జయగీతాలు-9

Reading Time: 2 minutes

43


దైవాన్ని నమ్మని వాళ్ళ ముందు

నన్ను సమర్థించు ప్రభూ, నా తరఫున వాదించు

మోసకారిమనుషులనుంచి,

అన్యాయానికి ఒడిగట్టేవారినుంచి

నన్ను బయట పడెయ్యి.

నా ఏకైక ఆశ్రయానివి, దైవానివి నువ్వొక్కడివే

నన్నెందుకు నిరాకరిస్తున్నావు

నా శత్రువు నన్ను పెడుతున్న బాధలకి

నేనెందుకిట్లా శోకిస్తూ తిరగాలి?

నీ సత్యాన్నీ, వెలుతురునీ నాకోసం పరిచిపెట్టు

వాటితో నాకు దారిచూపించు

అవి నన్ను నీ పవిత్ర శిఖరం చెంతకి

నీ గృహప్రాంగణానికి నన్ను తీసుకురానివ్వు

అప్పుడు నేను భగవంతుడి అర్చావేదికదగ్గర నిలబడతాను

నా తంబుర సితారనాదాలతో నా దైవమా

ప్రియదైవమా, నా ఆనందధామమా, నిన్ను స్తుతిస్తాను

నా ప్రాణమా నువ్వెందుకిట్లా నీరసించిపోయావు

లోపల్లోపల ఎందుకిట్లా సతమతమవుతున్నావు

దేవుణ్ణి నమ్ము. ఆయనే నా దైవం, నా విముక్తి

మళ్ళా మళ్ళా అయనకే నా స్తోత్రములు, స్తోత్రములు.

46

ప్రధాన గాయకుడి గీతం, కోరాపుత్రుల కృతి


భగవంతుడే మనకు దిక్కు, బలం

కష్టాలు చుట్టుముట్టినప్పుడు ఆయనొక్కడే ఓదార్పు.

సముద్రాలు ఘూర్ణిల్లనీ, నురగలు కక్కనీ

కెరటాల తాకిడికి కొండలు కంపించనీ

భూమి బద్దలై, కొండలు కడలిలో కుంగిపోనీ

మనకు భయం లేదు.

భగవంతుడి నగరంచెంత ఆహ్లాదనదీప్రవాహం ఒకటుంది

అచంచలం, అక్కడే భగవంతుడు నిలిచి ఉంటాడు

సర్వేశ్వరుడి పవిత్ర సన్నిధానం

ప్రతి ఉషోదయవేళా ఈశ్వరుడు ఆమెకి తోడునిలబడతాడు.

జాతులు తిరగబడతాయి, రాజ్యాలు తడబడతాయి

ఆయన తన గళం విప్పగానే భూమి కరిగిపోతుంది.

సేనాధీశుడు సర్వేశ్వరుడు మనకు తోడుగా ఉన్నాడు

దేశాధీశుడు మనకు కోటలాగా నిలబడివున్నాడు.

రండి, ప్రభు మహిమలు చూడండి

ఈ భూమిని ఆయన శిథిలం చెయ్యగలడు, చూడండి

యుద్ధాల్ని భూమి అంచులదాకా తుడిచెయ్యగలడు

విల్లమ్ములు విరిచిపారేసాడు, బల్లేల్ని ముక్కలు చేసేసాడు

రథాల్ని దగ్ధం చేసేసాడు.

నిశ్చింతగా ఉండు, దైవం నేనేనని తెలుసుకో.

సమస్త జాతులు నన్ను కొనియాడతాయి

భూమిమొత్తం నా మహిమను ఉద్ఘాటిస్తుంది.

సేనాధీశుడు సర్వేశ్వరుడు మనకు తోడుగా ఉన్నాడు

దేశాధీశుడు మనకు కోటలాగా నిలబడివున్నాడు.

47

ప్రధానగాయకుడి గీతం, కోరాపుత్రుల కృతి


సమస్త జనులారా, సంతోషంగా చప్పట్లు చరచండి

అత్యుచ్చస్వరంతో ఆనందగానం ఆలపించండి.

సర్వేశ్వరుడు ప్రభువుని చూసి భీతిచెందండి

సమస్తపృథ్విమీద రాజాధిరాజు ఆయన.

జనుల్ని మన చేతికింద అణచిపెట్టాడు

జాతుల్ని మన కాళ్ళకింద తొక్కిపెట్టాడు.

తాను ప్రేమిస్తున్న దేశం పట్ల అభిమానాన్ని

మనకు వారసత్వంగా అనుగ్రహించాడు.

దైవం ఉచ్చైస్వరంతో పైకి అధిరోహించాడు

భేరీనినాదంతో ప్రభువు ముందుకు సాగాడు

ఆలపించండి స్తోత్రాలు దైవానికి, స్తోత్రాలు

మన రాజాధిరాజుకి స్తోత్రములు, స్తోత్రములు.

సమస్తభూమండలానికి రాజాధిరాజు ఆయన

సర్వేశ్వరుడికి సామగీతాలతో స్తోత్రమాలపించండి.

లోకమంతటికీ దైవమొక్కడే పాలకుడు

తన పవిత్ర సింహాసనం మీద అభిషిక్తుడు

సమస్త జాతులరాకుమారులూ అబ్రహాము

సంతతితిగా ఒకచోట కూడుకుంటున్నారు.

భూమ్మీద ఉన్న రక్షణస్థలాలన్నీ దేవుడివే

సర్వేశ్వరుడు, ఆయన సర్వోన్నతుడు.

19-1-2023

4 Replies to “జయగీతాలు-9”

 1. సాహితీమూర్తి కి వందనం.శుభోదయం.

  46వ కృతి భావపరంగా,భాషా పరంగా చాలా బాగుంది.

  సహజ సుందర శైలి కి భిన్నంగా,కొంత కృత్రిమంగా ఉంటాయి క్రైస్తవుల ప్రవచనాలు.

  1. ఒక భాష నుంచి మరో భాషలో అనువాదం చేసేటప్పుడు అనువాద సమస్యలు ఉంటాయి. తొలి తరం బైబిల్ అనువాదకులు ఆ సమస్యలు ఒక విధంగా పరిష్కరించాలి అనుకున్నారు. ఇప్పుడు మనకి మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి.

 2. ఆత్మగతంగా దైవం పై విశ్వాసం అన్న విషయం ఇప్పటి వాళ్లకు తలకెక్కడం ఒక జటిలమైన విషయం.అదేదో షాపింగ్ మాల్ కు వెళ్లినట్లుగానే టెంపుల్ కి వెళ్తే అయిపోతుంది అన్న భ్రమ పెరిగిపోయింది.దేవుడు అనే పదం ఇప్పుడు పక్కా కమర్ష్యలాత్మకం.అలాగని అందరిననటం లేదు కాని భక్తి కాన్సెప్టు మారింది.ఆర్తోరర్థార్థి జిజ్ఞాసువులు
  ప్రశ్నార్థకాలు.దేవాలయ నిర్మాణ స్థాయిలోనే స్వార్థ భూమికలు కన్పిస్తున్నాయి.Trust of God అనేది గీతాల్లో పుష్కలంగా ఉంది.

  1. మీరు సరిగా పట్టుకున్నారు. తనకి ఒక భగవంతుడు ఉన్నాడు అనే విశ్వాసం మనిషికిచ్చినంత బలం మరేదీ ఇవ్వలేదు.

Leave a Reply

%d bloggers like this: