
133
యాత్రా కీర్తన, దావీదు కృతి
అన్నదమ్ములు కలిసిమెలిసి బతకడంలో
ఎంత సుఖమో తెలుసుకో!
అది నెత్తిన పోసిన పరిమళ తైలంలాంటిది
ముఖం మీంచి, గడ్డం మీంచి
ఋషీశ్వరుడి గడ్డం మీంచి
అతడి అంగీ కొంగువరకు కారుతుంటుంది
అది హెర్మోను పర్వతమ్మీద కురిసిన మంచులాగా
బీడునేలమీదకి ప్రవహిస్తుంది.
భగవంతుడి ఆశీర్వాదంలాగా
తరుగులేని జీవం అది.
134
యాత్రా కీర్తన
ప్రభు నివాసప్రాంగణంలో రాత్రంతా మేలుకున్న
ప్రభుసేవకులారా! రండి, ప్రభువుని స్తుతించండి.
పవిత్రస్థలాన్ని నతిస్తూ చేతులు చాపండి
ప్రభువుని స్తుతించండి.
భూమ్యాకాశాల్ని సృజించిన భగవంతుడు
తన నగరం నుంచి మిమ్మల్ని తప్పక దీవిస్తాడు!
137
బేబిలోను జలాల దగ్గర
మన నగరాన్ని తలచుకుంటూ
తలవాల్చుకు కూచున్నాం, విలపించాం.
అక్కడ నిరవంజి చెట్లకొమ్మలకు
మన తంత్రీవాద్యాలు వేలాడదీసాం.
మనల్ని చెరబట్టినవాళ్ళు
అక్కడ తమకోసం మమ్మల్ని పాటలు పాడమన్నారు
మనల్ని హింసిస్తున్నవాళ్ళు తమ వినోదానికి
మన దేశం గురించి ఒక పాట పాడమన్నారు.
మనదికాని పరాయి నేలమీద
ప్రభుగీతాన్నెట్లా పాడగలం?
నా ఆనందాలన్నిటికన్నా పైన
నా నగరం ఉందని గుర్తుచేసుకోకపోతే
ఓ దైవనగరమా! నిన్ను నేను మర్చిపోతే
నా కుడిచెయ్యి తెలివి తప్పినట్టు.
నిన్ను నేను గుర్తుపెట్టుకోకపోతే
నా నాలుక అంగిట్లో అతుక్కుపోయినట్టు.
ప్రభూ, నా నగరం మీద
శత్రువులు దండెత్తిన ఆ రోజు, గుర్తుందా,
దాన్ని కూల్చెయ్యండి, కూల్చెయ్యండి
పునాదుల్తోటీ పెకలించండి అని అరిచారు వాళ్ళు.
ఓ బేబిలోను కుమారీ, నీకు వినాశనం తప్పదు
వాళ్ళు మమ్మల్ని పెట్టిన కష్టానికి
నీకు బదులిచ్చిన వాడు నిజంగా ధన్యుడు.
నీ బిడ్డల్ని తన చేతుల్లోకి తీసుకుని
రాళ్ళకేసి బాదినవాడు ధన్యుడు.
138
దావీదు కృతి
ప్రభూ, నీకు హృదయపూర్వక ధన్యవాదాలు
దేవతలముందు నీ గురించి గానం చేస్తాను
నీ పవిత్రాలయం ముందు శిరసువంచి మొక్కుతాను
నీ ప్రేమానుగ్రహాలకు కృతజ్ఞ్తగా నీ సంకీర్తన చేస్తాను
అన్నిటికన్నా మిన్నగా నువ్వు నీ పేరు నిలబెట్టుకున్నావు,
నువ్విచ్చిన మాట నిలబెట్టుకున్నావు
నేను నిన్ను పిలిచినప్పుడు నాకు బదులిచ్చావు
అప్పణ్ణుంచీ నా ఆత్మబలం ఇనుమడించింది.
ప్రపంచరాజ్యాధినేతలంతా నీకు ధన్యవాదాలు పలుకుతారు
ఎందుకంటే వాళ్ళకి కూడా నీ మాటలు వినబడ్డాయి
ప్రభు మహిమల్ని వారు ఘనంగా కీర్తిస్తారు
ప్రభుమహిమాతిశయం అటువంటిది
ఆయన సర్వోన్నతుడు, దీనుల్ని అక్కున చేర్చుకుంటాడు
గర్విష్టుల్ని దూరం పెడతాడు.
నేను కడగండ్ల మధ్య నడుస్తున్నా
నువ్వు నా బతుకుని కాచిరక్షించేవు
నా శత్రువుల క్రోధానికి నీ అరచెయ్యి అడ్డుపెట్టావు
నీ కుడిచేత్తో నన్ను పక్కకు తప్పించావు.
ప్రభువు నా మీద పెట్టుకున్న ఆకాంక్షలు నిజమవుతాయి
అచంచలమైన నీ ప్రేమ, ప్రభూ, కలకాలం నిలుస్తుంది
నీ చేతుల్తో సృజించినవాటిని ఎప్పటికీ వదిలిపెట్టకు
31-1-2023
ఈ గీతాలు అర్థం చేసుకోవడానికి ఇరాక్ లోని మెసపొటేమియా ప్రంతంలేగల బాబిలోన్ పట్టణ విశేషాలు క్రీస్తుపూర్వం నెబుచాడ్నెజ్జార్II జెరూసలేం నుండి యూదులను తెచ్చి అరశతాబ్దానికి పైగా బందీలుగా ఉంచిన వైనం చదివాను. క్రిస్టియన్ల పరంగా హిబ్రూల పరంగా వేరు వేరు కథనాలు ్నాయి. సద్దాం కాలం పాతకాలపు నిర్మాణాలను పునరుద్ధరించటం బైబిల్ టవర్ గురించి అనేక విషయాలున్నాయి.
చదువుతుంటే శ్రీశ్రీ చరణాలు గుర్తుకు రాక మానవు
‘ఏదేశ చరిత్ర చూసినా
ఏమున్నది గర్వకారణం
నరజాతి చరిత్ర సమస్తం
పరపీడన పరాయణత్వం’
ఈ నాలుగు వాక్యాలు చాలు ఆయనను చిరస్థాయిగా మహాకవిగా నిలిపేందుకు. మీ వల్ల కొత్త విషయాలవైపు చూసే అవకాశం దొరుకుతున్నందుకు కృతజ్ఞతలు.
‘తెలిసింది రేణువంత
వలసింది సింధువంత
ఇంకా ఈదటమే తెలియదు
ఆశ మాత్రం ఆకాశమంత’
ఈ గీతాల్లో ఉన్నది ఒక దైవార్తుడూ, ఒక దైవార్త జాతీను. ఆ దైవం ఆ జాతిని ఆ వ్యక్తిని ఇద్దరినీ సమానంగా అనుగ్రహిస్తున్నది. అందుకనే ఆ గీతాల్లో అంత శక్తి కనిపిస్తున్నది.