సెనెకా ఉత్తరాలు -11

Reading Time: 5 minutes

ఈ ప్రపంచం గురించి, మనిషి గురించి, ప్రపంచంలోని సత్యం గురించి స్టోయిక్కులు నిర్మించిన తత్వశాస్త్రమంతా ఒక ఎత్తు, రెండు విషయాల పట్ల వారు చూపించిన సాహసోపేతమైన నిర్ద్వంతమైన వైఖరి మరొక ఎత్తు. రోమన్ నాగరికతలో రోమన్ పాలకులు, పండితులు, సాధారణ పౌరులు- ముగ్గురూ కూడా అంగీకరించిన రెండు విషయాల్ని స్టోయిక్కులు అంగీకరించ లేకపోయారు. ఒకటి, బానిసత్వం. రెండోది, గ్లాడియేటింగ్. ఈ రెండు అంశాల పట్ల స్టోయికులు చూపించిన నిరసనకి, ధిక్కారానికి వారు మానవజాతి గౌరవానికి సదా పాత్రులని ఎడిత్ హామిల్టన్ రాసింది.

నైతికమైన ప్రవర్తన గురించి, శీలవంతమైన జీవితం గురించి, జ్ఞాన సముపార్థన గురించి నువ్వు ఎంతైనా రాయవచ్చు గాక, చెప్పవచ్చుగాక. సౌందర్యాత్మకమైన అభిరుచిని, దృక్కోణాన్ని నువ్వు నీ తోటి మనుషులకు కలిగించడానికి ఎంతైనా కృషి చేసి ఉండవచ్చు గాక. కానీ నీ కళ్ళ ఎదుట జరుగుతున్న సామాజిక అన్యాయాన్ని నువ్వు నోరెత్తి ఖండించకపోతే, అటువంటి వైఖరిని ధిక్కరించకపోతే నీ జ్ఞానం, దానం, తపస్సు అని నిరర్థకమే అవుతాయి.

నీ కాలం నాటి పాలకుల తోటి, కులీన వర్గాల తోటి తగాదా పడకుండా నీలోకి నువ్వు మరలిపోవడం శ్రేయస్కరం అని చెప్పే సెనెకా బానిసత్వానికి, గ్లాడియేటింగ్ కి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు మనం అబ్బురపరుస్తాయి. ఆ మానవుడు నిజంగానే ఆత్మలో అత్యంత పరిశుద్ధుడనీ, తోటి మానవుడి పట్ల షరతులు లేని ప్రేమ కనపరచగలిగినవాడనీ మనకి అర్థమవుతుంది.

ఉదాహరణకి 47 వ ఉత్తరం చూద్దాం. ఈ ఉత్తరంలో ఇతివృత్తం ‘యజమాని- బానిస’. ఈ ఉత్తరం మొదలు పెడుతూనే ఇలా రాస్తున్నాడు:

నీ దగ్గర నుంచి వచ్చేవాళ్లు నువ్వు నీ బానిసలతో స్నేహపూర్వకంగా మసులుకుంటావని చెప్తుంటే వినడం నాకెంతో సంతోషం కలిగిస్తున్నది. నీవంటి విద్యావంతుడికి, సంస్కారవంతుడికి ఈ ప్రవర్తన తగిన విధంగానే ఉన్నది. ‘వాళ్ళు బానిసలండీ ‘ అంటారు మన చుట్టూ ఉన్నవాళ్లు. ‘కాదు, వాళ్లు మనుషులు’ అంటాను. ‘కాదు, బానిసలే’ అంటారు. ‘కాదు, మన సహచరులు’. ‘బానిసలు అంటే అర్థం కావటం లేదా?’ అంటారు. ‘ లేదు వాళ్లు కపటం తెలియని స్నేహితులు’ అంటాను. ‘లేదు, వాళ్లుబానిసలే అంటారు’. ‘కాదు, వాళ్లు మన సహబానిసలు’ అంటాను ఎందుకంటే విధి బానిసల్నీ, స్వతంత్రుల్నీ కూడా ఒక్కలానే పరిపాలిస్తుంది కాబట్టి.

అసలు ఇటువంటి వాక్యాలు రెండువేల ఏళ్ల కిందట ఒక రోమన్ రాజకీయవేత్త రాశాడంటే వినడం ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే 1848 దాకా ఫ్రెంచి కాలనీల్లో బానిసత్వం నడిచింది. 1861 దాకా రష్యాలో సర్ఫ్ డమ్ కొనసాగింది. 1865 దాకా అమెరికాలో బానిసత్వం యజమానుల హక్కుగా కొనసాగింది. భారతదేశంలో అస్పృశ్యతని ఖండిస్తూ ఒక చట్టం తేవటానికి 1948 దాకా ఆగవలసి వచ్చింది.

అమెరికాలో ఎమర్సన్, థోరో, రష్యాలో టాల్ స్టాయి, భారతదేశంలో గాంధీ నైతిక జీవితం గురించి, కాయ కష్టం గురించి మాట్లాడిన మాటలకు వారు తమ కాలంలో తమ కళ్ళ ఎదుట సంభవిస్తున్న సామాజిక అన్యాయం పట్ల వ్యక్తం చేసిన నిరసన, ధిక్కారం బలం చేకూర్చాయి. ఆ మాటలు మాట్లాడినందువల్ల వారి ఆదర్శవాదానికి మరింత విశ్వసనీయత చేకూరింది. సెనెకా విషయంలో కూడా అదే మాట చెప్పవచ్చు. ఈ మాటలు చూడండి:

అందుకనే ఒక మనిషి తన బానిసతో కలిసి భోజనం చెయ్యడం అతణ్ణి కించపరుస్తుందని ఆలోచించే వాళ్లను చూసి నాకు నవ్వొస్తుంది. అలా కలిసి భోజనం చేసినందువల్ల ఒక మనిషి తక్కువ వాడు ఎలా అయిపోతాడు?

ఈ ప్రశ్న వేసిన తర్వాత అతడు తన కాలం నాటి రోమ్ లో బానిసలు ఏ విధమైన అవమానానికీ, దండనకీ, హింసకీ గురవుతూ ఉండేవారో వివరంగా రాస్తాడు. అప్పుడు ఇదిగో మళ్లా ఇలా అంటున్నాడు:

నువ్వు ఎవరినైతే బానిస అని పిలుస్తున్నావో అతడూ, నువ్వూ కూడా ఒక పాదుకి చెందిన వారె. మీ ఇద్దరి మీదా ఉన్నది ఒక ఆకాశమే. మీరిద్దరూ కూడా ఒక్కలానే ఊపిరి పిలుస్తారు, బతుకుతారు, మరణిస్తారు. నువ్వు అతడిలో ఒక బానిసను చూస్తున్నట్టే ఒక స్వతంత్రుడిని చూసే ఒక అవకాశం కూడా ఉంది. ..ఇంత పెద్ద సమస్యను మరింత విస్తారంగా చర్చించాలనుకోవటం లేదు. మనం రోమన్లం ఏ బానిసల పట్లనైతే క్రూరంగా, దుర్మార్గంగా, అవమానకరంగా ప్రవర్తిస్తున్నామో దాన్ని ఇంతకన్నా ఎక్కువ చర్చించలేను. కానీ నా మొత్తం సలహా తాలూకు సారాంశం ఒక్కటే: నీ పైవాడు నిన్ను ఎలా చూడాలని కోరుకుంటావో నీకన్నా తక్కువ వాడిని కూడా నువ్వు అలా చూడాలి. నీ బానిస మీద నీకు ఎంత అధికారం ఉందని నువ్వు అనుకుంటున్నావో, నీ పైవాడు కూడా నీ మీద అంతే అధికారం చలాయించగలరని గుర్తుపెట్టుకోవాలి. ‘కానీ నాకెవరూ యజమానుల్లేరే’ అనవచ్చు. నువ్వింకా చిన్నవాడివి. ఏమో రేపు పొద్దున్న నీకు కూడా ఒక యజమాని రావచ్చు. హెకుబా ఏ వయసులో ఖైదీగా మారిందో నీకు తెలియదా? లేదా క్రోసియన్స్ లేదా డరియస్ తల్లి? లేదా ప్లేటో? లేదా డయోజనిస్? కాబట్టి నీ బానిస కూడా నీతో సంభాషించగలిగేటట్టు, నీతో కలిసి ఆలోచనలు చేసేటట్టు, నీతో కలిసి జీవించగలిగేటట్టు ప్రవర్తించు. నేను ఈ మాటలు అంటున్నప్పుడు తక్కిన సమాజమంతా ఒక్కటై ‘ఇంతకన్నా సిగ్గుమాలిన పని, ఇంతకన్నా భ్రష్టాచారం మరొకటి ఉండబోదని’ గొంతెత్తి విరుచుకుపడతారని నాకు తెలుసు. కానీ చాలాసార్లు నేను బానిసల చేతుల్ని ముద్దాడడం ద్వారా వాళ్లని నివ్వెరపరుస్తూనే ఉంటాను. మన పూర్వీకులు, యజమానుల క్రూర ప్రవర్తనని తొలగించడానికి, బానిసల అవమానాల్ని తగ్గించడానికి ప్రయత్నించారని నీకు తెలియదా? యజమానిని ‘కుటుంబానికి తండ్రి’ అని బానిసల్ని ‘కుటుంబ సభ్యులని’ పిలిచేవారు. ఆ పద్ధతి ఇంకా ఒక మూగ మర్యాదగా ఇప్పటికీ నిలిచే ఉంది. యజమానులు, బానిసలు ఇద్దరు కలిసి భోజనం చేయడం కోసం వారు ఒక విశ్రాంతి దినాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ ఒక్క రోజు మాత్రమే మాత్రమే కలిసి భోంచేయాలని కాదు, ఆ ఒక్క రోజైతే మాత్రం తప్పనిసరిగా చేసి తీరాలి అని ఆదేశించారు. ఆరోజు ఆ ఇంట్లో పని చేసే బానిసలు పూర్తి గౌరవాన్ని పొందాలని ఆశించారు. ప్రతి ఇల్లూ ఒక చిన్న పాటి ప్రజా ప్రభుత్వంగా కొనసాగాలని వారు కోరుకున్నారు.

ఎటువంటి మాటలు ఇవి! ఎటువంటి సంప్రదాయం ఇది! ఈరోజు ప్రపంచంలో ఇంత స్థూల రూపంలో బానిసత్వం కనబడకపోవచ్చు. కానీ సూక్ష్మ రూపంలో యజమాని-బానిస భేదం అడుగడుగునా, అనుక్షణం కనిపిస్తూనే ఉంది. ‘నువ్వు నీ బానిసతో కలిసి భోజనం చేయాలి’ అనే మాట ఈరోజు మనకి విడ్డూరంగా అనిపించవచ్చు. ఎందుకంటే మనకి బానిసలు లేరు కాబట్టి అని అనుకుంటాం.

కానీ కులాలుగా, మతాలుగా అనేక ఉప కులాలుగా విడిపోయిన భారతీయ సమాజంలో ఒక మనిషిని తనతో పాటు భోజనానికి కూర్చోబెట్టుకోకపోవటమే తన సామాజిక ఆధిక్యతకు నిరూపణగా భావించడం సర్వసాధారణం. అందుకనే మన సమాజంలో ఇప్పటికీ మన ఊహించగల అతిపెద్ద సంస్కరణ సహపంక్తి భోజనమే. ఆ సహపంక్తి భోజనం కూడా ఎంత కపటంగా, నటనగా, కంటి తుడుపుగా నడుస్తూ ఉంటుందో మనకి తెలియనిది కాదు.

అయితే ఇటువంటి దురాచారం గ్రామాల్లో మాత్రమే ఉందనీ, మనం నాగరికులం అయిన తర్వాత, విద్యావంతులం అయిన తర్వాత, ఏ మనిషినీ మనకన్నా తక్కువగా చూడటం లేదనీ, సర్వ మానవ సమానత్వం మన భోజనాల బల్ల దగ్గరే మొదలవుతుందనీ మనం మనల్ని నమ్మించుకుంటూనే ఉన్నాం.

కానీ మనం ఎంత మందిమి మన కన్నా కింద పని చేసే వాళ్ళతో కలిసి భోజనం చేస్తుంటాం? ఉదాహరణకి మీ సొంత కారులోనో, అద్దె కారులోనో ఏదైనా ప్రయాణంలో ఉన్నప్పుడు, ఎక్కడైనా భోజనానికి ఆగినప్పుడు, ఆ డ్రైవర్ ని మీతో కూర్చోబెట్టుకుంటారా లేక అతడు వేరే బల్ల దగ్గర కూర్చోవాలని ఆశిస్తారా?

ఒక డ్రైవర్ దాకా ఎందుకు నాకే ఈ అనుభవం చాలాసార్లు ఎదురయ్యింది. ఉదాహరణకి మన ప్రభుత్వాల్లో ఐఏఎస్ అధికారులు కింద అధికారులతో కలిసి భోజనం చేయరు. పెద్ద పెద్ద ప్రభుత్వ సమావేశాలు జరిగినప్పుడు ఐఏఎస్ అధికారులంతా ఒకపక్క, తక్కిన సిబ్బంది అవతల గదిలోనో, హాల్లోనో మరోపక్క భోజనం చేస్తారు.

ఈ సందర్భంగా నాకు ఒకఅనుభవం గుర్తొస్తోంది. అది నేను ఉద్యోగంలో చేరిన తొలి రోజులు. నాతోపాటు గ్రూప్ వన్ పరీక్షలు పాస్ అయి డిప్యూటీ కలెక్టర్ గా ఎంపికైన నా మిత్రుడు కూడా నేను ఉన్న చోట శిక్షణ పొందుతుండేవాడు. అయితే నా ఉద్యోగ శిక్షణ కాలవ్యవధి తక్కువ కాబట్టి నేను తొందరగా ఉద్యోగంలో చేరిపోయాను. అతని శిక్షణ ఇంకా కొనసాగుతూ ఉండేది. మేమిద్దరం ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. మాకు ఒక వంట మనిషి ఉండేవాడు. ఆయన మా ఇద్దరికీ వంట వండి పెట్టేవాడు. మేమిద్దరం ఒకరోజు మా పై అధికారితో కలిసి ఒక ఉద్యోగ పర్యటనలో ఉన్నాం. పొద్దున్న అంతా చూడవలసిన స్థలాలు చూసిన తర్వాత మధ్యాహ్న భోజనానికి గెస్ట్ హౌస్ కి చేరుకున్నాం. మా పై అధికారి ఒక యువ ఐఏఎస్ అధికారి. ఆయన నా మిత్రుణ్ణి తనతో పాటు భోజనానికి ఉండమని చెప్పి నన్ను బయటికి వెళ్లి భోజనం చేసి రమ్మన్నాడు. ఆ వివక్ష ఎందుకు చూపించాడో నాకు అప్పుడు అర్థం కాలేదు. కానీ ఆ తర్వాత నేను గ్రహించింది ఏమిటంటే ఆ మా మిత్రుడు డిప్యూటీ కలెక్టర్ కాబట్టి ఆయన మరొక ఏడెనిమిది ఏళ్లలో ఐఏఎస్ కి పదోన్నతి తప్పనిసరిగా పొందుతాడు కాబట్టి, ఆ యువ ఐఏఎస్ అధికారి నా మిత్రుణ్ణి తనతో సమానుడిగా గుర్తించాడు. తనతో కలిసి భోజనం చేసే అర్హత అతనికి ఉందని భావించాడు. నేను రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు చెందిన వాడిని కాబట్టి, నాకు ఐఏఎస్ పదోన్నతి పొందే అవకాశం దాదాపుగా మృగ్యం కాబట్టి, అతడు నన్ను తనతో కలిసి భోజనం చేయదగ్గవాడిగా గుర్తించలేదు.

ఇటువంటి ప్రవర్తన ఇప్పటికీ ఐఏఎస్ అధికారుల్లో సర్వసామాన్యం. ఈ ప్రవర్తనను ఐఏఎస్ అధికారులు ఒక కలోనియల్ వారసత్వంగా పుణికి పుచ్చుకున్నారు. ఎందుకంటే స్వాతంత్ర్యానికి ముందు ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారులు దాదాపుగా బ్రిటిషర్లే ఉండేవారు. భారతదేశానికి చెందిన ప్రభుత్వ అధికారులు ఇండియన్ సివిల్ సర్వీస్ కి పదోన్నతి పొందడం చాలా చాలా అరుదు. కాబట్టి వారు భారతీయ అధికారుల్ని ఏ రోజూ తమతో సమానంగా పరిగణించలేదు. వారిని ఎప్పటికీ ద్వితీయశ్రేణి పౌరులుగానే చూసేవారు. బంకించంద్ర చటోపాధ్యాయ వంటి మహోన్నతుడైన మానవుడు కూడా ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారుల నుండి ఈ వివక్ష తప్పించుకోలేకపోయాడు.

అంతెందుకు? ఇప్పటికీ మన ఇళ్లల్లో స్త్రీలు పురుషులతో కలిసి సమానంగా భోజనాల బల్ల దగ్గర కలిసి కూర్చుని భోంచేయడం ఎన్ని ఇళ్లల్లో జరుగుతోంది? ఎన్ని ఇళ్లల్లో కనీసం పండుగ రోజు అయినా యజమానులు, పనివాళ్ళు కలిసి భోజనం చేసే దృశ్యం మీరు ఎక్కడైనా చూశారా?

నా ఉద్యోగ జీవితం తొలి రోజుల్లో నేను చూసిన చేదు అనుభవానికి విరుద్ధమైన మరొక అద్భుతమైన అనుభవం కూడా నేను చూశాను. అప్పట్లో మాకు కోట్నాక భీమ్ రావు గారు అని అదిలాబాదుకు చెందిన గోండు గిరిజనుడు గిరిజన శాఖ మంత్రిగా ఉండేవారు. నేను కర్నూలు జిల్లాలో పనిచేస్తున్నప్పుడు ఆయన ఒకసారి శ్రీశైలం పర్యటనకు వచ్చారు. అప్పుడు మేమంతా అధికారులం ఆయన కోసం గెస్ట్ హౌస్ దగ్గర ఎదురు చూస్తున్నాము. ఆయన వచ్చేటప్పటికి రాత్రి తొమ్మిది అయింది. ఆయన వస్తూనే, వెంటనే ఫ్రెష్ అయ్యి, భోజనాల హాల్లోకి వచ్చి ‘మీరు చాలా సేపటినుంచి ఎదురుచూస్తున్నారు, రండి, భోజనం చేద్దాం’ అని పిలిచాడు. ‘మీరు చేయండి సార్, మీ తర్వాత చేస్తాం’ అన్నాం. కాదూ కూడదని పట్టుపట్టి అందరినీ తనతో పాటుకూర్చోబెట్టుకున్నాడు. అక్కడితో ఆగలేదు. అక్కడ ఉన్న డ్రైవర్లని అటెండర్ లని అందరిని కూడా వచ్చి తనతో పాటు భోజనాల బల్వదగ్గర కూర్చోమన్నాడు. అక్కడితో ఆగకుండా ఆ గెస్ట్ హౌస్ వాచ్ మెన్ ని కూడా పిలిపించాడు. మొత్తం అందరం ఆ పెద్ద భోజనాలబల్ల దగ్గర చుట్టూ కూర్చున్నాక, అందరితో కలిసి, ఆయన భోజనానికి ఉపక్రమించాడు. ఆ దృశ్యం నేను నా జీవితంలో మరవలేని దృశ్యం.

ఒక యువ ఐఏఎస్ అధికారి లో సంస్కారం లేకపోవటానికి కారణం అతనికి ముస్సోరీలో ఇస్తున్న శిక్షణలో ఉన్న దోషమనీ, తాను మంత్రి అయినప్పటికీ ఆ గిరిజనుడు చూపించిన ఆ సంస్కారాన్ని కారణం గిరిజన జీవన సంస్కృతిలోని ఔన్నత్యం అని నాకు ఆ తర్వాత అర్థమయింది. ఒక మానవుడు నాగరికుడయ్యేకొద్దీ ఒక రోమన్ గా మారతాడనీ, తోటి మనిషి నుంచి అన్ని విధాలా దూరంగా జరుగుతాడనీ, ఇదిగో ఇప్పుడు సెనెకాని చదువుతూ ఉంటే మరింత బాగా అర్థమవుతూ ఉన్నది.

27-12-2022

Leave a Reply

%d bloggers like this: