
29
దావీదు కృతి
బృందారకులారా! స్తుతించండి ప్రభువుని
యశోవైభవాలతో నోరారా స్తుతించండి
ఆ ఘనత ఆయనదొక్కడిదేనని కీర్తించండి
పవిత్రత ఆభరణంగా ఆయన్ని అలంకరించండి.
జలరాశులమీద ఆయన వాక్కు పరుచుకుంది
సమస్త జలాల మీద, ప్రభు మహిమ,
ప్రభు వైభవోద్గోష వినవస్తున్నది.
ప్రభు కంఠస్వరం శక్తిమంతం
ప్రభు కంఠస్వరం మహిమోపేతం
ఆయన స్వరం దేవదారు తరువుల్ని కూల్చగలదు
లెబనాను దేవదారు కాననాల్ని తుంచెయ్యగలడు
లెబనానుని లేగదూడలాగా పరుగులెత్తించగలడు
సిరియోనుని ఎద్దుగిత్తలాగా గెంతులెత్తించగలడు
ప్రభు కంఠస్వరం అగ్నిశిఖల్ని వెలికితేగలదు
ప్రభు కంఠస్వరం ఎడారుల్ని వణికించగలదు.
ప్రభు కంఠస్వరం ఖాదేషు సీమని కంపింపచెయ్యగలదు.
ప్రభు కంఠస్వరానికి హరిణాలు ప్రసవిస్తాయి
అడవిచెట్లన్నీ ఆకులు రాల్చేస్తాయి.
దేవళంలో ప్రతి ఒక్కరూ ఆయనకి జయం పలుకుతారు.
ప్రభువు జలప్రళయం మీద పట్టాభిషిక్తుడు కాగలడు
రాజాధిరాజై శాశ్వత సింహాసనాధీశుడు కాగలడు
ప్రభువు తన ప్రజానీకానికి బలం ప్రసాదించుగాక !
ప్రభువు తన జనానీకానికి శాంతి సమకూర్చుగాక !
30
దేవాలయ ప్రతిష్ఠ వేళ దావీదు కృతి
నిన్ను స్తుతిస్తాను, ప్రభూ, నన్నుద్ధరించావు.
నా శత్రువులు నన్ను మించిపోకుండా కాపాడేవు.
ఓ ప్రభూ, నా ప్రభూ, నీ చేయూత కోసం విలపించినప్పుడు.
నువ్వు నాకు స్వస్థత చేకూర్చావు
నా ఆత్మని నరకం నుండి బయటకు లాగావు
పతితజనులనుండి పక్కకు తీసిపెట్టావు.
ఓ భాగవతోత్తములారా, ప్రభుగుణగానం చెయ్యండి.
దివ్యనామ సంకీర్తన మొదలుపెట్టండి.
ఆయన కోపం క్షణకాలం మాత్రమే
కాని అనుగ్రహం కలకాలం.
నా సంగతంటారా, రోజులు బాగా ఉన్నప్పుడు
నాకు ఎదురులేదనుకున్నాను.
ప్రభూ, నువ్వు అనుగ్రహించిన వేళల్లో
నేను కొండలాగా నిశ్చలంగా ఉన్నాను
నీ ముఖం పక్కకు తప్పించినప్పుడు
నిరాశలో కుంగిపొయ్యాను.
ప్రభూ, నువ్వు వింటావనే నేను విలపిస్తున్నది
నీ దయానుగ్రహానికే ప్రాధేయపడుతున్నది.
నేను పాతాళానికి జారిపోతే
నా పతనం ఎవరికి ప్రయోజనకరం?
అప్పుడు ఆ దుమ్ము నిన్ను స్తుతిస్తుందా
నీ విశ్వాసమహిమను అది ఉగ్గడిస్తుందా?
ఆలకించు, ప్రభూ, నా మొరాలకించు
ప్రభూ, దయచూపు, నన్నాదరించు.
నా సంతాపాన్ని సంగీతంగా మార్చినవాడివి
నా మలినవస్త్రాన్ని ఊడ్చిపక్కకు లాగి
ఆనందనవ్యవస్త్రం కట్టబెట్టావు
ఇంక మౌనం సాధ్యంకాదు, నా వైభవమే నీ గుణగానం చేస్తుంది
ఓ ప్రభూ, నా దైవమా, కలకాలం నిన్నిలా కీర్తిస్తూనే ఉంటాను.
32
దావీదు సంకీర్తన
ఎవరి తప్పులు క్షమించబడతాయో, ఎవరి పాపాలు లెక్కకు రావో
అతడు ధన్యుడు.
ఎవరి ఆత్మలో కపటంలేదో, ఎవరి మీద ప్రభువు కినుక వహించడో
అతడు ధన్యుడు.
నేను మౌనంవహించినప్పుడు, రోజంగా మూల్గి మూల్గి
నా ఎముకలు శిథిలమైపోయాయి.
అహర్నిశలు నా మీద నీ చెయ్యి బరువుగా పడిఉన్నప్పుడు
వేసవికాల జలంలాగా నా సత్తువ ఇంకిపోయింది.
నీ పట్ల నా అపచారాల్ని పూర్తిగా ఒప్పుకున్నాను
నా అతిక్రమణలేవీ నీముందు కప్పిపెట్టుకోలేదు.
నా ఉల్లంఘనల్ని నీ ముందు వెల్లడించుకున్నప్పుడు
నా అపరాధాలన్నిటినీ నువ్వు క్షమించేసావు.
కనుక నువ్వు ఎప్పుడు దొరికితే అప్పుడే
భక్తులు నిన్ను ప్రార్థించుకోవాలి.
తీరా కాలం వరదలాగా పరుగెత్తినప్పుడు
వారు నిన్ను అందుకోలేకపోవచ్చు.
నేను తల దాచుకునే చోటువి నువ్వు.
కష్టాలనుంచి నన్ను కాచిరక్షిస్తావు.
నా చుట్టూ నీ విమోచన నినాదాలు.
నువ్వెలా నడుచుకోవాలో చెప్తాను, నీకు దారి చూపిస్తాను.
ఎప్పటికీ నిన్నొక కంట కనిపెట్టి ఉంటాను, కనికరిస్తాను.
గుర్రంలానో, కంచరగాడిదలానో తెలివిమాలి బతక్కు.
వాటికైతే కళ్ళెం, మునుగోల తప్పనిసరి
లేకపోతే వాటిని అదుపు చెయ్యలేం.
దుర్మార్గులకి అంతులేని కడగండ్లు,
విశ్వాసులచుట్టూ అంతులేని ప్రేమ/
సజ్జనులారా, సత్యవంతులారా, స్తుతించండి,
ఆనందజయజయధ్వానాలు ఆలపించండి.
16-1-2023