జయగీతాలు-7

Reading Time: 2 minutes

36

ప్రధాన గాయకుడి గీతం, దావీదు కృతి


దుర్మార్గుడు చేసే అపరాధాలే

అతడి హృదయంలోంచీ వినబడతాయి.

అతడి కళ్ళల్లో 

దేవుడి పట్ల భయం కనిపించదు.

లోపలి క్రూరత్వం బయటికి కనబడదు, కాబట్టి అతణ్ణి ద్వేషించడం కష్టమని

అతడు బాహాటంగా తనని తాను పొగుడుకుంటాడు.

నోరు తెరిచాడా మోసం, దగా.

మంచిదారిన నడవడం అతడెప్పుడో మానేసాడు

పక్కమీంచి దిగకుండానే పన్నాగాలు మొదలుపెడతాడు

అతడు ఎంచుకునే దారి వంకరదారి

తప్పుపనుల పనుల పట్ల ఏవగింపు లేదతడికి.

ప్రభూ, నీ ప్రేమది సూటిదారి, అంతరిక్షందాకా విస్తరించింది.

నీవాళ్ళ పట్ల నువ్వు చూపే అనుగ్రహం మేఘపర్యంతం.

నీ సత్యసంధత మహాపర్వతం వంటిది

నీ నిర్ణయాలు లోతైన సముద్రాలవంటివి.

ప్రభూ, మనుషులకీ,  పశువులకీ నువ్వే రక్షణ.

స్థిరమైన నీ ప్రేమ ఎంత అమూల్యం ప్రభూ

మానవజాతి నీ రెక్కలనీడకింద తలదాచుకుంటుంది

నీ గృహాంగణసమృద్ధి వాళ్ళకు విందువడ్డిస్తుంది.

నీ సంతోషజలాల్లో వాళ్ళ దప్పిక తీరుతుంది.

ప్రాణం నీ దగ్గర ఒక ఊటలాగా ఊరుతుంది

నీ వెలుగులోనే మాకు వెలుగు చిక్కుతుంది.

నిన్ను తెలుసుకున్నవాళ్ళందరికీ నీ ప్రేమ స్థిరంగా ప్రసాదించు

సత్యసంధులహృదయాల్లో నీ నిజాయితీ నాటుకోనివ్వు

గర్విష్ఠులు నా మీద తమ పాదం మోపనివ్వకు

దుర్మార్గుల హస్తం నన్ను దూరంగా తరమనివ్వకు

చెడ్డపనులు చేసేవాళ్ళు అదుగో అక్కడే పడివున్నారు

మళ్ళా పైకి లేవకుండా కుప్పకూలిపొయ్యారు.

41

ప్రధానగాయకుడి గీతం, దావీదు కృతి


బీదసాదల పట్ల ప్రేమకలిగిన వాడు ధన్యుడు

కష్టకాలంలో ప్రభువు అతణ్ణి బయటపడేస్తాడు

అతణ్ణి కాపాడతాడు, ప్రాణాలతో నిలబెడతాడు

భూమ్మీద అంత భాగ్యశాలి మరొకడు లేడనిపిస్తాడు.

నువ్వు అతణ్ణి శత్రువుల కుట్రలనుంచి తప్పిస్తావు

అతణ్ణి రోగశయ్యమీద కూడా ప్రభువు చూసుకుంటాడు

అస్వస్థతపొందినవేళల్లో అతడికి సమకూరుస్తావు.

ఇక నా గురించి. నేను నీ పట్ల అపరాధం చేసాను

అయినా ప్రభూ, నా పట్ల కృపచూపు, నన్ను బతికించు

వాడు మరణించగానే ఊరూపేరూ లేకుండా పోతాడు చూడు

అంటారు నా శత్రువులు, వాళ్ళ మాటల్లో ఎంత విషం.

నన్నెవరేనా పరామర్శించినా పైకి చెప్పేవి వట్టిమాటలు

వాళ్ళమనసులో మాత్రం కుటిలత్వం పోగుపడుతుంటుంది

నాదగ్గర్నుంచి బయటికి పోగానే అది బయటపడుతుంది.

నన్ను ద్వేషించేవాళ్ళంతా బయట చెవులు కొరుక్కుంటారు

ఎంత చెడ్డగా చెప్పుకోవాలో అంతగానూ చెప్పుకుంటారు.

వాడిమీద పెద్ద ఆపద విరుచుకుపడింది అనుకుంటారు

వాడు పడి ఉన్నచోటనుంచి ఇక మళ్ళీ పైకి లేవడంటారు.

చివరికి నేనెంతో నమ్మిన నా ప్రియమిత్రుడు, ఎన్నిసార్లో

నాతో కలిసి విందారగించినవాడు కూడా నన్ను నిందిస్తాడు

కాని, ప్రభూ, నువ్వు నా పట్ల దయార్ద్రహృదయం చూపించు

నన్ను పైకిలేపు, కనికరించు, నేను వాళ్ళకి పాఠం చెప్తాను.

అప్పుడు తెలుస్తుంది నాకు నేనంటే నీకు ఇష్టమని

ఎన్నటికీ నా శత్రువుకి నామీద పైచేయి దక్కదని

నువ్వు నా నిజాయితీ చూసినన్నుకనికరిస్తావు

నీ సమక్షంలో నాకు శాశ్వతమైన స్థానమిస్తావు.

నా జనాన్ని కాపాడుతున్న నా దైవం మహోన్నతుడు

యుగాలనుండి యుగాలదాకా మహా మహిమోపేతుడు

                              తథాస్తు! తథాస్తు!

17-1-2023

13 Replies to “జయగీతాలు-7”

  1. నా నిజాయితీ చూసి కనికరిస్తావు అన్న ఒక్క మాట చాలు ప్రశాంతంగా బతకడానికి.

  2. నా నిజాయితీ చూసి కనికరిస్తావు అన్న ఒక్క మాట చాలు ప్రశాంతంగా బతకడానికి.

  3. నువ్వు నా నిజాయితీని ఛూసి కనికరిస్తావు.ఈ మాట చాలు ఈ జన్మకు

  4. “యుగాల నుండి యుగాల దాకా మహా మహిమోపేతుడు” కరుణామయుడు.
    దయగల తండ్రి.

  5. నాకు ఆశ్చర్యం కలిగించినది దావీదు దుర్మార్గులను వర్ణించిన తీరు .ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా ఒక్క అక్షరం కూడా మార్చనక్కర్లేదు .

    1. దుర్మార్గుల తీరు మారకపోవడమే కాదు కవి ఎవరిని దుర్మార్గులు అంటున్నాడో వాళ్లు ఇప్పటికీ దుర్మార్గులే. ఎవరు వాళ్ళు? తప్పుడు సాక్ష్యం చెప్పే వాళ్ళు, బీదసాదల్ని హింసించే వాళ్ళు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని ద్వేషించే వాళ్ళు.

Leave a Reply

%d bloggers like this: