
మొన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు ఒక సాయంకాలం యెర్రాప్రగడ రామకృష్ణ ఇంటికి వెళ్ళాను. చాలా ఏళ్ళ తర్వాత అతని ఇంటికి వెళ్ళడం. అతనూ, అతని భార్య, ఆమెని మేమంతా సోదరి అని పిలుస్తాం, వారిద్దరూ నేను రాజమండ్రిలో ఉండేరోజుల్లో నన్ను సొంతమనిషిగా చూసుకున్నారు. దాదాపుగా ప్రతి రాత్రీ నా భోజనం వాళ్ళింట్లోనే నడిచేది. ఇన్నేళ్ళ తరువాత, వాళ్ళింటికి వెళ్ళినప్పుడు, ఆ ముచ్చట్లన్నీ తలచుకుంటున్నప్పుడు సోదరి ఒక మాట అన్నది: ‘నిన్నా, ఈ రోజూ సాహిత్యసమావేశాల్లో నిన్ను చూస్తుంటే అంతరంగంలో చాలా ప్రశాంతంగా ఉన్నట్టుగా కనబడ్డావు’ అని. ఆ మాటలు నాకెంత సంతోషాన్నిచ్చాయో చెప్పలేను. సంతోషం సరైన మాట కాదు, ధైర్యం. అవును, ఆ మాటలు చాలా ధైర్యాన్నిచ్చాయి. ఆమె ఇప్పుడు రాజమండ్రిలో కౌన్సిలింగులో చాలా ప్రసిద్ధి పొందిన వ్యక్తి కూడా కాబట్టి, సమస్యల్తో సతమతమవుతున్న ఎందరో మనుషుల్ని, కుటుంబాల్నీ దగ్గరగా చూస్తూ వున్నది కాబట్టి, ఆమె నా గురించి చెప్పిన మాటలు నాకు కూడా పరోక్షంగా ఒక కౌన్సిలింగు గానే అనిపించాయి.
నా చిన్నప్పుడు నాలో అంతగా బయటపడలేదుగానీ, నా యవ్వనకాలంలో మొదలయి, దాదాపుగా యాభై ఏళ్ళు వచ్చేంతదాకా నాలో చాలా వైల్డ్ నెస్ ఉండేది. నా కోపతాపాలకు నా తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు, నాకు చాలా దగ్గరగా ఉండే స్నేహితులు, తోటి ఉద్యోగులు ప్రతి ఒక్కరూ గురయ్యారు. నా ఇష్టాయిష్టాలు చాలా తీవ్రంగా ఉండేవి. చాలాసార్లు నేను సరైనది అనుకున్నదానికి విరుద్ధంగా మాట్లాడుతున్నవాళ్ళని, నాకు నచ్చని జీవనసరళిని చూపిస్తున్నవారిని క్షమించలేకపోయేవాణ్ణి. ఎంతో దగ్గరగా మసిలినవాళ్ళు కూడా, ఒకసారి నాకు నచ్చకపోతే, ఏళ్ళ తరబడి వాళ్ళతో మాట్లాడకుండా, కలవకుండా ఉండిపోయిన ఉదాహరణలు తక్కువేమీ లేవు.
రాజమండ్రి రోజుల్లో నా మిత్రుడు గోపీచంద్ నాతో ఒకసారి ఒక మాటన్నాడు. మనకి నచ్చనివాళ్ళతో మాట్లాడటం మానెయ్యడమంటే, వాళ్ళని physical గా eliminate చెయ్యడమే. అంటే నీ వరకూ నువ్వు వాళ్ళని నీ జీవితంలోంచి భౌతికంగా తొలగిస్తున్నట్టే కదా అని. కాకినాడ రోజుల్లో సీతారామశాస్త్రి ఒకసారి ఒకమాటన్నాడు. నీ ముఖం ఎంత expressive అంటే ఎదటి వాళ్ళ పట్ల నీ అయిష్టం ఎంత మాత్రం నీ మనసులో దాగిపోకుండా ఇట్టే బయటికి వచ్చేస్తూ ఉంటుంది అని.
నిజానికి ఇవి మంచి లక్షణాలు కావు. గర్వించదగ్గ విషయాలు కావు. ఏళ్ళ తరువాత నాకు ఏమి అర్థమయిందంటే, నిజానికి ఎదటివాళ్ళు నాతో విభేదిస్తున్నందుకు నేను వాళ్ళకి ఇస్తున్న శిక్ష, నాకు నేను ఇచ్చుకుంటున్నదే అని. నేను ఎదటివాళ్లల్లో చూస్తున్న లోపాలు నాలో నేను చూసుకుంటున్నవే, కాబట్టే, నా ప్రతిబింబం వాళ్లల్లో కనబడగానే నేను వాళ్లని క్షమించలేకపోతూ ఉన్నాను అని.
మనలో కనీసం రెండు వ్యక్తిత్వాలు ఉంటాయన్నది అందరికీ అనుభవంలోకి వచ్చిన విషయమే. ఆ రెండూ మరీ తీవ్రరూపం ధరిస్తే, తనలోని ఒక పార్శ్వంతో మరొక పార్శ్వానికి పొసగనప్పుడు, ఆ మనిషిని మనం ఉన్మాది అంటాం. అతడు bi-polar అనీ, schizophrenic అనీ అంటాం. కాని మామూలుగా కనిపించే ప్రతి మనిషిలోనూ కూడా ఆ ద్వైధీభావం ఉంటూనే ఉంటుంది. చాలాసార్లు దాని తీవ్రత కొన్ని క్షణాలకో లేదా దగ్గరివారి మీద చూపించే కోపతాపాలకో పరిమితమై ఉంటుంది. కాని ఒక మనిషిని మనం పూర్తి ఆరోగ్యవంతుడని ఎప్పుడు అనగలం అంటే, అతడు తనలోని ఈ రెండు పార్శ్వాలనూ సమన్వయించుకోగలినప్పుడు. యూంగ్ దాన్నే integration of personality అన్నాడు. నీలోని అశాంత మనస్సుని శాంతమనస్సు తనలో లీనం చేసుకోగలినప్పుడు, నీలో అపారమైన ప్రశాంతి ఆవరించడం మొదలవుతుంది. ఆ ప్రశాంత మనస్సుని ఒక అవిచ్ఛిన్న తైలధారలాగా తెంపు లేకుండా ఉంచుకోగలిగినప్పుడు, మనం ఆ మనిషి సన్నిధిలో కూచున్నప్పుడు, మనల్ని కూడా ఆ ప్రశాంతత ఏదో ఒక మేరకు మనల్ని తాకుతూ ఉండటం అనుభవానికొస్తుంది. ఎవరు అటువంటి మనఃస్థితిలోనే అహర్నిశం ఉండగలరో వారినే మనం ఋషి అనీ, సాధువు అనీ, సజ్జనుడనీ అంటాం.
సెనెకాకి అటువంటి మనఃస్థితి అంటూ ఒకటి ఉంటుందని తెలిసినట్టుగా అతడి ఉత్తరాలు సాక్ష్యమిస్తున్నాయి. అటువంటి మనఃస్థితి సాధించడానికి తత్త్వశాస్త్రం ఆలంబన అని అతడు పదే పదే చెప్తున్నప్పుడు, ఆ తత్త్వశాస్త్రం విశ్వవిద్యాలయాల్లో బోధించే తత్త్వశాస్త్రం కాదు. ఎందుకంటే, తొలి గ్రీకు తత్త్వవేత్తలు myth-logy ని ఎంతగా పక్కనపెట్టారో, స్టోయిక్కులు, ప్లేటో, అరిస్టాటిల్ ల logic ని కూడా అంతే పక్కన పెట్టారు.
వాళ్ళే కాదు, ఆంతరంగిక ప్రశాంతిని కోరుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లాజిక్ కి మొదటి పీట వెయ్యలేకపోయారు. అంటే వాళ్ళు illogical గానో, irrational గానో ప్రవర్తిస్తారని కాదు. లేదా విశ్వాసులు చేసేటట్టుగా ఏదో ఒక బలమైన విశ్వాసాన్నో, faith నో ఆలంబన చేసుకున్నారని కాదు. ప్రత్యేకంగా ఒక దైవం పైనగాని, మంత్రంపైనగాని, గ్రంథంపైనగాని విశ్వాసం పెట్టుకుని ఈ జీవితంలోని ఆటుపోట్ల ను తమకై తాము సమన్వయించుకోగలగడం విశ్వాసుల పద్ధతి. కాని సెనెకా వంటి స్టోయిక్కులు ఆ విశ్వాసాన్ని తమ అంతరంగం వైపు మరల్చుకుంటారు. కాబట్టి వారికి కూడా ఈశ్వరుడు ఉన్నప్పటికీ, వారిని religious అనలేము. ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి, ఆచరణవాదులు కారు అనలేము. నిజానికి ఈశ్వరవాదికి, నిరీశ్వరవాదికి మధ్య ప్రాయికంగా ఏమీ తేడా లేదు. గాంధీ గారు భగవంతుడి గురించి ఒక వ్యాసం రాస్తూ, దేవుడు నిరీశ్వరవాదుల నిరీశ్వరవాదం కూడా అని అన్నారు.
ఆలోచన, విశ్వాసం- ఈ రెండూ నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నాయి అన్నది ప్రశ్న. ఆలోచనలోంచి వికసించిన సైన్సు వైద్యశాస్త్రంగా పరిణమిస్తే, అది ఆరోగ్యవంతమైన ఆలోచన. అణ్వస్త్రంగా పరిణమిస్తే, అది అనారోగ్యకరమైన ఆలోచన. నీ విశ్వాసం నిన్నూ, నీ తోటిమనిషినీ కలపగలిగితే, కలిపి ఉంచగలిగితే, అది ఆరోగ్యవంతమైన విశ్వాసం. అలాకాక, నీ విశ్వాసానికి భిన్నంగా ఉన్న విశ్వాసిని పరిమార్చడంగా పరిణమిస్తే, అది అనారోగ్యకరమైన విశ్వాసం. కాబట్టి, ఆలోచన, విశ్వాసం అనే రెండు పదాల వెనక మరొక రెండు పదాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైనదీ, అనారోగ్యకరమైనదీ అని. మానవ జీవితంలో నైతికత గురించి మాట్లాడేవాళ్ళు ప్రధానంగా ఈ రెండు పార్శ్వాల మీద దృష్టిపెడతారు. నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా లేదా అన్నది ముఖ్యం కాదు. నువ్వు కార్యకారణ సంబంధాన్ని నమ్ముతున్నావా లేదా అన్నది ముఖ్యం కాదు. నిజంగా ముఖ్యమైంది ఏమిటంటే, నీ విశ్వాసం గాని, నీ ఆలోచన గాని, నిన్ను ఆరోగ్యవంతుడైన మనిషిగా మారుస్తున్నాయా లేక అనారోగ్యకరమైన మనిషిగా మారుస్తున్నాయా అన్నది.
ఈ దృష్టితో చూసినప్పుడు తర్కం, లేదా రాజకీయాలు లేదా సాంఘిక వ్యవహారాలు లేదా పదవీవిరమణ చేసి సంఘానికి దూరంగా గడిపే జీవితం- ఇవన్నీ కూడా నిన్ను మనిషిగా మార్చకపోతే నిరర్థకం అనేదే సెనెకా పదే పదే తన ఉత్తరాల్లో రాస్తూ వచ్చిన ఉత్తరం.
మొదట తర్కం సంగతి చూద్దాం. అరిస్టాటిలీయ సిల్లాజిజం ని సెనెకా ఒక ఉత్తరంలో ఎలా ఆటపట్టిస్తున్నాడో చూడండి:
‘ఎలక అనేది ఒక పదం. ఎలక రొట్టె తింటుంది కాబట్టి ఒక పదం రొట్టె తింటుంది.’ ఇప్పుడు నేనీ సమస్యని పరిష్కరించలేకపోయాను అనుకో, ఆ నా అజ్ఞానం వల్ల నా మీద ఎంత పెద్ద బరువు వేలాడుతుంది! ఇప్పుడు నన్ను నేనెంత తరచితరచి చూసుకోవాలి! ఇప్పుడు నేను ఏ మాత్రం జాగ్రత్త పడకపోయినా రేపు ఎలకలబోనులో పదాల్ని పట్టుకోక తప్పదు. ఇంకా అలసత్వం చూపించాననుకో, రేపు ఒక పుస్తకమే నా రొట్టెలన్నీ తినేవచ్చు. బహుశా అప్పుడు మనం ఆ సిల్లాజిజంని ఇలా మార్చుకోవాలేమో. ‘ఎలక ఒక పదం. పదం రొట్టె తినదు. కాబట్టి ఎలకలు రొట్టెలు తినవు’ అని. మన ఆలోచనల్లో ఇంతకన్నా మూర్ఖత్వం మరేముంటుంది! మనం తలపట్టుకు కూచోవలసింది ఇలాంటి విషయాల మీదనా? గెడ్డాలు పెంచుకోవలసింది ఇలాంటి హేతుబద్ధత గురించా? ఇదేనా మనం గంభీరమైన వదనాల్తో తరగతిగదుల్లో బోధించవలసింది?
ఈ మాటలు మరీ హాస్యస్ఫోరకంగా ఉన్నాయి గాని, కార్యకారణ సంబంధం మీద మన ఆలోచనలు, వాటి హేతుబద్ధతా మరీ ఇంత అన్యాయంగా ఉండవని మీరు అనుకోవచ్చు. కాని ఇరవయ్యవ శతాబ్దంలో Analytic philosophers సరిగ్గా ఈ ప్రాతిపదిక మీదనే ప్రాచీన యూరోపియన్ తత్త్వశాస్త్రాన్ని ఎండగట్టారని మనం మర్చిపోకూడదు. తత్త్వవేత్తలే కాదు, మేనేజిమెంటు పండితుడని చెప్పదగ్గ ఎడ్వర్డ్ డి బోనో ఆధునిక యూరోప్ అనుభవిస్తున్న ఎన్నో నైతిక సంక్షోభాలకు కారణం అరిస్టాటిలీయ సిల్లాజిజమే అంటాడు. ‘ఎ’ లేదా ‘బి’- ఆ రెండింటిలో ఒకటి మాత్రమే సత్యం, రెండోది కాదు అనే ఆలోచనలోనే దోషముందంటాడు. ‘ఎ’ లేదా ‘బి’ కి మధ్యలో అనంత సంభావ్యతలు ఉంటాయి. వాటిని చూడగలగడాన్నే అతడు lateral thinking అని వ్యవహరిస్తాడు.
తార్కికతలోని ఈ పరిమితులు మనిషి ప్రవర్తననీ, జీవితాన్నీ కూడా ఎంత సంక్షోభంలోకి నెట్టగలవో గోపీచంద్ ‘అసమర్థుని జీవయాత్ర’ నవలలో చూడవచ్చు. అలాగే తనలోని అనారోగ్యకరమైన వాసనల్ని నిర్లక్ష్యం చేస్తూ, ముందు తనని తాను సంస్కరించుకోకుండా, బయటి ప్రపంచాన్ని సరిదిద్దాలనుకోవడంలోని మూర్ఖత్వాన్ని చలంగారు తన మ్యూజింగ్సులో పదే పదే చర్చిస్తాడు.
రెండవది, ఏకాంతం. మనిషి తక్కిన మనుషులనుంచీ, సమాజం నుంచీ దూరంగా, ఏకాంతంగా జీవిస్తే, తనలోని అనారోగ్యాన్ని సరిదిద్దుకోగలడనే ఆలోచనల్ని కూడా సెనెకా పదే పదే విమర్శిస్తాడు. ఈ మాటలు చూడండి:
మనం పదవీ విరమణ జీవితం జీవిస్తున్నామని అందరూ అనుకుంటున్నారు, కానీ అది నిజం కాదు. ఎందుకంటే మనం నిజంగా రాజకీయ వ్యవహారాలనుంచి విరమించి ఉంటే, బయటి ఆకర్షణల పట్ల విముఖత చూపించి ఉంటే, నిజంగానే మనలోకి మనం మరలిపోయి ఉంటే, మనల్ని ఏ బయటి విషయమూ కలవరపరచకూడదు. మనుషుల సంగీతంగానీ, పక్షుల కూజితాలు గానీ మన ఆలోచనలకి అడ్డం పడకూడదు. మనం నిజంగా స్థిరత్వం పొందిఉంటే, మనోనిశ్చయత పొంది ఉంటే, ఆకస్మికంగా సంభవించే శబ్దాలపట్లా, వినిపించే పదజాలం పట్లా చలించే హృదయం ఇంకా తనలోకి తాను పూర్తిగా మరలిపోయినట్టు కాదు. అంటే దానిలో ఇంకా ఆందోళన ఉన్నట్టు, దాని వేర్లు ఇంకా భయంలో పాతుకునే ఉన్నట్టు. అటువంటి మనసు ఇంకా జాగ్రత్తని కోరుకుంటున్నట్టే.
సెనెకా ఈ ఉత్తరాలు రాస్తున్నప్పుడు, తన రాజకీయ వ్యవహారాల్నుంచి పక్కకు తప్పుకుని, రోమ్ కి దూరంగా జీవిస్తున్నాడు. కాని పదవీబాధ్యతలనుంచి తప్పించుకున్నంతమాత్రాన, అంతరంగం శాంతించినట్టు కాదు అని ఆయనకు తెలుసు. మనలోని రహస్య ఆకాంక్షలు, తీవ్ర భావోద్రేకాలు చల్లారనిదే మనం మనతో పూర్తిగా సమాధానం పొందినట్టు కాదు. మరొక ఉత్తరంలో ఇలా అంటున్నాడు:
ఎప్పుడైతే ఏ చప్పుడూ నిన్ను చేరదో, ఏ పొగడ్తగానీ, బెదరింపులుగానీ నిన్ను కుదపలేవో, నీ చుట్టూ మోతపెట్టే గోల వట్టి బోలు చప్పుడుగా మాత్రమే వినిపిస్తుందో, అప్పుడు మాత్రమే నీ పట్ల నీకు శాంతి చిక్కిందని తెలుసుకో.
ఆ మనఃస్థితి దేనివల్ల సాధ్యపడుతుంది అంటే తత్త్వశాస్త్రం వల్లనే అంటాడు సెనెకా. నిజానికి, ఇక్కడ తత్త్వం శాస్త్రమూ కాదు, వివేచనా కాదు, ఒక ఆచరణ. ఈ వాక్యాలు చూడండి:
కాబట్టి ప్రియమైన లుసిలియస్, తత్త్వచింతన మనం ఆరాధించవలసిన ఒక పవిత్రవిషయం. అది ఎంత పవిత్రమంటే,తద్విరుద్ధమైనదే మనకి ఎక్కువ సుఖాన్ని కలిగించడం మనం చూస్తూంటాం. ఒక మనిషి ఎక్కువ తీరిగ్గా గడుపుతుంటే అతడు సమాజం నుంచి ఏకాంతం సిద్ధించుకున్నాడని ప్రజాబాహుళ్యం భావిస్తుంటారు. అతడికి ఎటువంటి తాపత్రయాలూ లేవనీ, తనలోతాను, తనకై తాను జీవిస్తున్నాడనీ అనుకుంటారు. ఇవి నిజంగా జ్ఞానికి మాత్రమే లభ్యం కాగల వరాలు కాబట్టి. కాని ఆందోళననుంచి తప్పించుకోలేనివాడు నిజంగా తనలో తాను జీవించగలడా? ఏమంటావు? అలా ఎలా జీవించాలో (ఇది అన్నిటికన్నా ముఖ్యం) అతడికి నిజంగా తెలుసా? ఎందుకంటే మనుషుల వ్యవహారాలనుంచి దూరంగా వెళ్ళిపోయినవాడు, తన అసంతృప్తులు తనకి తెచ్చిపెడుతున్న బాధ తట్టుకోలేక ఏకాంతంలో కూరుకుపోయినవాడు, తన పొరుగువాడు తనకన్నా సంతోషంగా ఉంటే చూడలేనివాడు, భయంవల్ల మాత్రమే నలుగురినీ తప్పించుకు తిరిగేవాడు, ఒక భీతిల్లిన జంతువులాగా, జడప్రాయంగా పడి ఉండేవాడు నిజంగా తనకోసం తాను బతుకుతున్నట్టు కాదు, అతడు తన ఉదరంకోసం, తన సుఖంకోసం, తన నిద్రకోసం మాత్రమే బతుకుతున్నట్టు. అంతకన్నా సిగ్గుమాలిన జీవితం మరొకటి ఉండదు. ఎవరికోసం బతకలేనివాడు తనకోసం కూడా తాను బతకలేడు.
చాలా చక్కని మాటలు. ముఖ్యంగా, నీ ఏకాంతం ప్రయోజనరహితం అయితే ఆ ఏకాంతానికి అర్థం లేదు. అందులో బహుజన హితం గురించీ, బహుజన సుఖం గురించీ చింతలేకపోతే అది పూర్తిగా స్వార్థమే అవుతుంది. సంకుచిత జీవితమే అవుతుంది. కాబట్టి నువ్వు సామాజిక- రాజకీయ వ్యవహారాలనుంచి తప్పుకున్నంతమాత్రాన భయాన్నీ, ఆందోళననీ జయించినట్టుకాదు. నువ్వు నలుగురితో కలిసి నెరవేర్చగల పనుల కన్నా, నీ ఏకాంతం ద్వారా సమాజానికి, మానవాళికి మరింత బాగా దారి చూపించగలవనుకుంటేనే, ఆ ఏకాంతం సార్థకమవుతుంది.
కాబట్టి మనుషుల మధ్య సంచరిస్తున్నప్పుడు నువ్వు లోనయ్యే కలవరం నిజానికి నీ లోపలి విరుద్ధ పార్శ్వాలు ఒకదానితో ఒకటి కలహించడం తాలూకు చప్పుడు. నువ్వు నీలోని ఆ అసంతృప్తిని గుర్తుపట్టడం మొదలుపెట్టడమే నీ నైతిక ఆచరణ తాలూకు ప్రారంభం. ప్రతి సారీ నువ్వొక మనిషిని ద్వేషిస్తున్నప్పుడు, అతడి ఉనికిని ఏవగించుకుంటున్నప్పుడు, పరిశీలించుకో, నీలోని ఏ అవలక్షణానికి అతడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడో. ఆ అవలక్షణం నీదే. ఆ చప్పుడు నీలోని హీనపార్శ్వం చేస్తున్న చప్పుడు. ఆ చప్పుణ్ణి నువ్వు శాంతింపచేసుకోగలిగితే, అప్పుడు నువ్వు నలుగురి మధ్యా ఉన్నా కూడా ఏకాంతంగా ఉండగలుగుతావు. ఏకాంతంలో ఉన్నప్పుడు కూడా నలుగురి హితంగురించే ఆలోచించగలుగుతావు.
28-12-2022