సెనెకా ఉత్తరాలు-15

సంవత్సరం పూర్తయిపోతోంది. చివరి రోజుకి చేరుకున్నాం. ఈ శాటర్నేలియా 17 వ తేదీతో మొదలుపెట్టి ఈరోజు తో ముగుస్తున్నది. ప్రాచీన రోమన్ కాలం నాటి పండగని గుర్తు చేసుకుంటూ సెనెకా రాసిన ఉత్తరాల్ని ఈ రెండు వారాలూ కొంత చర్చించుకున్నాం. తన స్నేహితుడు లుసిలియస్ కి సెనెకా రాసిన 124 ఉత్తరాల్నీ  Richard M Gummere మూడు సంపుటాలుగా లాటిన్ నుంచి ఇంగ్లిషులోకి Moral Letters to Lucilius (1916) అనే పేర అనువదించాడు. వాటిలో మొదటి సంపుటంలో మొదటి 64 ఉత్తరాలు ఉన్నాయి. ఈ రెండు వారాల్లో నేను సెనెకా మొదటి సంపుటంలోని ఉత్తరాల్ని పరిచయం చేసాను.

మొదట ఆరు వ్యాసాల్లో మొదటి ఇరవై ఉత్తరాల్నీ క్లుప్తంగా పరిచయం చేసాను. వాటిద్వారా సెనెకా తన ఉత్తరాల్లో ప్రధానంగా ఏ ఇతివృత్తాల మీద చర్చించాడు, అతడి ఆలోచనా సరళి ఎలా ఉంటుంది, శైలి, నిర్మాణం ఎలా ఉంటాయని తెలుసుకోడానికి వీలవుతుందని వాటిని వివరంగా పరిచయం చేసాను. మిగిలిన ఎనిమిది వ్యాసాల్లో సెనెకా తన ఉత్తరాల్లో ప్రధానంగా చర్చించిన సమస్యల గురించి నా ఆలోచనలు కూడా జోడించి మరింత వివరంగా మీ ముందుపెట్టాను. ఈ శాటర్నేలియా ముగుస్తున్నది కాబట్టి, ఈ పరిచయ వ్యాసాల్ని కూడా ఇక్కడితో ముగిస్తున్నాను. మిగిలిన రెండు సంపుటాల్లోని 60 ఉత్తరాల గురించీ మరోసారి ఎప్పుడేనా మళ్ళా మాట్లాడుకుందాం.

ఈ ఉత్తరాల్ని ఇప్పుడెందుకు పరిచయం చేసానో మొదటి వ్యాసంలోనే చెప్పాను. శాటర్నేలియా పూర్వకాలపు గ్రీకు పండగ అనీ, ఒకప్పుడు ఆదిమకాలంలో శని భూమిని పాలించిన రోజుల్లో సర్వమానవ సమానత్వం ఉండేదనీ, బానిసత్వం లేనేలేదనీ భావించేవారని చెప్పాను. ఆ రోజుల్ని తలుచుకుంటూ శాటర్నేలియా వారం రోజులూ రోమ్ లో బానిసలకు పూర్తి స్వేచ్ఛా, స్వాంతత్య్రాలు ఉండేవని కూడా రాసాను. అప్పటి శాటర్నేలియా పండగ స్థానంలో ఇప్పుడు క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలు వచ్చి చేరాయి. ఆ రోజుల్లో చూసిన బానిసత్వం ఆ రూపంలో ఈ కాలంలో లేదు. కాని కొత్త రూపాల్లో, సూక్ష్మ రూపాల్లో మనుషులు ఇంకా బానిసలుగానే కొనసాగుతూ ఉన్నారు. మనిషి తోటి మనిషి మీద ఏదో ఒక రూపంలో ఆధిపత్యం కోసం అర్రులుజాస్తూనే ఉన్నాడు. ప్రతి మనిషీ ఏదో ఒక సుఖానికో, సౌకర్యానికో, సంతోషానికో తనలోని కొంత భాగాన్ని తోటిమనిషికి కుదువబెట్టుకుంటూనే ఉన్నాడు. ఫౌస్ట్ తన ఆత్మని మెఫిస్టోఫిలిస్ కి అమ్ముకున్నట్టుగా మానవుడు ఏదో ఒక భౌతిక, రాజకీయ విజయాన్ని ఆశించి తనలోని విలువైన పార్శ్వాన్ని రాజ్యానికో, రాజకీయపార్టీకో, కార్పొరేటు ప్రయోజనాలకో అమ్ముకుంటూనే ఉన్నాడు. సెనెకా ఒక ఉత్తరంలో రాసినట్టుగా ఇప్పుడు బానిసకానిమానవుడు ఎక్కడ అని ప్రశ్నించుకోవలసి ఉంటుంది.

రూసో తన సోషల్ కాంట్రాక్టు గ్రంథంలో ఒక విలువైన మాట రాసాడు: ‘ఏ మనిషీ తన తోటిమనిషిని కొనుగోలు చేసేటంత సంపన్నుడు కాకూడదు, ఏ మనిషీ తన తోటిమనిషికి అమ్ముడుపోయేటంత నిర్ధనుడు కాకూడదు’ అని. ఈ వాక్యాలు మొదటిసారి చదివి నలభయ్యేళ్ళు దాటింది. ఈ నాలుగు దశాబ్దాల నా జీవితం పొడుగునా మనిషి మనిషిని కొనుక్కుంటున్న దృశ్యాలు, మనిషి మనిషికి అమ్ముడుపోతున్న దృశ్యాలూ చూస్తూనే ఉన్నాను. ఈ క్రయవిక్రయాల్లో నేను కూడా ఒక భాగస్వామిని కాకుండా ఉండటానికి నేనెంత పోరాటం చెయ్యవలసి వచ్చిందని!

కాబట్టి ఈ రెండు వారాలూ నేను నాలోనూ, నా చుట్టుతానూ ఉన్న రకరకాల బానిసత్వ రూపాల్ని కనుగొనడానికీ, ఏమి చేస్తే ఆ బానిసత్వం నుండి మనకి విముక్తి లభిస్తుందో అర్థం చేసుకోడానికీ ప్రయత్నిస్తూ వచ్చాను. ఈ సందర్భంగా సెనెకా ఉత్తరాలు నన్నెందుకు ఆకర్షించాయంటే, మనం ప్రస్తుతం చూస్తున్న రాజకీయ నిర్మాణాలకీ, సెనెకా కాలం నాటి రాజకీయ నిర్మాణాలకీ మధ్య చాలా పోలికలు కనిపించినందువల్ల. రోమ్ ఒకప్పుడు గణతంత్రం. ఆ తర్వాత రాచరికంలోకి మారి చివరకు భయకరమైన నియంతృత్వాల్ని చవిచూసింది. ఆధునిక కాలంలో కూడా ప్రతి రాజకీయ విప్లవం తర్వాతా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, రష్యా, చైనాలు నియంతృత్వాల్ని చూడకతప్పలేదు. మన దేశంలో కూడా ప్రజాస్వామిక పద్ధతుల్లోనే రకరకాల నియంతృత్వ రూపాలు తలెత్తుతూ ఉండటం మనం కళ్ళారా చూస్తున్నాం. ఒక గణతంత్రం లేదా ప్రజాస్వామ్యం నియంతృత్వానికి చేతులు చాపడం యాదృచ్ఛికంగానో, ఆకస్మికంగానో జరిగే పరిణామం కాదు. దాని వెనక ఆ ప్రజల రాజకీయ దాహార్తి ఉంటుంది. విలాసాలు, ఆడంబరాలు, ఆస్తిపాస్తులు పోగేసుకోడాలు, ఒక సంస్కృతిగా మారగానే నెమ్మదిగా అది నియంతృత్వం వైపు అడుగులు వెయ్యడం మొదలవుతుంది.

దీన్నుంచి బయటపడటానికి రాజకీయ,ఆర్థిక విప్లవాలు చేపట్టడం ఒక మార్గం. కానీ ప్రజల మనఃస్థితిలో, సంస్కారంలో, జీవనశైలిలో మార్పు రాకుండా కేవలం రాజకీయ విప్లవాలు చేపట్టినందువల్ల ప్రయోజనం ఉండదని ఆధునిక చరిత్ర మనకి తెలియచేస్తోంది. అందుకనే గాంధీ భారతజాతీయోద్యమాన్ని కేవలం రాజకీయ ఉద్యమంగా చూడటానికి ఇష్టపడలేదు. దానిలో ఒక ఆత్మప్రక్షాళనకు అవకాశం లేకపోతే, నిర్మాణాత్మక కార్యకలాపం జతపడకపోతే, దేశానికి ఒకవేళ స్వాతంత్య్రం సిద్ధించినా అది రాజకీయ స్వాతంత్య్రం మాత్రమే అవుతుందనీ, అది కూడా కేవలం అధికార మార్పిడి మాత్రమే అవుతుందనీ ఆయన భావించాడు. ఆయన ఊహించింది సరైనదేనని, ఏడు దశాబ్దాల తరువాత ఇప్పుడు మనకి అనుభవానికొస్తున్నది.

అందుకనే సెనెకా తన రాతల్లో పదే పదే నిరాడంబర జీవితం గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఐచ్ఛిక దారిద్య్రం భయాన్ని పోగొడుతుంది. ముఖ్యంగా మృత్యువుభయాన్ని పోగొడుతుంది. గాంధీ జాతీయోద్యమంలో ప్రజలకి నేర్పింది ఇదే. ఆయన ముందు ప్రజల్లో జైలు భయం పోగొట్టాడు. ఆ తర్వాత ప్రజాసమూహాలు స్వాతంత్య్రకాంక్షతో ఉరకలెత్తడానికి ఏ అడ్డంకీ లేకపోయింది.

సెనెకా వివరించిన ఆదర్శ జీవితానికి నిరాడంబర జీవితం ఒక పార్శ్వం. దాని రెండో పార్శ్వం ఉదాత్త చింతనం. సరళజీవనం, విరళ చింతనం- ఈ రెండూ సాధనచేసిన మనిషికి అపజయం ఉండదు. అటువంటి మనుషుల్తో కూడుకున్న సమాజానికి ఎటువంటి రాజకీయ భయం ఉండదు, బానిసత్వ ప్రమాదం ఉండదు.

వీటిని సాధన చెయ్యాలనుకున్న మనిషికి ప్రత్యేకంగా ఏ పాఠశాల అవసరం లేదు. తత్త్వశాస్త్రాన్ని అనుసరిస్తే చాలు అని సెనెకా భావం. ఆయన చెప్తున్న తత్త్వశాస్త్రం, నేనింతకుముందు రెండు మూడు సార్లు వివరించినట్టుగా, ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో బోధించే అకడమిక్ ఫిలాసఫీ కాదు. అది శాస్త్రం. చాలామంది వృత్తి తత్త్వవేత్తలకు అదొక బతుకుతెరువు. కాని సెనెకా మాట్లాడుతున్న తత్త్వశాస్త్రం ఒక జ్ఞాన యోగం. అది మనలోని ఉత్తమ వ్యక్తిత్వాన్నీ, మనలోని హీన ప్రవృత్తుల్నీ సమన్వయించే ఒక మార్గం. నిజానికి యోగం అనే మాట ‘యుజ్ ‘ అనే ధాతువు నుంచి వచ్చింది. దాని అర్థం ‘కలపడం’ అని. రెండు విరుద్ధ పార్శ్వాల్ని కలపడం. అలా కలుపుతున్నప్పుడు మనలోని ఉన్నత పార్శ్వం మనలోని నిమ్న పార్శ్వాన్ని తనలో లీనం చేసుకుంటుంది. నిజానికి యూంగ్ integration of personality అని అంటున్నప్పుడు అది యోగమనే సంస్కృత పదానికి సమానార్థకమైన ఇంగ్లిషు అనువాదం అనే అనుకోవలసి ఉంటుంది.

చూడండి సెనెకా ఏమంటున్నాడో:

కాబట్టి మనం మనల్ని ఉద్ధరించుకుందాం. అప్పుడు మన తప్పుల్ని మనం సరిదిద్దుకోగలుగుతాం. మనల్ని చలింపచేయగలది తత్త్వచింతన ఒక్కటే. అదే మనల్ని మన మత్తునుంచి బయటపడవెయ్యగల ఏకైక శక్తి. కాబట్టి నిన్ను నువ్వు పూర్తిగా తత్త్వచింతనకు అంకితం చేసుకో. ఆమె నీకు తగినది. నువ్వు ఆమెకి తగినవాడివి. మీరిద్దరూ పరస్పరం ఒక గాఢాలింగనంతో పలకరించుకోండి. నీ జీవితంలోని తక్కిన అన్ని ఆసక్తులకూ ధైర్యంగా, నిర్మొహమాటంగా వీడ్కోలు చెప్పెయ్యి. తత్త్వశాస్త్రం ఏదో తీరికవేళల్లో చదివే చదువు కాదని గుర్తుపెట్టుకో.

ఇది చాలా గొప్ప మాట. భగవద్గీత గురించి కూడా ఈ మాట చెప్తారు. అది వృద్ధులు, పదవీవిరమణ చేసినవారు మాత్రమే చదువుకోవలసిన పుస్తకం కాదని. అది యువతీయువకులు చదువుకోవలసిన పుస్తకం. రణరంగంలో ధనుర్ధారి అయిన ఒక నరుడికి నారాయణుడు చేసిన ఉపదేశం అది. అస్త్రసన్యాసం చేసినవాళ్ళకి భగవద్గీతతో పనిలేదు. ఈ మాట ఏ తత్త్వగ్రంథానికైనా వర్తిస్తుంది. బుద్ధుడు, కన్ ఫ్యూసియస్, సువార్తలు, సోక్రటీసు సంభాషణలు- ఏ ఒక్క గ్రంథమైనా సరే, జీవితమధ్యంలో నిలబడి పోరాడేవాళ్ళకోసమే. వాళ్ళకి వెన్నుదన్నుగా నిలబడి, ధైర్యాన్నిచ్చి, మార్గదర్శకత్వం చెయ్యడం కోసమే. కాబట్టి, తత్త్వచింతన తీరిక సమయపు వ్యాపకం కాదు.

తత్త్వచింతన అంటే, మళ్ళా మళ్ళా నేను గుర్తు చేస్తున్నదేమంటే, కేవలం ప్రపంచం పుట్టుకగురించో, లేదా మరణానంతర జీవితం గురించో చేసే ఆలోచన కాదు. నీ దృష్టిని తాత్కాలిక, అల్ప, నిరర్థక విషయాల మీంచి మళ్ళించి, గొప్ప సౌందర్యం వైపు, ఉన్నత లక్ష్యాల వైపు, ఉత్తమ ఆదర్శాల వైపు మరల్చే ప్రతి ఒక్క ఆలోచనా కూడా తత్త్వశాస్త్రమే.

సెనెకా ఏమంటున్నాడో చూడండి:

నీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు నీ పనులన్నీ పక్కనపెడతావు. నీ ఉద్యోగ బాధ్యతల్ని మర్చిపోతావు. నువ్వు స్వస్థుడవయ్యేదాకా నీ కక్షిదారుల సమస్యల గురించి పెద్దగా ఆలోచించవు. అన్నిటికన్నా ముందు ఏమి చేసీ ఆ అస్వస్థత నుంచి బయటపడటమెట్లా అన్నదే ఆలోచిస్తుంటావు. ఇంకేమిటి? మరి ఇప్పుడు నువ్వు చెయ్యవలసింది కూడా అదే కదా. అన్ని అడ్డంకుల్నీ పక్కకు నెట్టి ముందు నీ మనస్సుని కుదుటపరుచుకోవడం మీద దృష్టి పెట్టు. వేరే వ్యవహారాల్లో కూరుకుపోతే నీ మనస్సు నీకు స్వాధీనం కాదు. తత్త్వశాస్త్రం దానికదే ఒక యజమాని. ఆమె నీకు సమయం నిర్దేశిస్తుంది గాని, నువ్వు ఆమెకు సమయం నిర్దేశిస్తానంటే కుదరదు. ఏదో అప్పుడప్పుడూ, వీలైనప్పుడు, ఆమెని చూస్తానంటే కుదరదు. ఆమెని రోజూ దర్శించుకోవాలి. అది నిత్యసాధన. ఆమె మహారాజ్ఞి. నువ్వు ఆమె ముందు హాజరుకాక తప్పదు. అలెగ్జాండరు ఒకసారి ఏదో ప్రాంతాన్ని జయించాక, ఆ రాజ్యం అతడితో తనలోని కొంత ప్రాంతాన్నీ, సగం ఆస్తినీ అప్పగిస్తానని ఆయనకు చెప్పిందట. అప్పుడు అలెగ్జాండరు ఆ ప్రాంతంతో చెప్పాడట: నేను ఆసియాను పాదాక్రాంతం చేసుకున్నది నువ్వేది ఇస్తావో దాన్ని ఒప్పుకోడానికి కాదు, నేను నీకు ఏది ఒదిలిపెడతానో దానితో నువ్వు సరిపెట్టుకోడానికి అని. తత్త్వశాస్త్రం కూడా అటువంటిదే. నువ్వు తక్కిన పనులన్నీ చూసుకుని ఏదైనా సమయం మిగిలితే నా దగ్గరకి వస్తానంటే కుదరదు. నేను నీకు ఏది వదిలిపెడతానో దానితోనే నువ్వు తక్కినవిషయాలు సర్దుకోవాలి అంటుంది.

సెనెకా రాయలేదు గానీ ఇదంతా మనం ఒక్క వాక్యానికి కుదిస్తే, అదిలా ఉంటుంది: నువ్వు తక్కిన అన్ని బానిసత్వాలనుంచీ బయటపడాలంటే, తత్త్వచింతనకి దాసుడివికాక తప్పదు అని.

సెనెకా ఈ వాక్యం రాయకపోయినా, ఇలాంటి మాటలే రాస్తున్నాడు, వినండి:

కాబట్టి నీ యావదాత్మతో ఆమెవైపు తిరుగు. ఆమె పాదాల దగ్గర కూచో. ఆమెను పోషించు, అప్పుడూ నీకూ నీ తోటిమనుషులకీ మధ్య గొప్ప దూరం పెరుగుతుంది. నువ్వు తక్కిన మర్త్యసమూహం కన్నా ఎంతోముందుకు నడవగలుగుతావు. ఆ మాటకొస్తే దేవతలు కూడా నీకన్నా మరీ ముందుండరు. నీకూ దేవతలకూ మధ్య తేడా ఏమిటంటావా? వాళ్ళు మరింత దీర్ఘకాలం జీవిస్తారు, అంతే. మామూలుగా మనం ఒకణ్ణి గొప్ప కళాకారుడని ఎప్పుడంటామంటే, అతడు తాను చూస్తున్న దాన్ని చిన్నకాగితపు పరిమితికి కుదించగలిగినప్పుడు. వివేకవంతుడి జీవితం అతడికి ఒక దేవతతో సమానమైన అనంతత్త్వాన్ని అందించగలదు. నిజానికి దేవతలకన్నా జ్ఞాని ఒక విషయంలో మరింత మెరుగనే చెప్పాలి. దేవతలు అధిభౌతిక తాపాలనుంచి తప్పించుకున్నవాళ్ళు. జ్ఞాని ఆధ్యాత్మిక తాపం నుంచి తప్పించుకున్నవాడు. ఆలోచించు, అది ఎంత మహాభాగ్యం! ఒక మనిషికుండే బలహీనతలన్నిటితోనూ దేవతలకుండే ప్రశాంతి పొందడం!

ఎంత బాగా చెప్పాడు. నీలో మానవసహజమైన దౌర్బల్యాలుంటూనే నువ్వు దేవతాసమానమైన మనఃస్థితిని పొందడం. అది కేవలం జ్ఞాన యోగం వల్ల మాత్రమే సాధ్యపడుతుంది అని ఉపనిషత్తులు చెప్పినట్టే, సెనెకా కూడా చెప్తున్నాడు. చెప్పడమే కాదు, తనకాలం నాటి నిష్ఠురమైన రోమ్ లో తన ఆంతరంగిక ప్రశాంతిని కాపాడుకుంటూ జీవించగలిగాడు. చివరికి మృత్యువు ఒక శిక్షగా ఎదురయినప్పుడు, స్థిరచిత్తంతో ఆమెను స్వాగతించి, తన మాటకీ, చేతకీ మధ్య ఎటువంటి తొట్రుపాటూ లేదని చరిత్ర ఎదట తనని తాను నిరూపించుకోగలిగాడు. అతడికి ఆ మనోబలం తత్త్వచింతన సమకూర్చిందని మనకు ఈ ఉత్తరాల ద్వారా తెలుస్తూ ఉంది. ఇన్ని వందల ఏళ్ళ తర్వాత కూడా  ఆ రచనలు ఇప్పటికీ స్ఫూర్తిదాయకంగా ఉండటానికి కారణం ఆ జీవితం, ఆ మరణం.

30-12-2022

7 Replies to “సెనెకా ఉత్తరాలు-15”

  1. Sir… Such a cult of writing is unique and is never possible for others even in times to come. Long Live, Sir.

  2. సర్,

    మనిషికి ఉండే బలహీనతలతో దేవతలకుండే ప్రశాంతిని పొందడం…గొప్ప ఛాలెంజ్

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading