జయగీతాలు-1

ధనుర్మాసపు ప్రత్యూషం. కిందన ఎవరో అప్పుడే ప్రభాతసంకీర్తన మొదలుపెట్టారు. ఒక్కసారిగా మెలకువ వచ్చింది. మనిషి తనని తాను మేల్కొల్పుకోడానికి ఎన్ని దారులు! ఎన్ని గీతాలు! ప్రతి ఒక్క గీతమూ నిన్ను నీకు సన్నిహితుణ్ణి చేసేదే. తప్పిపోయిన నిన్ను నీకు తిరిగి తీసుకొచ్చి ఇచ్చేదే.

అందుకనే నేనిష్టపడే కవుల్లో శైవులున్నారు, వైష్ణవులున్నారు, శాక్తులున్నారు, బౌద్ధులున్నారు, జైనులున్నారు. నా చిన్నప్పుడు తాడికొండలో సాయంకాల ప్రార్థనాసమావేశాల్లో మా సహాధ్యాయి వెంకటరత్నం ‘నడిపించు నా నావా, నడిసాంద్రమున దేవా’ అని ఎలుగెత్తి పాడిన క్రైస్తవ కీర్తన నేను జీవించినంతకాలం నా ఎదలో మార్మ్రోగుతూనే ఉంటుంది. ఆ స్కూల్లోనే అదే సమావేశాల్లో, అర్థం తెలియకపోయినా, అది ‘సురా అల్ ఫాతిహా’ అని తెలియకపోయినా ప్రతి సాయంకాలం నేను నా తోటిపిల్లలందరితో చదివించిన ఖురాన్ లోని మొదటి సురా ని నా చిన్నప్పుడే దేవుడు విని ఉన్నాడన్న నమ్మకం నన్నెప్పటికీ వదలదు.

‘నిన్ను ఇంటర్వ్యూ చేస్తూ మృణాళిని నీకు ఇష్టమైన కవిత్వం ఏదని అడిగినప్పుడు నువ్వు భక్తి కవిత్వమని చెప్పగానే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది, సంతోషంగానూ అనిపించింది’ అంది మా అక్క. ‘ప్రపంచమంతా కవిత్వవీథుల్లో తిరిగి తిరిగి చివరికి మళ్ళా భక్తికవిత్వం దగ్గరకే చేరడం గొప్పగా కూడా అనిపించింది’ అని కూడా అంది.

ఏది భక్తి కవిత్వం కాదు? రాజమండ్రిలో కవిత్వం గురించి మాట్లాడుకునే రోజుల్లో నా మిత్రుడు గోపీచంద్ తనకి గీతాంజలి అంటే చాలా ఇష్టమని చెప్తూ, అక్కడ కవి సర్వేశ్వరుణ్ణి సంబోధించిన ప్రతి తావులోనూ తాను ‘జీవితం’ అని అనుకుని చదువుతుకుంటానని చెప్పాడు. చరాచరాల్ని ప్రేమిస్తూ మనిషి పలికిన ప్రతి మాటా భక్తికవిత్వమే కదా.

భక్తి కవిత్వం, సర్వేశ్వరసన్నిధికోసం తపించిన కవుల కవిత్వం, నిజంగానే నాకు ప్రాణదాయకం. ఆ కవితలు చదువుకున్నప్పుడు నాకు నిజంగా జీవించిన అనుభూతి కలుగుతుంది. ఆ కవిత్వాల్ని సమస్తభాషల్లోనూ చదువుకుంటూ ఉండటంకోసమే మరొక నూరేళ్ళు బతకాలనిపిస్తుంది. మరొక భాషలోని భక్తి కవిత్వం చదివినప్పుడల్లా, దాన్ని మళ్ళా నా కోసం తెలుగు చేసుకుంటేనే దాన్ని నా గుండెనిండుగా ఆఘ్రాణించిన తృప్తి కలుగుతుంది.

అందుకనే మొన్న నా ప్రసంగంలో Pslams నుంచి ఒక గీతాన్ని ప్రస్తావించినప్పుడు మిర్యాలగూడ నుంచి ఫాదర్ అలెగ్జాండర్ ఫోన్ చేసారు. ఆ సామగీతాల్ని తెలుగు చెయ్యరాదా అనడిగారు. మీరు అడుగుతున్నారంటే దేవుడు అడుగుతున్నట్టే అన్నాను.

Psalms బైబిల్లో పాతనిబంధనలో ఒక అధ్యాయం. ఆ పదానికి అర్థం స్తోత్రములు అని. జయగీతాలు అని కూడా అనవచ్చు. మొత్తం 150 గీతాలు అవి. వాటిలో స్తుతులు ఉన్నాయి, నతులు ఉన్నాయి, ఆత్మవిశ్వాసగీతాలున్నాయి, ధన్యవాద సమర్పణలున్నాయి, నిరసనలున్నాయి, విలాపాలున్నాయి. ప్రపంచమంతా భగవద్భక్తులు ఎన్ని మానసిక అవస్థలకు లోనవుతూ కవిత్వం చెప్పారో ఆ అవస్థలన్నీ ఆ గీతాల్లో కనవస్తాయి.

ఆ గీతాల్ని చదువుతున్నప్పుడు మనకి టాగోర్ గీతాంజలి గుర్తు రావడంలో ఆశ్చర్యం లేదు. నిజానికి టాగోర్ తన బెంగాలీ గీతాల్ని ఇంగ్లిషు వచనంలోకి అనుసృజించి వెలువరించినప్పుడు పాశ్చాత్యపాఠకులకి అవి మరో రూపంలో Psalms లాగే అనిపించాయి. త్యాగరాజ కీర్తనల్ని భమిడిపాటి కామేశ్వరరావుగారు ‘త్యాగరాజు ఆత్మవిచారము’ పేరిట వచనంలోకి మార్చారు. Psalms అధికభాగం డేవిడ్ రాసాడనే నమ్మకం ఉన్నందువల్ల ఆ కవితల్ని చదువుతుంటే నాకు దావీదు రాజు ఆత్మవిచారం లాగా అనిపిస్తుంటుంది.

Pslams భాష, అభివ్యక్తి చాలా సూటిగా, తేటగా ఉంటుంది. వాటిని చదువుతుంటే, ఆ గీతాల్లోని ఆర్తి సరాసరి మన హృదయంలోకి చొచ్చుకుపోతుంది. ఇప్పుడు ఫాదర్ అలెగ్జాండర్ ఆదేశంతో వాటిని, కొన్నేనా, ఇలా  మీతో తెలుగులో పంచుకుంటున్నాను.

1

దైవానికి దూరంగా ఉండేవాళ్ళ తోవ తొక్కని మనిషి ధన్యుడు. దుర్మార్గులతో కలిసి నిలబడనివాడు ధన్యుడు. దైవం తిరస్కరించినవాళ్ళు కూచున్నచోట కూచోని వాడు ధన్యుడు.

ప్రభు వాక్యాన్ని అనుసరించడంలోనే అతడికి సంతోషం. అహర్నిశలు ప్రభుశాసనం మీదనే తన దృష్టి లగ్నమై ఉంటుంది.

అతడు ఏటి ఒడ్డున నాటిన చెట్టులాంటివాడు. ఆ చెట్టు ఋతువు రాగానే ఫలిస్తుంది. దాని ఆకులు ఎప్పటికీ వాడవు. ప్రతి ఒక్కపనిలోనూ అతడికి జయం సిద్ధిస్తుంది.

దైవానికి దూరమయినవాళ్ళ సంగతి వేరే. వాళ్ళు ఊకలాంటివాళ్ళు. గాలి వాళ్ళని చెదరగొట్టేస్తుంది.

మనం చేసిన పనులకి ఒకనాటికి మనం బాధ్యత పడవలసి వచ్చినప్పుడు, దైవంతోడులేని వాళ్ళు నిలబడలేరు. సజ్జనుల సన్నిధిలో దుర్జనులకు చోటు దక్కదు.

సత్యవంతుల దారి దైవం సమ్మతించిన దారి. దైవాన్ని తప్పి నడిచేవాళ్ళది నశించే దారి.

11-1-2023

One Reply to “జయగీతాలు-1”

Leave a Reply

%d bloggers like this: