
నలభై ఒకటవ ఉత్తరం
ఇరవై ఏడవ ఉత్తరంలో మనల్ని అంటిపెట్టుకుని ఉండే మంచి గురించి రాస్తే, నలభై ఒకటవ ఉత్తరంలో మనల్ని అంటిపెట్టుకుని ఉండే దైవం గురించి రాస్తున్నాడు. దైవం బయట ఎక్కడో లేడనీ, మనలోనే ఉన్నాడనీ చెప్తూ తన ఉత్తరం ఇలా మొదలుపెడుతున్నాడు:
మనం మన చేతులు ఆకాశం వైపుగా చాచి ప్రార్థించనక్కర్లేదు. దేవాలయంలో పూజారి దగ్గర నిలబడి, గర్భగుడిలో విగ్రహం చెవి దగ్గర మన విన్నపాలు వినిపించమని కోరనక్కర్లేదు. భగవంతుడు నీకు దగ్గరగా ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. నేను చెప్తున్నదేమింటంటే, లుసిలియస్, ఒక దివ్యశక్తి మనలోనే నివసిస్తున్నది, మన మంచిచెడులు రెంటినీ గమనిస్తున్నది. ఆ శక్తి మనని కాచి సంరక్షిస్తున్నది. మనం ఆ శక్తిని ఏ విధంగా చూసుకుంటామో, అది కూడా మనల్ని ఆ తీరుగానే చూస్తున్నది. నిజానికి ఆ దైవం సహకారం లేకుండా ఏ మనిషీ మంచిగా జీవించలేడు.భగవంతుడి ఆసరా లేకుండా ఏ మనిషైనా విధిని దాటి మనగలడా? మనకి ఉదాత్తమైన, సత్యసమ్మతమైన దారి చూపించేది అతడే. ప్రతి ఒక్క మంచిమనిషిలోనూ ‘ఒక దైవం నివసిస్తున్నాడు, అయితే ఆ దైవం ఎవరో మనకు తెలియదు, అంతే.’
ఈ మాటలు సాధారణంగా దైవం గురించి మాట్లాడేవారందరూ మాట్లాడే మాటల్లానే వినిపిస్తూండవచ్చు. కాని, ఈ మాటలు రెండువేల ఏళ్ళ కిందటి గ్రీకు-రోమన్ ప్రపంచ నేపథ్యంలో మట్లాడినవి అని మనం గుర్తుపెట్టుకుంటే, వీటి విశిష్టత బోధపడుతుంది. ఈ సందర్భంగా గ్రీకు తాత్త్విక చింతనలో దైవం గురించిన ఆలోచన ఏ విధంగా పరిణమించిందో ఒకసారి చూద్దాం.
ప్రాచీన గ్రీసులో హోమర్, హెసియోద్ వంటి కవులు ఒక పౌరాణిక ప్రపంచం గురించి కవిత్వం చెప్పినప్పుడు, అందులో దేవుళ్ళ గురించి చెప్పిన విషయాల పట్ల ధిక్కారంగా తత్త్వశాస్త్రం పుట్టుకొచ్చింది. ఆ దేవుళ్ళు, మన పురాణాల్లోలానే, మనుషుల్లాగే, అనైతికంగానూ, విచ్చలవిడిగానూ, తీవ్రరాగద్వేషాలతో ప్రవర్తించడం పట్ల తలెత్తిన అసహనం తత్త్వశాస్త్రానికి పునాది. ప్రాచీన ప్రపంచంలో కర్మకాండ ద్వారా, బలుల ద్వారా, నైవేద్యాల ద్వారా ఆ దేవుళ్ళని తృప్తి పరచాలని చూసే మతం పట్ల కలిగిన అసంతృప్తి తొలి గ్రీకు తత్త్వవేత్తల్ని సృష్టించింది. ఈ ప్రపంచ ఆవిర్భావం గురించీ, ఈ విశ్వంలో మనిషి స్థానం గురించీ, మనిషి నిర్వహించవలసిన పాత్ర గురించీ, mytho-logical గా కాక, logical గా ఆలోచించే ఒక ధోరణి మొదలయ్యింది. అది దాదాపుగా దేవుడితో సంబంధం లేని ఆలోచన అని చెప్పవచ్చు.
ఈ ప్రపంచంతా దేవతలనే అభౌతిక శక్తులవల్ల కాక, నీళ్ళు లేదా గాలి లాంటి ఒకే ఒక్క పదార్థంతో సృష్టించబడిందని తొలి తత్త్వవేత్తలు థేల్సు మొదలైనవాళ్ళు భావించారు. ఆ మూల పదార్థానికి సంకోచించగలిగే శక్తీ, వ్యాకోచించగలిగే శక్తీ ఉన్నాయని వారు భావించారు. అనక్జిమాండర్ అనే తత్త్వవేత్త, ఆ రెండు లక్షణాలకూ అదనంగా అనంతత్త్వం అనే మూడవ లక్షణాన్ని జోడించాడు. అంటే ఆ ప్రథమ, మూల పదార్థానికి అనంతంగా ముడుచుపోగల, విస్తరించగల శక్తి ఉందన్నమాట. దాన్ని అతడు దైవం అని పిలిచాడు. దాంతో మొదటిసారిగా మతంతో సంబంధం లేని ఒక ఆలోచనా ధోరణకి పెద్దపీట లభించింది. అనంతంగా సంకోచించే, వ్యాకోచించే ఈ లక్షణాన్ని హెరాక్లిటస్ ఒక నిరంతర స్రవంతిగా, ఒక flux గా భావించాడు. ఆ మూలపదార్థం సదా ప్రవహిస్తూ ఉంటుందనీ, అదే ప్రవాహంలో నువ్వు రెండు సార్లు కాళ్ళు పెట్టలేవనీ కూడా అన్నాడు. అది ఒక అగ్నిశ్వాసలాంటిది అని కూడా అన్నాడు. పార్మెనేడిస్ అనే మరొక ఆలోచనాపరుడు దీనికి విరుద్ధంగా, ఆ మౌలిక పదార్థం మార్పులేనిదనీ, ప్రతి ఒక్క వస్తువులోనూ, అవినాశి, మార్పుచెందనిదీ అయిన ఒక మూలపదార్థం ఉంటుందని అన్నాడు.
ఆ తర్వాత హెరాక్లిటస్, పార్మనెడిస్ అనుయాయులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒకరు ఈ ప్రపంచంలో కనవచ్చే వైవిధ్యానికీ, ఇంద్రియాల ద్వారా మనం గ్రహిస్తున్న అనేకత్వానికి కారణంగా కార్యకలాపాన్ని భావిస్తే, మరొకరు, ఈ భౌతిక ప్రపంచం వెనక ఒక ఏకత్వమూ, శాశ్వతత్వమూ ఉన్నాయని వాదించేరు. ఎంపిడొకిల్స్ అనే మరొక తత్త్వవేత్త, ఈ వైరుధ్యాన్ని సమన్వయించే ప్రయత్నంలో, మూలభౌతిక శక్తులు- నిప్పు, గాలి, నీళ్ళు, నేల- ఆకర్షణ, వికర్షణలనే రెండు శక్తుల్ని బట్టి పనిచేస్తాయన్నాడు, మరొకవైపు అనగ్జగోరస్ అనే మరో తత్త్వవేత్త కూడా ఈ వివాదాన్ని పరిష్కరించే ఉద్దేశంతో, ఈ ప్రపంచమంతా అనేక భౌతిక అణువుల సముదాయంతో నిండి ఉందని చెప్తూ ఆ జడప్రాయమైన అణుసముదాయాన్ని ‘మనస్సు’ అని వ్యవహరించాడు. దాంతో హెరాక్లిటస్, పార్మనెడిస్ ప్రతిపాదనల్లోని ద్వంద్వం పరిష్కరించబడకపోగా, మరొక కొత్త ద్వంద్వం- జడప్రాయమైన పదార్థం ఒకవైపూ, ఆకర్ష, వికర్ష శీలం కలిగిన శక్తి మరొకవైపూ- పుట్టుకొచ్చింది. ఒకసారి ఈ విషయం అర్థం కాగానే, మళ్ళా తొలిద్వంద్వం కొత్త పరిభాషలో చర్చల్లోకి వచ్చింది. దానిలో ఒకవైపు అణువాదులు ఉన్నారు. వాళ్ళు ఈ ప్రపంచమంతా ఏకరూపత కలిగిన అణుసముదాయం అని చెప్తే, మరొకరు, ఈ ప్రపంచ ఆవిర్భావం వెనక ఒకే ఒక్క అభౌతిక సూత్రం ఉందనీ, అది సంఖ్య అనీ అన్నారు. ఈ సాంఖ్యానికి ఆద్యుడు పైథాగొరస్.
అణువాదులు, సాంఖ్యులూ ప్రతిపాదిస్తున్న ఈ రెండు రకాల దర్శనాల వల్ల మొదటిసారిగా గ్రీకు చింతనలో భౌతిక-అభౌతిక ద్వంద్వం మొదలయ్యింది. తొలి తాత్త్వికులు ఈ ప్రపంచం వెనక ఒక మూల శక్తి ఉందన్నప్పుడు, అది అభౌతికమా, భౌతికమా అని ప్రశ్నించలేదు. వాళ్ళందరూ అది భౌతికమనే భావించారు. హెరాక్లిటస్ మాట్లాడిన అగ్నిశ్వాస, పార్మనేడిస్ మాట్లాడిన మూల శక్తి, అనగ్జగొరస్ మాట్లాడిన ‘మనస్సు’ అన్నీ కూడా ప్రాథమికంగా భౌతికమే. మొదటిసారిగా పైథాగొరస్ పదార్థం వెనక ఒక మూలభావన ఉందని చెప్పినప్పుడు, అణువాదులు అందుకు విరుద్ధంగా, మూలసత్యం అణుసముదాయంతో కూడిన పదార్థం అని వాదించారు. కాని గమనించ వలసిందేమంటే, వారందరూ కూడా ఒకలాంటి అద్వైతులే. అంటే మూల పదార్థం ఏది అన్న విషయంలో భేదాభిప్రాయం ఉందిగాని, అది ఒక్కటే అనడంలో మాత్రం వారి మధ్య తేడా లేదు. ఒకరు భౌతికవాద అద్వైతులు, మరొకరు అభౌతిక వాద అద్వైతులు. అంతే తేడా. తొలి గ్రీకు తత్త్వవేత్తలు కూడా అద్వైతులేగాని వాళ్ళని మనం సర్వాస్తిత్వ అద్వైతులు అనవచ్చు. అంటే వాళ్ళు చూసిన మూలపదార్థానికి ఒక ప్రత్యేక వ్యక్తిత్వం లేదు. ఈ సమస్త అస్తిత్వం ఒకే ఒక ప్రథమ వ్యక్తి నుంచి పుట్టిందని వాళ్ళెవ్వరూ భావించలేదు. గ్రీకు మతం మీదా, కర్మకాండ మీదా ధిక్కారంగా వచ్చినందువల్ల, తొలి గ్రీకు తత్త్వతత్త్వవేత్తలు, తాము దర్శిస్తున్న ఆ మూల సత్యానికి ఎటువంటి మూర్తిమత్వాన్నీ ఆపాదించడానికి ఇస్టపడలేదు.
కాని ఆశ్చర్యంగా, ఏ దైవాన్ని అయితే తొలి గ్రీకు తత్త్వవేత్తలు తమ చింతననుంచి పరిహరించారో, ఆ దైవం, పాశ్చాత్య తత్త్వశాస్త్ర చరిత్రలో తిరిగి తిరిగి ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. శాశ్వతమూ, మార్పులేనిదీ అయిన ఆ మూలసత్యం గురించి మాట్లాడుతూ జీనోఫేన్స్ దానికి అత్యున్నత ప్రజ్ఞ, సంకల్పశక్తి, నైతికతా ఉన్నాయని ప్రతిపాదించాడు. సోక్రటీసు కూడా అదే దారిలో, ఆ మూలసత్యానికి ప్రజ్ఞ, నైతికతా ఉన్నాయని భావిస్తూ, దాన్ని providence అన్నాడు.
కాని ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంది. ఒక మూలసత్యం ఉందనీ, దానికి ఒక సంకల్పశక్తి, క్రియాశక్తీ, జ్ఞానశక్తీ ఉన్నాయని భావించడం వేరు, తనకి అటువంటి లక్షణాలున్నాయని ఆ శక్తికి తెలుసు అనుకోవడం వేరు. ఉదాహరణకి మొక్కలకి కూడా ఏదో ఒక రూపంలో ప్రజ్ఞ ఉంటుంది. వాటి వికాసం కూడా ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారమే నడుస్తుంది. కాని వాటికి తమ వికాసం గురించిన స్వీయ జ్ఞానం లేదు. తొలి తత్త్వవేత్తలు మాట్లాడుతున్న మూలపదార్థానికి అటువంటి స్వీయజ్ఞానం లేదు.
ప్లేటో దగ్గరికి వచ్చేటప్పటికి, అతడు ఈ ప్రపంచం భావనల మీద ఆధారపడి ఉంటుందని చెప్తూ, ఆ భావనలన్నింటి లోనూ అత్యున్నత, చరమ భావనని దైవం అని పిలిచాడు. కాని ఆ చరమభావనా, కంటికి కనిపిస్తున్న ఈ ప్రపంచమూ ఒకటే అని చెప్పలేదు. దానివల్ల, పదార్థానికీ, భావనకీ మధ్య కొత్త వైరుధ్యం తలెత్తింది. ఒకవైపు పరిపూర్ణ చరమభావన, మరొకవైపు అపరిపూర్ణ భౌతిక ప్రపంచం-ఇలా సత్యం రెండుగా విడిపోయింది. అంతేకాదు, ఆ పరిపూర్ణ భావన, ఆ దైవం, ఈ అపరిపూర్ణ ప్రపంచంలో ఉంటున్నప్పటికీ, పూర్తిగా దీనితో తాదాత్మ్యం చెందకుండా, విడిగా కూడా ఉండవలసి వచ్చింది. అయితే, అప్పుడు కూడా, ఆ పరిపూర్ణ భావనకి స్వీయ జ్ఞానం ఉందని ప్లేటో ఎక్కడా అనలేదు. నిజానికి అతడు ఆ ప్రశ్న వేసుకోనే లేదు.
అరిస్టాటిల్ ప్లేటో చింతనని మార్చినప్పుడు, ప్లేటో మాట్లాడుతున్న పరిపూర్ణ భావన స్థానంలో పరిపూర్ణ ఆకృతిని తీసుకొచ్చాడు. అయితే, ఆ పరిపూర్ణ ఆకృతిని అతడు thought of the thought, thought thinking itself అంటున్నప్పుడు, దానికి ఒక స్వీయజ్ఞానం లాంటిదేదో ఉందని ఊహించాడు అనుకోవచ్చు. ఆ విధంగా, గ్రీకు తత్త్వవేత్తల్లో, దైవానికి, ఒక మూర్తిమత్వం సంతరించడం అరిస్టాటిల్ తో మొదలయ్యిందని చెప్పవచ్చు.
కాని అరిస్టాటిల్ అనుయాయులు పరిపూర్ణ ఆకృతి అనే భావనని అంత సులభంగా ఒప్పుకోలేకపోయారు. అరిస్టాటిల్ చింతనతాలూకు బలమైన ఖండన ఎపిక్యూరస్ లో కనిపిస్తుంది. అతడు పూర్వకాలపు అణువాదుల్లాగా, ఈ ప్రపంచం అనేక అణువుల తాలూకు యాదృచ్ఛికమైన కలయిక వల్ల మాత్రమే తలెత్తి నడుస్తోందనీ, దీని వెనక ఎటువంటి అభౌతిక శక్తీ లేదనీ వాదించాడు. కాబట్టి ఎపిక్యూరస్ ఆలోచన పూర్తిగా నిరీశ్వరం.
తొలి స్టోయిక్కులు, జెనో, క్లియాంథస్, క్రైసిప్పస్ లు తిరిగి తొలితత్త్వవేత్తల పంథాలో, ఈ ప్రపంచ మూల సూత్రం ఒకటేనని భావిస్తూ, ప్లేటో లోని ద్వైతాన్ని నిరాకరించారు. ప్రపంచ సారాంశం పాదార్థికం మాత్రమే అని వాదించారు. అరిస్టాటిల్ కూడా మూల కారణం పదార్థం అన్నాడుకాని, ఆకృతిలేని పదార్థమూ, ఒక అభౌతికమైన ఆకృతీ అంటో తిరిగి రెండు భావనలు తీసుకొచ్చాడు. స్టోయిక్కులు ఆ ద్వైతాన్ని నిరాకరిస్తూ, ఆ రెండు లక్షణాలూ కూడా పదార్థానివే అని వాదించారు. అంటే పదార్థం ఏకకాలంలో జడమూ, క్రియాశీలమూ కూడా. మొదటి లక్షణం వల్ల అది శాశ్వతం, రెండో లక్షణం వల్ల చలనశీలం. ఇక్కడ స్టోయిక్కుల చింతన భారతీయుల తొలిసాంఖ్యానికి దగ్గరగా కనిపిస్తుంది.
స్టోయిక్కుల దగ్గరికి వచ్చేటప్పటికి పార్మనెడిస్, హెరాక్లిటస్ ల ఆలోచనలు సమన్వయించబడ్డాయి అనుకోవచ్చు. అంటే మూలసత్యం భౌతికమే, కాని అది క్రియాశీలం. ప్రపంచం అణువుల కలయిక వల్ల సంభవించింది, అయితే, ఎపిక్యూరియన్లు భావించినట్టుగా, ప్రపంచ గతి యాదృచ్ఛికం కాదు, దాని వెనక విశ్వాన్ని నడిపిస్తున్న ఒక హేతుబద్ధత ఉంది. ఇంకా చెప్పాలంటే, ఈ పాదార్థిక విశ్వం దానికదే ఒక సజీవ అస్తిత్వం, దానికి దానిదంటూ ఒక ప్రజ్ఞ ఉంది, సంకల్పం ఉంది, ఒక నైతిక ప్రయోజనం ఉంది. కాబట్టి స్టోయిక్కులు, ఈ పాదార్థిక, భౌతిక ప్రపంచంలో ఉంటూనే దీనికి అతీతంగా ఉండే ప్రజ్ఞ అంటో మరొకటి ఉంటుందని నమ్మలేదు. వారి దృష్టిలో, ఈ ప్రపంచమే దైవం.
24-12-2022
విశ్వమే విష్ణువు.. విష్ణువే విశ్వం🙏
🕉:- One in Many… Many in One 🙏