ఆ పల్లె, ఆ యేరు, ఆ పద్యాలు

Reading Time: 4 minutes

మొన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు రెండో రోజు సమావేశం గోదావరి గట్టుమీదనే ఏర్పాటు చేసారు. ఇష్టకవితా పఠనం. తొమ్మిదింటికి. అందుకని పొద్దున్నే గోదావరి గట్టుమీదనే ఉన్న రెండు దేవాలయాలూ, వేణుగోపాల స్వామి గుడీ, ఉమామార్కండేయేశ్వర స్వామి గుడీ చూసుకుని సమావేశానికి వెళ్దామన్నాను పద్మతో. మార్కండేయేశ్వర స్వామి గుడి సరే, శ్రీవేణుగోపాల స్వామి గుడి కూడా అక్కడే ఉందని ఆ ఊళ్ళో అన్నేళ్ళు వున్నా తెలుసుకోలేదు. ఒక్కరోజూ వెళ్ళలేదు కూడా. కాని రాజమండ్రిని తలుచుకున్నప్పుడల్లా ఆ వేణుగోపాలుణ్ణి కూడా తలుచుకుంటూనే ఉన్నాను. మొదటిది, ఆయన రాజమండ్రికి క్షేత్రపాలకుడు అయినందువల్ల, రెండోది, మా మాష్టారు రాసిన శ్రీ వేణుగోపాల శతకం వల్ల.

గోదావరి గట్టుమీద ఒకప్పుడు లాంచీల రేవు ఉండేది. దాన్ని కొవ్వూరు లాంచీల రేవు అని కూడా అనేవారు. అప్పటికి ఇంకా ఈ గట్టు ఇప్పుడు చూస్తున్నట్లుగా ఇలా రూపొంది ఉండని రోజుల్లో, అది ఇంకా కరకట్టగానే ఉన్నప్పుడు, అక్కడొక పెద్ద నిద్రగన్నేరు చెట్టు కూడా ఉండేది. ఆ రేవుకి ఇవతలవైపు రోడ్డు దాటితే నేరుగా సమాచారం ఆఫీసు ఉండేది. సమాచారానికి వెళ్ళే వీథిలో కుడివైపు సదనం ఉండేది. అక్కడే శరభయ్యగారు పాఠాలు చెప్పేవారు. అక్కడే మా అక్క చదువుకుంది. ఆ సమాచారం మేడమీద చాలా కాలం శరభయ్యగారు నివాసం కూడా ఉన్నారు. ఆ సెంటరు నేను రాజమండ్రిలో ఉన్నాన్నాళ్ళూ నాకూ, మా మిత్రబృందానికీ అడ్డా. ప్రతి రోజూ సాయంకాలం కాగానే మేమంతా అక్కడ కలుసుకునే వాళ్ళం.

ఆ సెంటరుకి అటువైపు శ్రీ వేణుగోపాల స్వామి గుడీ, ఇటువైపు మార్కండేయేశ్వర స్వామి గుడీ ఉన్నాయి. కాని ఎందుకనో, ఒక్కసారి కూడా ఆ వేణుగోపాలుడి గుడివైపు నా అడుగులు పడలేదు. బహుశా ‘అమరధామం’ అనే వ్యాసంలో రాసినట్టుగా, నా చిన్నప్పుడు నా మదిలో ముద్రపడ్డ ఆ బాలమార్కండేయుడి దగ్గరే ఆగిపోయినట్టున్నాను. అందుకని ఈసారి ఎలాగేనా వేణుగోపాల స్వామిని దర్శించుకుని తీరాలనుకున్నాను.

ఆ సుప్రభాతవేళ ఆ గుళ్ళో అడుగుపెట్టగానే ‘ఈ నా శరీరమందు ఇవతళించిన గాలి ఎంత పౌరాతన్యమేచికొనెనొ ‘ అన్నట్టు ఏదో పూర్వయుగాల పలకరింపు పులకింతగా తోచింది. ఆ గుడికి కనీసం వెయ్యేళ్ళ చరిత్ర ఉందని అక్కడ ఒక బోర్డుమీద రాసి ఉంది. చాళుక్యులు శైవులయినా కూడా, క్షేత్రపాలకుడు కాబట్టి ఆయనకు కూడా గుడి కట్టారని చరిత్ర చెప్తున్నది. నెమ్మదిగా గుడిలో అడుగుపెట్టగానే మోహనాకారుడు దర్శనమిచ్చాడు. అప్పటికే అక్కడ భక్తులు చాలామంది అక్కడ నిలబడి ఉన్నారు. పూజారి వారి గోత్రనామాలు తెలుసుకుంటూ దేవుడికి నివేదిస్తున్నాడు. మేము నిలబడగానే మా గోత్రనామాలు కూడా అడిగాడు. మా ముందున్న భక్తులు తమ గోత్రనామాలు చెప్తూనే అర్చన పూర్తయ్యేదాకా వేచి ఉండకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. అదీ మంచిదయింది. అర్చన పూర్తయ్యేసరికి మేము దేవుడికి బాగా దగ్గరగా జరగ్గలిగాం.

స్వామి దర్శనమయ్యాక పూజారి అమ్మవారి దర్శనానికి కూడా పిలిచాడు. అక్కడ కూడా దర్శనం పూర్తయ్యాక, స్వామి ధరించి విడిచిన ఒక శేష మాల నా భుజాల చుట్టూ కప్పాడు. ‘ఏమి భాగ్యం’ అనుకున్నాను. నేను కోరుకున్నట్టే దేవుడు కూడా నన్ను చూడాలని కోరుకుంటున్నాడా ఏమి అనుకున్నాను.

దర్శనం పూర్తయి గర్భగృహంలోంచి బయటకు అడుగుపెడుతుండగా ఒక వీణావాదనం వినవస్తూ ఉన్నది. ఆ వీణ ఎవరిదై ఉండవచ్చునా అని అనుకుంటూ పక్కకి తిరిగి చూద్దునుకదా, అక్కడ ఒక వైపు మంటపంలో ఒకామె వీణ వాయిస్తూ కనిపించింది. అమె వెనక గోడమీద విశ్వరూపం, విష్ణు సహస్రనామాలు లిఖించి ఉన్నాయి. నేరుగా ఆ అరుగు దగ్గరకు వెళ్ళి పక్కన ఒక స్తంభానికి ఆనుకుని కూచున్నాను. ఆమె వీణ మీద స్వరాలో, జతిస్వరాలో పలికిస్తున్నదేమో అనుకున్నాను. కాదు, వేదమంత్రాల్ని వినిపిస్తూ ఉన్నది. జగన్మోహనాకారుడి దర్శనం, నా భుజాలమీద అలంకరించిన చామంతిమాల, ఆ వీణాగానం- కాలం తాకిడికి చెక్కుచెదరని రాజమండ్రిలో ఉన్నాననిపించింది.

మా మాష్టారు రాసిన ‘శ్రీవేణుగోపాల శతకం’లోని వేణుగోపాలుడు రాజమండ్రి వేణుగోపాలుడు కాడు. ఎందుకంటే ఆ పద్యాలు, దివి సీమలో వేముల మడ గ్రామంలో కొలువైన శ్రీవేణుగోపాలుడి మీద రాసినవి. ఆ పద్యాల్లో ఆ ప్రసక్తి చాలా స్పష్టంగా ఉంది. కాని ఆ పద్యాలు రాజమండ్రి వేణుగోపాలుడి మీద రాసినవి కూడా. ఎందుకంటే, ఆయన రాజమండ్రి మీద రాసిన మరొక పద్యంలో ‘మా గోదావరియే, తదీయతటియే, ఆమ్నాయాంత సంవేద్యుడౌ మా గౌరీశుడె, మా వేణుగోపాలుడే’ అని కూడా స్పష్టంగా చెప్పుకున్నారు. ఆయన పుట్టింది కృష్ణా జిల్లా చిట్టిగూడురులో. ఉద్యోగరీత్యా, ఆ తర్వాతా కూడా గడిపింది రాజమండ్రిలో. అందుకని ఆ పద్యాల్లో ఉన్నది కృష్ణాతీరపు మోహన కృష్ణుడు అనే మాట నిజమో, గోదావరి ఒడ్డున ఉన్న వేణుగోపాలుడు అనే మాట కూడా అంతే నిజం. ఈ పద్యం చూడండి:

స్మయదబ్జాక్ష! ఘటింపవే! యెపుడు నా స్వాంతంబునన్ నీదు ప

ల్లియయో! నల్లని యేరొ! పచ్చబయలో! లేదూడలో! జారువ

ల్లియయో!పిల్లనగ్రొవియో! నెనరులో! లేజూపులో! నెమ్మిపిం

చియమో!వంచిన యోరమోము సవురో! శ్రీ వేణుగోపాలకా!

కృష్ణుడి తలపులు తన మనస్సులో ఎప్పటికీ ఆ జ్ఞాపకాలే కలిగిస్తూ ఉండాలట! కెరలిస్తూ ఉండాలట. వేటి గురించి? ఆ పల్లె, ఆ నల్లని యేరు, ఆ పచ్చికబయళ్ళు, ఆ లేగదూడలు, ఆ వల్లెవాటు, ఆ పిల్లనగ్రోవి, ఆ ఓరచూపులు, ఆ పింఛం, ఆ ఓరమోము- అబ్బా! ఇది ఏ గుడికి చెందిన కృష్ణుడి గురించిన పద్యం? మా ఊళ్ళో కృష్ణుడికి ప్రత్యేకంగా ఏ గుడీ లేదుగాని, ఆ పల్లె, ఆ ఏరు, ఆ లేగలూ, ఆ నెమళ్ళూ మా ఊరివి కావా!

మా మాష్టారు తలుచుకుని ఉంటే ఒక మహాకావ్యం రాయగలిగి ఉండేవారు. కాని ఆయన దృష్టి ఎంతసేపూ పూర్వకవుల కవిత్వాల్ని చదువుకోవడం మీదనే ఉండేది. ‘శ్రీ వేణుగోపాల శతకం’ ద్వితీయ ముద్రణ (1998) కు ముందుమాట రాస్తూ ఎక్కిరాల కృష్ణమాచార్యులు వజ్రాలు పొదిగినట్టుండే వాక్యాలు రాసారు. ఈ వాక్యాలు చూడండి:

ఉత్తమ కవులకు జీవితమొక సారస్వత సత్త్రయాగము. వారు చదువుకొన్న కావ్యముల కర్తలు వారి అంతరంగమను సత్త్రశాలలో ఆజన్మాంతము సన్నిధి చేసి యుందురు. శరభయ్య శర్మ లోగల లోగిలి బహుసహస్ర మహాకవులకు సత్త్రశాల. అంతేకాదు, ఆ కవులందరు అవకాశము కలిగినప్పుడెల్ల అతని జిహ్వాగ్రమున నిలిచి కూనిరాగములు తీయుచుందురు, ఇతనికి పుస్తకాపేక్ష లేదు. కనుకనే అఖండ రససిద్ధి గల ఈ శతకమును ఆస్వాదించువారికి లీలాశుకుడు, జయదేవుడు, పోతన, తెనాలి రామకృష్ణుడు, విశ్వనాథ సత్యనారాయణ చవులుగా తగులుచుందురు..’

శరభయ్యగారు శైవుడు. నిత్యం అభిషేకం చెయ్యందే అన్నం ముట్టనివాడు. అన్నేళ్ళు రాజమండ్రిలో ఆ గోదావరి ఒడ్డున ఉన్నందుకు ఆయన మార్కండేయేశ్వరస్వామిమీద శతకం రాసి ఉండాలి, న్యాయంగా. కాని కృష్ణుడి మీద ఎందుకు రాసాడు? అది కూడా తాను ఎప్పుడో వదిలి వచ్చిన దివిసీమ లోని కృష్ణుడి మీద? ఆయన పసితనంలో కృష్ణాకర్ణామృతం చదివినవేళ ఎటువంటిదో గాని, చాలా ఏళ్ళు ఆ బాలకృష్ణుడు తప్ప మరెవరూ కనిపించేవారు కాదట. ఆ చిన్నపిల్లవాణ్ణి ఒకసారి బందరులో ముట్నూరి కృష్ణారావుగారు ఒళ్ళోకి తీసుకుని ‘నువ్విప్పుడేం చదువుతున్నావు బాబూ’ అనడిగితే, ‘కృష్ణకర్ణామృతం తప్ప మరేదీ నా మనసుకి రుచించడం లేదు’ అని చెప్పాడట. ఆ మహర్షి నవ్వి ‘లీలాశుకుడు కృష్ణుడిలో ఏ సౌందర్యాన్ని చూసాడో, కాళిదాసు, భవభూతి మొత్త ప్రపంచంలో ఆ సౌందర్యం చూసారు. నీకు పెద్దయ్యాక అర్థమవుతుంది లే’ అని చెప్పారట.

కాని ఆ మాటలే ఆయన్ను కాళిదాసాదులకు దగ్గరగా తీసుకువెళ్ళాయికాని, మహాకావ్యనిర్మాణానికి దూరం చేసాయేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే, ఆయన కాళిదాసాదులు ఏ సౌందర్యాన్ని చూసారో దాన్ని చూడగలిగాడుకాని, తనంతటతనుగా ఒక సౌందర్యాన్ని వర్ణించవలసి వచ్చినప్పుడు, ఆ చిన్ని కృష్ణుడి నుంచి ఆయన దృష్టి ఏ మాత్రం పక్కకు తప్పుకోలేదు. ఒకసారి ఆయన శ్రీకృష్ణకర్ణామృతం మీద ప్రసంగిస్తూండగా విన్నాను. అప్పుడు ఈ శ్లోకం (2:44) –

గోధూళి ధూసరిత కోమల గోపవేషం

గోపాల బాలకశతైః అనుగమ్యమానం

సాయంతనే ప్రతి గృహం పశుబంధనార్థం

గచ్ఛంతమచ్యుత శిశుమ్ ప్రణతోస్మి నిత్యం.

రెండుమూడు సార్లు చదివి వినిపించారు. ప్రతి పదార్థం వివరిస్తూ మళ్ళా మళ్ళా చదివారు. ఇన్నాళ్ళ తరువాత ఆ వదనాన్నీ, ఆ శ్లోకం చదువుతున్నప్పుడు ఆయన కళ్ళల్లో కనిపించిన మెరుపునీ, ఏ లోకాతీత సీమవైపో చూస్తున్న ఆ దృక్కుల్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే, ఆయన ఆ గోపబాలకుడిదగ్గరే ఆగిపోయాడని అర్థమవుతూ ఉన్నది. తీరా ఆయన పద్యాలు రాయబోతే ఆ గోపబాలకుడే దొంగలాగా వచ్చి కాగితాల మీద కూచున్నాడనిపిస్తుంది. చూడండి ఈ పద్యం:

వన్నెల్! వన్నెలు !పిన్న కూకటులపై బర్హావతంసాదృతీ

కన్నుల్! కన్నులు! నెమ్మిగుంపుల మెయిన్ కాంతార ఖేలారతీ!

వెన్నల్! వెన్నలు! మోవికెంజిరుపై వ్రీడావిహీనాకృతీ!

చిన్నెల్! చిన్నెలు! చిన్ని చెక్కిళులపై శ్రీ వేణుగోపాలకా!

జగత్సౌందర్యమంతా ఆ జగన్మోహనాకారుడే! చూడండి ఈ పద్యాలు:

వలపుల్ వెన్నలు వెన్నెలల్ వెలదులన్ వత్సంబులన్ ధేనువుల్

తలిరుల్ పూవులు తేనియల్ ఋతువులున్ ధర్మబులన్ వ్రాలు సం

జలు లే సంజలు నారబంబులు తరుల్ ఛాయల్ నవాబ్దంబులై

చెలగున్ మీ చెలువంబె క్రొత్తలగుచున్ శ్రీ వేణుగోపాలకా!

సుమగర్భంబుల తేనె, నిండునెలలన్ జ్యోత్స్నామృతం బబ్ధ గ

ర్భములన్ నీరము, శాలి గర్భముల క్షీరం, బాల యాపీన గ

ర్భములన్ స్నిగ్ధ పయస్సు, వేణుజడ గర్భంబందు నుద్గీథ, మ

బ్రము నా గుండియనైన లోతులుబికింపన్ వేణుగోపాలకా!

మళ్ళీ ఎక్కిరాల వారి ముందుమాటకి వస్తాను. ఆయన ఇలా రాస్తున్నారు:

ఈ కవికి జీవితము, సాహిత్యజీవితము వేరు కావు. ఇతడొక రసోన్మత్తుడు. ఒక పదివేల సంవత్సరములు ఏకాంతముగా నుండుమన్నను పూర్వకవులతో నిరంతర సల్లాపములు చేయుచుండగలడు. పూర్వజన్మలలో చేసినను చేసి యుండవచ్చును. అప్పటి మాధుర్యస్రవంతి యిప్పటి జీవితఘట్టములచే అతిరస్కృతమూర్తిమంతము. లేనిచో భౌతిక జీవితఘట్టముల ప్రభావమున నితడు పిచ్చివాడై యుండవలసినది. ఇది కూడా ఇతని సాహిత్యోన్మత్తకు కారణమేమో!

అని ఈ మాట కూడా అన్నారు:

ఒకమాట మాత్రము నిజము-ఇతని ఐహిక జీవితము నితడు జీవించుట లేదు. అంతర్వాహియైన ఇతని సరస్వతియే యీ వేణుగోపాల శతకముగా ప్రవహించి, సహృదయులకు తరంగ మృదంగ నాదములను వినిపింపచేయుచున్నది.

వేణుగోపాల స్వామి గుడి దగ్గరనుంచి మార్కండేయేశ్వర స్వామి గుడికి వెళ్ళాం. అక్కడ సకలదేవతలూ కొలువున్నారు. వారి చుట్టూ పూర్వాంధ్రమహాకవుల పద్యాలు గాల్లో నినదిస్తూనే ఉన్నాయి. గుడినుంచి బయటకి వచాము. ఎదురుగా నీలగోదావరి. శుభ్రగోదావరి. సత్త్వగోదావరి. ఒడ్డున రావి చెట్లు. ఆ గాలి, ఆ ఆకాశం, యుగాలుగా అక్కడ వినిపిస్తున్న సంస్కృత శ్లోకాలు, తెలుగు పద్యాలు- నాకు చెప్పలేనంత బెంగ పుట్టింది. ఆ మంగళమోహన గోపాలుడు, ఆ వేణుగోపాల శతకం, ఆ వీణానాదం- నా చిన్నప్పుడు ఏ రాజమండ్రిని చూసానో ఆ రాజమండ్రినో మరొక్కసారి చూసాననిపించింది. అదే ఆ గోపాలుడి పల్లె, ఆ నల్లని ఏరు, అవే నెనరులు, అదే లేజూపులూను!

7-1-2023

2 Replies to “ఆ పల్లె, ఆ యేరు, ఆ పద్యాలు”

  1. ఆ గోపబాలకుడే దొంగలాగా వచ్చి ఆ కాగితాల మీద కూర్చున్నాడనిపిస్తుంది..
    ఎంత హృద్యంగా ఉంది సర్ 🙏

Leave a Reply

%d bloggers like this: