యు ఆర్ యునీక్

Reading Time: 3 minutes

మార్చిలో రిటైరయినప్పుడు మిగిలిన జీవితమంతా చదువుకోవడానికీ, రాసుకోడానికీ కేటాయించుకుందాం అనుకుంటూ ఉండగా, ఒకరోజు రామకృష్ణ మిషన్ స్వామీజీ ఒకాయన ఫోన్ చేసారు. కలాం పుస్తకమొకటి ఇంగ్లిషులో వచ్చిందనీ, దాన్ని తెలుగులోకి తేవడానికి ఆ ప్రచురణకర్తలు తగిన అనువాదకుడికోసం వెతుకుతున్నారనీ, నాకు ఇష్టమయితే, తాను నా పేరు సూచిస్తాననీ చెప్పారు. పదవీ విరమణ వేళ ఆ ఫోన్ కాల్ నాకు శుభసూచకంగా అనిపించింది. తప్పకుండా చేస్తానని చెప్పాను.

అప్పుడు ఆ పుస్తక రూపకర్త డా. పూనం ఎస్ కోహ్లీ నాకు ఫోన్ చేసారు. పుణ్య పబ్లిషింగ్ హౌస్ పేరిట ఆమె ఆ పుస్తకం వెలువరించారు. అది కలాం నేరుగా రాసిన పుస్తకం కాదు. ఆయన వివిధ సందర్భాల్లో రాసిన వ్యాసాలనుంచి, ప్రసంగాలనుంచి ఆమె ముఖ్యమైన అంశాల్ని ఏరి వాటికి ఒక ఏకసూత్రతని తీసుకొచ్చి ఒక పుస్తకంగా రూపొందించారు. దాన్ని డా.కలాం కి పంపితే ఆయన ఆ అమరికను అంగీకరించి ఆమెని ప్రశంసించారు.

పోయిన ఏడాది వేసవి అంతా ఈ పుస్తకం అనువాదంలో గడిపాను. దీన్ని పూరిగా యూనికోడ్ లో తీసుకురావాలని, ఇన్- డిజైన్ లో రూపొందించాలనీ ఆమె కోరినందువల్ల ఈ పుస్తకం పూర్తికావడానికి దాదాపు ఆరునెలలు పట్టింది. ఇప్పటికి, ఈ పుస్తకం విడుదలయ్యింది. ఈ రోజే ఆ పుస్తకం యు ఆర్ యునీక్ ప్రతులు నాకు అందాయి.

డా.కలాం రచనలకు నేను చేసిన అనువాదాల్లో ఇది ఆరవ పుస్తకం. ‘ఇక విజేత ఆత్మకథ’ (ఎమెస్కో, 2002), ‘నా దేశ యువజనులారా’ (ఎమెస్కో, 2002), ‘ఈ మొగ్గలు వికసిస్తాయి’ ( రీమ్, 2009), ‘ఎవరికీ తలవంచకు’ (రీమ్ 2009), ‘ఉత్తం కుటుంబం, ఉదాత్త దేశం’ ( రీమ్, 2016) ఇప్పటిదాకా నేను అనువదించినవి.

ఈ పుస్తకం ఒక విధంగా డా.కలాం జీవితకాలం పాటు మాట్లాడుతూ వచ్చినవాటికి సంగ్రహంగా చెప్పవచ్చు. వాటితో పాటు సమకాలిక ప్రపంచంలో భారతదేశం ఒక విజ్ఞాన నాయకత్వాన్ని అందిపుచ్చుకోవాలంటే ఏమి చెయ్యాలో కూడా కలాం మాటలు ఇక్కడ స్పష్టంగా వినిపిస్తాయి. అన్నిటికన్నా నన్ను ఎక్కువ ఆశ్చర్యపరిచిన విషయం, డా.కలాం తన జీవితంలో చివరి సంవత్సరాలకు వచ్చేటప్పటికి సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా గళమెత్తడం. ఆయన కేవలం ఉత్పత్తి గురించి మాత్రమే మాట్లాడేడు, పంపిణీ గురించి పట్టించుకోలేదు అనేవారికి ఈ పుస్తకం ఒక సమాధానం.

ఇందులో డా.కలాం రాసిన కవితలు కూడా కొన్ని ఉన్నాయి. తిరువళ్లువర్ లాగా, కబీరులాగా కలాం కూడా సాధుకవి. ఆయన భాష కూడా ఒక సాధుక్కడి. ఆయన భారతరాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన రాత్రి మొఘల్ గార్డెన్స్ లో తిరుగాడుతూ రాసిన ఒక కవితనుంచి కొన్ని పంక్తులు చూడండి. అటువంటి సాధుసత్పురుషుణ్ణి దేశరాజకీయాల్లో చూడటానికి మళ్ళా ఎన్నాళ్ళు పడుతుందో!


నేనేమివ్వగలను

భారతరాష్ట్రపతిగా నా పదవీకాలం ముగిసిన చివరిరోజు అంటే 2007 లో జూలై 24 సాయంకాలం జరిగిన సంఘటన ఒకటి మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. రాష్ట్రపతిభవనం భారతరాష్ట్రపతి నివాససముదాయం. ఆ రోజు నేను అక్కడి ఉద్యానవనాలన్నీ కలయతిరిగాను. అలా తిరుగుతున్నప్పుడు చక్కని సంగతులెన్నో సంభవించాయి. ఎన్నో విశేషమైన దృశ్యాలు నా మనోనేత్రం ముందు కదలాడేయి. ఆ రోజు నేను చూసిందీ, ఊహించిందీ అంతా సమగ్రంగా ఒక చక్కటికవితగా కూర్చాను. ఆ కవితకు ‘నేనేమివ్వగలను?’ అని శీర్షిక సమకూర్చాను.

1

ఒక సాయంకాలం, అందమైన సాయంకాలం

నా ప్రకృతికుటుంబానికి

ధన్యవాదాలు సమర్పించే పనిలో ఉన్నాను

మొఘల్ ఉద్యానవనంలో చిక్కటి వటవృక్షఛాయన

కుటీరానికి చేరుకున్నాను

చుట్టూ అల్లుకున్న వనమూలికల సౌరభం

సంగీతభరిత జలయంత్రం, షెహ్ నాయి మంద్రస్వరం.

వందలాది చిలుకలు ఆ సంగీతానికి మత్తెక్కి ఉన్నాయి

అక్కడొక చిన్న మర్రిచెట్టు నన్ను ‘నాన్నా, కలాం’ అంటో పిలిచింది.

‘భూమిలోకీ వేళ్ళు దన్నుకుని అన్ని ఋతువుల్లోనూ

మధ్యాహ్నాల వేడి మాలోనే ఇంకించుకుంటాం

ఎన్నో పిట్టలకి గూడునిస్తాం,

పశుపక్షిప్రాణిగణాలకి

చల్లటినీడనిస్తాం, శీతలపవనమిస్తాం

మరి మనిషి ఏమిస్తున్నాడు? చెప్పు కలాం?’

‘ఓ నా వటకిశోరమా, ఇవ్వడం గురించి

ఎంత అద్భుతమైన సందేశమిచ్చావు

ఇవ్వడం భగవంతుడి ఉద్యమం

కొనసాగించు, కొనసాగించు.

2

ఇంతలో ఎన్నో చిలకలు వచ్చివాలాయక్కడ

ఆ ప్రశాంత వటవృక్ష ఛాయలో

చుట్టూ ఉన్న చెట్లమీదకు చేరుకున్నాయి

మెరుస్తున్నాయి, ఆ తావుని వెలిగిస్తున్నాయి.

అప్పుడొక చిలక నన్నో ప్రశ్న అడిగింది:

‘రామచిలకలం మేం ఎంత అందంగా ఉంటాం

మీరు కవులు మమ్మల్ని మాటల్లో చిత్రిస్తారు కద

చెప్పవయ్యా కలాం, మీ అంతట మీరు ఎగరగలరా?’

ఆ ప్రశ్నవినగానే నా మానుషగర్వం కరిగిపోయింది

‘లేదు మిత్రులారా, మీ ధన్యత మాకు లేదు

ఎగరండి, మీరిట్లానే సంతోషంగా ఎగరండి’ అన్నాను

5

సూర్యుడు అస్తాద్రి వైపు నడుస్తున్నాడు

దిగంతరేఖమీంచి పూర్ణచంద్రుడు ఉదయిస్తున్నాడు

ఆధ్యాత్మిక ఉద్యానవనం స్వాగతం పలుకుతున్నది

‘ఓ కలాం, మాది ఖర్జూర కుటుంబం,

మాదగ్గర ఆలివ్ చెట్లు, తులసి మొక్కలు కూడా ఉన్నాయి

ఇంకా మరెన్నో

నీకు మా స్వాగతం

మమ్మల్ని చూడూ

మేము కలిసి మెలిసి పెరుగుతాం

కలిసి మెలిసి బతుకుతాం

మహ్మదీయులు, క్రైస్తవులు, హిందువులు

మరెన్నో మతాలకి చెందినవారెందరో

మమ్మల్ని ఆరాధిస్తారు ఎవరికి వారు.

అన్ని ఋతువుల్లోనూ మందపవనాలు

మాలోంచి తాజాదనం సుగంధం ప్రవహిస్తుంటాయి,

మాలో ప్రతి ఒక్కరినీ అల్లుకుంటాయి

మా గురించి.

కలాం చెప్పవయ్యా నీ ప్రజలందరికీ

‘ఓ నా ఆధ్యాత్మిక గురువులారా

మనసులన్నీ ఒక్కటిగా ఉండాలనే శివసంకల్పం మీది

ఈ జ్ఞానవిశ్వవిద్యాలయంలో

ఇది నాకొక గొప్ప కానుక

నేనేమిది పంచాలో, నేనేమివ్వగలనో

ఇక్కడ నాకు దారి దొరికింది.’

6

ఆ ప్రాకృతికప్రపంచపు పౌరులు నన్నుత్తేజపరిచారు

నేనేమివ్వగలను?

ఆర్తుల దుఃఖాన్ని తొలగించగలను

వారి ఖిన్న హృదయాల్ని సంతోషపెట్టగలను

అన్నిటికన్న ముఖ్యం నేనొకటి తెలుసుకున్నాను

ఒకసారి ఇవ్వడం మొదలుపెడితే

నాలుగుదిక్కులా సంతోషమే అల్లుకుంటుందని.

( 2007 జూలై 24 న మొఘల్ ఉద్యానవనంలో కూర్చిన కవిత)

25-1-2023

8 Replies to “యు ఆర్ యునీక్”

  1. చాలాకాలం తరువాత రాష్ట్రపతి పదవికే ఒక గౌరవం తెచ్చిన వ్యక్తి కలాం.

Leave a Reply

%d bloggers like this: