంబెరుగ మన్నించందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద -లావొక్కింతయు లేదు అన్నట్లుగా దావీదు ప్రార్థనా గీతాలు విశ్వసత్యైకభావోద్దీప్తములు కనుకనే సామగీతాలు మిమ్మల్ని ఇంతగా ఆకట్టుకున్నాయి..
Reading time may be one minute but gulping and digesting time is more.
ఎంత బాగా చెప్పారు! అవును. దావీదు కూడా ఒక సత్య కామ జాబాలి.
నమస్సుమాంజలి