సెనెకా ఉత్తరాలు -10

ఈ ప్రపంచాన్నీ, దైవాన్నీ ఒకటిగా భావిస్తున్నప్పుడు స్టోయిక్కులు కూడా ఒకలాంటి అద్వైత దర్శనాన్ని ప్రతిపాదిస్తున్నట్టుగా మనం భావించవచ్చు. అయితే వారు దాన్ని వివరిస్తున్నప్పుడు కొన్నిసార్లు వాళ్ల మాటల్లో ఒక విధమైన ద్వైత భావన వినిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఈ ప్రపంచాన్ని దైవ శరీరం గాను దేవుణ్ఢి ఈ ప్రపంచానికి ఆత్మగాను వర్ణించడం. కానీ ఇది తాము చెప్తున్న దాన్ని మరింత వివరంగా, నిశితంగా చెప్పడం కోసం చేసే ప్రయత్నమే తప్ప నిజంగా వాళ్ల ఆలోచనల్లో ఎటువంటి ద్వైతం లేదు. ఉన్నది ఒకటే. అది వస్తుపరంగా చూసినప్పుడు ప్రపంచం. శక్తి పరంగా చూసినప్పుడు దైవం. కంటికి కనిపించేదిగానూ, తాకి చూడ్డానికి వీలయ్యేదిగానూ ఈ ప్రపంచం ఉంటుందని చెప్పినప్పుడు అది పదార్థం. దాన్లో అంతర్లీనంగా ఉన్న పద్ధతి, అమరిక, నైతిక ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నప్పుడు అది మనస్సు.

వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది కానీ పదమూడో శతాబ్దానికి చెందిన మరాఠీ భక్తికవి సంత్ జ్ఞానేశ్వర్ ‘అనుభవామృతం’ కావ్యంలో ఇటువంటి దర్శనాన్నే ప్రతిపాదిస్తాడు. ఈ ప్రపంచాన్ని శివశక్తి స్వరూపంగా ఆయన దర్శించినప్పుడు విశ్వానికి శక్తికి మధ్య అభేదాన్ని చూశాడు.అయితే ఒక తేడా ఉంది. ఆ దైవం లేదా ఈ ప్రపంచంతో ఈ విశ్వంతో సమానంగా స్టోయిక్కులు గుర్తిస్తున్న ఆ దైవానికి ఒక మూర్తిమత్వం ఉందా, అంటే, ఆ దైవానికి తాను దైవం అని తెలుసా? తొలి స్టోయిక్కుల రచనలు మనకి లభ్యమవుతున్న ఆ కొద్దిపాటి శకలాల నుంచి మనం స్పష్టంగా ఏ సమాధానాన్ని రాబట్టలేము. కాకపోతే వారు ఆ దైవానికి ఆపాదిస్తున్న ప్రజ్ఞ, నైతిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే ఆ దైవానికి ఎంతో కొంత స్వీయ జ్ఞానం ఉండి ఉండాలి అనిపిస్తుంది. కానీ అరిస్టాటిల్ ప్రతిపాదించినంత స్పష్టంగా వారు ప్రతిపాదించినట్టు కనబడదు.

అయితే ఒక తేడా ఉంది. ఆ దైవం లేదా ఈ ప్రపంచంతో ఈ విశ్వంతో సమానంగా స్టోయిక్కులు గుర్తిస్తున్న ఆ దైవానికి ఒక మూర్తిమత్వం ఉందా, అంటే, ఆ దైవానికి తాను దైవం అని తెలుసా? తొలి స్టోయిక్కుల రచనలు మనకి లభ్యమవుతున్న ఆ కొద్దిపాటి శకలాల నుంచి మనం స్పష్టంగా ఏ సమాధానాన్ని రాబట్టలేము. కాకపోతే వారు ఆ దైవానికి ఆపాదిస్తున్న ప్రజ్ఞ, నైతిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే ఆ దైవానికి ఎంతో కొంత స్వీయ జ్ఞానం ఉండి ఉండాలి అనిపిస్తుంది. కానీ అరిస్టాటిల్ ప్రతిపాదించినంత స్పష్టంగా వారు ప్రతిపాదించినట్టు కనబడదు.

స్టోయిక్కు దర్శనం గ్రీకుల నుండి రోమన్లకు అందిన తర్వాత ఆ దైవానికి మరింత స్పష్టంగా రూపురేఖలు ఏర్పడ్డాయని మనం భావించవచ్చు. ఇది సెనెకా లో పూర్తి స్పష్టతను సంతరించుకుంది. సెనెకా తనను స్టోయికుల వారసుడిగా చెప్పుకున్నప్పటికీ అతనిలో అరిస్టాటిల్, ప్లేటో, ఎపిక్యూరస్ అందరూ కనిపిస్తారు. ప్రపంచానికి సంబంధించినంతవరకు అతడు ఒక ఎపిక్యూరియన్. భగవంతునికి సంబంధించిన వరకు అతడు ఒక ప్లేటానిస్టు. గ్రీకు తత్వవేత్తలు ఎలా అయితే గ్రీకు పురాణాల్లోని దేవతలను పక్కకు నెట్టడానికి ప్రయత్నించారో, అలాగే, సెనెకా కూడా తన కాలం నాటి రోమన్ దేవతా సముదాయాన్ని పక్కన పెట్టాడు. అలాగని వారిని నిరాకరించలేదు. వారిని కేవలం దేవతలు అనే ఒక బహువచనంతో గుర్తించి ఒక నమస్కారం తో పక్కన పెట్టేసాడు. కానీ దైవం అనే ఏకవచనంతో సంకేతిస్తున్నప్పుడు, ఆ దైవం అత్యంత శక్తిమంతుడు, ప్రజ్ఞావంతుడు, నైతికంగా అత్యున్నతుడు అని మనకి వివరిస్తాడు. 41వ ఉత్తరంలో, మనలో ఉన్న దైవం గురించి, ఆయన మాట్లాడుతున్న మాటలు అర్థం చేసుకోవడానికి ఈ నేపథ్యమంతా అవసరమవుతుంది. ఈ మాటలు వినండి:

ఒక ఆత్మ తక్కిన ఆత్మల కన్నా ఉన్నతంగా ఎదిగినప్పుడు, ఆ అంతరాత్మ తనని తాను నిరంతరం అదుపులో పెట్టుకుంటున్నప్పుడు, తన ప్రతి ఒక్క అనుభవాన్ని అదేమంత పెద్ద అనుభవంగా భావించకుండా స్వీకరించగలుగుతున్నప్పుడు, అది మన భయాలను ప్రార్థనలను చిరునవ్వుతో పరికిస్తున్నప్పుడు, అది ఒక స్వర్గ శక్తితో కనిపిస్తుంది. స్వర్గం తాలూకు మద్దతు లేకుండా ఏ ఒక్క మనిషి కూడా అటువంటి స్థిరత్వాన్ని కనపరచలేడు కాబట్టి అటువంటి మనిషిలో కనిపిస్తున్న శక్తిలో అత్యధిక భాగం తాను ఎక్కడి నుంచి ప్రభవిస్తున్నదో ఆ స్థానానికి అంటిపెట్టుకొని ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఉదాహరణకి సూర్యకిరణాలు భూమిని తాకుతున్నప్పటికీ, అవి ఆ సూర్యుని అత్యంత ప్రకాశమాన ప్రారంభ స్థానాన్ని అంటిపెట్టుకునే ఉన్నట్లుగా, మనలోని దైవ శక్తి గురించి కూడా మనం భావించవచ్చు. ఆ దైవ శక్తి గురించి మనం తెలుసుకోవటానికి అది కొంత భాగం మనలో అవతరించినప్పటికీ అది ఇంకా తన ఉత్పన్న స్థానాన్ని అంటిపెట్టుకునే ఉంటుందని మనం గమనించవచ్చు

ఇంకా ఇలా అంటున్నాడు

మరి అటువంటి మనిషి ఆత్మ ఎటువంటిదై ఉంటుంది? అది తన ప్రకాశానికి బయట వస్తువుల మీద ఆధారపడేది కాదు. కేవలం తనలో తాను తన మీద తాను ఆధారపడి ఉండే ఒక స్వయం ప్రకాశక అస్తిత్వం. నిజానికి బయటనుంచి వచ్చే గుణగణాలకి ఒక మనిషిని ప్రశంసించడం కన్నా మూర్ఖత్వం ఏముంటుంది? ఈ క్షణంలో కనబడి మరుక్షణం లో కనుమరుగైపోయే గుణగణాలకు మనం ఉబ్బితబ్బిపోవడం వెర్రితనం కాదా? బంగారు గిట్టలు తొడిగినంత మాత్రాన ఒక గుర్రం మంచి గుర్రం అవుతుందా? జూలు మెరుగు పెట్టినంత మాత్రాన ఒక సింహం గొప్పదవుతుందా? మనం దాన్ని ఎంతైనా అలంకరించవచ్చు గాక అడవి నుంచి వచ్చిన ఒక సింహం ముందు అది నిలబడుతుందా?

ఈ విశ్వాన్ని నడుపుతున్నటువంటి ఒక అంతర్గత శక్తినీ మానవుడిలో ఉన్నటువంటి ఆలోచనాశక్తినీ ఈ రెండింటిని కూడా సెనెకా దైవంగా అభివర్ణిస్తున్నాడు. అదే సమయంలో ఈ ప్రపంచం మానవ దేహం ఈ రెండూ కూడా ఆ శక్తి నుండి వేరు కాదని కూడా ప్రతిపాదిస్తున్నాడు. ప్లేటో చెబుతున్నట్లుగా సెనెకా దృష్టిలో ఈ ప్రపంచం అపరిపూర్ణణం కాదు. మనం భావించగల అత్యున్నత భావన, అరిస్టాటిల్ చెప్పినట్లుగా, మనం దర్శించగల అత్యున్నత ఆకృతి ఈ రెండూ కూడా ఈ ప్రపంచమే. అయితే ఆ ప్రపంచంలో నీకన్నా వేరే అని భావించినా, అది నీలో లేదు బయట ఉందని భావించినా, అది పొరపాటు అని సెనెకా ఉద్దేశం.

దైవం గురించి సెనకా తన ఉత్తరాల్లో రాస్తూ వచ్చిన మాటల్ని బట్టి ఆ దైవం అంతదాకా గ్రీకు తత్వవేత్తలు కవులు మాట్లాడుతూ వచ్చిన దైవం కన్నా మరింత ఉన్నతమైన పరిణతి చెందిన దైవమని మనం గమనిస్తాము.


స్టోయిక్కులు ఈ ప్రపంచాన్ని నడుపుతున్నది ఒక ఆలోచన శక్తి లేదా వివేచనాశక్తి అంటున్నప్పుడు అది యథార్థానికి ఒక కాస్మిక్ ప్రిన్సిపుల్ అని అనుకోవాలి. వారు మాట్లాడుతున్న ప్రకృతి సాంఖ్యుల ప్రకృతితో సమానమే. అయితే ఆ ప్రకృతి, ప్రకృతి-పురుష సమాహారం. సెనెకా పదేపదే చెప్పేది ఏమిటంటే ఈ ప్రపంచాన్ని నడుపుతున్న కాస్మిక్ ప్రిన్సిపుల్ ఈ ప్రపంచానికి అతీతం కాదు. అంటే స్థితి దశలో అది ప్రపంచం. గతిదశలో అది ప్రాకృతిక సూత్రం. స్థితి దశలో ప్రకృతి. గతి దశలో సాంఖ్యుల పురుషుడు అనవచ్చు. ఆ ఆలోచనని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తాడంటే, ప్రపంచాన్ని నడుపుతున్న కాస్మిక్ ప్రిన్సిపుల్, మనిషిని నడుపుతున్న వివేచన ఒకటే అని అంటాడు. దీన్ని దాదాపుగా ఉపనిషత్తుల ‘తత్త్వమసి’ అనవచ్చు. ఒకసారి ఆ మెలకువ కలిగిన తర్వాత మనిషి చేయవలసిన పని ఆ విశ్వ సూత్రంతో తన వ్యక్తిగత జీవితాన్ని అనుసంధానించుకోవటం. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ఉల్లంఘించకపోవడం. దారి తప్పకపోవడం.

అయితే ఒక వ్యక్తికి ఆ కాస్మిక్ ప్రిన్సిపల్ గురించిన జ్ఞానం ఎలా ఉందో అలాగే ఆ కాస్మిక్ ప్రిన్సిపల్ కి కూడా తన గురించిన జ్ఞానం ఉంది అని చెప్పటం సెనెకా వేసిన ముందడుగు. అంతదాకా ఈ విశ్వాన్ని నడుపుతున్న సూత్రానికి ఒక వ్యక్తిత్వం ఉందని, ఒక మూర్తిమత్వం ఉందని ఎవరు స్పష్టంగా చెప్పలేదు. ఆ రకమైన దైవ దర్శనం మొదటిసారిగా విస్పష్టంగా చేసింది సెనెకా అనే చెప్పాలి. ఆ తర్వాత మరొక రెండు శతాబ్దాల తర్వాత ప్లాటినెస్ దాన్ని మరింత విస్తరించాడు. ఒకసారి రోమన్ ప్రజా మానసాన్ని ఈ విధంగా ఒక దైవానికి అనుగుణంగా సంసిద్ధం చేసిన తర్వాత తొలి క్రైస్తవులు రోమ్ లో పాదుకోవడానికి ఇక ఎటువంటి అడ్డంకి లేకపోయింది. అందుకని సెనెకాని ఈరోజు చదువుతుంటే ఒక క్రైస్తవ బోధకుడిని చదివినట్లు ఉంటుందని ఒక వ్యాఖ్యాత రాసిన మాటల్లో అతిశయోక్తి లేదు.

అయితే దైవమూ, దేవతలూ ప్రాచీన గ్రీసులో కూడా ఉన్నారు కదా. వాళ్లని ధిక్కరిస్తూనే కదా తొలి తత్వవేత్తలు తలెత్తారు, మరి సెనెకా తిరిగి ఒక దైవం గురించి మాట్లాడుతున్నప్పుడు వారి కన్నా ఏ విధంగా ప్రత్యేకం అనే ప్రశ్న సహజంగానే కలుగుతుంది. ఇక్కడ మనం గమనించవలసింది ప్రాచీన గ్రీకుమతం బహుదేవతారాధకం. ఆ దేవతలు పౌరాణిక దేవతలుగా మారిపోయి నైవేద్యాల్ని బలులని కోరుతూ మానవుల హేతు వివేచన కాక మూఢనమ్మకాన్ని మాత్రమే ప్రోత్సహిస్తూ ఉండేవారు. అటువంటి అంధవిశ్వాసాల స్థానంలో ఒక వివేచనాశీలమైన విశ్వ ఆలోచన సూత్రాన్ని తత్వవేత్తలు ముందుకు తీసుకువచ్చారు. సెనెకా చేసింది ఏమిటంటే ఆ సూత్రాన్ని దాదాపుగా ఏకేశ్వర సమానం చేశాడు. అయితే ఈ ఏకేశ్వరుడు నైవేద్యాల్ని, బలుల్ని కోరుకునే ఈశ్వరుడు కాదు. ఇతను కోరుకునేది విశ్వాన్నీ, మనిషినీ కూడా నడిపే ఒకే ఒక్క సూత్రానికి కట్టుబడి ఉండడం. ఎట్టి పరిస్థితుల్లోనూ మనిషి ఆ సూత్రాన్ని ఉల్లంఘించకుండా ఉండడం.

సెనెకా దర్శించిన ఏకేశ్వరుడు అత్యంత ప్రజ్ఞావంతుడు, మూర్తిభవించిన నైతికత, సర్వశక్తిమంతుడు మాత్రమే కాక దయామయుడు కూడా. మనల్ని నడిపిస్తున్న ఆ కాస్మిక్ ప్రిన్సిపుల్ కి ఒక ఔదార్యం కూడా ఉందని చెప్పటం సెనెకా విశిష్టత.

25-12-2022

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading