జయగీతాలు-4

14

ప్రధాన గాయకుడి గీతం, దావీదు కృతి

మూర్ఖుడు తనకు తాను చెప్పుకుంటాడు దేవుడు లేడని. వాళ్ళంతా భ్రష్టులు. భరించలేని పనులు చేస్తుంటారు. మంచిపనులు చేసేవాడు ఒక్కడు కూడా లేడు వాళ్ళల్లో.

ప్రభువు స్వర్గంలో ఆసీనుడై మనుష్యసంతతి చేసే పనులు చూస్తూనే ఉన్నాడు. ఒక్కళ్ళయినా తనని అర్థం చేసుకునేవాళ్ళున్నారా, తనకోసం తపించేవాళ్ళున్నారా అని వెతుకుతుంటాడు.

వాళ్ళంతా ఆయన్నుంచి ముఖం చాటేసారు. మొత్తం కలిసికట్టుగా భ్రష్టులయ్యారు. మంచిచేసేవాడు వాళ్ళల్లో ఒక్కడు కూడా లేడు, ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు.

నా మనుషుల్ని రొట్టెల్లాగా తినేస్తున్న ఆ దుర్మార్గులకి నిజంగా తెలివి లేదా? వాళ్ళెందుకని ప్రభువుని తలుచుకోరు?

ఘోరభయం వాళ్ళకోసం కాచుకుంది. ఎందుకంటే దేవుడు వహించేది సత్యవంతుల పక్షం కాబట్టి. మీరు బీదసాదల ఉద్దేశాల్ని గేలిచేస్తారు, కాని భగవంతుడు వాళ్ళకి రక్షణగా నిలబడతాడు.

దైవసన్నిధిలోనే నా దేశానికి విముక్తి లభిస్తుంది. ప్రభువు నా జనుల కడగండ్లు తీర్చిన రోజున నా దేశం పులకిస్తుంది, నా ప్రజలు హర్షిస్తారు.

15

దావీదు కృతి

ప్రభూ, నీ గుడారంలో తలదాచుకోడానికి తగినవాళ్ళెవ్వరు?

పవిత్రమైన నీ కొండమీద నివసించడానికి యోగ్యులెవ్వరు?

వేలెత్తి చూపలేని విధంగా ఎవరు నడుచుకుంటారో, హృదయంలో సత్యానికి ఎవరు కట్టుబడి ఉంటారో, ఎవరు నీతితప్పక నడుస్తారో, తోటిమనిషిని నిందించని వాళ్ళెవరో, ఎవరు పొరుగువాడికి హానితలపెట్టరో, తన మిత్రుడి పట్ల శతృత్వం వహించనివారెవరో.

ఎవరు దుర్మార్గుల్ని  ఈసడించుకుంటారో, ప్రభువుని నమ్ముకున్నవాళ్ళని  గౌరవిస్తారో.

తమకి నష్టం వాటిల్లినా సరే ఆడినమాటకు కట్టుబడి ఉండేదెవరో

ఎవరు తమ సొమ్ముతో వడ్డీవ్యాపారం చెయ్యరో, అమాయకులకు వ్యతిరేకంగా లంచం ముట్టరో

వాళ్ళు ధీరులు, వాళ్ళనెవ్వరూ ఇసుమంతైనా కదిలించలేరు.

23

దావీదు కృతి

నా ప్రభువు నా కాపరి. నాకు కొరత లేదు.

ఆయన నన్ను పచ్చికబయళ్ళవెంట తిప్పుతాడు.

ప్రశాంత సరోవరాలకు తీసుకుపోతాడు

నా ఆత్మని నిలబెడతాడు.

తన పేరుకు తగ్గట్టే

నన్ను నీతిమార్గంలో నడిపిస్తాడు.

మృత్యువు నీడ పడే లోయలో నడిచినా

ఏ కీడూ భయపెట్టలేదు.

ఎందుకంటే నువ్వు నా పక్కనే ఉన్నావు

నీ బెత్తం, నీ దండం

నాకు గొప్ప ఓదార్పు.

నా శత్రువుల సమక్షంలోనే

నువ్వు నాకు విందుబల్ల పరుస్తావు

నా శిరాన్ని అభిషేకిస్తావు

నా పాత్ర పొంగిపొర్లుతుంది.

నేను జీవించినంతకాలం

నీ దయ, అనుగ్రహం నన్ను వెన్నంటే ఉంటాయి

ప్రభుసన్నిధిలోనే

నా శాశ్వతనివాసమని నాకు తెలుసు.

14-1-2023

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading