ఈ పుస్తకం ఒక దీపం

మీ చేతుల్లో ఉన్న ఈ చిన్న పుస్తకం చైనా సాంస్కృతిక ప్రతినిధి అని చెప్పదగ్గ కన్ఫ్యూసియస్ జీవితాన్ని, బోధనల్ని, ఆచరణని ఎంతో సమగ్రంగా, ఆకర్షణీయంగా పరిచయం చేస్తున్న పుస్తకం. మామూలుగా కన్ ఫ్యూషియస్ గురించిన పుస్తకాలు చదవడం కొంత కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాటిలో ప్రతి ఒక్క పేజీకి ఎన్నో విరణలు, ఫుట్ నోట్లు, వ్యాఖ్యానాలు ఉంటాయి. ప్రతి ఒక్కవివరణ మీదా ఎన్నో పాండిత్య వివాదాలూ, చర్చలూ ఉంటాయి. ఆయన జీవితవిశేషాల మీద కూడా ఏకాభిప్రాయం ఉండదు. అటువంటి పరిస్థితుల్లో పాఠకులకి, ముఖ్యంగా పిల్లలకి ఎంతో సరళంగా, సుబోధకంగా కన్ఫ్యూషియస్ జీవితం గురించీ, ఆలోచనలగురించీ, ఆయన చేపట్టిన అన్వేషణ గురించి చెప్పిన ఈ పుస్తకం చదవడం చక్కటి అనుభవం.

ఈ పుస్తకంలో వంద అధ్యాయాలు, అంటే దాదాపుగా వంద పేరాలు. రెండు మూడు అధ్యాయాల్లో మాత్రమే ఒకటికన్నాఎక్కువ పేరాలు ఉన్నాయి. వాడిన భాష చాలా సరళంగా ఉంది. ఎంతో గంభీరమైన తాత్విక విషయాల్ని ఎంతో సులువుగాపరిచయం చేసిన తీరు నిజంగా మెచ్చుకోదగ్గది. ఇక ప్రతి సంఘటనకీ కూర్చిన బొమ్మ ప్రాచీన చీనానీ, అప్పటి సాంఘిక-రాజకీయ పరిస్థితుల్నీ కళ్ళకి కడుతున్నది.

ఈ పుస్తకం చదివిన తరువాత కన్ ఫ్యూషియస్ గురించి మరింత తెలుసుకోవాలనే కోరిక ఎలానూ కలుగుతుంది. అయితే, ఈపుస్తకం ప్రధానంగా చీనా పాఠకుల్ని ఉద్దేశించి రాసింది కాబట్టి, కన్ఫ్యూసియస్ కాలం నాటి సాంఘిక, ధార్మిక, రాజకీయపరిస్థితుల గురించి ప్రత్యేకంగా ఎక్కడా వివరించలేదు. అటువంటి అంశాల గురించి స్థూలంగా కొంత పరిచయం చేస్తే ఈ పుస్తకంతెలుగుపాఠకులకి మరింత సుబోధకంగా ఉంటుందనిపించి ఈ నాలుగు మాటలూ రాస్తున్నాను

కన్ ఫ్యూషియస్ కన్నా ముందటి చీనా

మూడు వేల ఏళ్ళకిందట ప్రాచీన చైనాలో పచ్చ సముద్రానికి పైన షాంగ్ చక్రవర్తులు చీనాలో నాగరికతను ప్రారంభించారు. కాని వారికి సామంతులుగా ఉన్న ఝౌ వంశీకులు వారిని యుద్ధంలో ఓడించి పడమటి ఝౌ సామ్రాజ్యాన్ని స్థాపించారు. వారు తమకి రాజ్యాధికారం స్వర్గం (లేదా ఆకాశం) నుంచి అనుగ్రహించబడిందనీ, తాము ఆ దైవశాసనానికి విధేయులుగా ఉన్నతకాలం తమ పాలన కొనసాగుతుందనీ నమ్మారు. వారు ప్రజల పట్ల బాధ్యతతో, దైవం పట్ల విధేయతతో, అత్యంత దయార్ద్రహృదయంతోనూ, నైతికశీలంతోనూ పరిపాలన చేసారు.

కాని అనంతరకాలంలో వారు తమ ధర్మం తప్పగానే ఉత్తరాదినుంచి ఆటవిక తెగలు వారిమీద దండెత్తి వారి రాజ్యాన్ని ఆక్రమించుకున్నాయి. అప్పుడు ఆ చక్రవర్తులు తూర్పు ప్రాంతానికి పారిపోయి అక్కడ లొయాంగ్ కేంద్రంగా పాలన కొనసాగించారు.

కాని వారు పడమటి ఝౌ చక్రవర్తుల్లాగా పూర్తి స్థాయి పాలకులు కారు. విస్తృతమైన వారి రాజ్యం అనేక చిన్న చిన్న సామంతరాజ్యాలుగా చీలిపోయి, ఆ సామంతరాజులే పూర్తి సైనిక, రాజకీయ అధికారాన్ని చలాయిస్తూ ఉండేవారు. ఆ సామంతరాజులు వివిధ రాజవంశాలకూ, సైనిక వంశాలకు చెందినవారి చేతుల్లో ఉండేవారు. కాబట్టి ఆ చిన్న చిన్న రాజ్యాల్లో ఎప్పటికప్పుడు రాజ్యాధికారం కోసం కుట్రలూ, యుద్ధాలూ, ఒకరిమీద ఒకరి దండయాత్రలూ నడుస్తూ ఉండేవి. మరొకవైపు తూర్పు ఝౌ చక్రవర్తులునామమాత్రపు పాలకులుగా కేవలం పూర్వకాలపు యజ్ఞయాగాదులకు మాత్రమే పరిమితమైపోయి ఉండేవారు.

కన్ఫ్యూషియస్ కాలం నాటి రాజకీయ పరిస్థితి

కన్ ఫ్యూషియస్ జీవితకాలంలో అంటే క్రీస్తు పూర్వం 551 నుండి 479 దాకా, అయిదారు శతాబ్దాల కాలాన్ని ప్రాచీన చీనాచరిత్రలో వసంత-హేమంతాల కాలం (క్రీ.పూ.722 476) అనీ, సమరశీల రాజ్యాల కాలం (క్రీ.పూ 476-221) అనీ అంటారు.

అప్పుడు తూర్పు ఝౌ చక్రవర్తుల ఏలుబడిలో ఏడు రాజ్యాలు నిరంతరం ఒకదానితో ఒకటి కలహించుకుంటూ ఉండేవి. అవి కిన్,హాన్, వెయి, ఝావో, కీ, చూ, యాన్ లు. వాటితో పాటు మరికొన్ని చిన్న చిన్న రాజ్యాలు కూడా ఉండేవి. ఝా చక్రవర్తులులువోయి కేంద్రంగా చిన్న రాజ్యానికి పరిమితమై ఉండేవారు. ఆ రాజ్యాల్లో కన్ ఫ్యూషియస్ పుట్టినలూ రాజ్యం కూడా ఒకటి. దాని రాజధాని కు-ఫు. ఆ పాలకుడు ఝౌ చక్రవర్తిలాగా నామమాత్రపు పాలకుడు. రాజకీయాలు, సైనిక వ్యవహారాలూ ముగ్గురుహూణులుగా పిలిచే మూడు వంశాల చేతుల్లో ఉండేవి. రాజులు దైవశాసనాన్ని మర్చిపోయి, ప్రజల పట్ల తమ బాధ్యతని ఉల్లంఘించి, రైతులమీద పన్నుల మీద పన్నులు వేస్తూ విలాసమయ, భోగమయ, ఆడంబరమయ జీవితం జీవిస్తుండేవారు. ఆ కాలంలో రాజకీయ పదవులు, ప్రభుత్వోద్యోగాలు కూడా వంశపారంపర్యంగానే సంక్రమించేవి. ఎవరేనా సామాన్యప్రజలు ఆ ప్రభుత్వోద్యోగాల్లోకి రావాలంటే ఎంతో కష్టపడి చదువుకోవలసి ఉండేది. అటువంటి పరిస్థితుల్లో కన్ఫ్యూసియస్ పుట్టి పెరిగాడు.

కన్ఫ్యూషియస్ ఏమి కోరుకున్నాడు?

ఆయన తన చుట్టూ ఉన్న అవ్యవస్థకి కారణం రాజులూ, రాజోద్యోగులూ, తండ్రులూ, కొడుకులూ అందరూ కూడా ప్రాచీనధర్మసూత్రాల్ని ఉల్లంఘించి నడవడమే అని భావించాడు. ఆ ప్రాచీన ధర్మసూత్రాల్ని ‘లిజి’ అనే గ్రంథం వివరిస్తుంది. ఆ సూత్రాల్నేఈ పుస్తకంలో సదాచారాలుగా పేర్కోవడం జరిగింది. సదాచారాలు మనిషికి తోటిమనిషి పట్ల ఉండే బాధ్యతని, తండ్రికి కొడుకుపట్ల, కొడుక్కి తల్లిదండ్రుల పట్ల, రాజుకి ప్రజల పట్ల, ప్రజలకి రాజు పట్ల ఉండవలసిన బాధ్యత, మర్యాద, పరస్పర గౌరవం గురించి వివరిస్తాయి. వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆ ప్రకారం నడుచుకుంటే ఏ రాజ్యమైనా చక్కగా వికసిస్తుందనీ, అక్కడ మరణశిక్ష అవసరమే ఉండదనీ కన్ ఫ్యూషియస్ భావించేడు.

సదాచారాల ప్రకారం నడిచే పాలనని కన్ ఫ్యూషియస్ పదే పదే రెండు విశేషణాలతో వివరిస్తూ వచ్చేడు. అవి ‘దయార్ద్రహృదయం’, ‘ధార్మిక శీలం’ అనేవి. దయార్ద్రహృదయం అంటే ఏమిటని ఈ పుస్తకంలో చాలాచోట్ల చర్చ కనిపిస్తుంది. ఆ చర్చలో కన్ఫ్యూషియస్ ఇచ్చిన వివరణలు ఎంతో మానవీయంగా, విశ్వసనీయంగానూ, అనుసరణయోగ్యంగానూ మనకి కనిపిస్తాయి. ధార్మిక శీలం అనేదాన్ని ఆయన కొన్ని సార్లు నైతికశీలంగా, కొన్నిసార్లు వివేకంగా కూడా పేర్కొన్నాడు.

కన్ఫ్యూషియస్ సంభాషణలు

కన్ఫ్యూషియస్ తన భావాల్ని కేవలం ప్రచారం చెయ్యడమే కాదు, ఆయన స్వయంగానూ, ఆయనదగ్గర చదువుకున్న శిష్యులద్వారానూ ఆ భావాల్ని ఆచరణకు పెట్టడానికి ప్రయత్నించాడు. ఆ విశేషాలు మనకి కన్ఫ్యూషియస్ కీ, ఆయన శిష్యులకీ మధ్య జరిగిన సంభాషణల ద్వారా తెలుస్తున్నాయి. ఆ సంభాషణల్ని కన్ఫ్యూషియస్ తర్వాతి కాలంలో ‘లున్-యు’ అనే పేరిట సంకలనంచేసారు. వాటిని ‘అనలెక్ట్స్’ అనే పేరిట ఇంగ్లిషులోకి అనువదించాక, కన్ఫ్యూషియస్ భావాలు విస్తృతప్రపంచానికి పరిచయ మయ్యాయి.ఈ పుస్తకంలోని ఎన్నో సంఘటనలు, చర్చలు ఆ సంభాషణలనుండి తీసుకున్నవే.

కన్ఫ్యూషియస్ సంభాషణల ఆధారంగానూ, ఆయన జీవితం గురించీ, ఆ కాలం చరిత్ర గురించి లభిస్తున్న ఇతర విశేషాలఆధారంగానూ, కన్ఫ్యూషియస్ బోధనల్లో ఎనిమిది ముఖ్యమైన విషయాలున్నాయని చెప్పవచ్చు. అవి: దయార్ద్ర హృదయం, సత్యసంధత, మర్యాద, వివేకం, విధేయత, విశ్వసనీయత, కుటుంబాల్లో ఉండవలసిన అనుబంధం, పెద్దల పట్ల వినయం. ఈ విలువల్లో ప్రతి ఒక్కదానికీ, ఉదాహరణగా చెప్పదగ్గ ఏదో ఒక సంఘటన, మనకి ఈ పుస్తకంలో కనిపిస్తుంది.

కన్ ఫ్యూషియస్ దర్శనం, ఇతర దర్శనాలు

కన్ఫ్యూసియస్ కాలంలోనే లావో-జి అనే మరొక దార్శనికుడు ఉండేవాడు. ఈ పుస్తకంలో కన్ ఫ్యూసియస్ లువోయి పట్టణానికి వెళ్ళినప్పుడు లావో జి ని కలుసుకున్న సంఘటన గురించిన వివరణ ఉంది. లావో-జి అనే వ్యక్తి చరిత్రలో లేడని కూడాకొందరు అంటారు. కాని ఆయన ప్రతిపాదించిన దర్శనం డావోయిజం పేరిట కన్ఫ్యూషియస్ ఆలోచనలకి ఒక సవాలుగా, ప్రత్యామ్నాయంగా ఉంటూనే వచ్చింది. ఈ పుస్తకంలో ఒక సంఘటనలో, కన్ఫ్యూషియస్ తన ప్రయాణాల్లో ఇద్దరు మునీశ్వరుల్ని కలుసుకున్న సంఘటన ఉంది. అక్కడ కన్ఫ్యూషియస్ ఆలోచనా విధానానికీ, డావోయిస్టు విధానానికీ మధ్య ఉన్న తేడా చాలాచక్కగా చిత్రించబడింది. ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలకు ఇక్కడే ఉండి పరిష్కారాలు వెతకాలి తప్ప ఈ లోకాన్ని వదిలిపెట్టి,అడవుల్లోకో, కొండల్లోకో పోయి ముక్కుమూసుకుని తపసుచేసుకోవడం తనకి ఇష్టం కాదని కన్ఫ్యూషియస్ అక్కడ స్పష్టంగా చెప్తాడు. ఏడు దశాబ్దాల ఆయన జీవితం మొత్తం ఆ మాటకి ఉదాహరణగా నిలబడిందని మనం ఈ పుస్తకం చదివితే గ్రహిస్తాం.

కన్ఫ్యూసియస్ సఫలమయ్యాడా విఫలమయ్యాడా?

దీన్ని బట్టి కన్ఫ్యూషియస్ సఫలతచెందాడని చెప్పగలమా లేక ఆయన సమకాలికులు చాలామంది విమర్శించినట్టుగా కేవలం సిద్ధాంతానికే పరిమితమై, ఆచరణ సాధ్యంకాని ఆశయాలు ప్రబోధిస్తూ గడిపాడనుకుందామా? ఈ పుస్తకం మొదటిసారి చదివితే, రాజ్యం నుంచి రాజ్యానికి తిరుగుతూ, తన మాట వినే ప్రభువు ఒక్కడు కూడా కనిపించకుండా నిరుత్సాహంగా స్వదేశానికిమరలివచ్చిన కన్ఫ్యూషియస్ కనిపిస్తాడు. నిజమే. కాని మరోసారి చదివితే, జీవితం పట్ల, ప్రపంచం పట్ల ఆశకలిగించే జీవితంజీవించిన ఒక మహామానవుడు మన కళ్ళముందు కనిపిస్తాడు. నిరుపేద బాల్యం నుంచి కేవలం స్వశక్తితో, స్వీయ అభ్యసనంతో ఒక పండితుడిగా మారి, రాజుల్నీ, రాజ్యాల్నీ ప్రభావితం చెయ్యగలగడం మామూలు విషయంకాదు.

ఈ పుస్తకం చదువుతుండగా మనల్ని వెంటనే ఇబ్బంది పెట్టే అంశం, ఆయన తన సలహాలు, సూచనలు వినే రాజు కోసం, రాజ కోసం ఒక రాజ్యం నుంచి మరొక రాజ్యానికి నిర్విరామంగా చేస్తూ వచ్చిన ప్రయాణాలు చెయ్యవలసి రావడం. ఏ ఒక్కరాజ్యం కూడా ఆయనకి తగిన పదవీ బాధ్యతలు ఇవ్వడానికి ఇష్టపడకపోవడం. ఆ రాజ్యాల జాబితా చూస్తే, కన్ఫ్యూషియస్ ఆ రోజుల్లో దాదాపుగా ప్రాచీన చైనా మొత్తం పర్యటించినట్టు మనకి కనిపిస్తుంది. కాని ఎక్కడా ఏ రాజ్యంలోనూ ఆయనకి తగిన పదవిగాని, ఆయన ఆలోచనల్ని అమలు చేయగలిగే ప్రభుత్వోద్యోగం గాని లభించకపోవడం చూస్తాం. ఆయన జీవితకాలంలో ఒక ఏడాది పాటు ఒక నగరపాలకుడిగా పనిచేయగలిగాడు. ఆ ఏడాదిలో ఆ నగరాన్ని గొప్ప శీలవంతమైన జనావాసంగా మార్చేడని చరిత్ర చెప్తున్నది. మరొక పెద్ద ఉద్యోగం న్యాయశాఖ మంత్రిగా దొరికిన అవకాశం. ఆ రోజుల్లో రాజకుటుంబాలకు చెందని వారికి లభించగల అతి పెద్ద ఉద్యోగం అదే. కాని ఆయన్ని ఎక్కువ రోజులు ఆ ఉద్యోగం చెయ్యనివ్వలేదు. మూడేళ్ళు తనని ఏదైనాపదవిలో ఉండనిస్తే అద్భుతాలు చేసి చూపించగలని ఆయన చెప్పుకున్నాడుగాని, ఏ రాజ్యమూ తన చరిత్రలో కనీసం మూడేళ్ళు ఆయనకి అప్పగించ లేకపోయింది.

చదువు ఒక్కటే మనుషుల్ని పారంపరికదాస్యం నుంచి విడుదల చేస్తుందని నమ్మి, ఆర్థిక, సాంఘిక అంతరాల్తో నిమిత్తం లేకుండా అందరికీ పాఠశాల తెరిచిపెట్టిన ఒకవిద్యావేత్త కనిపిస్తాడు. తన కాలం నాటి రాజకీయాలు, జీవనవిధానం ఆడంబరంతో, విలాసాలతో, పీడనతో కూడుకుని పోయినప్పుడువారికి మానవత్వాన్ని గుర్తుచేస్తూ, మనిషికి తోటిమనిషి పట్ల ఉన్న ప్రాథమిక బాధ్యతని గుర్తుచేస్తూ వచ్చిన ఒక నైతికనాయకుడు
కనిపిస్తాడు.

సాహసి, నిర్భయుడు, సత్యం కోసం ప్రాణాల్ని పణంగా పెట్టగలిగిన సత్యాగ్రాహి కనిపిస్తాడు. సరైన పుస్తకాలు చదవకపోతే కన్నకొడుకుని కూడా మందలించిన ఒక తండ్రి, పన్నులు పెంచుతున్న పాలకుడితో చేతులు కలిపినందుకు తన ప్రియ శిష్యుణ్ణినిరాకరించిన గురువు, విలాసాలకు బానిస అవుతున్నందుకు తన ప్రభువునే పరిత్యజించిన ఒక పౌరుడు ఇందులో కనిపిస్తారు.

మరొకసారి చదివితే, ఇటువంటి పరిస్థితులే ఈ రోజు మన చుట్టూతా కూడా ఉన్నాయనీ, లేనిదల్లా కన్ ఫ్యూషియస్ లాంటి వివేకి, దయార్ద్రహృదయుడే అని మనం గ్రహించగలుగుతాం.

ఆయన ఒక రోల్ మోడల్

ఈ రోజు వ్యక్తిత్వ వికాసవేత్తలు యువతరానికి రోల్ మోడళ్ళు ఉండవలసిన అవసరం గురించి మాట్లాడుతున్నారు. కన్ఫ్యూషియస్ నిజంగానే ఒక రోల్ మోడల్. మనం మన పైవారితో, కిందవారితో, తోటివారితో ఎలా నడుచుకోవాలన్నదానికి, ఈ పుస్తకంలోనే ఎన్నో ఉదాహరణలున్నాయి. తాము నమ్మినదాన్ని ఆచరణలో పెట్టడం కోసమే జీవించి తమ జాతికీ, దేశానికీ గురువులుగా నిలబడ్డ సోక్రటీస్, బుద్ధుడు, యేసుక్రీస్తు, మహాత్మా గాంధీ వంటి వారిసరసన నిలబడే జీవితం కన్ఫ్యూషియస్. ఈ చిన్న పుస్తకం ఆ మహామానవుడి పట్ల మనకొక కొత్త కుతూహలాన్ని కలిగిస్తుంది. అలా జీవించాలనే ఆశ మనలో రగిలిస్తుంది. మన చుట్టూ ఆవరించి ఉన్న చీకటిలో ఈ పుస్తకం ఒక దీపం. ఒక్క బాలుడు, ఒక్క బాలిక ఈ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని తమని తాము మలుచుకున్నా ఈ రచన సఫలమయినట్టే.

23-1-2023

3 Replies to “ఈ పుస్తకం ఒక దీపం”

  1. ఒక్క సారి కన్ఫ్యూసియస్ కాలాన్ని రాజకీయ పరిస్థితుల్ని చక్కగా కనులకు కట్టినట్లుగా చూపించారు.నాకు ఇది చదువుతుంటే బడే ఆంటీనాలనీ చాందోర్కర్ గారు గుర్తుకు వచ్చారు.ఆవిడ చరిత్ర బోధకురాలు.ఆమె బహు పుస్తక పాఠి. సంగీత సాహిత్య ఆధ్యాత్మిక విషయాల్లో విదుషీమణి.ఈ విషయాలు మీరు కర్ణాకర్ణిగ విని ఉంటారు. కాని చరిత్ర బోధన విషయంలో ఆమెను ఆదర్శంగా తీసుకోవచ్చు.
    అందరూ గణితానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సామజిక శాస్త్రానికి కనీస ప్రాధాన్యత ఇవ్వక పోవడం ఆమె ఇష్ట పడేవారు కాదు. మనిషిని మనిషిగా తయారు చేయడం లేదా మంచి పౌరుడిగా చేయటం ఆ శాస్త్ర విధి.మనిషిగా తయారు కానివాడు ఎంత మేధావియైనా లాభం లేదు.దానికి JK quote’ we’re producing Doctors, Engineers,Lawyers but not Human beings’అన్నది సరిగ్గా వర్తిస్తుంది. కన్ఫ్యూసియస్ మూడు వేల ఏండ్ల కిందటి వాడైనా ఇప్పటికీ మీ వంటి నారి వల్ల బతికి ఉన్నాడు.ఉంటాడు. మీ పుస్తకానికి ఈ పరిచయం అత్యావశ్యకం.మరొక్క మేలిమి ఉదయాన్నిచ్చిన మీకు ధన్యవాదాలు.

Leave a Reply

%d