జయగీతాలు-2

Reading Time: 2 minutes

3

ప్రభూ, చూడు! నన్ను బాధపెట్టేవాళ్ళ సంఖ్య ఎట్లా పెరుగుతోందో! నామీద విరుచుకుపడేవాళ్ళు కూడా తక్కువేమీ లేరు.

వాణ్ణి దేవుడు రక్షించడంటో నా గురించి చాలామందే చెప్తున్నారు.

కాని ప్రభూ, నువ్వు నాకు రక్షణవి. నా యశస్సువి. నన్ను తలెత్తుకు తిరిగేట్టు చేసేవాడివి.

నేను ఎలుగెత్తి ఆయనతో మొరపెట్టుకున్నాను. ఆయన తన పవిత్ర శిఖరమ్మీంచి నన్ను విన్నాడు.

నేను మేనువాల్చాను, నిద్రించాను, మేల్కొన్నాను. ప్రభువు నన్ను నిలబెట్టాడు.

నా చుట్టూ పదివేలమంది మోహరించినా నాకు భయం లేదు.

ప్రభూ, ఉదయించు, నా భగవంతుడా నన్ను రక్షించు. నువ్వు నా శత్రువులందరి దవడ ఎముకలు ధ్వంసంచేసావు. దైవాన్ని తప్పినడుచుకునేవాళ్ళ పళ్ళు రాలగొట్టావు.

విముక్తి నిజంగా ఒక దైవక్రియ. నీ వాళ్ళందరిమీదా నీ కృప వర్షిస్తూనే ఉంటుంది.

4

నేను పిలిచినప్పుడు, నా తండ్రీ, నన్నుగన్నవాడా, నా మొరాలించు. నన్ను నిరాశానిస్పృహలనుంచి నుంచి బయటపడేసావు. నా మీద దయ చూపు, నా ప్రార్థనలు పట్టించుకో.

మనుష్యజనులారా! ఎన్నాళ్ళు మీరిట్లా నా ప్రతిష్టకి తలవంపులు తెస్తుంటారు? ఎన్నాళ్ళు మీరిట్లా పనికిమాలినవాటిని ప్రేమిస్తారు, అసత్యాన్ని అభిమానిస్తారు?

నాకు తెలుసు, ఎవరు దైవానికి దగ్గరో, వారికోసం ప్రభువు తనలో కొంతచోటు వదిలిపెడతాడు. పిలవగానే దేవుడు నా పిలుపు వింటాడు.

చింతించండి, తప్పులు చెయ్యకండి, ఇంకా శయ్య మీద పరున్నప్పుడే మీ హృదయంలో ఆయన్ని తలచుకోండి. నిశ్చింతగా ఉండండి.

మీ ఆహుతులు సత్యసమ్మతంగా ఉండేట్టు చూసుకోండి.ప్రభువుపైన పూర్తి విశ్వాసం నిలుపుకోండి.
మాకు ఏది మంచిదో ఎవరు చెప్తారు అంటారు చాలామంది. ప్రభూ, నీ సాక్షాత్కార ప్రకాశాన్ని మాలో ప్రతిఒక్కరిమీదా ప్రసరింపచెయ్యి.

కోతకాలం రాగానే వాళ్ల ధాన్యరాశులూ, ద్రాక్షారసాలూ పొంగిపొర్లిన దానికన్నా మిన్నగా నా హృదయాన్ని సంతోషపు వెల్లువతో నింపావు.

ఇక ప్రశాంతిగా మేనువాలుస్తాను, నిద్రిస్తాను, ప్రభూ, నా యోగక్షేమాలు నీ చేతుల్లోకి తీసుకున్నావని నాకు తెలుసు.

8

ఓ ప్రభువా, ఈ సమస్తభూమండలం మీద నీ నామం సర్వోన్నతం. ద్యులోకసీమను దాటికూడా విస్తరించింది నీ వెలుగు.

పురిటిగదుల్లో పొత్తిళ్ళలో శయనించే బిడ్డల్లో, పసిపాపల నోటితో జయం పలికించావు. నీ శత్రువులనుంచి కాపాడావు. విరోధుల్నీ, పగతీర్చుకోడానికి పొంచిఉండేవాళ్ళనీ నోరెత్తకుండా చేసావు.

నువ్వు నివసించే స్వర్గధామాన్నీ, నీ అంగుళులు రూపొందిస్తున్న సృష్టినీ, నువ్వు నియమించిన చంద్రతారకల్నీ సంభావించినప్పుడు

ప్రభూ, నీ తలపుల్లో కదలాడుతున్న మనిషి ఎంత? ఎవరికోసం దిగివస్తున్నావో ఆ మనిషి ఎంతటివాడు?

దేవదూతలకన్నా ఒకింత తక్కువగానే అతణ్ణి సృష్టించావు, కాని యశోమకుటంతో, గౌరవంతో అతడి శిరసును అలంకరించావు.

నీ చేతుల్తో రూపొందించిన కార్యాలన్నిటిమీదా అతడికి ఆధిపత్యాన్నిచ్చావు, సమస్త విషయాల్నీ అతడి చరణాల కింద పరిచిపెట్టావు.

ఎడ్లు, గొర్రెలు- సమస్తజంతుజాలం

గాల్లో ఎగిరే పక్షులు, సాగరజలాల్లో ఈదులాడుతూ పయనించే చేపలు- సమస్తం.

ఓ ప్రభూ, మా ప్రభువా, సమస్త భూమండలం మీద నీ నామం ఎంత సర్వోన్నతం!

12-1-2023

Leave a Reply

%d bloggers like this: