సెనెకా ఉత్తరాలు-14

Reading Time: 5 minutes

ఈ ప్రపంచంలో భౌతికమైన పదార్థమూ, అభౌతికమైన వివేచనా రెండూ కలిసే ఉన్నాయనీ, నిజానికి ఆ రెండూ ఒకటేననీ స్టోయిక్కులు భావించినట్టుగా ఇంతకు ముందు చెప్పాను. అభౌతికమైన ఆ వివేచననే వాళ్ళు ప్రకృతి అనీ, ప్రాకృతిక సూత్రం అనీ, హేతువు అనీ, ఆలోచన అనీ, వివేచన అనీ రకరకాల పేర్లతో పిలిచారు. కొన్నిసార్లు దాన్ని ఆత్మ, జీవాత్మ, ప్రాణాత్మ లాంటి పేర్లతో కూడా పిలిచారు. చాలాసార్లు దాన్ని భగవంతుడు అని కూడా అన్నారు. అయితే ఈ భగవంతుడికీ, ప్రాచీన గ్రీకు, రోమన్ మతాల్లోని భగవంతుడికీ తేడా ఏమిటంటే, స్టోయిక్కుల భగవంతుడు ప్రపంచం కన్నా భిన్నుడు కాడు. మతాలు చెప్పే భగవంతుడు ఈ ప్రపంచంలో ఉంటూనే ఈ ప్రపంచానికి అతీతంగా ఉంటాడు. ప్రపంచాన్ని అంటే పదార్థంతో కూడుకున్న ప్రపంచాన్ని నడిపే శక్తి కూడా ప్రపంచమే కాని, అది ప్రపంచం తాలూకు గతిరూపం. ప్రపంచం ఆ శక్తితాలూకు స్థితిరూపం అని స్టోయిక్కులు భావించేరు అని కూడా ఇంతకు ముందు చెప్పాను.

ప్లేటో దృష్టిలో ప్రపంచం అపరిపూర్ణం. అది పరిపూర్ణమైన భావనని (idea) ఎన్నడూ అందుకోలేదు. అరిస్టాటిల్ దృష్టిలో కూడా ప్రపంచం అపరిపూర్ణమే, అది పరిపూర్ణమైన ఆకృతిని (form) ని ఎంతకీ సంతరించుకోలేదు. సరిగ్గా ఈ విషయంలోనే స్టోయిక్కులు విభేదించేది.

నలభై అయిదవ ఉత్తరమంతా దీని గురించే. ఇందులో సెనెకా ఏమంటున్నాడో చూడండి:

మన స్టోయిక్కు తత్త్వవేత్తలు ఈ విశ్వంలో ప్రతి ఒక్కదానికీ ఆధారంగా రెండే ఉన్నాయని చెప్తారని నీకు తెలుసుకదా- అవి, కారకమూ, పదార్థమూ. పదార్థం ఎప్పుడూ జడంగా పడి ఉంటుంది. తన్ను ఎవరైనా వినియోగించుకోడానికి ఎదురు చూస్తూ ఉంటుంది. తనని ఎవరేనా చలనంలో పెట్టకపోతే అది నిరుపయోగంగా పడి ఉంటుంది. ఇక కారకం, దాన్నే మనం వివేకమూ, జ్ఞానమూ, బుద్ధీ అంటాం, అది తాను సంకల్పించిన పద్ధతిలో పదార్థాన్ని మలుచుకుంటుంది. తనకి కావలసినన్ని రకాలుగా తీర్చిదిద్దుకుంటుంది. కాబట్టి, ప్రతి ఒక్క విషయంలోనూ దాన్ని మలచడానికి అవసరమైన వస్తువు ఒకటుండాలి, దాన్నే పదార్థం అంటున్నాం, దాన్ని మలిచేదంటూ ఒకటుండాలి, దాన్నే వివేకమూ, బుద్ధీ అంటున్నాం… స్టోయిక్కులు ఒకే ఒక్క కారణాన్ని నమ్ముతారు. పదార్థాన్ని మలిచే ఒకే ఒక్క స్రష్టని. కాని అరిస్టాటిల్ కారకాన్ని మూడు స్థాయిల్లో ఊహిస్తాడు. అతడు చెప్పే దాని ప్రకారం మొదటికారకం, పదార్థం. అది లేకుండా దేన్నీ రూపొందించలేం. రెండవకారకం దాన్ని రూపొందించేవాడు. మూడవకారకం అకృతి. దాన్నే స్రష్ట పదార్థం మీద ఆరోపిస్తాడు. ఉదాహరణకి ఒక విగ్రహం. ఇవి కాక మరొకటి, నాలుగోది కూడా ఉందంటాడు. అది ఆ మొత్తం సృజన లేదా నిర్మాణం తాలూకు ఉద్దేశ్యం లేదా ప్రయోజనం. ఇదేమిటో చూద్దాం. ఒక విగ్రహానికి కాంస్యలోహం మొదటి కారకం…రెండవ కారకం, కళాకారుడు…మూడవ కారకం ఆ విగ్రహం ఆకృతి. ..ఇక నాలుగవ కారకం ఆ విగ్రహన్ని రూపొందించిన ఉద్దేశ్యం… ఈ నాలుగింటికీ ప్లేటో అయిదవ కారకాన్ని జతపరుస్తాడు. దాన్ని idea అంటాడు. అంటే ఆ కళాకారుడు ఏ ఊహ ఆధారంగా ఆ విగ్రహాన్ని రూపొందించాడో అదన్నమాట.

ఇంతవరకూ అతడు ప్లేటో, అరిస్టాటిల్ ల తత్త్వశాస్త్ర సారాంశాన్ని సూక్ష్మంగా పట్టుకున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడో చూడండి:

ప్లేటో, అరిస్టాటిల్ లు నిర్వచించిన ఈ కారకాల సందోహం అయితే మరీ అతివ్యాప్తికి లోనవుతున్నది లేదా అల్పవ్యాప్తికి. ఒక వస్తువు తయారు కావడానికి వారు ఏ కారకాలు అవసరమో వాటన్నిటినీ నిర్వచించారనుకుంటే, వాళ్ళు చాలా విషయాల్ని వదిలిపెట్టేసారని చెప్పాలి. కాలాన్ని కూడా అందులో చేర్చవలసి ఉంటుంది. కాలవ్యవధి లేకుండా ఏదీ తయారు కాదు కాబట్టి. స్థలాన్ని కూడా కలుపుకోవాలి. ఎందుకంటే ఏదో ఒక చోటంటూ లేకుండా దేన్నీ తయారు చెయ్యలేము కాబట్టి. అలాగే కదలిక కూడా. కదలిక లేకుండా దేన్నీ నిర్మించలేం, కూలదొయ్యలేం. అయితే నేను ఆ మొదటి కారణం గురించి, ఆ సాధారణ కారకం గురించి అన్వేషిస్తున్నాను. అది కూడా భౌతిక పదార్థం ఎంత సరళమో అంత సరళమైంది అయి ఉండాలి. ఆ కారణం ఏమై ఉండవచ్చునని అడుగుతావా? అది సృజనాత్మక వివేకం లేదా మరో మాటలో చెప్పాలంటే భగవంతుడే అయి ఉండాలి. ఇంతవరకూ మనం ప్రస్తావించుకున్న విడి విడి కారకాలన్నీ ఆ ఒకే ఒక్క కారకానికి తగులుకుని ఉంటాయి. అదొక్కటే సృజనాత్మక కారకం.

ఇది సోక్రటీసు మాట్లాడిన providence, లేదా సర్వేశ్వరుడైన జ్యూస్ సంకల్పం. అలాగని ఈ దేవుడు నైవేద్యాల్నీ, బలుల్నీ, కర్మకాండనీ కోరుకునే దేవుడు కాడు. నిజానికి ఇతడు మానవరూపాన్ని ఆరోపించుకున్న దేవుడు కానే కాడు. ఈ దేవుడు కూడా ఈ భౌతిక పదార్థమే కాని, ఆ భౌతిక పదార్థం తనంతతానుగా ఒక ఉద్దేశ్యాన్నీ, చలనాన్నీ సంతరించుకున్న సృజనాత్మక రూపం.

సెనెకా ఇంకా ఇలా రాస్తున్నాడు:

దీని గురించి నువ్వేమంటావు? లేదా ఇలాంటి విషయాల్లో మామూలుగా మనం అనుకునేటట్టే, ఈ విషయం స్పష్టంగా లేదు కాబట్టి మరో సారి చర్చించుకుందాం అంటావా? ‘ఇలాంటి సమస్యల మీద నీ సమయం వృథా చేసుకుంటూ ఉంటే నీకేమి సంతోషం? ఇదేమీ నీ భావోద్రేకాలనుంచి నిన్ను బయటపడెయ్యదే, నీ కోరికలేమీ తీరవే?’ అని అంటావా?. కాని నాకు సంబంధించినంతవరకూ నేను ఈ విషయాలు నా అంతరంగ తాపాన్ని ఉపశమింపచేసేవిగా భావిస్తాను.అందుకని ముందు నా అంతరంగాన్ని తరచి చూసుకుంటాను, ఆ మీదటనే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని. అందుకని నువ్వు అనుకుంటున్నట్టుగా ఇప్పుడు కూడా నేను నా సమయాన్నేమీ వృథా చేసుకోవడం లేదు. ఈ ప్రశ్నలన్నీ కూడా నా ఆత్మోద్ధరణకి ఉపకరించేవే. చెప్పలేని బరువు కింద కుంగిపోతూ, ఈ అస్తిత్వం నుంచి తప్పించుకుని, తన మూలస్వభావానికి మరలిపోవాలని కోరుకునే మనసుని ఇవి తేలికపరుస్తాయి. ఈ మన శరీరం మన ఆత్మ మీద పెద్ద బరువుగా ఒరిగిపోతూ దాన్ని గొప్ప క్లేశానికి గురి చేస్తూ ఉంటుంది. శరీరభారం ఆత్మని అణగదొక్కుతూ దాన్ని దాస్యంలోకి నెట్టేస్తూ ఉంటుంది. అటువంటి సమయాల్లోనే తత్త్వశాస్త్రం ఆత్మరక్షణకి సాయంగా, ఈ విశ్వవిచారణ చేపట్టడం ద్వారా పార్థివ విషయాల్ని దివ్యవిషయాలుగా మారుస్తుంది. అప్పుడే, అక్కడే ఈ ఆత్మకి స్వేచ్ఛ. అక్కడే దీని విహారం. అప్పటిదాకా దేహపంజరంలో చిక్కుపడ్డ ఈ ఆత్మ బయటపడి ద్యులోకంలో కొత్త ఊపిరి పోసుకుంటుంది. అదెలాంటిదంటే, పనివాళ్ళు ఏదో ఒక పనిలో నిమగ్నులై తమ కళ్ళు నొప్పిపుట్టేదాకా పనిచేసాక, కళ్ళు బైర్లు కమ్మినట్టనిపించి, కొంతసేపు బయట ఏదో ఒక తోటలోనో లేదా ఆరుబయటనో తిరుగాడటానికి వెళ్తారు చూడు, అప్పుడు ఆ అపారమైన వెలుగులో తమ కళ్ళకి సుఖం చేకూర్చుకుంటారు చూడు. అలాగే ఈ ఆత్మ కూడా, ఈ చీకటికొట్టం నుంచి ఎప్పుడు వీలైతే అప్పుడు బయటపడి అవిరళమైన ఆకాశం కోసం పరితపిస్తూ, ఈ విశ్వవిచారణలో సేదతీరుతుంది.

దాదాపుగా ఉపనిషత్తుల భాషలాగా వినిపిస్తున్న ఈ మాటల్లో మనం గ్రహించవలసిన విషయం ఒకటే: అదేమంటే, విశ్వవివేచన మనల్ని ప్రాపంచిక, పాదార్థిక విషయాల నుంచి బయటపడేసి మన అంతరంగం బరువుని తగ్గిస్తుంది. అంటే మన ఆలోచననీ, అనుభూతినీ petty విషయాల నుంచి lofty విషయాల వైపు మరలుస్తుంది. ఈ loftiness నే ఆయన తత్త్వశాస్త్రం అనే పేరుతో పిలుస్తున్నాడు. నిజానికి ఇది ఈ ప్రపంచం ఎలా పుట్టింది, ఎలా నడుస్తోంది, ఈ జీవితం ప్రయోజనమేమిటి, మరణానంతరం ఏమవుతుంది లాంటి ప్రశ్నలకు మాత్రమే పరిమితం కాదు. అసలు ఏదైనా సరే, స్థూలంగా ఉండే విషయాలని దాటి సూక్ష్మ చింతనలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ నువ్వు భూమి తాలూకు బరువుని తగ్గించుకుని ఆకాశం తాలూకు తేలికలోకి అడుగుపెట్టినట్టే.

సెనెకా ఇంకా ఇలా రాస్తున్నాడు:

వివేకాన్ని అభిలషించే జ్ఞాని ఈ దేహాన్ని దగ్గరగా అంటిపెట్టుకుని ఉన్నప్పటికీ దానికే పూర్తిగా చెందడు. తనలోని ఉత్తమ పార్శ్వాన్ని దానికెప్పుడూ ఎడంగానే ఉంచుకుంటాడు. తన ఆలోచనలెప్పుడూ ఉదాత్త విషయాలమీదనే నిలుపుకుంటాడు. తన వరకూ తనకు లభించిన ఈ జీవితకాలాన్ని ఒక ఉద్యోగ కాలపరిమితి గానే లెక్కపెట్టుకుంటాడు. ఈ విషయంలో ఎంత సుశిక్షితుడిగా ఉంటాడంటే, అతడు తనకి లభించిన ఈ జీవితాన్ని ప్రేమించడు, అలాగని ద్వేషించడు కూడా. ఈ మర్త్య జీవితంలో తనకి ఏది లభించినా అది తన వంతువాటాగా సరిపెట్టుకుంటాడు, కాని ఇంతకన్నా మించింది మరొకటి తన వంతుగా రానున్నదని అతడికి తెలుసు. కాబట్టి నన్ను ఈ విశ్వవిచారణ చెయ్యవద్దంటావా? సమస్తాన్నీ సమగ్రంగా చూడటం మానేసి విడివిడివిషాల గురించే చింతిస్తూ కూచోమంటావా? సమస్త విషాయాల ప్రాదుర్భావం ఎక్కడో, ఈ విశ్వాన్ని ఎవరు తీర్చిదిద్దారో, ఈ జడప్రాయ పదార్థాన్ని ఎవరిట్లా విడి విడి ఆకృతులుగా విభజించిపెట్టారో ఆలోచించవద్దా? ఈ విశ్వకర్త ఎవరో, ఈ మహాపదార్థాన్ని తన శాసనం కిందకీ, చలనసూత్రాలకిందకీ తీసుకువచ్చిందెవరో, చెల్లాచెదరుగా పడి ఉన్న అసంఖ్యాక అణు సముదాయాన్ని పోగుచేసినదెవరో, ఆకారం లేకుండా అస్తవ్యస్తంగా పడి ఉన్న మూలకాలకు ఈ బాహ్య ఆకారాల్ని సంతరించిందెవరో వివేచించవద్దా? ఈ మహాకాంతి ప్రకాశం ఎక్కణ్ణుంచి వచ్చింది? ఇది అగ్నినా లేక అంతకన్నా మించిన తేజోవికాసమా? నేను ఈ ప్రశ్నలు అడగవద్దా? నేను ఏ శిఖరాలు దిగివచ్చానో వాటి గురించి తలపోయవద్దా? ఈ ప్రపంచంలో నా పుట్టుక ఒక్కసారేనా లేక తిరిగి తిరిగి జన్మించవలసి ఉందా? దీని తర్వాత నా ప్రయాణం ఎటు? ఈ మానవ దాస్యం నుంచి బయటపడ్డాక నా ఆత్మకోసం ఏ ఆశ్రయం కాచుకుని ఉంది? స్వర్గంలో నాకంటూ ఒక చోటు వద్దా? లేదా మరో మాటగా చెప్పాలంటే, నేనెప్పటికీ ఇలా తల దించుకుని బతకవలసిందేనా? కాదు, నేను ఇటువంటి మనుగడ కోసం పుట్టలేదు. ఈ దేహమనే వస్తుసామగ్రిలో కూరుకుపోవడాన్ని మించిన ధ్యేయం కోసం నేను పుట్టాను. ఈ దేహం నా స్వాతంత్య్రానికి తగులుకున్న సంకెల. అది నా భాగ్యానికి అడ్డంకి. నేను నా ఆత్మని గాయపరుచుకోలేను. నాలో గాయపడేదంటూ ఉంటే అది నా దేహం మాత్రమే. సదా ప్రమాదం పొంచి ఉన్న ఈ గృహంలో స్వతంత్రంగా ఉన్నది నా ఆత్మ మాత్రమే. రక్తాస్థిగతమైన ఈ దేహం నాకెన్నడూ భయకారకం కాకుండు గాక! నేనొక సజ్జనుడిగా జీవించడానికి ఇది ఎన్నడూ అడ్డుపడకుండు గాక! ఈ అల్పదేహానికి అవసరమైనదానికన్నా ఎక్కువ గౌరవం కోసం నేనెన్నడూ పాకులాడకుందును గాక! అవసరమైనప్పుడు, సముచితమనిపించినప్పుడు నేను ఈ బంధాన్ని తెంచుకోడానికి సదా సంసిద్ధుడుగా ఉందును గాక!

ఇది సెనెకా తత్త్వశాస్త్రం. అతడి నీతిశాస్త్రం కూడా. ఇదే అతడి మతం, తర్కం, సైన్సు కూడా. ఇక్కడ అతడు మాట్లాడుతున్నది ఆ loftiness గురించే. దీన్నే అతడు ఫిలాసఫీ అంటున్నాడు. ఉదాహరణకి ఒక స్వాతంత్ర్య వీరుడు ఉన్నాడనుకుందాం. అతణ్ణి కారాగారంలో పెట్టారనుకుందాం. అతడి ముందు రెండు దారులు ఉన్నాయి. ఒకటి తన కారాగార వాసం గురించి చింతించడం, బాధపడటం, దాన్నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించడం. మరొకటి, ఆ సమయాన్ని అధ్యయానికి కేటాయించడం, తన జీవితప్రయాణాన్ని పునఃపరిశీలించుకోవడం. ఈ రెండో పనికి పూనుకుని అతడు తన ఆత్మకథ రాసాడనుకుందాం. దాన్ని సెనెకా ఫిలాసఫీ అనే అంటాడు. అతడి దృష్టిలో తత్త్వశాస్త్రమంటే నిన్ను కిందకి దిగలాగుతున్న అల్పవిషయాలనుంచి నీ మనసుని ఉదాత్త విషయాలవైపు మరల్చడం. అది నిన్ను మనిషిగా మార్చే ప్రక్రియ. మతంతో నిమిత్తం లేని ఆధ్యాత్మికత. నైవేద్యాలతోనూ, బలుల్తోనూ నిమిత్తం లేని దైవారాధన.

ఇది అంతా చదివాక మనకి ఏమనిపిస్తున్నది? ఒక్కసారి పునశ్చరణ చేసుకుందాం. పదార్థమూ, ఆలోచనా ఒకటే, రెండూ వేరు వేరు కావు. ఈ ప్రపంచాన్ని ప్రపంచమే నడిపించుకుంటున్నది, దీనికి బయట అతీతంగా మరే శక్తీ లేదు. కాని అలాగని మనం పాదార్థిక ప్రపంచం వైపు మొగ్గకూడదు. అది మన జీవితాన్ని పరిమితం చేసేస్తుంది. అల్పవిషయాల్లోకి లాగేస్తుంది. మన కోరికలకీ, భయాలకీ, సందేహాలకీ బానిసల్ని చేసేస్తుంది. ఆ క్రమంలో మనం తోటిమనిషికి కూడా బానిసలుగా మారిపోతాం. మనల్ని మనం చూపుల్ని పదార్థం వైపు నుంచి తిప్పుకుని వివేచన వైపు మళ్ళించుకోవాలి. అది స్థూలం నుంచి సూక్ష్మానికి ప్రయాణం. నేలనుంచి నింగికెగరడం. భువినుంచి దివికి పయనించడం.

ఈ విశ్వవివేచన నిజానికి ఒక నైతిక కార్యాచరణ. ఈ ప్రయత్నంలో మనిషి తన అల్పత్వం నుంచి బయటపడి ఉదాత్తమానవుడిగా రూపొందుతాడు. భీరుత్వం నుంచి బయటపడి ధీరుడిగా మారతాడు. నర-పశువు నరసింహుడిగా మారతాడు.

ఇది కర్మకాండ అవసరం లేని మానవతావాదం. నైవేద్యాల్తో బలుల్తో నిమిత్తం లేని దైవారాధన. ఎప్పుడెప్పుడు మనిషి తన ఆలోచనల్ని ఉదాత్తంగా మలచుకుంటాడో, ఎప్పుడెప్పుడు గంభీరమైన విషయాల వైపు చూపుతిప్పుతాడో, ఎప్పుడెప్పుడు తోటిమనిషిని తన అవసరానికి కాక, తానే తోటిమనిషికి ఎలా ఉపయోగపడగలని ఆలోచిస్తాడో, అప్పుడల్లా అతడికి స్వర్గంలో చోటు చిక్కినట్టే.

30-12-2022

One Reply to “సెనెకా ఉత్తరాలు-14”

Leave a Reply

%d bloggers like this: