
24
దావీదు కృతి
ఈ పృథ్వి నా ప్రభువుది, దీనిలోని సమస్తం ఆయనదే.
ఈ ప్రపంచం, ఇందులోని సకలజనులూ కూడా.
సముద్రాల మీద పుడమిని స్థాపించినవాడు
నదీతీరాలమీద నిలబెట్టినవాడూ ఆయననే.
పరమేశ్వరుడి పవిత్రశిఖరం అధిరోహించగలిగేదెవ్వరు?
ప్రభుసన్నిధిలో నిలబడగలిగేదెవ్వరు?
ఎవరి చేతులు నిరపరాధాలో, ఎవరి హృదయం నిర్మలమో
తమవి కానివాటిని ఎవరి చూపులు ఆశించవో
మోసపూరితంగా సాక్ష్యం చెప్పనిదెవరో
అతడికి ప్రభు కృపాశీస్సులు లభిస్తాయి
దేవుడు వారిని నిర్దోషులుగా లెక్కగడతాడు.
మందిరకవాటాల్లారా, తెరుచుకోండి
ఓ ప్రురాతన ద్వారాల్లారా, మీరు తెరుచుకోగానే
తన సమస్త వైభవంతో నా ప్రభువు అడుగుపెడతాడు
వైభవమూర్తి, ఆ ప్రభువు, ఎవరని?
బలాఢ్యుడు, సమరశూరుడు
సాహసమూర్తి ఆ ప్రభువు.
మందిరకవాటాల్లారా, తెరుచుకోండి
ఓ ప్రాచీన ద్వారాల్లారా, మీరు తెరుచుకోగానే
యశోవంతుడు నా ప్రభువు అడుగుపెడతాడు.
వైభవమూర్తి, ఆ ప్రభువు, ఎవరని?
సేనాధిపతి, సమరశూరుడు
సాహసమూర్తి ఆ ప్రభువు.
26
దావీదు కృతి
నన్ను నిలబెట్టు ప్రభూ, నీతితప్పని వాణ్ణి
సందేహించకుండానిన్నే నమ్ముకున్నవాణ్ణి.
పరీక్షించు, ప్రభూ, పరీక్షించి, నిరూపించు
నా మనసుని, నా హృదయాన్ని పరీక్షించు.
చెక్కుచెదరని నీ ప్రేమానురాగాన్ని కళ్ళారా చూస్తున్నాను
నీ పట్ల నమ్మకమే నన్ను నడిపిస్తున్నది.
తప్పుడుపనులు చేసేవాళ్ళతో కలిసి కూచోను
ఆత్మవంచకుల సహవాసాన్ని అభిలషించను
దుర్మార్గుల సమావేశాల్ని మనసారా ద్వేషిస్తాను
కపటులతో కలిసి కూచోడం నాకు చాతకానిపని.
నా చేతుల్ని నిరపరాధత్వంతో శుభ్రంచేసుకుని
నీ పాదపీఠం చుట్టూ ప్రదక్షిణం చేస్తాను.
ఎలుగెత్తి ధన్యవాదాలు సమర్పిస్తాను
నీ మహిమలు నోరారా గుణగానం చేస్తాను.
ప్రభూ నువ్వు నివసించే చోటంటే నాకెంతో ప్రేమ
నీ తేజోధామం మీదనే నా దృష్టి ఎప్పుడూ.
పాపిష్టివాళ్ళతో నన్ను కూడా తుడిచిపెట్టకు
హంతకుల్లో నన్ను కూడా ఒకడిగా లెక్కగట్టకు
వాళ్ళ చేతులనిండా పాచికలు, పన్నాగాలు
వాళ్ళ కుడిచేతిలో చూడు, ఒకటే లంచాలు.
నేనైతే ఎప్పుడూ నీతిమార్గం తప్పలేదు, ప్రభూ,
నన్ను బయటపడెయ్యి, నా మీద దయచూపు.
నేనెప్పుడు నిలబడ్డా సమతలంమీదనే నిలబడ్డాను
నలుగురుకూచున్నచోట నీమహిమలు ఎలుగెత్తి చాటుతాను.
28
దావీదు కృతి
ప్రభూ, పిలుస్తున్నది నిన్నే
నువ్వు నా ఆధారశిలవి,
నీ పవిత్రసింహాసనం ముందు
చేతులు పైకెత్తి ప్రార్థించినప్పుడు
నా పిలుపు పెడచెవిన పెట్టకు
నువ్వు నాకు బదులివ్వకపోతే
అధఃపాతాళానికి జారిపోతాను
నీకోసం మొరపెట్టుకున్నప్పుడు
నా స్వరం, విన్నపం ఆలకించు.
నన్ను దుర్మార్గుల్తో కలిపి కిందకు తోసెయ్యకు
చెడ్డవాళ్ళల్తో చేర్చి లెక్కించకు.
వాళ్ళు తోటిమనుషుల్తో ఇచ్చకాలాడతారు
కాని హృదయంలో విషం మూటగట్టుకుంటారు
వాళ్ళ పన్నాగాలకీ, జిత్తులకీ
మోసకారిపనులకీ ప్రతిఫలం ముట్టచెప్పు.
వాళ్ళేది చెల్లిస్తే దాంతోనే తిరిగి చెల్లించు
వాళ్ళ చేతల్ని వాళ్ళకే అప్పగించు.
ప్రభువు చేతలు అర్థం కాదు వాళ్ళకి
అందుకని చీల్చిపారేస్తాడు వాళ్ళని.
ప్రభువు నిజంగా కృపామయుడు
ఆయన నా మొరాలకించాడు.
ఆయన నా బలం, నా రక్షణ.
ఆయనలోనే నాకు నమ్మకం.
నన్ను ఆదుకున్నాడు, నా హృదయం పరవశించింది
నా గీతంతో ఆయన్ని ఎలుగెత్తి స్తుతిస్తాను.
ప్రభువు తనని నమ్ముకున్నవాళ్ళ బలం
తాను ఎంచుకున్నవాళ్ళకి రక్షణ
నీ ప్రజల్ని కాపాడు, నీ సంపత్తి చూసుకో.
కలకాలం వాళ్ళని నీ బుజంపైకెత్తుకో.
15-1-2023