
ఆ మధ్య విజయవాడలో అశోక్ బుక్ సెంటర్ కి వెళ్ళినప్పుడు కన్ ఫ్యూసియస్ జీవితాన్నీ, దర్శనాన్నీ వివరిస్తూ ఒక బొమ్మల పుస్తకాన్ని అశోక్ కుమార్ గారు చూపించారని మీతో చెప్పాను. ఆ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించానని కూడా మీకు చెప్పాను.
ఈ రోజు ఆ పుస్తకం కన్ ఫ్యూసియస్: జీవితం, దర్శనం ప్రతులు నాకు అందేయి. అశోక్ కుమార్ గారు తన అభిరుచికి తగ్గట్టుగా చాలా ఆకర్షణీయంగా ముద్రించారు. ఇటువంటి పుస్తకం ఒకదాని మీద నా పేరు కూడా ఉంటుందని నేనెప్పుడూ అనుకోలేదు. బుక్ షాపుల్లో దేవదూతలు ఉంటారని మరోమారు నా విషయంలో ఋజువయ్యింది.
ఈ పుస్తకంలో కన్ ఫ్యూసియస్ జీవితానికీ, దర్శనానికీ సంబంధించిన వంద అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క పేరా లేదా ఒక్కొక్క పేజీ. మచ్చుకి, నాలుగైదు అధ్యాయాలు మీతో పంచుకుంటున్నాను.
___
7
లూ రాజ్యాన్ని ఝావో ప్రభువు పాలించడం మొదలుపెట్టి ఏడవ సంవత్సరం, అంటే క్రీస్తు పూర్వం 535 లో జి-సున్ అనే ఒక ఉన్నతాధికారి తనతో పాటు పనిచేస్తున్న తోటి ఉద్యోగుల కోసం ఒక విందు ఏర్పాటు చేసాడు. కన్‌ఫ్యూషియస్‌కి అప్పటికి పదిహేడేళ్లు తాను కూడా ఒక అధికారి కొడుకుని అనే ఉద్దేశ్యంతో ఆయన కూడా ఆ విందుకి వెళ్ళాడు. కాని ఆ రోజు ఆయన్ని ఆ విందులో అడుగుపెట్టకుండా గుమ్మం దగ్గరే ఆపేసారు. ఎందుకంటే ఆయన అధికారి కొడుకు కావచ్చు కాని, స్వయంగా అధికారి కాడు కాబట్టి. ఆ సంఘటన కన్‌ప్యూసియస్‌ని జీవితకాలం పొడుగునా వెన్నాడింది.
16
ఫాంగ్-షాన్ నుంచి తిరిగి వస్తూండగా కన్‌ఫ్యూషియస్‌ని ఒక బందిపోటు అడ్డగించాడు. ఆ బందిపోటు కత్తితిప్పడంలో ఘనుడు. వెంటనే తమ గురువుని కాపాడుకోవడం కోసం శిష్యులు కూడా కత్తులు దూసారు, కాని కన్ ఫ్యూసియస్ వాళ్ళని నివారించాడు. ఆ బందిపోటుతో నెమ్మదిగా, మృదువుగా మాట్లాడి అతడి విషయాలు అడిగి తెలుసుకున్నాడు. ఆ దొంగ పేరు జీ-లు. ఒక రాజ్యాన్ని పాలించడమెట్లా అని అతడు కన్‌ఫ్యూషియస్‌ని అడిగాడు. ‘దయార్ద్రహృదయం కలిగిన విధానాలతో’ అని జవాబిచ్చాడు కన్‌ఫ్యూషియస్. ‘దయార్ద్ర హృదయం అంటే ఏమిటి?’ అనడిగాడు జీ-లు. ‘నిన్ను నువ్వు అదుపులో పెట్టుకోవడం, ధర్మసూత్రాలు పాటించడం’ అని చెప్పాడు కన్‌ఫ్యూషియస్. ఇంకా ఇలా చెప్పాడు: ‘ఇప్పుడు నువ్వు నా మీద కత్తిదూసావు కదా. అప్పుడు నేను నీకు ఓపికతో జవాబుచెప్పాను. ఇద్దరం కత్తులు దూసి ఉంటే రక్తం ప్రవహించి ఉండేది. అది నేను చూడలేక పోయేవాణ్ణి. దాన్నే దయార్ద్రహృదయం అంటారు. దయగా ఉండటమంటే ఇతరుల్ని ప్రేమించడం. ప్రతి ఒక్కరూ అలా తమని తాము అదుపులో పెట్టుకుని మంచిపనులు చెయ్యడం మొదలుపెడితే, ఈ లోకమంతా దయాగుణం పొంగిపొర్లుతుంది.’
34
కన్‌ఫ్యూషియస్ తన శిష్యులతో కలిసి వెచ్చని వసంతపవనంలో ఓలలాడుతూ పాటలు పాడుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఆయన తన శిష్యులు యాన్-హుయి, ఝీ-లు లతో ‘ఇప్పుడు మీకేమనిపిస్తోందో చెప్పండి’ అనడిగాడు. అందుకు ఝీ-లు ‘ఇప్పుడు మా రథాల్నీ, వస్త్రాల్నీ ఎవరు తీసుకుపోయినా మాకు బాధలేదు, అవి పాడైపోయినా పట్టించుకోం’ అన్నాడు. ‘నాకు నా గొప్పదనాన్ని చెప్పుకోవాలని గాని లేదా ఊరికినే ఏదో ఒకదానికి గర్వించాలని గానీ లేదు’ అన్నాడు హాన్-హుయి. ‘మరి మీరేమనుకుంటున్నారు’ అనడిగాడు ఝీ-లు కన్‌ఫ్యూషియస్‌ని. ‘వృద్ధులూ, పెద్దవాళ్ళూ శాంతిగా, సంతోషంగా ఉండాలనీ, స్నేహితులు పరస్పరం నమ్మకంగా మెలగాలనీ, చిన్నపిల్లలకి చక్కని సంరక్షణ దొరకాలనీ కోరుకుంటున్నాను’ అన్నాడు కన్‌ఫ్యూషియస్.
52
పూర్వం రోజుల్లో ఏ ఇంట్లోనైనా నైరుతి దిక్కు ని ఎంతో గౌరవప్రదంగా భావించేవారు. అది ‘ఆవో’ దేవత అధిస్ఠానమని నమ్మేవారు. అయితే వంట ఇంటికి కూడా ఒక దేవత అధిపతిగా ఉండేది గాని ఆ దేవత ఆవో దేవతకన్నా కొద్దిగా తక్కువస్థాయి దేవత. కాని మనుష్యప్రపంచంలో ఏమి జరుగుతున్నదో నేరుగా దేవుడికి నివేదించే అధికారం ఆ దేవతకు ఉండేది. కాబట్టి ఆవో దేవతకి మొక్కులు చెల్లించడం కన్నా వంటింటి దేవతకు దణ్ణాలు పెట్టడం మంచిదనే ఒక సామెత వాడుకలో ఉండేది.
వెయి రాజ్యంలో తనకి ఇవ్వచూపిన పదవిని స్వీకరించాలనే కన్‌ఫ్యూషియస్ మొదట్లో అనుకున్నాడు. అందుకుగాను ప్రభువుకి దగ్గరగా ఉన్న అధికారుల బదులు మరొక అధికారిని మంచి చేసుకొమ్మని వాంగ్-సుంజియా అనే మంత్రి కన్‌ఫ్యూషియస్‌కి సలహా ఇచ్చాడు. ఆ మాటలు వినగానే కన్‌ఫ్యూషియస్ పై సామెత గుర్తు చేస్తూ ‘మీరు చెప్తున్నది అలాగే ఉంది, కాని అది సరైన మార్గం కాదు. అందరికన్నా పైన దైవం ఉన్నాడు. దైవశాసనాన్ని తప్పి నడుచుకుంటే ఏ దేవతా సాయం చెయ్యలేదు’ అన్నాడు.
80
జి-గాంగ్ అడిగాడు కన్‌ఫ్యూసియన్‌ని ‘మీకెవరంటే ఎక్కువ ఇష్టం? జువాన్ సన్ షి అంటేనా లేక బూ-షాంగ్ అంటేనా?’ ‘జువాన్-షి ఎంత దూరమైనా పోడానికి సిద్ధపడతాడు, కాని బూ-షాంగ్ మరీ అంత దూరం పోవాలనుకోడు’ అన్నాడు కన్‌ఫ్యూషియస్. ‘అంటే మీరు జువాన్-షీ పట్ల మొగ్గు చూపుతున్నట్టు అనుకోవచ్చా?’ అనడిగాడు జి-గాంగ్. ‘లేదు. సంగతేమిటంటే, ఎంత దూరమైనా పోవాలను కోవడమూ, ఎంతో దూరం పోడానికి ఇష్టపడకపోవడమూ- రెండూ సరైనవి కావు’ అన్నాడు కన్‌ఫ్యూషియస్.
____
పుస్తకం కావలసినవారు అలకనంద ప్రచురణలు, 59-6-150 కంచుకోట వీథి, మేరిస్ స్టెలా కాలేజి ఎదట, విజయవాడ, 520008 కి రాసి తెప్పించుకోవచ్చు లేదా http://www.ashokcentre.com ద్వారా ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టవచ్చు. పుస్తకం వెల రు.175/-
22-1-2023
https://ashokbookcentre.com/shop/confucius/
Thank you for your kind words sir 🙏
Welcome Sir
ముఖచిత్రం చూస్తుంటేనే ఊరింపుగా ఉంది.
ప్రతీ పేజీలోనూ బొమ్మలతో ఊరిస్తూ ఉంది. ఒకప్పుడు ఇస్మాయిల్ గారు తన పుస్తకాలు ఇలా వేసుకోవాలి అని ఆశ పడేవారు. అందుకే పుస్తకం అట్ట మీద నీ పేరు చూసుకుని హాయిగా గర్వించు.
చాలా సంతోషం, ఈ పుస్తకం చూసినందుకు.
రుచి అద్భుతంగా చూపించారు … ఇక పూర్తి వంట ఆస్వాదించాలి లక్ష్మీనారాయణ
మీ స్పందనకు ధన్యవాదాలు. మీరు చదివారంటే ఆంధ్రదేశం అంతా ఈ పుస్తకం గురించి తెలుస్తుంది.