అతడు నాతోనే ఉంటాడు

సమాచారం సుబ్రహ్మణ్యం ఒక సరదా క్షణంలో..

సుబ్రహ్మణ్యం జ్ఞాపకాలతో ఒక సంచిక తెస్తున్నాం, దానికి నువ్వు కూడా ఒక వ్యాసం రాసి పంపమని సమాచారం రవి నన్ను అడిగి నెల రోజులు దాటింది. మొన్న రాజమండ్రిలో సాహితీవేదిక మిత్రులు కలుసుకున్నప్పుడు ఆ జ్ఞాపక సంచికని ‘సౌగంధ్యం’ పేరిట ఆవిష్కరణ కూడా చేశారు. అయితే అది కేవలం మొదటి వెర్షన్ మాత్రమేనని ఇంకా మరి కొందరు మిత్రుల వ్యాసాలు కూడా అందాక పూర్తిగా ప్రచురిస్తామని రవి చెప్పాడు. నా వ్యాసం తప్పకుండా పంపిస్తాను అని చెప్పాను. కానీ ఎంత ప్రయత్నించినా నా మనసు కనీసం మొదటి వాక్యం పేర్చుకోవడానికి కూడా సిద్ధపడటం లేదు. ఒక మనిషి గురించిన తలపోతలు కనీసం ఒక వాక్యంగా కూడా మారలేకపోతున్న ఇంత ఆశక్తత నేనెప్పుడూ ఎరగను.

గంధం నాగ సుబ్రహ్మణ్యం (1954-2004) రాజమండ్రి సమాచారం పత్రిక సంపాదకులు గంధం సీతారామాంజనేయులు గారి పెద్ద కొడుకు. కానీ అతడు మాకు ఆత్మబంధువు అనడమే సరైన పరిచయం. ఆ సుబ్రహ్మణ్యం లేడు అనే విషయాన్ని నా మనసు ఇప్పటికీ అంగీకరించట్లేదు. గత ఇరవై ఏళ్లుగా ఎన్నోసార్లు రాజమండ్రి వెళ్ళినప్పుడు ‘సుబ్బూని కలుసుకోలేకపోయానే’ లేదా ‘సుబ్బూ కలవలేదే’ అని అనుకోగానే ఇది సుబ్రహ్మణ్యం లేని రాజమండ్రి కదా అని గుర్తొచ్చి ఒక్కసారిగా మనసంతా శూన్యం అయిపోతూ ఉంటుంది. మహేష్ అయితే ‘సుబ్రహ్మణ్యం లేని రాజమండ్రిలో అడుగుపెట్టను’ అని చెప్పాడట. చివరిదాకా ఆ మాట నిలబెట్టుకున్నాడు కూడా.

నాకూ, మహేష్ కీ, మాలాంటి మిత్రులందరికీ కూడా రాజమండ్రి అంటే సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం అంటే రాజమండ్రి. సుబ్బూ లేని ఆ ఊళ్లో ఒక్కరోజు గడపడం కూడా అసాధ్యం అనిపిస్తుంది. గోదావరి లేని రాజమండ్రీని ఊహించడం ఎంత కష్టమో మాకు సుబ్రహ్మణ్యం లేని రాజమండ్రి కూడా అంతే.

నేను ఉద్యోగం కోసం రాజమండ్రి 1982లో వెళ్లాను. కానీ ‘సమాచారం’ పత్రిక నాకప్పటికీ ఎంతో కాలం ముందు నుంచీ తెలుసు. నేను ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఉండటానికి ఒక ఆశ్రయం వెతుక్కునే లోపు, మొదట్లో వారం రోజులు మా మాస్టారు శరభయ్య గారి ఇంట్లో ఉన్నాను. ఆయన సమాచారం మేడ మీద ఉండేవారు. సుబ్రహ్మణ్యం అప్పుడే పరిచయమయ్యాడా లేకపోతే తక్కిన సాహితీ వేదిక మిత్రులతో పాటు పరిచయమయ్యాడా గుర్తులేదు కానీ ఒకసారి పరిచయమయ్యాక సుబ్రహ్మణ్యం ఆ ఊళ్లో నాకు తల్లిగా, తండ్రిగా, అక్కగా, అన్నగా మారిపోయాడు. చాలీచాలని జీతంతో, ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో వచ్చి పడే అవసరాలతో, సతమతమయ్యే నాకు అవేవీ పట్టకుండా సాహిత్య జీవితం కొనసాగించడానికి సుబ్రహ్మణ్యం ఉన్నాడన్న ధైర్యమే కారణం.

అలాంటి మనిషి అంటూ ఒకడుంటే నువ్వు మరి ఇంకేమీ చూసుకోనక్కర్లేదన్న నిశ్చింత సుబ్రహ్మణ్యం దగ్గర లభిస్తుంది. అప్పటి సుబ్రమణ్యం వయసు ఏమాత్రమని? బహుశా నాకన్నా ఏడెనిమిదేళ్లు పెద్దవాడై ఉండవచ్చు. కానీ అంత చిన్న వయసులోనే అతడు ఒక తండ్రి లాగా, ఒక అన్న లాగా నాకు ఇచ్చిన మానసిక భద్రత మాటల్లో చెప్పలేనిది.

నేను రాజమండ్రిలో టెలిఫోన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసే వాడిని. కానీ సమాచారంలో పనిచేస్తున్నాననే నాకు నేను చెప్పుకునేవాడిని. ఎందుకంటే ప్రతిరోజూ, సాయంకాలం మిత్రులందరం సమాచారం ఆఫీసులో చేరినప్పుడు అక్కడ ఆ న్యూస్ ప్రింట్ కాగితాల మీద, కనీసం ఒక్క పేజీ అయినా నేను ఏదో ఒకటి రాయకుండా ఏ రోజూ గడిచేది కాదు. అది సాహితీవేదిక సమావేశాల గురించిన నివేదిక కావచ్చు, లేదా ఎవరైనా సాహిత్య వేత్త రాజమండ్రి వచ్చి వెళ్లిన ముచ్చట కావచ్చు, లేదా కనీసం ఏదో ఒక వార్త సుబ్రహ్మణ్యం చెప్తే దాన్ని అర్జెంటుగా కాగితం మీద పెట్టడమేనా కావచ్చు. కొన్ని రోజులకి సుబ్రహ్మణ్యమే నన్ను ప్రతి వారం కాలం రాయమని అడిగాడు. ‘అ ఆ ఇ ఈ’ పేరిట సమాచారం లో కాలం రాయడం ద్వారా నేను మొదటిసారి కాలమిస్ట్ గా కూడా మారాను. అందులో ఏదో ఒక అంశం మీద ఏదో ఒకటి రాసేవాడిని. దేని మీద రాశావు, ఎలా రాశావు, ఈ వాక్యం ఉండాలా వద్దా, ఇలా రాయాలా వద్దా- ఇలాంటి ప్రశ్నలు ఏమీ ఉండేవి కావు. నేను ఏమి రాస్తే అది ప్రచురించేవాడు. అంత స్వాతంత్ర్యం నాకు లభించడం వెనుక అతడు నన్ను ఎంతగా నమ్మాడో ఇప్పుడు అర్థమవుతోంది.

నన్నయ సహస్రాబ్దిసభలు హైదరాబాదులో జరిగినప్పుడు ఆ విశేషాలన్నీ సమాచారంలో ప్రచురించడానికి నన్ను పెద్ద నివేదిక రాయమని అడిగాడు. ఆ నివేదికను ప్రింట్ లో కూర్చేటప్పటికీ సమాచారం పేపర్లో పూర్తిగా రెండు పేజీలు సెంటర్స్ స్ప్రెడ్ గా వచ్చింది. అంత పెద్ద నివేదిక నా పేరుతో ఆ పత్రికలో చూసుకున్నప్పుడు నా కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. రాజమండ్రి నన్ను కవిని, రచయితని చేసిందేమో కానీ ప్రింట్ కు నన్ను సన్నిహితుణ్ణి చేసింది మాత్రం సుబ్రహ్మణ్యమే.

నా కవితా సంపుటి ‘నిర్వికల్ప సంగీతం’ తీసుకు రావాలనుకున్నప్పుడు సుబ్రహ్మణ్యమే నాకు ప్రింటో ఫైన్ ప్రతాప్ ను పరిచయం చేశాడు. ఆ పుస్తకానికి ఒక శిల్పాన్ని ముఖచిత్రంగా వేయాలనుకున్నప్పుడు తనే దగ్గరుండి బ్లాక్ తయారు చేయించాడు. ఆ పుస్తకావిష్కరణ ఆ ఊర్లో జరిగిందంటే దానికి సాహితీ వేదిక ఎంత కారణమో సుబ్రహ్మణ్యమూ అంతే కారణం.

సుబ్బూతో..


సుబ్రహ్మణ్యంలో శతాబ్దాల రాజమండ్రి చరిత్ర, సంస్కారం, సంప్రదాయాలు మూర్తీభవించాయని చెప్పటం అతిశయోక్తి కాదు. అంత చిన్న వయసులోనే అతను ఆ నగరానికి తలలో నాలుకగా ఎలా మారగలిగాడో ఇప్పటికీ నా ఊహకు అందదు. తర్వాత రోజుల్లో రాజమండ్రిలోనూ, తూర్పుగోదావరి జిల్లాలోను, ఆంధ్రప్రదేశ్ లోనూ కీలక పాత్ర వహించిన ఎందరో రాజకీయ నాయకులు సుబ్రహ్మణ్యం తో చాలా దగ్గరగా, సన్నిహిత మిత్రులుగా కలిసి తిరిగిన వాళ్ళు. ప్రతిరోజూ వాళ్లు సుబ్బూని కలుసుకున్నప్పుడు అతణ్ణుంచి గొప్ప శక్తిని, స్ఫూర్తిని, ఉత్సాహాన్ని దోసిళ్లతో జుర్రుకునేవారు అని చెప్పగలను.

ఒక రేడియో ప్రోగ్రాంలో. మధ్యలో ఉన్నది సుబ్బూ, అతని భార్య రాజీ.

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఆ మాటకొస్తే భారతదేశంలోని చిన్న పత్రికల చరిత్రలో సమాచారంది ఒక విశిష్టమైన ప్రయాణం. ఆ పత్రికను ప్రారంభించి దానికి రూపురేఖలు ఇచ్చింది సీతారామాంజనేయులు గారు కానీ ఆ పత్రికను నిజంగా ఒక సామాజిక సాంస్కృతిక శక్తిగా మార్చింది మాత్రం సుబ్రహ్మణ్యమే. పాత్రికేయుడిగా సుబ్రహ్మణ్యం పాటించిన విలువలు, సాధించిన ప్రమాణాలు అత్యున్నతమైనవి కాబట్టే అతనికి జాతీయ స్థాయి పురస్కారం లభించింది. ఆ విలువల్ని, ఆ పత్రిక నడపడంలో అతడు చూపించిన ఎన్నో మెలకువల్ని ప్రతిరోజూ ఎంతో దగ్గరగా చూశాను. వాటి మీద ఏకంగా పుస్తకమే రాయవచ్చు. ఈరోజు ఇంత అత్యాధునికమైన ప్రింటింగ్ టెక్నాలజీ అందుబాటులో ఉన్న కాలంలో సుబ్రహ్మణ్యం ఉండి ఉంటే ఆ పత్రికను ఏ స్థాయికి తీసుకు వెళ్ళగలిగి ఉండేవాడో అనిపిస్తుంది. ఆ పాత కాలపు లెటర్ కంపోజింగ్ సిస్టంలో, ట్రెడిల్ ప్రెస్ లో, అరిగిపోయిన ఆ లోహపు అక్షరాలతో గాలీప్రూఫులు చూసుకుంటూ, ప్రతి రాత్రీ నలుగురు పనివాళ్లను పెట్టుకుని అతడు ఆ పత్రికను రూపొందించడం ఒక యజ్ఞం లాగా చేసాడు. ఒక్కొక్కసారి ఎవరైనా వర్కర్ రాకపోతే తనే నిలబడి అక్షరాలు కంపోజ్ చేయడం కూడా నేను ఎరుగుదును.

ఏ ముఖ్యమైన సంఘటన జరిగినా దాని గురించి నేను ఏదైనా రాయాలని సుబ్బూ కోరుకునే వాడు. నాకు బాగా గుర్తు. 1984 లో భారత ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు గురైన రోజు. సుబ్రహ్మణ్యం మా ఆఫీస్ కి వచ్చేసాడు. ‘నువ్వు ఈ వార్త రాస్తూ ఇందిరమ్మ మీద సమగ్రంగా ఒక వ్యాసం కూడా రాయి’ అన్నాడు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడం, ఆ తర్వాత ఎన్నికలు, జనతా పార్టీ అధికారంలోకి రావడం మొదలైనవన్నీ నేను హైస్కూల్లో ఉన్న రోజుల్లో జరిగాయి కాబట్టి, అది అప్పుడప్పుడే కళ్ళు తెరుస్తున్న వయసు కాబట్టి, ఇందిరా గాంధీ పట్ల నాకు ఎటువంటి సానుకూల అభిప్రాయం ఉండేది కాదు. కాబట్టి నేను ఏమీ రాయలేనని, రాయాలని లేదనీ చెప్పాను. సుబ్బూ నన్ను ఎంతో సానునయంగా మందలించాడు. ‘ఇట్లాంటి చారిత్రక క్షణాలు వ్యక్తిగత ఇష్టాయిష్టాల్ని దాటి చూడవలసిన క్షణాలు. నీలోని రచయిత, నీలోని పాత్రికేయుడు నీ వ్యక్తిగత ఇష్టాయిష్టాల్ని దాటి ప్రపంచం తో మాట్లాడవలసిన సమయం ఇది’ అన్నాడు. వాడి మాటలు నా మీద మంత్రంలాగా పనిచేశాయి. సరే. నేను రాయటం అయితే ఏదో రాశాను కానీ పొద్దున్నే పేపర్ చూసేటప్పటికీ నా వ్యాసానికి కనబడ్డ శీర్షిక నన్ను అపరిమితమైన ఆశ్చర్యానికి గురి చేసింది. ‘తుపాకీ గుళ్లకు మరో గాంధీ బలి’ అని ఆ శీర్షిక! అటువంటి వాక్యం ఎలా స్ఫురించింది, ఎవరికి స్ఫురించింది అని అడిగాను. నేను వ్యాసం రాయగానే ఆంజనేయులు గారు అడిగి తెప్పించుకుని చదివి ఆయనే ఆ శీర్షిక స్వహస్తాలతో రాశారు అని చెప్పాడు సుబ్బు. ఎటువంటి తండ్రీకొడుకులు! రాజమండ్రి ఎంత అదృష్టం చేసుకుంటే అట్లాంటి తండ్రీకొడుకులు ఆ ఊళ్లో అన్నేళ్లపాటు ఆ పత్రిక నడిపివుంటారు!


సుబ్బు నాకు చేసిన సాయాలు, ఆర్థికంగా మానసికంగా నాకు అండగా నిలబడ్డ క్షణాలు-రాయటం మొదలు పెడితే ఆ జాబితా అంత తొందరగా పూర్తి కాదు. వాడు చేసిన ప్రతి ఒక్క సాయం నాకు గుర్తే. సదనంలో చదువుకుంటున్న మా చెల్లెలు బుజ్జికి ఒకసారి బాగా సుస్తీ చేసింది. ఆ సంగతి సుబ్రహ్మణ్యం కి చెప్పాను. వాడికి నా స్థితిగతులు తెలుసు. అందుకని వాళ్ళ ఆఫీసు రిక్షా పిలిచి నన్ను ఒక హోమియో డాక్టర్ దగ్గరికి పంపించాడు. ఫీజు ఎంత ఇవ్వాల్సి ఉంటుంది అని అడిగాను. ‘అర్ధరూపాయి’ అన్నాడు. ఆ అర్ధరూపాయి కూడా నాతో ఖర్చు పెట్టించకూడదను కున్నాడేమో, వాళ్ళ తమ్ముడు, కిష్టప్పని నాకు తోడుగా పంపించాడు.

కానీ, చాలా నిరర్ధకమైన కోరికలు, సిల్లీగా అనిపించే విషయాల్లో కూడా, మరొకరెవరైనా విసుక్కునే విషయాల్లో కూడా సుబ్బూ నా పట్ల చూపించిన ప్రేమ, ఆదరణ నేనెప్పటికీ మరువలేనివి. ఒక రోజు మేము సాయంకాలం డీలక్స్ సెంటర్లో నడుచుకుంటూ వెళుతున్నాము. దూరంగా ఒక మ్యూజికల్ షాపులో రేఖ బొమ్మతో కొత్తక్యాలెండర్ ఒకటి కనిపిస్తూ ఉంది. రేఖ అంటే అప్పట్లో నాకు చెప్పలేనంత పిచ్చి. ‘సుబ్బూ, ఆ క్యాలెండర్ చూడు’ అన్నాను. వాడు చూశాడు. వెంటనే నా చేయి పట్టుకుని బరబరా ఆ షాపు దగ్గరికి లాక్కుపోయాడు. ఆ షాపు వాడితో ‘ చూడు, ఆ క్యాలెండర్ మీ షాప్ లో కన్నా మావాడి రూమ్ లో ఉంటే ఎక్కువ ప్రయోజనం. ఎందుకంటే మావాడు ఆమెను చూస్తూ రోజుకో కవిత అయినా రాస్తాడు’ అన్నాడు. ఆ షాపు వాడు మరేమీ మాట్లాడకుండా ఆ కొత్త క్యాలెండర్ గోడ మీంచి తీసి సుబ్బు చేతుల్లో పెట్టేశాడు.

నేను రాజమండ్రి వదిలి వెళ్ళిన తర్వాత కూడా ఏదో ఒక రూపంలో సుబ్బూతో అనుబంధం కొనసాగింది. నేను శ్రీశైలంలో ఉండగా ఒక పాత్రికేయబృందంతో శ్రీశైలం టూర్ కి వచ్చాడు. అప్పుడు నేను ఉద్యోగ పరంగా ఆ బృందానికి ఏమి ఆతిథ్యం మర్యాదలు అందించానో తెలియదు కానీ, అప్పటి మా కలయికని సుబ్బు ఎన్ని సార్లో, ఎంత మందితోనో, ఎంతో గొప్పగా చెప్పుకునేవాడని తర్వాత చాలామంది ద్వారా విన్నాను.

మహేష్, నేను, గోపీచంద్, సుబ్బూ


స్వాతంత్రోద్యమ శంఖారావం నాటకం నాతో రాయించి రామనాథంతో ప్రదర్శింపజేసింది సుబ్బునే. మా మిత్రులందరికీ తీసుకుని పాపికొండల్లో లాంచ్ ప్రయాణం చేయించింది కూడా సుబ్బు నే. ప్రతి ఏటా సాహిత్య వేదిక మిత్రులు వనభోజనాలు చేయటానికి అన్ని ఏర్పాట్లు చేసింది సుబ్బునే. ప్రతి ఏటా జనవరిలో రాజమండ్రి పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేసింది సుబ్బూనే. అప్పటికింకా విజయవాడ లోనూ, హైదరాబాదులోనూ పుస్తక ప్రదర్శనలు మొదలు కాలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటి పుస్తక ప్రదర్శనలకు నమూనా సుబ్బూ రూపొందించిన రాజమండ్రి పుస్తక ప్రదర్శన లే.

సుబ్బు నాకు రాజమండ్రి ఆత్మని పరిచయం చేశాడు. మొదటిసారి నన్ను వీరేశలింగం గారి ఇంటికి తీసుకువెళ్లి చూపించి, అక్కడి నుంచి గోదావరి గట్టు దగ్గరకు తీసుకువెళ్లి, ‘ఇక్కడే వీరేశలింగం గారి మీద సంప్రదాయవాదులు దాడి చేసింది’ అని చూపించి నప్పుడు నా ఒంట్లో కలిగిన జలదరింపు నాకు ఇప్పటికీ గుర్తే. వీరేశలింగం పుర మందిరం, ఆంధ్ర కేసరి యువజన సమితి, గౌతమి గ్రంథాలయం- రాజమండ్రి చరిత్ర భద్రపరచుకున్న ప్రతి ఒక్క తావునీ నేను మొదటిసారి సుబ్రహ్మణ్యం కళ్ళతోనే చూశాను, సుబ్రహ్మణ్యం మాటల్లోనే విన్నాను.

ప్రకాశం పంతులు గారి ‘నా జీవిత యాత్ర’ చదువుకుంటూ ఆయన పదహారణాల ఆంధ్రుడని, ఆయన్ని నాయకుడిగా మార్చింది రాజమండ్రియేనని సుబ్రహ్మణ్యం చెప్తూ ఉంటే నాకూ, మహేష్ కీ మళ్ళీ మళ్ళీ వినాలనుకునే ముచ్చటగా ఉండేది. సమాచారంలో సాయంకాలం హడావుడి తగ్గాక రాత్రి వేళల్లో సన్నిధానం నరసింహశర్మ వంటి రాజమండ్రి పండితులు వచ్చి కూర్చుని, ఒకప్పటి రాజమండ్రి ముచ్చట్లు చెబుతూ ఉంటే, న్యాపతి సుబ్బారావు, చిలకమర్తి లక్ష్మీనరసింహం, నాళం కృష్ణారావు, వడ్డాది సుబ్బరాయుడు, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, సామినేని ముద్దుకృష్ణమ నాయుడువంటి ఉద్దండుల గురించి చెప్పుకుంటూ ఉంటే, ఆ ముచ్చట్లు వింటూ గడపటం నా జీవితంలో నాకెంతో విలువైన అధ్యాయం.

సుబ్రహ్మణ్యం గురించిన జ్ఞాపకాల్లో ఎంతో ఉల్లాసకరమైన జ్ఞాపకం అతని పెళ్లి. వెంకట పార్వతీశ్వర కవుల కవిత్వం గురించి రాస్తూ కృష్ణశాస్త్రి గారు వాళ్ళ కవిత్వాన్ని తలుచుకుంటే పెళ్లి పందిళ్ళ ఉత్సాహం గుర్తొస్తుందని రాసుకున్నాడు. గోదావరి జిల్లాల పూర్వకాలపు పెళ్లి పందిళ్ళలో ఆయన ఏ వెలుగు చూశాడో కానీ అటువంటి ఉత్సాహం, ఉల్లాసం మళ్లీ సుబ్రహ్మణ్యం పెళ్లిలో చూసాం. మండపేటలో అతని పెళ్లి జరిగిన రాత్రీ, ఆ మర్నాడూ మేము ఏం కబుర్లు చెప్పుకున్నామో, ఏమి తిన్నామో, ఏ సంతోషం పంచుకున్నామో తెలియదు కానీ అంత ఉల్లాసకరమైన వివాహ వేడుకలు నా జీవితంలో నేను చూసిన వాటిని వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు.

ఇలా ఎన్నో జ్ఞాపకాలు. ఎన్నెన్నో విషయాలు. ఇప్పుడు సుబ్రహ్మణ్యం మనమధ్య లేడనీ, నేను అతని జ్ఞాపకాలు రాస్తున్నాననీ స్ఫురించగానే నా గొంతు మూగబోతున్నది. ఒక్క వాక్యం కూడా ముందుకు కదలదు. ఎవరో ఒక దూరపు వ్యక్తి గురించి నాలుగు మాటలు ప్రసంగించినట్టుగా సుబ్రహ్మణ్యం గురించి రాయటం నాకు చేతకాదు. నేను ముందే చెప్పినట్టుగా, సుబ్రహ్మణ్యం, మా తల్లిదండ్రుల్లాగా, నా చిన్నప్పటి గురువుల్లాగా నన్ను ఆదరించి అక్కున చేర్చుకున్న వ్యక్తి. నేను జీవించి ఉన్నంతకాలం అతడు నాతో జీవించి ఉంటాడు.

8-1-2023

2 Replies to “అతడు నాతోనే ఉంటాడు”

  1. మీ పదాల్లో అన్నయ్య మళ్లీ మొగ్గలా పుట్టి పువ్వుగా విరబూసాడు. అదే క్షణంలో సన్నని బ్లేడ్ తో గుండెలో నరాలను కోస్తున్నంత బాధ. కొత్త గోదావరిని రెండు కళ్ళల్లోనూ మోస్తూ..
    ధన్యవాదాలు 🙏🏻

  2. అద్భుతంగా ఆవిష్కరించారు భద్రుడు గారు. గుండె లోతుల్లో నుండీ వచ్చింది. భారమైంది చదువుతున్నంత సేపు….చెమర్చిన కళ్ళకు అక్షరాలు అలికి పోతుంటే మళ్ళీమళ్ళీ చదవాల్సి వచ్చింది.
    కృతజ్ఞతలు చిన్న మాటే కాగలదు.
    ధన్యవాదాలు మీకూ, మీ సంస్కారానికి.

Leave a Reply

%d bloggers like this: