జయగీతాలు-13

75

ప్రధానగాయకుడికోసం గీతం, అసఫ్ కృతి


దేవా, నీకు ధన్యవాదాలు
నీ నామసంపద మాకు చేరువైనందుకు ధన్యవాదాలు
నీ మహిమలు కొనియాడడం మాకు సంతోషం.

నేను ప్రతి ఒక్కటీ ముందే నిర్ణయించిపెట్టాను
ప్రతి ఒక్కర్నీ సమదృష్టితో పరిపాలిస్తాను
పృథ్వి, పార్థివజీవులంతా తడబడుతున్నప్పుడు
ఆ స్తంభాలు చెక్కుచెదరకుండా నిలబెట్టేది నేనే.
ప్రగల్భుల్ని ప్రగల్భాలాడవద్దని మందలించేదీ నేనే
దుష్టులకి హితవు చెప్తాను: గొప్పలు పోకండి
మరీ అంత పైకెత్తి మీ బూరాలు ఊదకండి
గర్వంతో మిడిసిపడకండి అని హెచ్చరిస్తాను.

నాకు తెలుసు మన ఉద్ధరణ తూర్పునుంచో
పడమటినుంచో ఎడారులనుంచో వచ్చేది కాదు
అంతిమతీర్పరి దైవం మాత్రమే. ఒకరిని
అణచిపెట్టేదీ, మరొకర్ని పైకి లేవనెత్తేదీ ఆయనే.
భగవంతుడి చేతిలో ద్రాక్షారసంతో పొంగిపొర్లే
పాత్ర ఉంది, దాన్ని చక్కగా కలిపి
ఆయన ధారపోస్తున్నాడు
భూమ్మీద ఉండే దుష్టులంతా
దాని మడ్డికూడా మిగలకుండా తాగేస్తారు

నేను మాత్రం ఎలుగెత్తి చాటతాను
నా రాజాధిరాజు మహిమలు కొనియాడతాను
దుర్మార్గుల బాకాలు తుత్తునియలు చేస్తాను
సత్యవంతుల ఘనత నలుదిక్కులా చాటిస్తాను.

82

అసఫ్ కృతి


దేవసభలో భగవంతుడు ఆసీనుడయ్యాడు
దేవతాబృందం మధ్య ఆయన ప్రశ్నిస్తున్నాడు
ఎన్నాళ్ళు మీరిట్లా అన్యాయంగా తీర్పులిస్తారు
దుర్మార్గులపట్ల పక్షపాతం చూపిస్తారు
దీనులకీ, దిక్కులేనివాళ్ళకీ న్యాయం చెయ్యండి
దళితులవీ, పతితులవీ హక్కులు కాపాడండి
ఆర్తుల్నీ, అన్నార్తుల్నీ రక్షించండి
దుర్జనహస్తాలనుంచి వాళ్ళని బయటపడెయ్యండి

వాళ్ళకి తెలివి లేదు, మెలకువలేదు
చీకట్లో నడుస్తుంటారు
భూమి పునాదుల్లోంచీ కంపించిపోతున్నది.

వాళ్లతో చెప్పాన్నేను
మీరంతా దేవతలు, ఉత్తమ వంశ సంజాతులు,
అయినా, మీరు కూడా మరణిస్తారు మనుషుల్లానే,
కూలిపోతారు తక్కినరాజుల్లానే.

సర్వేశ్వరా, మేలుకో, భూమిని చక్కదిద్దు
సకల రాజ్యాలూ నీ సొత్తు.

87

కోరాకుమారుడు రాసిన గీతం


పవిత్రపర్వతం మీద నగరాన్ని నిర్మించాడు ఆయన
దేశంలోని సమస్త స్థలాలకన్నా
ఈ నగర ద్వారాలే ఆయనకు ప్రీతికరం
ఓ దైవనగరమా
నీ గురించి ఎంత గొప్పగా విన్నాం.

నా గురించి తెలిసినవాళ్ళు రహాబులో బేబిలోనులో
ఫిలిస్తియా, తైరు, కుష్ దేశాల్లో ఉన్నారు
నా గురించి చెప్తూ
ఇతడు అక్కడి బిడ్డ అంటారు వాళ్ళు
ఈ నగరం గురించి తలుచుకుంటూ
ఇదిగో వాడూ, వీడూ అక్కడ పుట్టినవాళ్ళే అంటారు
సాక్షాత్తూ సర్వేశ్వరుడు నిర్మించిన నగరం అది.
జనుల పుట్టుకల లెక్కలు రాసేటప్పుడు
దేవుడు ‘ఇదిగో వీడిక్కడ పుట్టాడు ‘అని రాసుకుంటాడు

మా జలాలు నీలోనే ఊటలూరుతున్నాయని
గాయకులూ, నర్తకులూ ఒక్కలానే చెప్పుకుంటారు.

26-1-2023

Leave a Reply

%d bloggers like this: