జయగీతాలు-17

124

యాత్రా కీర్తన, దావీదు కృతి


ప్రభువు మనవైపు లేకపోయుంటే-
నా దేశాన్ని బిగ్గరగా చెప్పమను-
ప్రభువు మన తోడుగా లేకపోయుంటే
శత్రువులు మనమీద విరుచుకుపడ్డప్పుడు
వాళ్ళు మనల్ని ప్రాణాల్తో దిగమింగేసేవారు
మనమీద వాళ్ళు ఆగ్రహంతో దండెత్తినప్పుడు
వరదలు మనల్ని ముంచెత్తి ఉండేవి
తుపాన్లు మనల్ని తుడిచిపెట్టేసి ఉండేవి
కోపంతో పరవళ్ళు తొక్కే జలాల్లో
మనం కొట్టుకుపోయి ఉండేవాళ్ళం.

వాటి కోరలకు చిక్కకుండా
మనల్ని కాపాడిన ప్రభువు
నిజంగా స్తుతిపాత్రుడు.
వేటగాళ్ళ ఉచ్చునుంచి
పక్షిలాగా బయటపడ్డాం
ఉచ్చు తెగిపోయింది
మనం తప్పించుకున్నాం

భూదిగంతాల్ని సృష్టించిన
ప్రభునామంలోనే మన రక్షణ ఇమిడి ఉంది.

125

యాత్రా కీర్తన


ప్రభువును నమ్మిన వాళ్ళు పర్వతంలాంటివాళ్ళు
దాన్నెవరూ కదల్చరేరు, అది సుస్థిరం, శాశ్వతం.
దైవనగరం చుట్టూ కొండలు పరుచుకున్నట్టు
ప్రభువు తన జనుల చుట్టూ పరివేష్టించాడు.
ఇప్పటికీ, ఎప్పటికీ.
నీతిమంతుల వాగ్దత్త వసుంధరమీద
దుర్జనుల రాజదండం నిలవజాలదు
చెడుపనులు చెయ్యడానికి
సత్యవంతులు చేతులు చాపకూడదని ప్రభువు తలపు.
ఎవరు మంచివారో వారికి మంచి చెయ్యి, ప్రభూ,
ఎవరు హృదయాల్లో సత్యవర్తనులో వారిని కరుణించు
కుటిలమైన దారులవైపు చూసేవాళ్ళకి కూడా
దుష్టుల్తో పాటే దండన పడుతుంది.
నా దేశానికి శాంతిలభిస్తుంది.

126

యాత్రా కీర్తన


దేవుడు తన నగరాన్ని విడిపించినప్పుడు
మనకి అదంతా ఒక కలలాగా తోచింది.
అప్పుడు మన పెదాలమీద చిరునవ్వులు పూసాయి
మన గళాలు కేరింతలు కొట్టాయి
ఆ దృశ్యం చూసి తక్కినరాజ్యాలు
ప్రభువు వాళ్ళకి తన మహిమ చూపించాడని చెప్పుకున్నాయి
ప్రభువు మనకోసం నిజంగా అద్భుతాలు చేసాడు
మనం సంతోషంతో పొంగిపోయాం.

దక్షిణ నదీ ప్రవాహ జలాల్లాగా
మమ్మల్ని మళ్ళీ చెరనుంచి తప్పించు.
అశ్రువుల్ని విత్తనాలుగా జల్లుకున్నవాళ్ళకి
ఆనందాన్ని పంటగా అనుగ్రహించు
కన్నీళ్ళు నారుగా నాట్లు నాటేవాళ్ళు
సంతోషం గంపలకెత్తుకుని తిరిగిరానివ్వు.

127

యాత్రా కీర్తన, సొలోమోను కృతి


ఆ ఇల్లు దేవుడు కట్టకపోతే
రాళ్ళెత్తిన కూలీలది వృథాశ్రమ
ప్రభువు నగరాన్ని కాచిచూసుకోకపోతే
కావలివారు రాత్రంతా మేలుకుని వృథా.
నువ్వు పొద్దున్నే లేచిపరిగెత్తడం
రాత్రి ఆలస్యంగా పక్కమీదకు చేరడం
నీ శ్రమ, నీ ఆరాటం సమస్తం వృథా-
ప్రభువు ఎవరిని ప్రేమిస్తాడో వాళ్ళకి మాత్రమే
విశ్రాంతిని కానుకచేస్తాడు.

తెలుసుకో, పిల్లలు ప్రభువు ప్రసాదించే వారసత్వం
వాళ్ళని నవమాసాలు మోసినందుకు బహుమానం
వీరుడైన విలుకాడి చేతిలో శరాల్లాంటివాళ్ళు
నీ యవ్వనకాలంలో నీకు పుట్టిన సంతతి.
అట్లాంటి పిల్లల్తో అమ్ములపొది
నింపుకున్నవాడు ధన్యుడు
గుమ్మందగ్గర విరోధుల్తో వాదించేటప్పుడు
అతడికి అవమానపడే అవసరమే కలగదు.

128

యాత్రా కీర్తన


ప్రభువుకు భయపడే ప్రతి ఒక్కడూ,
ఆయన దారిన నడిచే ప్రతి ఒక్కడూ ధన్యుడు
నీ రెక్కలకష్టానికి తగిన ఫలితం దొరుకుతుంది
నువ్వు ధన్యుడివి, నీ శ్రమఫలితం నీతోనే ఉంటుంది.

నీ భార్య చక్కగా ఫలించిన
ద్రాక్షతీగలాగా నీ ఇంటిని అల్లుకుంటుంది
ఆలివు వృక్షం చిగురించినట్టుగా
నీ పిల్లలు నీ భోజనాలబల్ల చుట్టూ మూగుతారు.
భగవంతుడికి భయపడే
మనిషి భాగ్యం అలా ఉంటుంది, తెలుసుకో.

తన నగరంలోంచి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు
నువ్వు బతికినన్ని రోజులు
దైవనగర దినదినాభివృద్ధి కళ్ళారా చూస్తావు
నీకు పుత్రపౌత్రాభివృద్ధి లభిస్తుంది!
నా దేశానికి జయం కలుగుతుంది!

30-1-2023

Leave a Reply

%d bloggers like this: