మధురవిషాద మోహగాథ

మహాకవి కాళిదాసు మూడు కావ్యాలూ, మూడు నాటకాలూ రచించాడు. కావ్యాలు మేఘసందేశం, కుమారసంభవం, రఘువంశం. నాటకాలు మాళవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం, ఆభిజ్ఞాన శాకుంతలం. ఈ మూడు కావ్యాల్లోనూ, నాటకాల్లోనూ ఆయన కవిగా, నాటకకర్తగా, మనిషిగా ఒక్కొక్కమెట్టే అధిరోహిస్తో, కవిగా రఘువంశంలోనూ, నాటకకర్తగా శాకుంతలంలోనూ పరిపూర్ణత సాధించాడు అని చెప్తారు. ఆ ఆరు గ్రంథాలనూ స్వయంగా చదువుకుని, వాటిలో కాళిదాసు సాధించిన క్రమోన్మీలతను గుర్తుపట్టగలగడం కంటే, ఈ దేశంలో భావుకులు కోరుకోగల రసానుభవం మరొకటి లేదు ఇప్పటిదాకా.

ఒకప్పుడు పిల్లలకి చిన్నప్పుడే ఎనిమిదేళ్ళ ప్రాయంలో, ఈ గ్రంథాలనుంచి ఒక్కొక్క సర్గ తండ్రినో, గురువునో కావ్యపాఠం చెప్పేవాడు. ఆ తర్వాత ఆ శిష్యుడు తనంతతానుగా మిగిలిన గ్రంథమంతా చదువుకోవాలి. సంస్కృత శ్లోకంలో ఛందస్సుకోసం వాక్యంలో వివిధ భాగాలు ముందువెనకలుగా ఉంటాయి. వాటిని ముందు వ్యాకరణరీత్యా వరసలో పెట్టుకోవాలి. దాన్ని అన్వయం అంటారు. ఒక సంస్కృత శ్లోకాన్ని తనకై తాను చదువుకుని, ఆ పదజాలాన్ని విడదీసుకుని, అన్వయక్రమాన్ని తనకై తాను కూర్చుకోగలిగితే ఆ విద్యార్థి కృతకృత్యుడయినట్టే. అయితే, అన్వయక్రమం బోధపడి, తాత్పర్యం అర్థమయినంతమాత్రాన, కావ్యానందం పట్టుబడినట్టు కాదు. దానికి విద్యార్థి తాలూకు ఊహాశాలీనత, ఇతర గ్రంథాల అధ్యయనం, గురువుల్తోనూ, తోటివిద్యార్థుల్తోనూ చేసే చర్చలూ, సంభాషణలూ మొదలైనవన్నీ తోడైతేనే కావ్యపాఠం హృదయంలోకి ఇంకడం మొదలవుతుంది. అప్పుడు కూడా కావ్యార్చన పూర్తయినట్టుకాదు. ఏళ్ళు గడిచేకొద్దీ, తాను చిన్నప్పుడు చదువుకున్న ఆ కావ్యాన్ని ఎప్పటికప్పుడు తనకి ఒనగూడుతున్న జీవితానుభవపు వెలుగులో మళ్ళీ మళ్ళీ చదువుకుంటేనే, ఆ విద్యార్థి సహృదయుడిగా మారతాడు.

నేను రాజమండ్రిలో ఉండే రోజుల్లో మల్లంపల్లి శరభయ్యగారు అని ఒక సంస్కృత పండితుడు ఉండేవారు. ఆయన అక్కడ ఆంధ్రయువతీ సంస్కృత కళాశాలలో చదువుచెప్పేవారు. మా అక్క ఆయన దగ్గర స్వయంగా చదువుకుంది. నేను ఆ భాగ్యానికి నోచుకోలేదుగాని, ఎన్నో సాయంకాలాలు, మరెన్నో సందర్భాలు ఆయన మాట్లాడుతూ ఉంటే వినే అదృష్టానికి నోచుకున్నాను. ప్రాచీన తెలుగు, సంస్కృత కవిత్వాల గురించి నాకేదైనా తెలిసి ఉంటే, అవగాహన కలిగి ఉంటే, అదంతా ఆ శుశ్రూష ఫలితమే.

సంస్కృతంలోనూ, తెలుగులోనూ ఆయన చదవని కావ్యం లేదు. కొన్ని వేల శ్లోకాలూ, పద్యాలూ ఆయనకు హృదయస్థంగా ఉండేవి. ఒక పుస్తకం తెరిచి చూస్తూ ఒక కవి పద్యాన్ని ఆయన అప్పగించడం నేనెప్పుడూ చూడలేదు. ఒక కవి మీద ప్రసంగించడం మొదలుపెడితే చాలు, ఆ కవి పద్యాలు ఆయన ధారణలోంచి జలపాతంలాగా వర్షించేవి. ఎప్పటికప్పుడు ఏ కవి మీద ప్రసంగిస్తే, ఆ కవినే తన ఇష్టకవిగా ప్రస్తావించే ఆయన మాటలు నన్ను అయోమయంలోకి నెట్టేసేవి. కాని ఏళ్ళ తరబడి సాంగత్యం వల్ల చివరికి, ఆయన అమితంగా ప్రేమించింది కాళిదాసు కవితని మాత్రమే అనే రహస్యాన్ని నేను కనుక్కోగలిగాను. కాని ఆ రహస్యం నాకు తెలియనట్టే ఉండటంలో, ఆయన దాన్ని నానుంచి దాస్తున్నట్టు మాట్లాడుతుండటంలో ఒక చిలిపి మాధుర్యం ఉండేది.

1986 నాటి మాట. వాళ్లింటికి వెళ్ళాను. అక్కడ జనమంచి కామేశ్వర రావు అనే ఆయన ఉన్నాడు. జనమంచి వెంకట రామయ్య అనే కవికి ఆయన సోదరుడు. ఆ వెంకట రామయ్యగారి పుస్తకానికి మాష్టారితో ముందుమాట రాయించాడు. ఆ కృతజ్ఞతతో మాష్టారు ఎప్పుడో మొదలుపెట్టి, మధ్యలో చాలాకాలంగా ఆపేసిన విక్రమోర్వశీయం అనువాదాన్ని ఆయన పట్టుబట్టి పూర్తిచేయించాడు. ఆ రోజు నేను అక్కడికి వెళ్ళినప్పటికి, ఆ విక్రమోర్వశీయం అనువాదం అప్పుడే ప్రెస్సునుంచి బయటకు వచ్చి తళతళలాడుతూ ఉంది. మాష్టారు నన్ను చూసి ప్రేమతో ఒక పుస్తకం నాకు, మరొకటి మా అక్కకూ బహూకరించారు. నేను ఆ పుస్తకం తెరిచి చూసాను. దానికి చిన్న ముందుమాట రాసుకున్నారు ఆయన. తెరవగానే మొదటి వాక్యమే ఇలా కనిపించింది:

కవికుల గురువు కావ్యసంతానములో విక్రమోర్వశీయమేఘసందేశములు రెండును కవలపిల్లలు! వాని నిర్మాణములో శాప్రగ్రస్తమైన ప్రణయము కావ్యవస్తువు.

శాపగ్రస్త ప్రణయము- ఆ మాట చూడగానే నా హృదయం లయతప్పింది. ఇది జరిగి ముప్పై ఆరేళ్ళు. ఇన్నేళ్ళుగానూ ఆ పుస్తకం నాతోనే ఉంది. ఆ రచనని ఆయన అనువాదంలోనూ, తర్వాత ఇంగ్లిషు అనువాదంలోనూ కూడా చదివాను. సంస్కృతంలో చదువుకుని, అన్వయక్రమం కూర్చుకుని, నాకై నేను అర్థం చేసుకోగలిగే శక్తి నాకు లేదని మీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది. కాని ఇన్నేళ్ళుగానూ, ఆ రచన నా ముందు ఒక మేలిముసుగు కప్పుకునే కనిపించేది. మా మాష్టారి అనువాదం ఆ మేలివలిపానికి మరింత వన్నె చేకూర్చినట్టు ఉండేదే తప్ప, ఆ తెర తొలగించి చూపేది కాదు. ఇదిగో, ఇన్నాళ్ళకు, మా అక్క వచనంలో వెలువరించిన ‘ఊర్వశి’ చదివినదాకా.

2

మానవులు పొందే సంతోషాన్ని చిత్రించినవాడు కవి అవుతాడు. కాని మానవదుఃఖాన్ని దర్శించినవాడు మహాకవి అవుతాడు. కాళిదాసు రఘువంశ కావ్యంలో అజమహారాజు తన భార్యను పోగొట్టుకుని విలపించే ఘట్టాన్ని చిత్రించాడు. ఆయనకు ఒక పురుషుడి దుఃఖం ఎలా ఉంటుందో తెలుసని లోకానికి అర్థమయింది. కుమార సంభవంలో శివుడి మూడో కంటికి దగ్ధమైన మన్మథుడికోసం రతీదేవి పడ్డ దుఃఖాన్ని చిత్రించినప్పుడు స్త్రీ దుఃఖం కూడా ఆ మహాకవికి తెలుసుననిపించింది. మేఘసందేశ కావ్యంలో శాపగ్రస్తుడైన యక్షుడు తన భార్యకు సందేశం పంపుతున్నప్పుడు, స్త్రీ-పురుష దుఃఖం తెలిసిన కవి అనిపించాడు. ఈ మాటలు నావి కావు, మా మాష్టారివి. డా.రాధాకృష్ణన్ కూడా ఈ మాటలు రాసాడు. దాదాపుగా కొన్ని శతాబ్దాలుగా కాళిదాసు పాఠకులంతా ఈ మాటలు ఒకరికొకరు చెప్పుకుంటూనే ఉన్నారు.

ఇటువంటి క్రమోన్మీలనమే కాళిదాసు నాటకాల్లో కూడా ఉంది. మాళవికాగ్నిమిత్రంలో మాళవిక, కాళిదాసు పుట్టిపెరిగిన మాళవదేశపు ధాత్రీ సౌందర్యం. అందుకని మాళవికని మా మాష్టారు మానవలోక సౌందర్యానికి అవధి అన్నారు. విక్రమోర్వశీయంలోని ఊర్వశి ఆకాశానికి హద్దు. ఆమె స్వర్గలోక సౌందర్యాన్ని భూమికి పరిచయం చేసింది. అందుకని ద్యులోక సౌందర్యానికి ఊర్వశి చరమసీమ అన్నారు. ఇక భూమీ, ఆకాశమూ రెండూ కలిసే తావుల్లోంచి రూపొందించిన సౌందర్యం, సౌశీల్యం శకుంతల. కాబట్టే ఆ నాటకాన్ని మూడో రకం జర్మన్ అనువాదంలో చదివినా కూడా, గొథే, భూమ్యాకాశాలు కలుస్తున్న చోటు చూసానంటూ సంతోషంతో నాట్యం చేసాడు.

మూడు నాటకాల్లోని ముగ్గురు నాయికల్లోని క్రమవికాసాన్నీ మా మాష్టారు మరో ఉదాహరణతో కూడా చెప్పారు. కాళిదాసు రూపకనిర్మాణ ప్రతిభ మాళవికలో  మొగ్గగా, ఊర్వశి లో పువ్వుగా వికసించి శాకుంతలంలో ఫలించింది అని.

మాళవిక ఒక ముగ్ధ. ఆ నాటకంలో కూడా ఒక ఇన్నొసెన్స్ కనిపిస్తుంది. శకుంతల కూడా ముగ్ధనే. కాని ఆమెకి రాచనగరు తాలూకు కఠోరవాస్తవాలు తెలిసిరావడంతో ఆమె వ్యక్తిత్వానికొక అపూర్వమైన గాంభీర్యం చేకూరింది. తన చిన్ననాటి అమాయికమైన ఆ లోకం తనకింక మిగల్లేదని తెలిసినప్పుడు, తన స్వాభిమానాన్ని, స్వాతంత్య్రాన్ని కుదువపెట్టుకుని జీవించవలసిన పని లేదనుకున్న ధీరవనిత. ఆదర్శవాస్తవాల ఈ జమిలినేతవల్లనే శాకుంతలం సర్వోత్కృష్ట నాటకంగా నిలబడింది. విక్రమోర్వశీయం ఈ రెండింటి నడుమది. కానీ ఈ రెండింటికీ భిన్నమైంది.

విక్రమోర్వశీయంలో కథ ఇదీ అని చెప్తే విని ఆ నాటకాన్ని చదవకపోతే మనకు ఏమీ మిగలదు. ఊర్వశిలాగే ఆ నాటకం కూడా చేతికి చిక్కదు. అది వానాకాలపు అడవి మీద కొన్నిక్షణాల పాటు మాత్రమే విరిసే రంగుల హరివిల్లు. లేలేత రంగుల్తో చిత్రించిన నీటిరంగుల చిత్రం. సాయం కాలీనలలితగీతం. ఆ రంగులు ఎవరికి వారు చూడవలసినవి. ఆ రాగాలాపన ఎవరికి వారు వినవలసినది. నిజానికి విక్రమోర్వశీయాన్ని నాటకం అని కూడా అనలేం. దాన్ని లాక్షణికులు త్రోటకం అన్నారు. అంటే మనుషులకీ, దేవతలకీ మధ్య ప్రణయగాథ ఇతివృత్తంగా ఉండే రూపకం అని. కాని నా దృష్టిలో విక్రమోర్వశీయం కావ్యం. అందమైన, సుకుమారమైన దీర్ఘకవిత. చింగిజ్ ఐత్ మాతొవ్ రాసిన జమీల్యా లాగా అది విషాదమాధుర్యాలు కలగలిసి, చివరికి, మాధుర్యమే మనల్ని వెన్నాడే ఒక మోహగాథ.

మాళవిక ఏ శాపానికీ గురికాని నగరకన్య. శకుంతల ఒకసారి శాపానికి గురయి దానికి మూల్యం చెల్లించవలసి వచ్చిన ఆశ్రమకన్య. కాని ఊర్వశి దేవకన్య. ఆమె ఒకసారి కాదు, రెండు సార్లు శాపానికి గురయ్యింది. ఫలించని ప్రేమ విషాదభరితమని మనకు తెలుసు. ఊర్వశి కథ విచిత్రం. ఆమె ప్రేమలో పడ్డందుకు ఒకసారీ, ప్రేమ ఫలించిన దశలో మరొకసారీ శాపానికి గురయ్యింది. స్వర్గం, నగరం, అడవి- ఈ మూడింటి చుట్టూ అల్లుకున్న కథ ఆమెది. ఆమె ఇంద్రలోక నటి. ఆమె నటించిన నాటకానికి స్వయంగా భరతముని దర్శకుడు. సరస్వతి గీత రచయిత. ఆ నాటకంలో ఆమె లక్ష్మి పాత్ర ధరించింది. తాను పురుషోత్తముడైన విష్ణువుని ప్రేమిస్తున్నానని చెప్పాలి, పాత్రపరంగా. కాని పురూరవుణ్ణి ప్రేమిస్తున్నాని చెప్పింది, అన్యమనస్కంగా. అంటే ఆమె నటిగా తన పాత్ర పోషించలేకపోయింది. ఇంద్రుడి కొలువులో తన విధ్యుక్త ధర్మం తాను నెరవేర్చడంలో తొట్రుపడింది. దాంతో శాపానికి గురయ్యింది. ఆలోచించండి. ఈ కథలో ఎంత రమ్యస్ఫూర్తి ఉంది! ఒక విమర్శకుడు అన్నట్లుగా, ప్రేమకీ, మన్మథుడికీ మరో పేరు ‘స్మర’ అని. అంటే తలచుకోవడం. ఆమె తాను ఎవరి పట్ల ప్రేమలో పడిందో అతణ్ణే తలచుకుంటూ ఉంది. నాటకంలో చెప్పవలసిన పాత్ర మరిచిపోయింది. ఆ తలపు ఆమె శాపానికి కారణమయ్యింది, కాని అది ఆమె పాలిట వరంగా కూడా పరిణమించింది. శకుంతల కూడా అన్యమనస్కంగా అతిథిని ఆదరించక శాపానికి గురయ్యింది. కాని ఆ శాపం ఆమెకు వరం కాక, నిజంగానే శాపంగా పరిణమించింది.

శాపగ్రస్త ప్రణయం ఈ నాటకానికి వస్తువు అని మా మాష్టారు అంటున్నప్పుడు ఆయన శాకుంతలాన్ని కాక, మేఘసందేశాన్ని గుర్తు చేసుకున్నారు. ఎందుకని? ఎందుకంటే, విక్రమోర్వశీయంలో శాపం దేవమానవ ప్రణయంగా వికసించింది కాబట్టి, మేఘసందేశంలో శాపం ఋతుపవన ఆగమనాన్ని తెలియచెప్పే శుభాకాంక్షగా పరిణమించింది కాబట్టి.

ఊర్వశి, పురూరవుడితో కలిసి సంతోషంగా గడుపుతూ ఉండగా, తెలియకుండా పొరపాటున ఒక తపోవనంలో అడుగుపెట్టినప్పుడు మరోసారి శాపానికి గురయ్యింది. స్వర్గంలోనూ ఆమెకి శాపం తప్పలేదు, వనంలోనూ తప్పలేదు. విధికీ నిషేధానికీ మధ్య, ప్రణయానికీ, బాధ్యతకీ మధ్య, తలపుకీ, మరపుకీ మధ్య సంచరించిన ఒక ప్రణయిని కథ ఇది. నువ్వు దివ్యకాంతవే కావచ్చుగాక, అతిలోక సౌందర్యవతివే కావచ్చు గాక, నిన్ను ప్రేమించినవాడికి నువ్వు తప్ప మరోలోకం లేకపోవచ్చుగాక, అయినా, నీ చుట్టూ వలయాలు, వలయాలు గా హద్దులూ, గీతలూ ఉంటాయి. పొరపాటున ఏ గీత దాటినా నీ ప్రణయం శాపగ్రస్తం కాకతప్పదు.

శాకుంతలం కూడా ఆశ్రమానికీ, నగరానికీ, తిరిగి ఆశ్రమానికీ మధ్య నడిచిన కథ. నీతో అడవిలో ప్రేమగా గడిపినవాడు నగరానికి వెళ్ళగానే నువ్వెవరో తెలియదంటాడు. నిష్ఠుర వాస్తవానికి అది పరాకాష్ట. కాని విక్రమోర్వశీయంలో సామాజిక-రాజకీయ వాస్తవం కాదు, ప్రేమికుల్ని విడదీసింది, అది ప్రేమైక చిత్తులుగా ఉన్న స్త్రీపురుషులు ఏ దశలోనైనా తమ స్పృహని కోల్పోతే వారికి సంభవించగల ప్రమాదం గురించిన కథ. ఒళ్ళు తెలియని ఆ ప్రేమపారవశ్యం ఒకరిని ఉన్మాదిని చేసింది, మరొకర్ని స్థాణువుని చేసింది.

కాని వారి ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ. అది చివరకు దేవతల్ని కూడా మనసు మార్చగల ప్రేమ. ఆ అవస్థా భేదాలన్నిటిలో మనం ఆ ఇద్దరి వెంటా, వారినే చూస్తో, వింటో ప్రయాణించడం ఒక రసజ్ఞుడు లోనుకాగల తీవ్ర రసానుభవం.  తెలుగు వచనంలో కూడా ఆ రసానుభవానికి మనం లోనుకాగలమని ఈ అనుసరణ ఋజువు చేసింది.

3

అసలు రాజమండ్రికి, విక్రమోర్వశీయానికి ఏదో దగ్గరి సంబంధం ఉంది. ఒకప్పుడు కుమారగిరి రెడ్డి బావమరది, సేనాధీశుడు అయిన కాటయవేముడు ఒకపక్క విజయనగర రాజులతోనూ, మరొకపక్క గజపతులతోనూ యుద్ధాలు చేస్తూనే కాళిదాస నాటకాలకి గొప్ప వ్యాఖ్యలు రాసాడు. వాటిలో కుమారగిరి రాజీయం అనే పేరుమీద విక్రమోర్వశీయానికి కూడా చక్కని వ్యాఖ్య రాసాడు. నేను ఆ వ్యాఖ్య మొత్తం చదవలేదుగాని, దానిపైన ఒక సమగ్ర విమర్శ చదివాను. అందులో కాటయవేముడు నాట్యశాస్త్రం ప్రకారం, దశరూపకం ప్రకారం విక్రమోర్వశీయాన్ని ఎంతో సమగ్రంగా చర్చించాడని తెలుసుకున్నాను.

పందొమ్మిదో శతాబ్దంలో రాజమండ్రిలో వడ్డాది సుబ్బరాయకవి అనే గొప్ప కవి ఉండేవాడు. ఆయన్ని వసురాయ కవి అని కూడా పిలిచేవారు. ఆయన భక్తచింతామణి అని ఒక శతకం రాసాడు. శ్రీ శ్రీ టాగోర్ ని ఎద్దేవా చేస్తూ టాగోర్ వసురాయ కవి మోకాళ్ళ దాకా కూడా రాడని ఈసడించాడు. శ్రీ శ్రీ టాగోర్ ని విమర్శించడం నాకు నచ్చకపోయినా, ఆ సందర్భంగా, వసురాయకవిని గుర్తు తెచ్చుకోవడంలో గొప్ప ఔచిత్యం చూపించాడు అనుకున్నాను. వసురాయ కవి విక్రమోర్వశీయాన్ని 1889 లో అనువదించాడు. తిరిగి మళ్ళా 1912 లో ఆ నాటకాన్ని పునర్ముద్రించాడు.

వీరేశలింగం గారు శాకుంతలాన్ని అనువదించినట్టుగా కాక, సుబ్బరాయకవి విక్రమోర్వశీయాన్ని కొంత లలితంగానే తెలుగు చేసినా, ఆ భాష మా మాష్టారిని చాలా నిరాశకు గురి చేసి ఉంటుంది. ఆ నాటకాన్ని తెలుగు చేయవలసిన పద్ధతి ఏదో తాను చూపించడం కోసమే ఆయన విక్రమోర్వశీయాన్ని తెలుగు చేయడానికి పూనుకుని ఉంటారు. లేకపోతే, వసురాయ కవి అనువాదం అంత ప్రసిద్ధి చెందాక, అది కూడా రాజమండ్రిలో, మరో మారు తెలుగులోకి తేవడానికి మరొకరెవరూ సాహసించి ఉండేవారు కారేమో!

ఇప్పుడు ఆయన శిష్యురాలు తిరిగి విక్రమోర్వశీయాన్ని తెలుగు వచనంలోకి తీసుకురావడంతో ఈ మూడు శతాబ్దాల్లోనూ రాజమండ్రి విక్రమోర్వశీయాన్ని మూడు సార్లు తెలుగు వాళ్ళకి కానుక చేసినట్టయింది.

మొదటి రెండు అనువాదాలూ పద్య, గద్యాలతో కూడుకున్నవి. ఈ అనువాదం పూర్తిగా వచనం. కాని అరవిందులు కూడా విక్రమోర్వశీయాన్ని The King and the Nymph అనే పేరుతో అనువదించినప్పుడు, గద్యసంభాషణల్ని కూడా ఇంగ్లిషు లో పద్యాలుగా అనువదించారని గుర్తుచేసుకోవాలి. టాగోర్ తన గీతాంజలిని ఇంగ్లిషులో వచనంగా అనువదించుకున్నప్పుడు, నేను కాళిదాసుని పూర్తిగా పద్యంలోకి అనువదిస్తే తప్పేమిటి అనడిగారట అరవిందులు. ఇందులో పెద్ద అనువాద సమస్య ఉంది. కాళిదాసు ఈ నాటకంలో కేవలం సంస్కృత శ్లోకాలే కాక, నాలుగో అంకంలో వివిధ రకాల ప్రాకృత ఛందస్సుల్లో కూడా కొన్ని శ్లోకాలు రాసాడు. వాటిలో ఉన్నది కేవలం సంగీతం మాత్రమే కాదు, ఒక మనిషి ప్రణయోన్మాద స్థితిలోని స్వప్న భాష కూడా అది. ఆ సంగీతాన్నీ, ఆ స్వాప్నికతనూ ఏమి చేసీ మనం తెలుగులోకి గాని, ఇంగ్లిషులోకి గాని తేలేము. బహుశా అనువాదకులు చెయ్యగలిగిందల్లా ఆ మూలనాటకంలో ఇటువంటి ఒక మాధుర్యం ఉంది అని పాఠకులకి ఒక ఆనవాలు వదిలిపెట్టడమే.

కాళిదాసు ఈ నాటకంలో మాటల్ని సన్నజాజి పూలదండలుగా గుచ్చుతాడు.  ఏ మాటకి ఎంత బరువుంటుందో తెలిసిన కవి  మాత్రమే అంత తూలికాతుల్యంగా పద్యాల్ని, సంభాషణల్ని నిర్మిస్తాడు. ఆ శైలి అనువాదకులకి వేళ్ళు వొణికిస్తుంది. ఎందుకంటే, పదాలు మరీ తేలిక అయితే పద్యం గాల్లో ఎగిరిపోతుంది. మరీ బరువైతే నేలకు వాలిపోతుంది. ఆ రహస్యం ఈ రచయిత్రి గ్రహించింది అనడానికి మొత్తం పుస్తకం సాక్ష్యమిస్తున్నది.

ఇంకో విషయం చెప్పాలి. ప్రతి అనువాదమూ ఒక interpretation అనుకుంటే, ఆమె అక్కడక్కడ, చిన్న చిన్న వాక్యాల్లో, ఆ సన్నివేశాల్లోని ఆర్ద్రతనీ, మార్దవాన్నీ మరోసారి మనకు విడమర్చి చెప్తున్నది. ఆ చిన్ని చిన్ని వాక్యాలు మూలాన్ని మనకి మరింత హృదయస్థం చేసేవే తప్ప, అడ్డుపడేవి కావు. ఒకటి రెండు ఉదాహరణలు చూడండి:

చిత్రలేఖా, నీ సఖి కాస్త కుదుటపడినట్టుంది. భయం కూడా పోయినట్టే ఉంది. లేకపోతే చంద్రుడు ఉదయించగానే చీకట్లు పోయినట్లు ఇంత వెన్నెల వెలుగుతో ఈ మొహం ఎలా ఉంటుంది? అంతే కాదు, ఆహుతులు అగ్నిలో వెయ్యగానే హోమంలోంచి పొగ వస్తుంది. ఆ పొగపోయిన తర్వాత వెలుగుతున్న హేమశిఖలాగా ఉంది ఈమె. ఇంతేనా, ఇంకా-ఒడ్డు విరిగి పడి బురదనీరుగా మారిన గంగానది తిరిగి కలకదేరి నిర్మలమైనట్టుగా కూడా ఉంది. మీరంతా అదృష్టవంతులు. ఆమె తిరిగి పూర్వపు ఊర్వశిగా మారింది.

ఇంతదాక కాళిదాసు. ఇప్పుడు ఆమె మరొక మూడు వాక్యాలు అదనంగా చేర్చింది. చూడండి:

రాజు మూడు ఉపమానాలతో ఆమెని పోల్చాడు-

చీకట్ల తర్వాతి వెన్నెల.

హోమం తాలూకు ధూమం వచ్చిన తర్వాత వచ్చిన బంగారు రంగు అగ్నిశిఖ.

కలకదేరిన గంగతోయం.

మొదటిది ఆహ్లాదకతనూ, మిగిలిన రెండూ పవిత్రతనూ సూచిస్తున్నాయి.

మరొక ఉదాహరణ.

రాజు ఉత్తరం చదువుకుని ‘నిజమే సుమా ‘అన్నాడు.

అంతేకాక విదూషకుడి కోరికమీద పైకి చదివి వినిపించాడు.

‘మహారాజా, మీకు నా మనసు తెలియకపోవడం వల్ల అంగజుని వల్ల కలిగిన బాధతో మీరు ఎలా వివశులవుతున్నారో, మీ మనసు నాకు తెలియకపోవడం వల్ల నేను కూడా అలాగే ఉన్నాను. ఇంకా మరింత అధికంగా కూడా. పారిజాత పూల శయ్య మీద పడుకుని కూడా నందనవనం మీంచి వీచిన గాలుల వల్ల పుట్టిన మనోభవాగ్నికి మరింత బాధపడుతున్నాను అని రాసింది.’

ఇక్కడి దాకా కాళిదాసు, ఇప్పుడు ఈమె వాక్యాలు:

ఆమె ఎంత హృద్యంగా రాసిందంటే నువ్వు నన్ను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నావో నేను అలాగే ఉన్నాను అని చెప్పకనే చెప్పింది. అంతే కాదు ఇంకా ఎక్కువగా కూడా అని.

కొన్నిచోట్ల అనువాదమే చక్కని వ్యాఖ్యగా శోభించిన తావులూ ఉన్నాయి. ఈ ఉదాహరణ చూడండి:

ఆ మహారాజు మరికొంత ముందుకు నడిచి ఎదురుగా కనిపిస్తున్న ఒక లత దగ్గర ఆగేడు. దానికి పూలు లేవు. కాని ఎందుకనో అది అతనికి చెప్పలేని ఆనందం కలిగించింది. ‘కారణం లేకపోయినా ఇది సముచితమే’ అనుకున్నాడు.

ఎందుకంటే ఆ పుష్పవిహీన అయిన లతలో ఊర్వశి తాలూకు ఏవో పోలికలు కనిపించేయి.

వర్షపు నీటితో తడిసిన ఈ చిగురాకులు జారుతూన్న కన్నీటితో ఆర్ద్రమైన ఆమె పెదవిలా ఉన్నాయి. పూలు లేని ఈ తీగ ఆభరణాలు ధరించని ఊర్వశీ దేహంలా ఉంది. పూలు లేకపోవడం వల్ల తుమ్మెదల చడీచప్పుడూ కూడా లేదు. విచారం వల్ల మౌనముద్ర వహించినట్లుంది. ఇన్ని తీగల మధ్య ఉండి కూడా దుఃఖం వల్ల స్పృహలేని ఊర్వశిలాగే ఉంది. మహారాజు చేసిన ప్రణయాపరాధం వల్ల కోపించి, ఆయన ఆమె కాళ్ళమీద పడి వేడినా సరే పక్కకు తోసేసి, బాధతో ఆమె ఇలా లతగా మారిపోయిందేమో అనుకున్నాడు.

ప్రతి పదాన్ని జాజి పువ్వు లాగా సున్నితపుత్రాసు మీద తూచి ఈ రచన చేసింది రచయిత్రి అని అర్థమవుతోంది. కేవలం భక్తిశ్రద్ధలు ఒక్కటే ఈ రచనని ఇంత సుందరంగా తీర్చిదిద్దాయనుకోను. ఆమె మాష్టారి ద్వారా అందిన కాళిదాసకవితానుగ్రహం  ఆమెతో ఇలా రాయించింది అనుకుంటున్నాను.

1-1-2023

2 Replies to “మధురవిషాద మోహగాథ”

  1. అద్భుతమైన రచనకు
    అద్భుతమైన వ్యాఖ్యానం
    రచయిత పాఠకులకు చెప్పేది కాదు
    గురువు శిష్యునికి బోధించే తీరులా వుంది మీ
    వివరణ.

Leave a Reply

%d bloggers like this: