జయగీతాలు-10

Reading Time: 2 minutes

52

ప్రధాన గాయకుడికి గీతం, దావీదు కృతి

ఎదోం దేశవాసి దోయేగు సౌలు దగ్గరికి వెళ్ళి దావీదు అహీమెలెక్ ఇంట్లో ఆశ్రయం పొందాడని చెప్పాడని తెలిసినప్పుడు దావీదు రాసుకున్న గీతం ఇది.


ఉద్ధత మానవుడా నీ చెడునడతని చూసుకుని ఎందుకంత ఉబ్బిపోతున్నావు
కలకాలం నిలబడేది కరుణామయుడి ప్రేమ మాత్రమే.
నువ్వు నోరువిప్పితే విధ్వంసం
రంపంకొక్కుల్లాగా నీ చేతలనిండా మోసం
నీకు చెడు రుచిస్తుంది, మంచి కాదు.
నీ దృష్టి అబద్ధాల మీదే, నిజం మీద కాదు.
మోసకారి నోరు
నువ్వు మాట్లాడే మాటలు క్రూరమృగాల్లాగా విరుచుకుపడతాయి.

కాని దేవుడు నిన్ను నిట్టనిలువునా కూల్చేస్తాడు
నీ గుడారం నుంచి నిన్ను బయటకు ఈడ్చేస్తాడు
బతికున్న మనుషులనుంచి వేళ్ళతో పెళ్లగించిపారేస్తాడు
సత్యవంతులకి సత్యం తెలుసుకాబట్టి భయపడతారు
నిన్ను చూసి నవ్వుతూ అంటారు కదా
‘చూడండి దేవుణ్ణి శరణుజొచ్చనివాడి పరిస్థితి
తన ఐశ్వర్యాన్ని నమ్ముకుని
చేజేతులా వినాశనం కొనితెచ్చుకున్నాడు’ అంటారు.

నేను మటుకు భగవంతుడి ముంగిట్లో
పచ్చటిచెట్టులాంటి వాణ్ణి.
ఎప్పటికీ మరెప్పటికీ
భగవంతుడి ప్రేమనే నమ్ముకున్నవాణ్ణి.
నా మీద వర్షించిన ఈ ప్రేమ
నేనెప్పటికీ గుర్తుపెట్టుకుంటాను.
భగవత్సన్నిధిలో దైవ శుభనామసంపదకోసం
సదా నిరీక్షిస్తాను.

53

ప్రధాన గాయకుడికోసం గీతం, దావీదు కృతి


మూర్ఖుడు తనకు తాను చెప్పుకుంటూ ఉంటాడు
దేవుడు లేడని.
వాళ్ళ నడత మంచిది కాదు, భ్రష్టులు,
మంచి తలపెట్టేవాడు ఒక్కడు కూడా లేడు.

పరికిస్తుంటాడు దేవుడు మనుషుల్ని
ఆకాశసీమనుండి
ఒక్కడన్నా తనని అర్థం చేసుకున్నవాడున్నాడా
ఒక్కడన్నా తనకోసం తపిస్తున్నాడా అని.

మొత్తమంతా తోవతప్పినవాళ్ళు,
వ్యర్థులు.
మంచి కోరుకునే వాడు ఒక్కడు కూడా లేడు,
ఒక్కడంటే ఒక్కడు.

చెడుపనులు చేసేవాళ్లు గ్రహించరెందుకు?
రొట్టెలు నమిలినట్టు నా మనుషుల్ని తినేస్తున్నారే!
ఒక్కడికీ దైవం గుర్తుకు రాడు.

అదిగో, భయరహితసీమలో ఉన్నా
చూడు, వాళ్ళెట్లా వణికిపోతున్నారో
నీకు వ్యతిరేకంగా శిబిరంకట్టినవాళ్ళని
ఆయన ఎట్లా ఎముకలు విరగ్గొడుతున్నాడో.
దైవం తోసిపుచ్చినవాళ్ళకి దక్కేది అవమానమే.

నా దేశానికి విముక్తి లభించేది నా దైవం నుంచే
భగవంతుడు నా ప్రజల భాగ్యాన్ని కూడగట్టాక
నా దేశం హర్షించనీ, నా ప్రజలు సుఖించనీ.

54

తంత్రీవాద్యబృందంలో ప్రధానగాయకుడికోసం గీతం, దావీదు కృతి

జీఫ్ వాళ్ళు సౌలు దగ్గరికి వెళ్ళి దావీదు తమమధ్యనే దాగివున్నాడని చెప్పారని తెలిసినప్పుడు దావీదు రాసుకున్న గీతం ఇది.


భగవంతుడా, నీ పేరుమీద నన్ను కాపాడు
నీ శక్తితో, బలంతో నన్ను నిలబెట్టు
దైవమా, నా మొరాలకించు
నా విన్నపాలు వినిపించుకో.

పరాయివాళ్ళు నా మీద విరుచుకుపడుతున్నారు
క్రూరులు, నా ప్రాణాలకోసం పగబట్టారు
వాళ్ళపక్కన దేవుడు లేడు.

చూడండి, దేవుడు నా పక్కన నిలబడ్డాడు
నా బతుకు తనచేతుల్లోకి తీసుకున్నాడు
నా శత్రువులమీద ప్రతీకారం తీర్చుకుంటాడు.
తప్పనిసరిగా వాళ్ళని మట్టుబెడతాడు.

సంతోషంగా నీకోసం నైవేద్యాలు సమర్పిస్తాను
నీకు ధన్యవాదాలు చెల్లించుకోవడం నిజంగా శుభప్రదం
ప్రతి ఒక్క విపత్తునుంచీ నన్ను బయటపడేసిన
ఆయన దయవల్ల నా పగవాళ్ళ ఓటమినాకు కన్నులపండగ..

20-1-2023

4 Replies to “జయగీతాలు-10”

  1. నీవేతప్ప నితఃపరంబెరుగ మన్నించం దగున్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మకా!
    విశ్వాసం విశ్వమంతటా ఒకటే

  2. “మూర్ఖుడు తనకు తాను చెప్పుకుంటాడు
    దేవుడు లేడని.”
    జ్ఞానులు తమ లోనే ఉన్న దైవాన్ని దర్శించుకుంటారు
    తరిస్తారు.

Leave a Reply

%d bloggers like this: