
61
ప్రధాన గాయకుడికోసం గీతం, దావీదు కృతి
నా హృదయాన్ని నిస్సత్తువ ఆవహించినప్పుడు
దిగంతపు సరిహద్దునుండి నిన్ను పిలుస్తాను
ఓ దైవమా, నా మొరాలకించు
నా ప్రార్థన పట్టించుకో.
నా కన్నా ఎత్తైన కొండకొమ్ముమీదకి
నన్ను నడిపించు
నువ్వే నాకు నా ఆశ్రయానివి
నా శత్రువులకి అడ్డునిలబడే దుర్భేద్య దుర్గానివి
నీ గుడారంలో నన్ను నివసించనివ్వు
నీ రెక్కలనీడన నన్ను తలదాచుకోనివ్వు
ఎందుకంటే, దేవుడా, నువ్వు నా శపథాలు విన్నావు
భాగవతోత్తముల కోవలో నా పేరు కూడా రాసుకున్నావు
రాజుకి నువ్వు దీర్ఘాయుర్దాయమిస్తావు
ఆయనకు పుత్రపౌత్రాభివృద్ధి కలుగుగాక
ఆయన సదా దైవసన్నిధిలో నిలిచి ఉండుగాక
స్థిరమైన ప్రేమ, విశ్వాసం అతణ్ణి కాచిరక్షించుగాక
ప్రతిరోజూ నీ గుణగాణం చేస్తాను
అనుదినం నా మొక్కులు చెల్లించుకుంటాను.
62
ప్రధాన గాయకుడికోసం గీతం, దావీదు కృతి
భగవంతుడికోసమే నా ప్రాణం నిశ్శబ్దంగా పరితపిస్తున్నది
ఆయనవల్లనే నాకు విడుదల
అతడే నా ఆధారశిల, నా విమోచన,
నా దుర్గం. నన్నెవ్వరూ కదపలేరు.
ఎంతకాలం మీరంతా కలిసి ఒక్కమనిషినిట్లా వేధిస్తారు
అసలే అతడొక ఒరిగిపోయిన గోడ
కూలిపోతున్న కంచె.
అతడు పైకి చేరుకున్న చోటు నుంచి
అతణ్ణెట్లా కిందకు పడదొయ్యాలా అన్నదే మీ పన్నాగం.
కపటంలోనే మీకు సంతోషం
పైకి ప్రశంసలు కురిపిస్తారు
మనసులో శపిస్తారు.
నా ప్రాణమా, దైవం గురించి మాత్రమే ఎదురుచూడు.
నాకున్న ఆశ ఆయనొక్కడే
అతడే నా ఆధారశిల, నా విమోచన
నా దుర్గం, నన్నెవ్వరూ కదపలేరు.
ఆయన్ని బట్టే నా విడుదల, నా యశస్సు
నా బంగారుకొండ, నా నీడ దైవమొక్కడే.
జనులారా, ఎన్నటికీ ఆయన్నే నమ్ముకోండి
ఆయనముందే మీ హృదయం కుమ్మరించుకోండి.
మనందరికీ తోడూ, నీడా ఆయనొక్కడే.
మనుషులు నిమ్నస్థానాల్లో ఉండటం క్షణిక సత్యం.
ఉన్నతస్థానాల్లో ఉన్నారన్నది ఒక భ్రమ
దేవుడి తక్కెడలో అవి తేలిపోతాయి.
ఆ రెండూ కలిసి గాలికన్నా పలచన.
దౌర్జన్యాన్ని నమ్ముకోకండి
దోచుకోవడం మీద ఆశలు పెట్టుకోకండి
కలిమి సమకూరుతున్నదా, కనీసం మీ చూపులు కూడా తిప్పకండి.
దేవుడు ఒకసారి ఒక మాట చెప్పాడు
ఆ మాటలు రెండు సార్లు విన్నాను:
నిజమైన శక్తిమంతుడు దైవమొక్కడే అని.
ప్రభూ, నీది ప్రేమశిబిరం
ఎవరికి చేతలకు తగ్గట్టుగా
వాళ్ళని తీర్చిదిద్దుతావు.
63
యూదాలో ఏకాకిగా సంచరిస్తున్నప్పుడు దావీదు రాసుకున్న కీర్తన
దేవుడా, నువ్వే నా దైవానివి, నేను వెతుక్కుంటున్నది నిన్నే
నిర్జలసీమలో ఎండి మాడిపోయిన నేలలాగా
నా ప్రాణం నీకోసమే దప్పిపడి ఉంది
నా దేహం నీకోసమే స్పృహతప్పుతున్నది.
నిన్ను నా అభయక్షేత్రంగా గుర్తుపట్టాను
నీ యశోవైభవాలు కళ్లారా కనుగొన్నాను
జీవితాన్ని మించింది నీ ప్రేమ
కాబట్టే నా అధరాలు నిన్నే జపిస్తున్నాయి.
బతికినంతకాలం నిన్ను స్తుతిస్తూనే ఉంటాను
చేతులు పైకెత్తి నీ గుణసంకీర్తన సాగిస్తాను.
ప్రాణానికి పుష్టికరమైన ఆహారం దొరికినట్టు
నా సంతోషచలితాధరాలు నిన్ను కీర్తిస్తాయి
శయ్యమీద మేనువాల్చినప్పుడు
రాత్రి నాలుగు జాములూ నీ గురించే తలపోస్తుంటాను
నువ్వే కదా నాకు తోడు
నీ రెక్కలనీడలోనే నా సంతోషం, నా సంగీతం
నా ప్రాణం నిన్ను కరిచిపట్టుకున్నది
నీ కుడిచేత్తో నన్ను దగ్గరగా తీసుకున్నావు.
నా జీవితాన్ని కూలదొయ్యాలనుకున్నవాళ్ళు
వాళ్ళే పాతాళంలో కుంగిపోతారు.
కత్తికి ఆహారంగా మారతారు,
నక్కలపాలవుతారు.
రాజుకి కూడా శుభంకలిగేది దైవం వల్లనే
సకలజనుల్నీ పైకెత్తేది దైవమే,
అబద్ధాలాడేవాళ్ళ నోరునొక్కేసేదీ ఆయనే.
21-1-2023
“నువ్వే”కదా నాకు తోడు”.
అందరికీ తోడు నీడ ఆ దైవమే.
ఆయన లేని జగత్తు లేదు.
జగత్తు లేకున్నా ఆయన ఉన్నాడు.
నిజమే కదా!