జయగీతాలు-16

117


సమస్త జనులారా, ప్రభువుని స్తుతించండి

సకలలోకప్రజలారా, ప్రభు మహిమ ఉగ్గడించండి

మనపట్ల ఆయన అనుగ్రహం చెక్కుచెదరనిది

మనపట్ల ఆయన నమ్మకం ఎన్నటికీ తరగనిది.

స్తుతించండి ప్రభువుని నోరారా!

120

యాత్రాకీర్తన


నా దీనావస్థలో ప్రభువుకు మొరపెట్టుకున్నాను

ఆయన నా పిలుపుకు బదులిచ్చాడు

ప్రభూ, బయటపడెయ్యి నన్ను

అబద్ధాలాడే పెదాలనుంచీ

మోసకారి నోటినుంచి.

ఓ జిత్తులమారి నాలుకా

నీకేమి కావాలి?

ఎంతిస్తే సరిపోతుంది?

విలుకాడి పదునైన బాణపు ములుకులు

మండుతున్న చింతనిప్పులు.

ఎంత కష్టం నాకు,  ప్రవాసిగా బతకవలసి వచ్చింది

పరాయి వాళ్ళమధ్య గుడారం పాతుకోవలసి వచ్చింది

శాంతిని ద్వేషించే మనుషులమధ్య

చిరకాలమే నివసించవలసి వచ్చింది

నేనేమో శాంతి కోరుకుంటున్నాను

కాని నోరు తెరిచానా, వాళ్ళు కయ్యానికి కాలు దువ్వుతున్నారు.

121

యాత్రాకీర్తన


ఎక్కవలసిన కొండలెన్నో

ఎవరు నాకు చేయందిస్తారు?

ప్రభు హస్తం నాకు ఆసరా

భూదిగంతాల్ని సృజించినవాడాయన.

అతడు నీ అడుగులు తడబడనివ్వడు

నిన్ను కునికిపాట్లు పడనివ్వడు

చూడు, నా దేశాన్ని కాచిరక్షించుకుంటున్న

ప్రభువుకి కునుకులేదు, నిద్రలేదు.

ప్రభువు నీ కాపరి

నీ కుడిపక్కన పరుచుకున్న నీడ

నిన్ను పగలు ఎండ బాధించదు

రాత్రి వెన్నెల గాయపర్చదు.

ప్రభువు నిన్ను చెడుకు దూరంగా ఉంచుతాడు

నీ బతుకు నిలబెడతాడు

ఇప్పటికీ ఎప్పటికీ

నీ రాకపోకల్ని

తన చేతుల్లోకి తీసుకుంటాడు.

122

యాత్రాకీర్తన, దావీదు కృతి


దేవాలయానికి రమ్మని వాళ్ళు పిలిచినప్పుడు

నాకెంతో సంతోషమనిపించింది.

ఓ దైవనగరమా, నీ ద్వారాలదగ్గరకు

చేరుకున్నాయి మా చరణాలు.

ఒక నగరంలాగా నిర్మించబడ్డ

యెరుషలేము గట్టి కూడిక

భగవంతుడి మనుషులు,

సకలజనులు చేరుకునే చోటు అది.

ప్రభునామానికి కృతజ్ఞతగా

నా దేశానికి దక్కిన కానుక అది.

అక్కడ రాజసింహాసనం నెలకొల్పారు

దావీదు వంశ సింహాసనం.

దైవనగరక్షేమంకోసం ప్రార్థించండి

నిన్ను ప్రేమించేవాళ్ళకి అభ్యుదయం సిద్ధించు గాక

నీ ప్రాకారాలమధ్య శాంతినెలకొనుగాక

నీ హర్మ్యాలలో క్షేమం సుస్థిరమగుగాక

నా అన్నదమ్ములకోసం, బంధుమిత్రులకోసం

నీ క్షేమం కోరుతూ ప్రార్థిస్తున్నాను

మన ప్రభు దేవాలయకోసం

సర్వదా నీకు శుభం కోరుకుంటాను.

123

యాత్రాకీర్తన


స్వర్గసీమలో సింహాసనాధీశుడవైన

నిన్ను కనులారా దర్శిస్తాను

సేవకులు తమ యజమాని

హస్తం కోసం వెతుక్కున్నట్టు

దాసీజనం తమ యజమానురాలి

అభయం కోసం వెతుక్కున్నట్టు

మన నేత్రాలు మన ప్రభువు, మన దైవం

కృపావీక్షణానికై పరితపిస్తున్నాయి.

మా శక్తికి మించి అవమానాలు సహించాము

గర్విష్ఠుల తృణీకారం రుచిచూసాం.

సుఖంగా జీవితం వెళ్ళబుచ్చుతున్నవాళ్ల

ఈసడింపులు చవిచూసాం

ఇప్పటిదాకా భరించింది ఇంక చాలు,

మాపై కృపచూపు, తండ్రీ, మాపై దయచూపు.

29-1-2023

5 Replies to “జయగీతాలు-16”

  1. ఒక్క క్షణం యూదులు పడ్డ కష్టాలు ,వలస కష్టాలు అన్నీ గుర్తుకొచ్చాయి .

  2. సామ గీతాల కాలం నాడే జనుల మోసపు బుద్ధుల గురించి అంతగా వాపోయారంటే, అవి లేని కాలం ఊహించడం కష్టం ముందైనా వెనకైనా. ఆ దృష్టి కోణంలో మనల్ని మనం భగవదర్పితం చేసుకొని బ్రతకాలే తప్ప పరిస్థితులు మారతాయని
    ఆశించడం దండుగ. అని ఈ గీతాల వల్ల తెలుస్తుంది.కనుక ఇవి నిత్యశోభితాలు.

Leave a Reply

%d bloggers like this: