అమరధామం

(పోయిన నెల చివరి వారంలో సాహితీవేదిక మిత్రుల పునర్మిలనం కోసం రాజమండ్రి వెళ్ళాను. అక్కడ గోదావరి ఒడ్డున ఇస్కాన్ వారి గెస్ట్ హవుజ్ లో మూడు రోజులున్నాను. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం గోదావరి కనబడుతూ ఉంటే, ఆ గాలి ఎంతో వాత్సల్యంతో నా వళ్ళంతా నిమురూ ఉంటే, చెప్పలేని సౌఖ్యాన్ని అనుభవించాను. తిరిగి బస్సులో విజయవాడ వస్తూ ఉంటే, కొత్త వంతెన మీంచి గోదావరి దాటుతూ ఉంటే అపరిమితమైన బెంగ కలిగింది. ఈ మధ్యకాలంలో అటూ, ఇటూ ఎన్ని సార్లు సామాన్లు సర్దుకోలేదని! కానీ ఇటువంటి బెంగ కలిగి ఎరగను. ఆ బెంగలో ఎన్నో ఉన్నాయి. కోల్పోయినవి మరెన్నటికీ తిరిగిరావనే అతి పెద్ద బెంగ అది. ఎప్పుడో రాజమండ్రి మీద నాతో ఒక వ్యాసం సమాచారం సుబ్రహ్మణ్యం రాయించాడని గుర్తొచ్చింది. ఎక్కడుందో వెతికిపెట్టగలరా అని అడిగితే డా.అరిపిరాల నారాయణ రావుగారు ఈ వ్యాసం పంపించారు. ఇది సమాచారం 40 వసంతాల సంచికకోసం 1996 లో రాసింది. మీతో పంచుకోకుండా ఉండలేకపోతున్నాను.)

~

నా చిన్నప్పటి రోజుల్లో మా వూళ్ళో రాత్రిళ్ళు రామకోవెల దగ్గర రాజమండ్రి నుంచి వచ్చే చివరి బస్సుకోసం నిరీక్షిస్తుండే రోజులుండేవి. రాజమండ్రిలో సదనంలో మా అక్క చదువుకునేటప్పటి రోజులు అవి. ఆమె వస్తోన్నదంటే ఆమె కూడా ఒక మంత్రనగర మాధుర్యమంతా తరలివస్తున్నట్టుండేది. నాకు చాలా పసితనపు రోజుల్లో, బహుశా ఎనిమిది తొమ్మిదేళ్ళప్పుడు కాబోలు, మా నాన్నగారు నన్ను రాజమండ్రి తీసుకెళ్ళారు. మా వూరి ఏటికన్నా పెద్దదయిన గోదావరీ, పాత రైలువంతెనా, లాంచీలు, మార్కండేశ్వర స్వామి గుడి మీద మార్కండేయుడు శివలింగాన్ని కావిలించుకున్నట్టుండే విగ్రహం, పక్కన యముడూ, రేడియో లో దమ్ మారో దమ్. రాజమండ్రి తొలిచూపులోనే నా పైన మంత్రముద్ర వేసింది.

రాజమండ్రిలో నేను ఉద్యోగం చేస్తానని గాని, ఏళ్ళ తరబడి నివసిస్తాననిగాని ఎన్నడూ అనుకోలేదు. టెలిఫోన్స్ లో నాకో చిన్న ఉద్యోగం దొరికినప్పుడు ఏడాదిలోనే కాకినాడకి ట్రాన్సఫర్ అయిపోవాలనే కోరుకున్నానుగాని, సుమారు అయిదేళ్ళ పాటు ఆ వుద్యోగంలోనే రాజమండ్రిలోనే ఉండిపోతానని అనుకోలేదు. తీరా చేసి అక్కడ పాతుకున్నాక, ఆ వూర్ని విడిచిపెట్టేస్తాననీ, తిరిగి బహుశా ఆ వూర్లో మళ్ళా అన్నేళ్ళు నివసించే అవకాశం మరి రాకపోవచ్చనీ కూడా అనుకోలేదు.

రాజమండ్రిలో అయిదు సుదీర్ఘ సంవత్సరాల పాటు ఒక్కడినే ఉన్నాను. ఆ అయిదేళ్ళూ అనేక నెలలుగా, వారాలుగా, రోజులుగా, రాత్రులుగా, ఉదయాస్తమయాలుగా, గంటలుగా, క్షణాలుగా అక్కడ గడిపిన కాలం నా జీవితంలో అత్యంత ఉజ్వలమయిన కాలం. అంతే నిరర్థకమయిన కాలం కూడా.
రాజమండ్రిలో నేను గడిపిన రోజులు నా యవ్వనారంభ దినాలు. నా కెరీర్ లోని తొలి సంవత్సరాలు. నా జీవితానికి నేనో గమ్యానీ, అర్థాన్నీ వెతుకులాడుకోవాల్సిన రోజులు. అంతకు ముందూ, ఆ తర్వాతా కూడా నేను అనేక ఊళ్ళల్లో నివసించాను. కుగ్రామాల్లాంటి గిరిజన గ్రామాల నుండి విశాఖపట్నం, హైదరాబాద్ లాంటి మహానగరాల దాకా. కానీ ఏ జనావాసమూ కల్పించని ప్రత్యేక ముద్ర ఏదో రాజమండ్రి నాపైన ఒదిలిపెట్టింది. దాని వల్ల నేను అంతదాకా బతికిన గ్రామాల్ని మరింత బాగా అర్థం చేసుకోవడానికీ, ఆ తర్వాత జీవించిన, జీవిస్తూ ఉన్న ప్రాంతాల్ని మరింత ఎరుక పరచుకోడానికీ.

గోర్కీ తన విశ్వవిద్యాలయాల గురించి రాసుకున్నది మనకు తెలుసు. నేను కూడా గోర్కీ లానే విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టడానికి నోచుకోలేకపోయాను. కాని రాజమండ్రిలో నా జీవితం నాకు విశ్వవిద్యాలయాలన్నింటిలోనూ మహత్తరమైన విశ్వవిద్యాలయాన్ని అందించింది. రాజమండ్రిలోనే నేను మొదటిసారిగా విశాల ప్రపంచాన్నీ, జీవితాన్నీ చూసాను, తెలుసుకున్నాను, ప్రేమించాను.
ఒక చేత పానపాత్ర, మరొక చేత కొరడాతో రాజమండ్రి నాకు చదువు నేర్పింది. ఒక క్షణాన కన్నులు నిమీలితాలయ్యే జీవనానురాగ వివశత్వం, మరొక వైపు ఛళ్ళుమంటూ మెలకువ తెప్పించే వాస్తవకర్కశత్వం. రాజమండ్రి నా కెరీర్ ని, యాంబిషన్ ని, ఆశల్ని, ఆకాంక్షల్ని భగ్నం చేసింది. నన్ను నిలువెల్లా మూలాల్లోంచీ కూల్చిపారేసింది. కాని రాజమండ్రి నాకో ఆత్మనిచ్చింది. ఆశయాన్నిచ్చింది. ఆదర్శాన్నిచ్చింది. రాజమండ్రి నాకు చేరువ కాకపోయి వుంటే నేను మరేమన్నా అయి వుందును గాని, మనిషిని కాలేకపోయి ఉందును.

జీవితంలోని సకల కల్మషాలూ రాజమండ్రిలో కన్పిస్తాయి. కాని జీవితంలోని అపురూప సుమసౌరభాలు కూడా అక్కడే పరిమళిస్తాయి. నిత్యం నిష్కల్మషంగా ప్రవహించే గౌతమి రాజమండ్రికి ఆదర్శం. ఆ రాజమండ్రి మనకెల్లరకూ ఆదర్శం.

రాజమండ్రిని ఒట్టి మాటల్లో వివరించడం కష్టం. అది డాస్టవిస్కీ సెంట్ పీటర్స్ బర్గ్ ని చిత్రించినట్లు, ఓ హెన్రీ న్యూయార్క్ ని చిత్రించినట్లు, స్టెఫాన్ జ్వెయిగ్ వియన్నాని చిత్రించినట్టు, ప్రాచీన చీనా కవులు నాన్ కింగ్ ని వర్ణించినట్టు చెప్పగలగాలి. రాజమండ్రి కేంద్రంగా ఎపిక్ డైమెన్షన్స్ లో ఒక నవల రాయాలన్నది నా కల. నేనా నవలని రాయగలిగితే అది తెలుగు సాహిత్యంలో అపురూపమైన సృజన కాగలుగుతుంది. నా ప్రతిభవల్ల కాదు, జీవంతో తొణికిసలాడే రాజమండ్రి నేపథ్యం వల్ల.

నగరాల గురించీ, నగర జీవితపరిణామం గురించీ ఆధునిక శాస్త్రజ్ఞులకు ఎంతో ఆసక్తి. మాక్స్ వెబర్ కి మరీ ముఖ్యంగా. కాని వాళ్ళు రాజమండ్రి చూడగలిగి వుంటే వాళ్ల జ్ఞానానికి మరింత వన్నె చేకూరేది. గ్రామాల నిష్కాపట్యం, నగరాల విజ్ఞానం పొందిన మేలు కలయిక రాజమండ్రి. అలానే గ్రామాల మూఢత్వమూ, నగరాల వంచనా కూడా రాజమండ్రిలో బలంగానే ఉండవచ్చు. కానీ పక్కన నిండార్లుగా ప్రవహించే గౌతమి ఉన్న మాట మనం మర్చిపోవద్దు. తన సకల సంకుచిత అవలక్షణాలన్నిటితో సహా రాజమండ్రి అంటే నాకిష్టం. ఏమంటే నేను కూడా అట్లాంటి వాణ్ణే కనుక.

నా చిన్నప్పుడు రాజమండ్రి నుండి చివరి బస్సులో వచ్చే మా అక్క అంటే ఎంత ఎదురుచూసేవాణ్ణో ఇప్పుడు కూడా రాజమండ్రి నుండి ఎవరు ఎప్పుడు వస్తారా అని ఎదురుచూస్తాను. ఏమీ తెలియని పసితనపు వెన్నెలరాత్రి మంత్రనగరం అప్పుడయితే, అన్నీ తెలిసిన, తెలివి మీరిన ఈ నాటి జీవితంలో ఆనందాపరాధాల వెలుగునీడల వింతనగరం ఇప్పుడు.

యముడు పాశంతో మననెప్పుడూ వెంబడించే ఉంటాడు. ప్రతి మానవుడూ శప్తమృకండు సుతుడే. అయినా మృత్యు సమక్షంలోనే జీవిత అభయప్రదానం సాధ్యమయ్యేది. నాకు తెలిసినంతమటుక్కి, ప్రపంచ మహానగరాలన్నిటిలో, ఒక రాజమండ్రిలోనే ఈ మృత్యుంజయగాథకి మహత్వం సిద్ధించింది.

5-1-2023

2 Replies to “అమరధామం”

  1. గొప్ప వ్యాసం సర్,,ఇప్పుడే వెళ్లి ఆ ఊరు చూడాలి అన్పించింది ;;; దయచేసి రాజమండ్రి మీద ఒక నవల రాయండి

Leave a Reply

%d bloggers like this: