జయగీతాలు-8

Reading Time: 4 minutes

జయగీతాలుగా నేను అనువదిస్తున్న ఈ స్తోత్రాలకు, విన్నపాలకు ప్రత్యేకంగా ఎటువంటి వ్యాఖ్యానం అవసరంలేదనుకున్నాను. అందుకని ఆ గీతాల్ని సరళవచనంలో నేరుగా అనువదిస్తున్నాను. అయితే, ఈ గీతాల నేపథ్యం గురించి మరికొన్ని విషయాలు మీతో పంచుకుంటే మీరు వీటిని ఎక్కువ ఆస్వాదించగలరు అనిపించింది.

Psalms గా ఇంగ్లిషు బైబిలు పేర్కొన్న ఈ కవితల్ని తెలుగు బైబిలు ‘కీర్తనలు’ అని అనువదించింది. వీటి హీబ్రూ మూల పదం mizmor అంటే గీతం లేదా గేయమని అర్థం. దాని మరో పదం tehilim అంటే అర్థం స్తోత్రం అని. స్తోత్రంగానూ, గీతంగానూ కూడా వీటికి సంగీత సహకారం ఉండితీరాలన్న సూచనలేదు. కాని ఇవి మతపరమైన క్రతువుల్లో హవిస్సులు అర్పిస్తూ పలికే సూక్తాలకన్నా భిన్నమైనవి అని మాత్రం అర్థం చేసుకోవలసి ఉంటుంది.

Psalms లేదా ఈ సామగీతాలు క్రీస్తుకన్నా ఎంతో పూర్వకాలానికి చెందిన గీతాలు. చారిత్రికంగా ఇవి కాంస్యయుగానికి చెందినవి. అన్నిటికన్నా ప్రాచీన గీతం (90) మోషే కూర్చిన గీతంకాగా, అన్నిటికన్నా చివరి గీతాలు (126) యూదులు బేబిలోన్ లో ప్రవాసులుగా ఉన్నప్పటి కాలానికి చెందినవి. దాదాపు వెయ్యేళ్ల కాలానికి చెందిన మొత్తం 150 గీతాల్లోనూ ఎక్కువ భాగం అంటే డెబ్భై మూడు గీతాలు దావీదు రాజు కూర్చినవి. మోషే, ఎతాను, హెమాను అనేవారు ఒక్కొక్కగీతం కూర్చారు. పదకొండు గీతాలు కొరా పుత్రులు కూర్చినవి, పన్నెండు అసాఫ్ కూర్చినవి. మిగిలిన నలభై అయిదు గీతాలకి కర్తలెవరో తెలియదు.

నూట యాభై సామగీతాల్నీ అయిదు విభాగాలుగా పరిగణించడం పరిపాటి. 1 నుంచి 41 దాకా మొదటి భాగం, 42 నుంచి 72 దాకా రెండవ భాగం, 73 నుంచి 89 దాకా మొదటిభాగం, 90 నుంచి 106 నాలుగవ భాగం, 107 నుంచి 150 దాకా అయిదవభాగం.

ఇటువంటి విభజనకి కారణం స్పష్టంగా తెలియదు. కాని పాతనిబంధనలోని మొదటి అయిదుగ్రంథాలూ యూదులు తోరాగా పరిగణించే పారాయణగ్రంథాలు. సామగీతాల్లోని అయిదు విభాగాలూ ఆ అయిదు గ్రంథాలకీ అనుబంధంగా పరిగణిస్తూ తోరా పారాయణం జరిగినప్పుడల్లా ఈ అయిదు విభాగాల్నీ కూడా పారాయణం చేసేవారని మాత్రం తెలుస్తున్నది.

ఈ సామగీతాలకి ఇందరు కర్తలున్నప్పటికీ ఇవి ప్రధానంగా దావీదు కృతులుగానే ప్రసిద్ధికెక్కాయి. ఇటీవలి పరిశోధనలు దావీదు కర్తృత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పటికీ, కొందరు పరిశోధకుల దృష్టిలో దావీదు చారిత్రిక వ్యక్తి కాకపోయినప్పటికీ, ఒక ప్రశ్న మిగిలే ఉంటుంది. బైబిల్లో ఎందరో ప్రవక్తలు, ఎందరో కవులు, గాయకులు ఉండగా, వీటి కర్తృత్వాన్ని దావీదుకే ఎందుకే ఆరోపిస్తూ వచ్చారని. అందుకు రెండు కారణాలు చెప్పవచ్చు. మొదటిది, దావీదు గొర్రెలకాపరిగా ఉన్నప్పుడు ఒక తంత్రీవాద్యం మీద భగవత్ సంకీర్తనం చేసేవాడనీ, సౌలు రాజు అస్వస్థతకు గురయినప్పుడల్లా దావీదు వచ్చి  పాటలు పాడితే ఆ రాజుకి స్వస్థత చిక్కేదనీ బైబిలు చెప్తున్నందువల్ల. అంతేకాదు, మోషే తో యెహోవా కుదుర్చుకున్న మొదటి ఒడంబడిక మంజూషికని యెరుషలేం తీసుకువచ్చినప్పుడు దావీదు ఆ ఊరేగింపులో ముందునిలబడి ఆనందంతో పాటలు పాడుతూ నాట్యం చేసాడని కూడా అతడి కథ చెప్తున్నది. అంత విస్పష్టమైన గాయకుడిగా బైబిల్లో మరే పాత్రా మనకు కనిపించదు.

ఇక రెండో కారణం మరింత లోతైనది.

పాతనిబంధనలో David కథ Samuel మొదటి, రెండవ గ్రంథాల్లోనూ, Kings గ్రంథంలో మొదటి అధ్యాయాల్లోనూ ఉంది. ఆ కథ చదివినవాళ్ళకి అంత నాటకీయమైన జీవితకథ బైబిల్లో మరొకటి లేదని అర్థమవుతుంది. మోషే, యోసేపు లు కూడా దావీదు కనిపించినంత మానవీయంగా కనబడరు. దావీదు ఎంత బలవంతుడో అంత బలహీనుడు కూడా. అతడు తన జీవితకాలమంతా బయటి శత్రువులతో ఎంతో పోరాడేడో, తన ఇంటి శత్రువుల తోనూ, తన అంతశ్శత్రువులతోనూ కూడా అంతగా పోరాడేడు. అంతర్బహిస్సంగ్రామాలతో సంచరించే దావీదు కథ చదువుతున్నంతసేపూ మన ఒళ్ళు గగుర్పొడుస్తూనే ఉంటుంది. మనం అతణ్ణి అభిమానించాలో, అభిశంసించాలో తేల్చుకోలేంగాని, విస్మరించలేమని మాత్రం అర్థమవుతుంది. కాని తనని నడిపించిన దైవం పట్ల అతడి విశ్వాసం ప్రశ్నించలేనిదిగా కనిపిస్తుంది, చివరికి అతడు తన దైవం పట్ల అపచారం చేసినప్పుడు కూడా. అతడి ముందు పాలన చేసిన సౌలూ, అత్యంత వివేకవంతుడైన అతడి కొడుకు సొలోమోనూ కూడా దైవాజ్ఞని ఉల్లంఘించి దైవోపతులైనప్పటికీ, వారి అభిశప్తతలో లేని తీవ్రత మనకి దావీదు జీవితంలో కనిపిస్తుంది. అటువంటి జీవితంవల్లనే దావీదు భగవద్భక్తులకి ఒక ప్రాగ్రూపంగా కనిపిస్తాడు. దేహానికీ, దైవానికీ మధ్య జీవితమంతా నలిగిపోయినవాడుగా కనిపిస్తాడు. ఒక భగవద్భక్తుడు తన జీవితంలో ఎన్ని విరుద్ధావస్థలకు లోనుకాగలడో అవన్నీ మనకి దావీదులో కనిపిస్తాయి. అందుకనే బహుశా, సామగీతాలకు ఒక కర్త అంటూ ఉంటే అందుకు దావీదుని మించిన అర్హుడెవరూ మనకి కనిపించరు.

నేను ఈ గీతాల్ని అనువదించాలనుకున్నప్పుడు పది పన్నెండు ద్విపదలకన్నా మించని గీతాల్నే ఎంచుకున్నాను. చిన్న గీతాలను అనువదించినప్పుడు వాటి స్ఫూర్తిని గ్రహించడం సులభం అనే ఉద్దేశ్యంతో వాటినే ఎంచుకున్నాను. ఆ ప్రణాళిక ప్రకారం మొదటి భాగంలోని 41 గీతాలకుగాను 18 గీతాల్ని ఇప్పటిదాకా అనువదించాను. అదే క్రమంలో మిగిలిన నాలుగు విభాగాలనుంచీ కూడా మరికొన్ని గీతాలు అనువదించబోతున్నాను.

సామగీతాలకు కింగ్ జేమ్స్ బైబిలు తర్వాత కూడా మరెన్నో ఇంగ్లిషు అనువాదాలు వచ్చాయి. కొందరు వాటిని మూలవిధేయంగానూ, కొందరు స్వేచ్ఛగానూ అనువదించారు. ఇంగ్లిషు మహాకవి మిల్టన్ కూడా సామగీతాల్ని ఇంగ్లిషు ఛందస్సుల్లో అనువదించే ప్రయత్నం చేసాడు. కాని ప్రాయికంగా హీబ్రూ, ఇంగ్లిషు భాషలమధ్య ఉన్న భాషాపరమైన, ఛందోపరమైన విభేదాలవల్ల ఏ ఒక్క అనువాదం కూడా హీబ్రూలోని స్ఫూర్తిని, సమగ్రతని మనకి పూర్తిగా అందించలేదనే హీబ్రూ భాషావేత్తలు చెప్తున్నారు.

కాని భాష, ఛందస్సులకన్నా కూడా అతి పెద్ద సమస్య, సామగీతాల్లోని తాత్త్వికతకు సంబంధించిన సమస్య. ఆ గీతాల్ని కూర్చుతున్నప్పుడు ఆ గీతకర్తలు యూదు సంస్కృతికన్నా పూర్వకాలాలకు చెందిన మధ్యాసియా గీతాలనుంచి స్ఫూర్తి తెచ్చుకున్నారు. ముఖ్యంగా కాంస్యయుగానికి చెందిన cannanite గీతాల్ని తమకు నమూనాలుగా తీసుకున్నారు. ఆ గీతాల్లోని హీబ్రూ పదాలను మనం రెండువేల ఏళ్ళ క్రైస్తవసంప్రదాయం, మతాచారాల నేపథ్యంలో అనువదించినప్పుడు ఆ మూలానికి పూర్తిగా న్యాయం చెయ్యలేమనేది ఇప్పుడు మనకి కలుగుతున్న మెలకువ.

హీబ్రూ పండితుడు, అనువాదకుడు Robert Alter ఈ అనువాద సమస్యలను తన The Book of Psalms, A Translation with Commentary లో విపులంగా చర్చించాడు. ఆయన ఇచ్చిన రెండు ఉదాహరణలు మనకి ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తాయి. మొదటిది, Psalms ఇంగ్లిషు అనువాదాల్లో తరచు కనవచ్చే soul  అనే పదం. దాని హీబ్రూ మూలానికి అసలైన అర్థం జీవం లేదా ప్రాణం. దాన్ని గ్రీకులోకి అనువదించినప్పుడు anima అని అనువదించడంతో గ్రీకు నుంచి ఇంగ్లిషు అనువాదకులు soul అనే సమానార్థకాన్ని తీసుకొచ్చారు. దాన్ని మనం తెలుగులో ‘ఆత్మ’ అని అనువదిస్తే, అది హీబ్రూ మూలానికి సమానార్థకం కాకపోగా అసలు అర్ధం నుంచి సుదూరంగా జరిగిపోయినట్టు కూడా. ఎందుకంటే, హీబ్రూ గీతకర్త మాట్లాడుతున్న జీవానికీ, ప్రాణానికీ, ఆత్మ అనగానే మనకు స్ఫురించే శాశ్వత ఆధ్యాత్మిక సత్యానికీ మధ్య చాలా అంతరం ఉంది. ప్రాచీన హీబ్రూ కవికి ఆత్మలాంటి పెద్ద పెద్ద భావనలు లేవు. జీవం, ప్రాణం, శ్వాస, ఊపిరి లాంటి భౌతిక-జైవిక పదజాలం మాత్రమే ఆ భావనకి న్యాయం చెయ్యగలదు. అలాగే మరొక పదం, కింగ్ జేమ్స్ వెర్షన్ లో తరచు ఉపయోగించిన salvation అనే పదం. ఆ మాట వినగానే మనకు స్ఫురించేది ఆధ్యాత్మిక విముక్తి, మోక్షం. కాని హీబ్రూ కవి మాట్లాడుతున్నది విడుదల గురించి. ఉదాహరణకి నువ్వొకరికి అప్పుపడ్డావు. జీవితకాలం వెట్టిచాకిరీ చేసినా కూడా ఆ అప్పుతీరదు. నిన్నెవరేనా ఆ అప్పునుంచి విడిపించారనుకో, అప్పుడు నీకు కలిగే విడుదల లాంటిదే సామగీతాలు మాట్లాడే విడుదల. ఇలా హీబ్రూ గీతాల్లోని ముఖ్య పదాలు, ముఖ్యభావనలు ఒక మనిషి తన ఇహలోక జీవితం నిరపాయకరంగా కొనసాగాలని కోరుకోడానికి సంబంధించినవి తప్ప పరలోకం గురించిన పాకులాటలు కావు.

దాదాపుగా మన ఋగ్వేదీయ సూక్తాలది కూడా ఇదే పరిస్థితి. ఋగ్వేద ఋషులు కోరుకున్నది నలుగురు కలిసి పనిచేస్తూ, నూరు శరత్తులు బతకాలని మాత్రమే. ఇహలోకాన్ని దాటిన పరలోకం మీద ఋగ్వేదానికి ఏమంత ఆసక్తి లేదు. ఆ అంశంలో ఋగ్వేదంలోని ఇంద్ర, అగ్ని సూక్తాలకీ, సామగీతాలకీ మధ్య ప్రాయికంగా ఏమంత పెద్ద తేడా లేదు. వాటిని secular hymns అన్నా కూడా అతిశయోక్తి కాదు.

ఈ మెలకువతో నేను Psalms ని తెలుగు చేయడానికి పూనుకున్నాను.  ఈ ప్రపంచం ప్రేమించదగ్గదిగానూ, నీతిబద్ధంగానూ, న్యాయసమ్మతంగానూ ఉండాలని కోరుకున్న గీతాలు కాబట్టి వీటిని చదువుతుంటే పరిశుభ్రమైన జలాల్ని తాకినట్టూ, తాజాపరిమళాలు మనమీంచి వీచినట్టూ నాకు అనిపిస్తున్నది. ఆ పులకింతను మీతో కూడా పంచుకోవాలనే ఈ గీతాల్నిట్లా అందిస్తున్నాను.

18-1-2023

4 Replies to “జయగీతాలు-8”

  1. మీ వివరణ చాలా బాగుంది.సర్. నావంటి కొన్ని తెలియని విషయాలను తెలియదు అని చెప్పకోవడం తప్పుకాదనుకుంటాను.ఎందుకంటే నేను ఈ దిశలో చదివినవేనా లేవు కనుక. మీరు ప్రస్తావించిన బైబిలు సామగీతాలు మొదలైనవి ఏ కాలానికి చెందినవిగా.క్రీస్తు వల్ల క్రైస్తవ మతం ఏర్పడింది కనుక అంతకు ముందున్న మతాలు మొదలైనవి తెలియాలంటే ఎలా? బైబిలు కర్త ఎవరు? యేహోవా ఎవరు వంటివి అనేకం.అలాగే హీబ్రా భాష ప్రధాన కేంద్రం ఎక్కడ.అది అతి ప్రాచీన భాష అని తెలుసు అంతే .మరొక్క విషయం
    మీరు కొన్ని ఇంగ్లీషు పదాలు ఆంగ్ల లిపిలోనే రాస్తున్నారు.వాటిని తెలుగులో ఎలా ఉచ్చరిస్తారో తెలిపితే బాగుంటుంది.Pslams అనే పదమే ఎలా ఉచ్చరించటమో అందులో p సైలెంటా s సైలెంటా అనే సందేహం కలిగి చదవడానికి తికమక పడవచ్చు నా లాంటి వాెవరైనా ఉంటే.ధన్యవాదాలు

  2. ఈ వివరణ అవసరమని వీరలక్ష్మీదేవిగారితో మాట్లాడుతున్నప్పుడు అనిపించింది .అనువాదంలోని తేడాలు ఒక కోణమైతే దైవానికి ఆపాదించిన లక్షణాలు ఇంకో కోణం .మనలో చాలా మందికి Christianity అనగానే కొత్త నిబంధనలలో వున్న గళం మాత్రమే తెలుసు. ఈ సామ గీతాల్లో వున్నది నిప్పులు చెరిగే క్షమాగుణంలేని యెహోవా.

Leave a Reply

%d bloggers like this: