సెనెకా ఉత్తరాలు -12

Reading Time: 4 minutes

యజమాని బానిసల మధ్య సంబంధం గురించి సెనెకా ఇంకా ఇలా రాస్తున్నాడు:

‘అంటే ఏమంటున్నావు నువ్వు? నా బానిసల్ని నా బల్ల దగ్గర కూర్చోబెట్టుకోక తప్పదంటావా? అదేనా నీ ఉద్దేశం? కాదు. నువ్వు స్వతంత్రులైన మానవుల్ని అందరినీ ఆహ్వానించినట్టే వాళ్ళను కూడా ఆహ్వానించమంటున్నాను తప్ప అంతకన్నా ఎక్కువ కాదు. ఏ బానిసల పనులు అయితే మరింత తక్కువ స్థాయి పనులో అటువంటి బానిసల్ని నేను నా బల్ల దగ్గరికి అనుమతించబోనని నువ్వు అనుకుంటే అది పొరపాటు… నేను చెప్పేది ఏమంటే వాళ్లని వాళ్లు నిర్వహిస్తున్న పనులను బట్టి కాక వాళ్ళ శీలాన్ని బట్టి మాత్రమే గౌరవించమని చెప్తున్నాను. ఎందుకంటే ఏ మనిషికైనా శీలమూ, వ్యక్తిత్వమూ అతను తనంత తానుగా సమకూర్చుకునేవి. పనులంటావా యాదృచ్ఛికంగా అతని వంతుకు వచ్చేవి. కాబట్టి ఎవరు నీతో భోజనం చేయడానికి అర్హులో వారిని ఆహ్వానించు. ఎవరు అందుకు తగ్గ అర్హత పొందనున్నారో వారిని కూడా ఆహ్వానించు. ఒకవేళ వాళ్ళ వాళ్ళ సాంగత్యాన్ని బట్టి సాహచర్యాల్ని బట్టి వాళ్ల వ్యక్తిత్వాల్లో ఏదైనా బానిస మనస్తత్వం సంక్రమించి ఉంటే, స్వతంత్రులూ ఉదాత్తులూ అయిన మనుషులతో మరిన్నిసార్లు కలుసుకోగలిగే అవకాశం వల్ల ఆ అవలక్షణం తప్పకుండా తొలగిపోతుంది. కాబట్టి ప్రియమైన లుసిలియస్, నువ్వు నీ స్నేహితుల కోసం ప్రజా వేదిక దగ్గరో లేదా సెనేట్ మందిరం దగ్గరో మాత్రమే వెతుకులాడకు. నువ్వు కొద్దిగా శ్రద్ధ పెట్టి చూడగలిగితే, ఇంచుక జాగ్రత్తగా పరిశీలించగలిగితే వాళ్లు నీ ఇంటి దగ్గర కూడా లభ్యం కాగలరు. చాలాసార్లు గొప్ప సామగ్రి తగిన కళాకారుడు దొరక్క నిరుపయోగంగా పడి ఉంటుంది. ఆ విషయం నువ్వు కొంత ప్రయోగశీలత్వంతో పరిశీలిస్తే నీకే అర్థమవుతుంది. ఒక గుర్రాన్ని కొనేటప్పుడు దాని అశ్వ లక్షణాలను బట్టి కాక దాన్ని కళ్లేన్ని, జీనుని బట్టి మాత్రమే కొనుగోలు చేస్తే అంతకన్నా మూర్ఖుడు మరొకడు ఉండడు. అలాగే ఒక మనిషిని అతను ధరించిన దుస్తుల్నిబట్టో లేదా అతని సామాజిక అంతస్తునిబట్టో మాత్రమే గౌరవించేవాడు మరింత పెద్ద మూర్ఖుడు.

చాలా సరళంగానూ, తేటతెల్లంగానూ కనిపించే ఈ వాక్యాల వెనక ఎంతో సామాజిక శాస్త్రం ఉంది. ఒక మనిషికి సామాజికంగా లభించే గౌరవం అతడి వ్యక్తిత్వాన్ని బట్టి కాక అతను చేసే పనిని బట్టి లభించడం అనేది అత్యంత అనాగరిక లక్షణం. నిజానికి మనం ఆదిమ జాతులుగా పరిగణించే గిరిజన సమాజాల్లో ఒక మనిషి విలువ అతడి వయసును బట్టి, అతడు జీవితానుభవాలను బట్టి ఉంటుంది తప్ప అతడు నిర్వహించే సామాజిక బాధ్యతను బట్టి ఉండదు.

ఉదాహరణకి ఒక సవర గ్రామంలో ఉండే గ్రామ పెద్దను గొమాంగో అంటారు. అయితే ఆ గొమాంగో గ్రామ సభ నిర్వహించినప్పుడు మాత్రమే గొమాంగో గౌరవానికి అర్హుడు. మామూలు రోజుల్లో అతనితో ఒక చిన్న పిల్లవాడు కూడా పరాచకాలు ఆడగలడని గిడుగు సీతాపతి గారు రాశారు. అదే గొమాంగో తన గ్రామ గిరిజన సమాజాన్ని ఒక చెట్టు కింద సమావేశపరిచినప్పుడు అత్యంత దుర్నిరీక్ష్యుడిగా ఉంటాడు. అది అతడు నిర్వహిస్తున్న బాధ్యతకి సమాజం ఇస్తున్న గౌరవం. కానీ మన సమాజాల్లో ఒక శాసన సభ్యుడు శాసనసభకు వెలుపల కూడా ఇరవైనాలుగు గంటలూ ప్రత్యేక గౌరవానికీ, ప్రత్యేక మర్యాదలకూ, ప్రత్యేక సౌకర్యాలకూ తాను అర్హుడననే భావిస్తూ ఉంటాడు. అతనితో ఒక చిన్న పిల్లవాడు నలుగురి ఎదట పరాచికాలు ఆడగలడమనేది మన ఊహకి కూడా అందని విషయం.

ఒక మనిషిని అతను చేస్తున్న పనిని బట్టి కాక అతను సంతరించుకున్న వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవించాలని అనేది మామూలు మాట కాదు. ఇది కేవలం యజమానికి బానిసలకి మాత్రమే సంబంధించిన విషయం కాదు. సమాజంలో పనుల మధ్య ఉండే నిమ్నోన్నతాలు మొదట వ్యక్తులకు ఆపాదించడం, ఆ తర్వాత సమూహాలకి ఆపాదించడం వల్లనే సమాజంలో ఇన్ని సామాజిక అంతరాలు, ఆధిక్య, న్యూనతా భావాలు ఏర్పడ్డాయి. నిజానికి సెనెకా రాయని మరొక మాట ఏమిటంటే ఒకవేళ ఒక మనిషి సామాజికంగా ఉన్నత బాధ్యతలు నిర్వహిస్తున్నవాడైనప్పటికీ, అతడు శీలపరంగా, వ్యక్తిత్వ పరంగా పరిణతి చెందకపోతే అతణ్ణి నీ భోజనాల వల్ల దగ్గరకు ఆహ్వానించవద్దు అని కూడా చెప్పి ఉండవలసింది.

సెనెకా ఇంకా ఇలా రాస్తున్నాడు:

‘వాడు ఒక బానిస’ అంటారు. కానీ అతని ఆత్మ ఒక విముక్త మానవుడికి చెందినది కావచ్చు. ‘సరే, అతడు ఒక బానిస అయితే మాత్రం ఏమిటట?’ అసలు బానిస కాని మనిషి అంటూ ఎవరైనా ఉంటే నాకు చూపించు. ఒకడు కాముకత్వానికి బానిస. మరొకడు అసూయకు బానిస. ఇంకొకడు మహత్వకాంక్షకు బానిస. అసలు మొత్తం మనుషులందరూ భయానికి బానిసలు… మనిషి తనకై తాను విధించుకున్న బానిసత్వం కన్నా సిగ్గుమాలిన దాస్యం మరొకటి లేదు.’

సెనెకా ఇంకా ఇలా అంటున్నాడు

ఆ చాదస్తంగాళ్ళ మాటలు పట్టించుకోకు. నీ బానిసలతో స్నేహపూర్వకంగా మసలుకో, వాళ్ళ పట్ల ఎలాంటి ఆభిజాత్యం చూపించకు. వాళ్ళు నిన్ను గౌరవించాలి తప్ప నిన్ను చూసి భయపడకూడదు. నేనిలా అంటూ ఉంటే కొందరు నేనేదో బానిసత్వాన్ని నిర్మూలిస్తున్నానంతగా గగ్గోలు పెడుతుంటారు. ఈ కులీనుల ఆధిపత్యాన్ని కూలదోస్తున్నానుకుంటారు. ‘చూడు ఏమంటున్నాడో రేప్పొద్దుణ్ణుంచీ మనం బానిసలను కూడా పెద్దమనుషుల్లాగా గౌరవించాలట, ఈయన గారు చెప్తున్నాడు ‘ అంటో సన్నాయి నొక్కులు నొక్కుతారు. కాని ఆ సన్నాయినొక్కులు నొక్కేవాళ్ళు దేవుడికి మనమివ్వగలిగేది మనిషికి సరిపోదన్నట్టుగా మాట్లాడేవాళ్ళే. గౌరవం అంటే ప్రేమ. ప్రేమా, భయం ఒక్కచోట కలిసి మనజాలవు.

ప్రాచీన కాలంలో బానిసలు ఎవరు? యుద్ధ ఖైదీలు లేదా యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళు. బానిసలు, దాసులు, దస్యులు- వీళ్లే ఒక సమాజాన్ని ఆర్థికంగా నిలబెట్టేవాళ్లు. వాళ్ళ శారీరక శ్రమ మీదనే ఏ సమాజమైనా ప్రాచీన కాలంలో ఆర్థికంగా నిలబడేది, పురోగమించేది. అయితే బానిసని పోషించడం కన్నా అతణ్ణి ఒక కార్మికుడిగా మార్చుకోవటం ఎక్కువ లాభసాటి అని పారిశ్రామిక విప్లవం వల్ల ప్రపంచం తెలుసుకుంది. అందువల్ల ఆయా దేశాలు పారిశ్రామికంగా పురోగమించే కొద్దీ అక్కడ బానిసత్వపు పూర్వ రూపాలు నిషేధింపబడుతూ వచ్చాయి. కానీ బానిసకు ఉన్న కొద్దిపాటి, నామమాత్రపు జీవిత భద్రత కూడా కార్మికుడికి లేదు. కార్మికుడు పని చేసినంత వరకు మాత్రమే సమాజం అతడికి బాధ్యత పడుతుంది. పనిచేయకపోతే ఆ రోజుకి అతనికి వేతనం ముట్టదు. రాను రాను కార్మికుల హక్కుల చట్టాలు మరింత బలపడి, కార్మిక ఉద్యమాలు మరింత గళం విప్పే కొద్దీ కార్మికుణ్ణి పోషించడం కూడా ఆర్థిక వ్యవస్థలకు లాభసాటిగా కనిపించడం మానేసింది. అందుకని గత యాభై ఏళ్లుగా, ముప్ఫై ఏళ్లుగా, గత ఇరవై ఏళ్లుగా అసంఘటిత రూపంలో, ఔట్సోర్సింగ్ రూపంలో, గ్లోబలైజేషన్ తీసుకొచ్చిన ఎన్నో రకాల కొత్త సాధనాల రూపంలో కార్మికుణ్ణి మరింత చౌక కార్మికుడిగా మార్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ చౌక కార్మికులకి కార్మికులకు ఉన్న ఏ హక్కులూ ఉండవు. వీళ్ళు సంఘటితం కావడం కష్టం. వీళ్ళు గొంతెత్తలేరు. కేవలం బతకడానికి సరిపోయే వేతనం మాత్రమే వీళ్లకు దొరుకుతుంది. వీళ్ళు బతకలేరు, అలాగని మరణించలేరు. ఏ రూపంలోనూ తిరగబడలేరు.

సమాజాలు ప్రపంచమంతటా కూడా రాజ్యాల రూపంలో, ప్రభుత్వాల రూపంలో, కార్పొరేట్ సంస్థల రూపంలో నిర్వహిస్తున్న ఈ కొత్త రకం చౌక కార్మికులు బానిసలు కారా?

మన సమాజంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. ఇక్కడ ఇంకా ఎన్నో కులాలు తాము తరతరాలుగా చేస్తూ వస్తున్న నిమ్న బాధ్యతల వల్ల వివక్షకు గురవుతూనే ఉన్నారు. అంటే అక్కడ వివక్ష జన్మ వల్ల సంభవిస్తున్నది. మరొకవైపు మరింతగా మరింతగా జనాభా పోగుపడుతున్న నగరాల్లో కొత్త సమూహాలు, తాము ఏ కులానికి చెందిన వారైనా, తమకు దొరుకుతున్న తక్కువ స్థాయి పనుల వల్ల వివక్ష గురవుతున్నారు. అంటే ఇక్కడ వివక్ష పనివల్ల సంక్రమిస్తున్నది. ఏకకాలంలో మనుషులు తమ జన్మ వల్ల, తమ కర్మ వల్ల కూడా వివక్ష గురవుతున్న విషాద సమాజం మనది.

ఈ విషాదాన్నీ, ఈ అస్తవ్యస్తతనీ చక్కదిద్దడానికి ఆర్థిక సంస్కరణలు, చట్టాలు, ఉద్యమాలు ఎంత అవసరమో మనుషుల సంస్కారంలో, ప్రవర్తనలో మార్పు తీసుకురావడం కూడా అంతే అవసరం. ఒక మనిషి తన తోటి మనిషి నిర్వహిస్తున్న పనుల వల్ల అతణ్ణి తక్కువగా చూడటం వెనక మూల కారణం కాయ కష్టాన్ని తక్కువగా చూడటంలో ఉందని టాల్ స్టాయి పదే పదే చెబుతూ వచ్చాడు. టాల్ స్టాయి వల్ల ప్రభావితుడైన గాంధీ కూడా కాయకష్టాన్ని ఒక ఆదర్శంగా, ప్రతి వ్యక్తి తప్పనిసరిగా పాటించవలసిన సామాజిక బాధ్యతగా పైకెత్తి చూపించాడు. కానీ ప్రస్తుత సమాజంలో గాంధేయ విధానాల పట్ల మనుషులు ప్రకటిస్తున్న అసంతృప్తి, వ్యతిరేకతల్లో భాగంగా కాయకష్టం గురించి గాంధీ మాట్లాడిన మాటలు పక్కకు పోతున్నాయి.

ఈరోజు ఎవరికీ కాయకష్టం చేయడం పట్ల గౌరవం లేదు. ప్రతి ఒక్కరూ, తాముగాని, తమ పిల్లలు గానీ కాయకష్టంతో పనిలేని ఉద్యోగాలు చేయాలని కోరుకుంటున్నారు. ఒకవేళ కాయ కష్టం తప్పనిసరి అయితే ఒక ప్రాంతానికి చెందిన వాళ్లు మరొక ప్రాంతానికి పోయి పని చేయడానికి సిద్ధపడుతున్నారు తప్ప తమ ప్రాంతంలో పనిచేయడానికి సిద్ధపడటం లేదు. ఉదాహరణకి మలయాళీలు కేరళలో కాయకష్టం చేయటానికి సంకోచిస్తారు, కానీ గల్ఫ్ దేశాల్లో చేయటానికి సంసిద్ధులవుతారు. తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రాల్లో కాయకష్టానికి వెనకాడతారు కానీ బొంబాయిలో షోలాపూర్ లో భవన నిర్మాణ కార్మికులు గా పని చేయటానికి సంకోచించరు. ఇప్పుడు భారతదేశం రెండుగా చీలిపోయింది. ఒకరు కాయకష్టం తప్పనిసరి అయిన వాళ్ళు. మరొకరు వాళ్ళ కాయకష్టం మీద ఆధారపడ్డవాళ్ళు. కాయకష్టం నుంచి తప్పించుకున్న వాళ్లు మాత్రమే ఈ దేశానికి సంబంధించిన విధానాలు, ప్రణాళికలు రూపొందిస్తూ ఉంటారు. ఆ పర్యవసానం ఎంత విషాదకరంగా ఉంటుందో కరోనా సమయంలో వలస కార్మికుల ద్వారా మనకి స్పష్టంగా తెలియ వచ్చింది.

సెనెకా తన మిత్రుడికి రాసిన ఉత్తరం చదువుతూ ఉంటే నేను తీవ్రమైన వ్యథకి లోనవుతూ వచ్చాను. రెండువేల కిందట బానిసత్వాన్ని ఒక సామాజిక అవసరంగా భావించిన కాలంలో, బానిసలు యజమానుల తాలూకు వస్తు సామాగ్రిగా, పశు సంపదగా అప్పటి పాలకులు భావించిన కాలంలో ఒక భావుకుడు ఇంత సాహసంగా, ఇంత సూటిగా తన గళం ఎత్తగలిగాడు. కానీ ఇప్పుడు మనలో ఎంతమందిమి ఒక మనిషిని అతడు చేస్తున్న పనిని బట్టి కాక అతని వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవించాలని నిజంగా నమ్ముతున్నాం?

7-12-2022
Leave a Reply

%d bloggers like this: