కొత్త సంవత్సరానికి కానుక

Reading Time: 3 minutes

మొన్న మా ఊరు వెళ్ళాను. అక్కడంతా అడవిలో, కొండలచుట్టూ, ఇళ్ళమీదా, పొలాలమీదా పుష్యమాసపు పసిడి వెలుగు. ఆ వెలుతురుని అట్లా కళ్ళప్పగించి చూస్తో ఉండిపోయాను. ఆ కాంతిని వెంటతెచ్చుకోవడం ఎట్లా?

మా ఊరు కొండ కింద ఒక చిన్న పల్లె. నేను పుట్టినప్పటికీ, ఇప్పటికీ ఆ ఊరిలో పెద్ద మార్పేమీ లేదు. అప్పుడు కరెంటూ, వార్తాపత్రికా లేని కాలం. కాని అట్లాంటి ఊరునుంచి ప్రపంచానికి నన్ను దగ్గరచేసిందేది? చదువు అని చెప్పవచ్చు. కాని అది మరీ విస్తృతమైన మాట. సాహిత్యం అని చెప్తేనే ఆ సమాధానం సముచితంగా ఉంటుంది. సాహిత్యం వల్లనే, దేశదేశాల కవుల్నీ, రచయితల్నీ చదువుకోగలడం వల్లనే ఈ పృథ్వి నాకు దగ్గరగా జరిగింది. బతుకు తెరువు వెతుక్కుంటూ ఆ ఊరికి దూరంగా వచ్చేసిన నాకు, మొన్న, ఏమి అర్థమయిందంటే, ఆ ఊరికి దూరమయ్యానుగాని, ఆ వెలుతురుకి దూరం కాలేదు అని. ఎక్కడుంది ఆ వెలుతురు నా జీవితంలో? నిశ్చయంగా చెప్పగలను, అది దేశదేశాల కవిత్వంలో, కథల్లో, నవలల్లో, నాటకాల్లో.

ఆ ఊరికి దూరంగా వెళ్ళి తాడికొండలో చదువుకునే రోజుల్లో తెల్లవారు జామువేళల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు వచ్చి మమ్మల్ని పొద్దున్నే కేంపస్ చుట్టూ పరుగెత్తించేటప్పుడు, ఆ చంద్రుడి చివరి క్షణాలు నాకు చెప్పలేనంత బెంగ పుట్టించేవి. మార్చి లో వార్షిక పరీక్షల కోసం చదువుకుంటున్నప్పుడు విరగబూసిన వేపచెట్ల గాలి నన్ను గాఢాతిగాఢంగా సమ్మోహితుణ్ణి చేసి మత్తెక్కించేది. ఏప్రిల్లో, ఇక బడులు మూసేసి వేసవిసెలవులు ఇస్తారనగా, వసంతకాలపు జమ్మిచెట్లమీద చిలుకలు వాలి గోలచేస్తుంటే చెప్పలేని దిగులు పుట్టేది. ఇట్లాంటి క్షణాలు, వేళలు, మనసు మృదులమైపోయే తావులు నా జీవితమంతా పరుచుకుని ఉన్నాయి. కాని కొన్నాళ్ళకి ఇవి ఆరుబయట ఆకాశం కిందనో, వానాకాలపు పచ్చికతిన్నెల మీదనో మాత్రమే కాక, పుస్తకాల్లో కూడా కనిపించడం మొదలయ్యింది. ప్రాచీన చీనా కవిత్వం, జపనీయ హైకూలు, ఇంగ్లిషు రొమాంటిక్ పద్యాలు, పారశీక ఘజళ్ళు, రుబాయీలు, వాల్ట్ విట్మన్, ఎమిలి డికిన్సన్ లనుండి సంగకాలపు అకం కవులదాకా ప్రతి ఒక్క కవీ తన కవిత్వం తెరిచిన ప్రతిసారీ, మా ఊరి వెలుగునీ, వెన్నెల రాత్రుల్నీ మళ్ళా నాకోసం తీసుకువచ్చినట్టుగానే అనిపించేది.

అందుకనే ఏళ్ళ మీదట నేను గ్రహించిన రహస్యం ఏమిటంటే, మా ఊరు వెళ్ళాలంటే రైలు, బస్సు ఎక్కనక్కర్లేదు. వాంగ్ వెయినో, బషొనో, కపిలార్ నో, కాలరిడ్జినో, హైన్రిక్ హైనినో, ఆంటోనియో మచాడో నో చదువుకుంటే చాలు, ఒకటో రెండో వాళ్ళ కవితలు నా కోసం మళ్ళా తెలుగులో రాసుకుంటే చాలు అని. కవిత్వం ప్రపంచాన్ని మారుస్తుందా? బుచ్చిబాబు తన ‘అంతరంగ కథనంలో’ గొప్ప మాట అన్నాడు: సాహిత్యం ప్రపంచాన్ని సహించదగ్గదిగా చేస్తుంది. కవిత్వం నాకు నా జీవితాన్ని మొదట్లో భరించదగ్గదిగానూ, ఇప్పుడు ప్రేమించదగ్గదిగానూ మార్చిందని చెప్పగలను.

అందుకనే అనిల్ బత్తుల ఏరి కూర్చి తెచ్చిన ‘దేశదేశాల కవిత్వం ‘ చూడగానే నాకు ప్రాణం లేచి వచ్చింది. గాలి నాసరరెడ్డి అభిరుచి, ఎంపిక, విజ్ఞతలతో నిండుదనం సంతరించుకున్న ఈ పుస్తకంలో నాకు బాగా తెలిసిన కవితలు, నేను కూడా అనువదించిన కవితలతో పాటు, నాకు ఎందరో కవులు కొత్తగా పరిచయమయ్యారు. ఆ కవితలు ఈ నా పురాతన పాంథశాలలో మరిన్ని కిటికీలు తెరిచాయి.

నేనొకప్పుడు రాసాను: భాషని సుసంపన్నం చేసేది ఇద్దరే- ఒకరు మహాకవీ, రెండోది అనువాదకుడూను అని. తెలుగు కవిత్వం మొదలయ్యిందే అనువాదంతో. పోతన, షేక్స్ స్పియర్, కబీరు లాంటి కవులు లేకపోతే తెలుగు, ఇంగ్లిషు, హిందీ ఇప్పుడు మనం చూస్తున్నంత వైశాల్యాన్ని సంతరించుకుని ఉండేవే అన్నది అనుమానమే. మహాకవి అయిన అనువాదకుడు భాషకి విస్తృతితో పాటు లోతు కూడా పట్టుకొస్తాడు. మూలభాషని, తన భాషతో కలిపి కొత్త పలుకుబడిని నిర్మిస్తాడు. అనువాదం ఒక నిరంతర నిషిద్ధాక్షరి. వ్యత్యస్త దత్తపది. అనువాదకుడు ముందు మూలభాషలో పదాలు కాదు, కవి గుండెచప్పుడు వింటాడు. అప్పుడు తన చెవుల్ని ఆ గుండెకి దగ్గరగా చేర్చి ఆ మూల హృదయస్పందనాన్ని తన చెవుల్తో తన భాషలోకి అనువదిస్తాడు. చెవుల్తో చేసి ఉండకపోతే, ఎమిలీ వెర్హేరన్ గీతాన్ని తెలుగు చేస్తున్నప్పుడు శ్రీ శ్రీ ఇటువంటి భాష వాడగలిగి ఉండేవాడా?

అంతేలే, పేదల మూపులు !
అణగార్చిన విధి త్రోద్రోపులు ,
పయోధితట కుటీరములవలె
భరియించవు బాధల మోపులు !

అంతేలే, పేదల చేతులు !
శ్లథశ్లశైశిర పలాశరీతు లు !
విశుష్కములు, పరిపాండురములు !
విచలించెడు విషాదహేతులు !

అనువాదకళ గురించీ, దేశదేశాల కవిత్వంలోని అనువాద కవితల ఎంపిక గురించీ పుస్తక ఆవిష్కరణసభలో నేను సుదీర్ఘ ప్రసంగం చేసాను. ఆసక్తి ఉన్నవాళ్ళు ఇక్కడ వినవచ్చు.

కాని ఇప్పుడు మళ్ళా ఆ పుస్తకాన్ని చూస్తూ ఉంటే, అదనంగా మరొక రెండు మూడు మాటలు చెప్పాలనిపించింది. మొదటిది, ప్రతి మనిషీ తన బాల్యంలోనో, యవ్వనంలోనో ఒక పారడైజ్ ను పోగొట్టుకుని ఉంటాడు. లేదా ఒక పారడైజ్ కోసం పోరాడుతూ ఉంటాడు. ఆ దూరస్వర్గకాంతిని కవిత్వంలో పోల్చుకోవడం ఏ మనిషి కైనా లభించగల గొప్ప భాగ్యం. ఎన్ని భాషల కవిత్వాలు, ఎన్ని కాలాల కవిత్వాలు ఎంత చదువుకోగలిగితే, నీ జీవితం అంత సుసంపన్నం, సార్థకం. ఆ కాంతికిరణాల్ని కొన్నింటినేనా ఇలా గంపకెత్తి తెచ్చినందుకు అనిల్ కి మనమెంతో ఋణపడి ఉంటాం.

పూర్వ మహాకవులు, అనువాదకులు సరే, కొత్త యువతీయువకులు కూడా ఈ కావ్యకళను అభ్యసిస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. పూర్వకవులు జీవితకాలం తపస్సు చేస్తేగాని సాధించుకోలేని సరళవాక్యం ఈ యువతీయువకులకు ఎంత సహజంగా అబ్బింది! రిగోబెర్తా ప్రభాత, స్వేచ్ఛా వొటార్కర్, వాసిరెడ్డి ప్రకృతి, నందకిషోర్, స్వాతికుమారి, నల్ల యామిని, అనిల్ బత్తుల, అజయ వర్మ, నవీన్ కుమార్, సురేష్ బాబు, స్వర్ణ కిలారి, ఉషాజ్యోతి బంధం, దేశరాజు వంటి యువకవుల అనువాదాలు ఈ సంపుటిలో చూడటం నాకు తెలుగు భాష భవిష్యత్తు పట్ల గొప్ప ఆశ కలిగించింది.

ఈ యువతీయువకులు వాడుతున్న ఇటువంటి భాష కోసమే తిక్కన తపించాడు. ఇటువంటి సూటిదనంకోసమే వేమనని శ్రీ శ్రీ నెత్తికెత్తుకున్నాడు. ఇటువంటి తేటదనంవల్లనే గురజాడ వైతాళికుడయ్యాడు. అంటే, ఇందులో దేశదేశాల వెలుతురూ మన ఊళ్ళల్లో నీరెండగా మారిపోయిందన్నమాట.

ఉదాహరణకి, మలయాళ మహాకవి ఓ ఎన్ వి కురుప్ కవితకు స్వేచ్ఛా వొటార్కర్ తెలుగు చూడండి:

ఒక గీతం

కారణమేమీ లేకుండానే
నువ్వు నా పక్కనుండాలనుకున్నా

రాత్రి పూట, వాన ఆగిపోయినప్పుడు
ఎండిన ఆకులు సన్నని సవ్వడి చేస్తున్నప్పుడు
లేత చినుకుల రాగమొకటి నా హృదిని మీటినప్పుడు
నా కిటికీ పక్కనొక పిట్ట భయంతో అరిచినప్పుడు

కారణమేమీ లేకుండానే
నువ్వు నా పక్కనుండాలనుకున్నా

ఇంటిబయట నేను నాటిన చంపకం మొక్క
మొదటిసారి పూసినప్పుడు
నా కమ్మటి కలలన్నీ
నీ కురుల పరిమళంలో చిక్కుకున్నప్పుడు
ఒక పురాతన ప్రేమకథలోని పాటలన్నీ
నా లోపల్లోపలే అల్లాడిపోయినప్పుడు

కారణమేమీ లేకుండానే
నువ్వు నా పక్కనుండాలనుకున్నా

భారతీయ కవుల్ని అనువదించడం సులభం అనుకుందాం, మరి ఫ్రెంచి కవుల్ని? గిలాం అపోలినేర్ కవితకు వాసిరెడ్డి ప్రకృతి చేసిన ఈ అనువాదం చూడండి:

సంజ్ఞ

శరత్కాల ప్రభువు సంజ్ఞకు నేను దాసుడను
పండ్లను ప్రేమిస్తాను, పూలను ద్వేషిస్తాను
ఇచ్చిన ప్రతి ఒక ముద్దుకూ విచారపడుతున్నాను
శక్తి ఉడిగిన రేలచెట్టును, గాలికి మొరపెట్టుకుంటున్నాను

బౌద్ధిక తరుణమా, నా చిర శరత్కాలమా
జీర్ణప్రేమికుల చేతులు నీ మట్టిని పరచుకుంటాయి
ఛాయావధువు నా ప్రాణాలకై వెంబడిస్తుంది
మాపటికి కడసారిగా పావురాలు ఎగురుతాయి.

ఏమి భాష! తొలి మాడ్రన్ కవుల్లో ఒకడైన అపోలినేర్ ని ఈమె ఎంత స్ఫుటంగా తెలుగు చేసింది! అయితే వీళ్ళకు కావలసిందల్లా కొద్దిపాటి సహకారం. చిన్న చిన్న సూచనలు. ఉదాహరణకి, ఇందులో శరత్కాలం అనే బదులు హేమంతం అని ఉంటే ఈ అనువాదం పరిపూర్ణం అయి ఉండేది.

మనం కోల్పోయిన బాల్యాన్నీ, యవ్వనాన్నీ కవిత్వంలో వెతుక్కోవడం ఒకటైతే, దాన్ని మళ్ళా ఈ యువతీయువకుల అనువాదాల్లో చూసుకోవడం మరొకటి. ఈ రెండు కారణాలవల్లా కూడా ‘దేశదేశాల కవిత్వం’మనకి నిజంగా కొత్తసంవత్సరం కానుక.

~

పుస్తకం ప్రతులకోసం: అనిల్ బత్తుల, 8179273971 ని సంప్రదించవచ్చు. వెల రు.500/-

31-12-2022

3 Replies to “కొత్త సంవత్సరానికి కానుక”

  1. అద్భుతంగా రాశారు సర్. ప్రతీ వాక్యం వేదప్రమాణం. మీకు పాదాభివందనం 🙏

Leave a Reply

%d bloggers like this: