
11
ప్రధాన గాయకుడు ఆలపించే గీతం, దావీదు కృతి
నేను ప్రభువును నమ్ముకున్నవాణ్ణి. ఒక పక్షిలాగా కొండమీదకి ఎగిరిపొమ్మని మీరు నాకెట్లా చెప్తారు?
‘చూడు దుర్మార్గులు విల్లు వంచారు, శరం ఎక్కుపెట్టారు, సత్యవంతుల మీద దొంగచాటుగా దాడిచెయ్యబోతున్నారు.
పునాదుల్నే ధ్వంసం చేస్తే నీతిమంతులు ఏమి చెయ్యగలుగుతారు?’ అని మీరంటారు
ప్రభువు తన పవిత్రాలయంలో ఉన్నాడు, ఆయన సింహాసనం స్వర్గంలో ఉంది, ఆయన కనిపెట్టుకుని ఉన్నాడు, ఆయన చూపులు వాళ్ళని పరికిస్తున్నాయి.
ప్రభువు నీతిమంతుల్ని పరీక్షిస్తుంటాడు. దుష్టుల్నీ, హింసాకాముకుల్నీ ద్వేషిస్తాడు.
దుర్మార్గుల మీద నిప్పులు కురిపిస్తాడు. వాళ్ళ పానపాత్రలో గంధకమూ, అగ్నీ కురిపిస్తాడు. వడగాడ్పులు వర్షిస్తాడు.
దేవుడు సత్యవంతుడు కాబట్టి సత్యవంతుల్నే ప్రేమిస్తాడు. నీతిమంతుల్నే కటాక్షిస్తాడు.
12
ప్రధాన గాయకుడు ఆలపించే గీతం, దావీదు కృతి
రక్షించు ప్రభూ, నీతిమంతులు తుడిచిపెట్టుకు పోబోతున్నారు. మనుషుల మధ్యనుంచి విశ్వాసులు కనుమరుగు కాబోతున్నారు.
ప్రతి ఒక్కడూ పక్కవాడితో సోమరి సల్లాపాలు మొదలుపెట్టాడు, ఎంతసేపు చూడు, మెరమెచ్చులు, పైకి ఒక మాట, లోపల ఒక మాట. ప్రతి మనిషికీ రెండు గొంతుకలు.
ఊరికే పొగిడే ప్రతి పెదవినీ ప్రభువు కత్తిరించెయ్యాలి. ప్రగల్భాలు పలికే ప్రతి నాలుకనీ చీరెయ్యాలి.
‘మా నాలుక మా ఇష్టం, మా పెదవులు, మా సొంతం, ప్రభువెవ్వరు మామీద పెత్తనం చెయ్యడానికి’ అని అంటారా?
‘ఎందుకంటే మీరు బీదల్ని దోచుకుంటున్నారు కాబట్టి, దీనులు దుఃఖిస్తున్నారు కాబట్టి’ అంటాడు ప్రభువు, ‘వాళ్ళకోసం రాబోతున్నాను, నాకోసం ఎవరు తపిస్తున్నారో వాళ్ళ రక్షణ చూసుకుంటాను’ అంటాడు ఆయన.
ప్రభువు మాట్లాడే మాటలు అత్యంత నిర్మలమైనవి. ఏడు సార్లు కాల్చి పుటం పెట్టిన పరిశుద్ధమైన వెండి లాంటివి.
ప్రభూ, వారిని కాపాడు, ఈ తరం నుంచి కాచి రక్షించు. చుట్టూ నీచత్వం పెరిగే కొద్దీ దుర్మార్గులు నలుదిక్కులా విచ్చలవిడిగా తిరుగుతున్నారు.
13
ప్రధాన గాయకుడు ఆలపించే గీతం, దావీదు కృతి
ఎంతకాలం ప్రభూ? ఈ దీనుణ్ణి ఎంతకాలం దూరం పెడతావు? ఎన్నాళ్ళు నన్ను నీ సమక్షం నుంచి దూరంగా పెడతావు?
ఎన్నాళ్ళు నన్ను నేను ఓదార్చుకుంటూ ఉండాలి? ఎన్నాళ్ళిట్లా ప్రతిరోజూ నా హృదయం దుఃఖార్తిభరితం కావాలి? ఎన్నాళ్ళు నా శత్రువు నా మీద విర్రవీగుతుండాలి?
ఓ ప్రభూ, నా తండ్రీ, నా మొరాలకించు, నా విన్నపాలు విను, నా కళ్ళకు వెలుగునివ్వు. లేకపోతే మరణంలాంటి నిద్రలోనే నేనిట్లా కూరుకుపోయేట్టున్నాను.
లేదనుకో, నన్ను అణచేసానని నా శత్రువు మిడిసిపడుతుంటాడు. నేను పడిపోయినప్పుడల్లా నన్ను బాధపెట్టేవాళ్ళు పొంగిపోతుంటారు.
కాని నాకు నీలోనే నమ్మకం, నీ దయలో. నువ్విచ్చే విముక్తిలోనే నా హృదయానికి సంతోషం.
నా మీద అపరిమిత దయావర్షం కురిపించిన ప్రభువును స్తుతిస్తో నేను జయగీతాలు పాడుకుంటాను.
13-1-2023