జయగీతాలు-14

సామగీతాలు నాలుగవ భాగం నుండి (90-106) ఎంపిక చేసిన కొన్ని గీతాల్ని తెలుగులో అందిస్తున్నాను.

93


ప్రభువు పరిపాలన మొదలుపెట్టాడు.

వైభవవస్త్రం ధరించాడు, సత్త్వసంపదతో నడుం బిగించాడు

అవును, ప్రపంచం సుస్థాపితమైంది, ఇకదాన్నెవరూ కదల్చలేరు

అనాదికాలం నుండీ సాగుతున్నది నీ పాలన

చిరకాలం నడుస్తుంది నీ సామ్రాజ్యం

వరదలు గొంతెత్తాయి, ఓ ప్రభూ

వరదలు హోరెత్తాయి

వరదలు ఘోషించడం మొదలుపెట్టాయి

ఉరుముతున్న నదీప్రవాహాలకన్నా

సాగర తరంగాల గర్జనలకన్నా

ప్రభువు మరింత శక్తిమంతుడు.

ప్రభూ, నీ సన్నిధి పవిత్రతకు మారుపేరు

నీ శాసనం నమ్మదగ్గది

నిన్నా, నేడూ, రేపూనూ.

98

గీతం


ప్రభువుకోసం ఒక నూతనగీతం పాడండి

ఆయన చేసిన మహిమలు అద్భుతం.

ఆయన దక్షిణహస్తం, పవిత్రహస్తం

అవి విజయహస్తాలు.

తన రక్షణ ఎటువంటిదో ప్రభువు వెల్లడి చేసాడు

సమస్త జనుల ఎదట తన సత్యనిష్ఠ ప్రకటించాడు

నా దేశానికి తన ప్రేమనీ

అనుగ్రహాన్నీ ఎరుకపరిచాడు

నేల నాలుగు చెరగులూ

దైవమహిమ కళ్ళారా కనుగొన్నాయి.

సర్వలోకమా, ప్రభువుకు స్తుతిగీతాలు ఆలపించు

ఎలుగెత్తి మంగళగీతాలు, జయగీతాలు ఆలపించు

తంబురసితారనాదాలతో శుభగీతాలు ఆలపించు

భేరీవాద్యాలు మోగించండి, బాకాలు ఊదండి

మన రాజాధిరాజుకు జయజయధ్వానాలు చెయ్యండి.

సముద్రం గర్జించుగాక, సముద్రస్వరంతో

సమస్తజనుల సంతోషం కలిసిపోవుగాక!

భూమ్మీద తన శాసన ప్రకటనకై

ప్రభువు దిగిరానున్నాడు, ఆయన ముందు

నదీప్రవాహాలు చప్పట్లు చరచుగాక!

కొండలు సంతోషపరవశంతో కేరింతలాడుగాక!

ఆయన ప్రపంచాన్ని సరిదిద్దనున్నాడు

మనుష్యకోటికి మంచినడత నేర్పబోతున్నాడు.

100

ధన్యవాద సమర్పణ


సమస్త భూమండలమా, జయధ్వానం కావించు

ప్రభువును సంతోషంగా సేవించు

పాటలు పాడుతూ ఆయన సన్నిధిలో ప్రవేశించు.

ఆయనే ప్రభువు, మన దైవమని తెలుసుకో

ఆయన మన సృష్టికర్త, మనం ఆయన సొత్తు

ఆయన సొంతమనుషులం, ఆ పచ్చికబయలుకు గొర్రెలం.

ధన్యవాదాలు సమర్పిస్తూ ఆ గడపలో అడుగుపెట్టండి

స్తుతిగీతాలు ఆలపిస్తూ ఆ సన్నిధిలో అడుగుపెట్టండి

కృతజ్ఞతలు చెప్పండి, గుణగాన కీర్తన చెయ్యండి.

ప్రభువు శివంకరుడు

ఆయన ప్రేమ స్థిరం, శాశ్వతం

తరాలు మారినా చెక్కుచెదరదు ఆ విశ్వాసం.

27-1-2023

6 Replies to “జయగీతాలు-14”

  1. మనం ఇవి క్రైస్తవ గీతాలని చెప్పకపోతే వీటిని ఏ మతమో పోల్చలేము .అన్ని మతాల్లోనూ సృష్టికర్తను ,జగమంతా ఆవరించిన శక్తిని ఇలానే కదా కొనియాడుతాము !👌👌

    1. చాలా చక్కగా చెప్పారు. ఈ గీతాల్ని అనువదించడంతోసేపు నాకు మన ప్రార్ధనలు మన భక్తకవులే మదిలో మెదులుతూ ఉన్నారు.

  2. ఈరోజు సామగీతాలు చదవగానే నా మనసులో కలిగిన భావం కల్యాణి నీలారంభం గారు వ్యక్తపరిచారు.

Leave a Reply

%d bloggers like this: