సెనెకా ఉత్తరాలు-8

Reading Time: 5 minutes

ఇరవై ఏడవ ఉత్తరం

మన ఆలోచనలకీ, చేతలకీ, మనం కోరుకుంటున్న ఆదర్శాలకీ, మన వాస్తవ ప్రవర్తనకీ మధ్య అంతరం ఉందన్న సంగతి మనకు తెలుసు. మనం మన గురించిన ఒక మంచి అభిప్రాయం ఏర్పరచుకుంటాం. కాని రోజూ జీవితంలో ఎదురయ్యే ఎన్నో సందర్భాల్లో మనం మన గురించి ఊహించుకున్నట్టుగా కాక భిన్నంగా ప్రవర్తిస్తాం. అలా ప్రవర్తించడం చూసి ముందు మనం ఆశ్చర్యపోతాం. అరె, ఇది నేనేనా? ఇలా ఉండకూడదనుకున్నాను కదా, కాని ఇదేమిటి, ఇలా ప్రవర్తించాను అనుకుంటాం.

ఆదర్శానికీ, వాస్తవానికీ మధ్య ఈ తేడా పెట్టుకుని మనం నైతిక జీవితం గురించి ఆలోచించడంలో, మాట్లాడటంలో ఏమైనా అర్థముందా? అది ఆత్మవంచన కాదా? మనకై మనం నిష్కళంకంగానూ, నిక్కంగానూ ఉండకుండా మరొకరికి పరిశుద్ధ జీవితం గురించి ఎలా సలహాలూ, సూచనలూ ఇవ్వగలం? అలాగని మానసికంగా ఉన్నతమైన జీవితం గురించిన మన ఆలోచనలు కూడా అసత్యం కాదే. మనల్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న కోరిక కూడా పై పై కోరిక కాదే!

సరిగ్గా ఈ అంశాన్నే సెనెకా ఇరవై ఏడవ ఉత్తరంలో చర్చిస్తున్నాడు. ఆ ఉత్తరం మొదలుపెడుతూనే ఇలా అంటున్నాడు:

‘ఇదేమిటిది? నువ్వు నాకు సలహాలు ఇస్తున్నావు’ అని అడగొచ్చు నువ్వు. ‘అసలు ముందు నీకు నువ్వు సలహాలు ఇచ్చుకున్నావా? నీ తప్పులు నువ్వు సరిదిద్దుకున్నావా? ఇందుకేనా తక్కినవాళ్ళని సరిదిద్దేంత తీరిక దొరికింది నీకు? ‘అని నన్ను నిలదియ్యవచ్చు. లేదు, నాకై నేను జబ్బుపడి, మరొకరి అస్వస్థతని చక్కదిద్దేంత సిగ్గులేని వాణ్ణి కాను నేను. అయితే, నేను మన ఇద్దరికీ సంబంధించిన చికాకుల్నీ, సమస్యల్నీ నీతో కలిసి చర్చిస్తున్నాను, వీటికి పరిష్కారాన్ని నీతో పంచుకుంటున్నాను. ఇదెట్లాంటిదంటే మనమిద్దరం కలిసి, ఒకే ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు అన్నమాట. కాబట్టి నేను నాతోనే మాట్లాడుకుంటున్నాను అన్నట్టుగా నా మాటలు విను. నేను నిన్ను సాకుగా పెట్టుకుని నాతోనే మాట్లాడుకుంటున్నాను అనుకో.

మనలో లోపాలు, వైఫల్యాలు, జారిపోవడాలు ఉంటున్నప్పటికీ, మనం శీలవంతమైన జీవితం గురించీ, నైతికసమగ్రత గురించీ ఎందుకు మాట్లాడుకుంటూ ఉంటామంటే, నిజానికి అది మనల్ని మనం హెచ్చరించుకుంటూ ఉండటానికి. పడిపోతున్న మనల్ని మనమే చేతులు జాపి పైకి లాక్కుంటూ ఉండటానికి. ఈ ప్రయత్నంలో మనం నూటికి నూరుశాతం సఫలం అయినా కాకపోయినా, కనీసం ఎప్పటికప్పుడు పైకి లేవడానికీ, పైకి చూడటానికీ ప్రయత్నిస్తూ ఉంటామని అర్థం. ఇదే లేకపోతే, మనల్ని మనం సమర్థించుకుంటూ, మన ప్రలోభాలకి ఇంధనం సమకూర్చుకుంటూ మరింత దిగజారిపోతాం.

సెనెకా ఇంకా ఇలా అంటున్నాడు:

నాతో నేనిట్లా బిగ్గరగా విలపిస్తుంటాను: నీ ఏళ్ళు లెక్కపెట్టుకో. నీ కుర్రతనంలో నువ్వు వేటివెంట పడ్డావో, దేనికి అర్రులుజాచావో, వాటికోసమే ఇంకా ఆరాటపడుతున్నందుకు నువ్వు సిగ్గుపడాలి. మృత్యువు నీ తలుపు తట్టేనాటికి, ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో: నువ్వు మరణించడానికి ముందే నీ లోపాలు మరణించి తీరాలి. అస్తవ్యస్తమైన ఆ సుఖాలకి స్వస్తి చెప్పు. వాటికి నువ్విప్పటికే ఎంతో మూల్యం చెల్లించావు. రానున్న రోజుల్లో రాబోయేవి మాత్రమే కాదు, ఇంతదాకా వచ్చి వెళ్ళిపోయినవి కూడా నీకు హాని కలిగించేవే. నేరాల్లాగే. వాటిని మనం చేసినప్పుడు, ఎవరూ మనల్ని పట్టుకోకపోయినా, ఆందోళన మాత్రం అక్కడే ఆగిపోదు. ఆ సుఖాలు గడిచిపోయినా చింత మాత్రం వదిలిపెట్టదు. ఆ సుఖాలు నిలిచేవికావు, నమ్మదగ్గవి కావు, అవి మనకి హానిచేసినా, చెయ్యకపోయినా, అవి అస్థిరాలు. కాబట్టి నిన్ను అంటిపెట్టుకునే ఉండే మంచి ఏముందో దానికోసం వెతుకులాడు. ఆత్మ తనలో తాను దేన్ని పట్టుకోగలుగుతుందో, అది తప్ప మరేదీ మనల్ని అంటిపెట్టుకునేది కాదు. మధ్యలో ఒకటీ అరా ఆటంకాలు ఎదురైనా, సద్గుణం, సత్ప్రవర్తన ఒక్కటే మనకి శాశ్వతమైన, శాంతిప్రదమైన సంతోషాన్ని ఇవ్వగలిగేవి. అది సూర్యుడిమీద పాకే మబ్బులాగా కొద్దిసేపు కప్పి ఉంచగలదేమోగాని శాశ్వతంగా అడ్డగించలేదు.

మనల్ని అంటిపెట్టుకునే మంచి- ఇదీ ఈ ఉత్తరం సారాంశం. మనకి సంతోషం రకరకాలుగా కలుగుతుంది. కాని ఏ సుఖం సుఖానంతర చింతగ మారదో, ఏది ఎల్లవేళలా మనకి శాంతినిచ్చే సంతోషంగా ఉంటుందో, దాన్నే అతడు మనల్ని అంటిపెట్టుకుని ఉండే మంచిగా అభివర్ణిస్తున్నాడు. ఇంకా ఇలా అంటున్నాడు:

అటువంటి సంతోషం అనుభవించడానికి నీ వంతు ఎప్పుడొస్తుంది? నువ్వేమీ సోమరిగా లేవుగానీ, నీ నడక వేగం పెంచాలి. ఇంకా చాలా కష్టపడవలసి ఉంది. నువ్వు అనుకున్నది పొందాలంటే, నువ్వు మేలుకుని ఉండే గంటలు, నీ ప్రయత్నాలు, అన్నీ కూడా దానికోసమే కేటాయించాలి. ఈ పని మరొకరికి అప్పగించేది కాదు.

ఇది చాలా ఆసక్తికరమైన మాట. మన ఉద్యోగ జీవితంలోనూ, ఆ మాటకొస్తే సాహిత్య జీవితంలోనూ కూడా కొన్ని బాధ్యతలు పక్కవాళ్ళకి అప్పగించవచ్చు. నీ తరఫున నీ బాధ్యతలు నిర్వహించడానికి నీ కింది వాళ్ళకి అధికారాలు బదలాయించవచ్చు. కాని శీలవంతమైన నడవడిక అనే బాధ్యతని మరొకరికి బదలాయించలేం. సమ్యక్ చింతన అనే కార్యక్రమాన్ని మరొకరికి అప్పగించి మనం మరొక పని చూసుకోలేం. అది ఎవరికి వారు, స్వయంగా నిర్వహించుకోవలసిన కర్తవ్యం.

ఈ సందర్భంగా సెనెకా ఒక రోమన్ సంపన్నుడి గురించి చెప్తాడు. అతడు చాలా ధనవంతుడు కానీ జ్ఞాపకశక్తి చాలా తక్కువ. పురాణాల్లో పాత్రల్నే కాదు, ఇంట్లో పనిచేసేవాళ్ళ పేర్లు కూడా మర్చిపోతూ ఉండేవాడట. ఐతే, తన ఇంటికి అతిథులు వచ్చినప్పుడు, వారిని అలరించడానికి, పురాణాలనుంచీ కావ్యాలనుంచీ పద్యాలూ, శ్లోకాలూ గుర్తుచేసి అతిథుల్ని రంజింపచేయాలని ఉండేదట. అందుకని ఒక్కొక్క కవిని కంఠతాపట్టడానికి ఒక్కొక్క బానిసని నియమించుకున్నాడట. ఒక్కొక్క బానిసనీ లక్ష సెస్టెర్సెలు వెల పెట్టి కొనుక్కున్నాడట. ఎవరేనా అతిథి ఇంటికి రాగానే, అతడింకా పల్లకీ దిగకముందే ఆ బానిసలు కావ్యగానం మొదలుపెట్టేవారట. ఆ తమాషా చూసి ఒకతను ఆ సంపన్నుడికి ఒక సలహా కూడా ఇచ్చాడట. ఆ కావ్యాల్ని వింటూ అతిథులు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో దొర్లే పదప్రయోగాల్ని వివరించడానికి భాషావేత్తల్ని కూడా కొనుక్కుని నియమించుకొమ్మని. కాని దానికన్నా మించిన ఛలోక్తి మరొకాయన విసిరాడట. ఆ సంపన్నుడు చాలా బక్కగా, అర్భకంగా ఉండేవాడట. ఒకాయన అతణ్ణి కుస్తీపోటీల్లో పాల్గోమని చెప్పాడట. ‘నేను అర్భకుణ్ణి. నేనెట్లా కుస్తీపోటీల్లో పాల్గొనగలుగుతాను’ అని అంటే, ‘దానికేముంది? నీ తరఫున కుస్తీ పట్టడానికి నలుగురు బానిసల్ని నియమించుకోవచ్చు కదా’ అన్నాడట.

ఈ కథ చెప్పి సెనెకా ఇలా అంటున్నాడు:

ఎవరూ కూడా ఆరోగ్యవంతమైన మనస్సుని కొనుక్కోలేరు, కనీసం అప్పుతెచ్చుకోలేరు. నాకేమనిపిస్తుందంటే, ఒకవేళ ఆరోగ్యవంతమైన మనస్సులు అమ్మకానికి ఉన్నా కొనుక్కోడానికి ఎవరూ ముందుకు రారు. పాపిష్టిమనస్సులంటావా, రోజూ వాటిని అమ్ముతూనే ఉన్నారు, కొనుక్కునేవాళ్ళు ఎగబడి కొనుక్కుంటూనే ఉన్నారు.

ముప్పై ఒకటవ ఉత్తరం

హోమర్ రాసిన ఒడెస్సీలో ఒక ఘట్టం ఉంది. ఒడెస్యూస్ స్వదేశానికి తిరిగి వస్తున్నప్పుడు అతడికి మార్గమధ్యంలో ఎదురైన ప్రమాదాల్లో ఒకటి సైరెన్ల సంగీతం. సముద్రం మీద ప్రయాణించే నావికుల్ని శ్రావ్యంగా ఉండే గీతాల్తో ఆకర్షించే సముద్రకన్యలు వాళ్ళు. నావికులు ఆ గీతాలకి ప్రలోభపడగానే వాళ్ళ చుక్కానుల పట్టుతప్పిపోయి వాళ్ళు సముద్రంలో పడిమునిగిపోతారు. అందుకని ఆ ప్రమాదం గురించి ఒడెస్యూస్ ను హెచ్చరించిన సర్సి అతణ్ణి, ఆ సైరన్లను సమీపించేటప్పుడు వాళ్ళ పాట వినబడకుండా చెవుల్లో మైనం పెట్టుకొమ్మని చెప్తుంది.

సెనెకా ఈ ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకుని తన ముప్పై ఒకటవ ఉత్తరం ఇలా మొదలుపెడుతున్నాడు:

నువ్వు జ్ఞానివి కావాలంటే, లుసిలియస్, ఒక్కమాటలో చెప్పాలంటే, నీ చెవులు మూసుకో. వాటిని మైనంతో మూసుకుంటే చాలదు. యులిసెస్ తన నావికులకి వాడినదానికన్నా బలమైన మూతలు కావాలి. అతడు భయపడ్డ గానం ప్రలోభపరిచేదేగాని, అది ప్రతి ఒక్క దిక్కునుంచి వినవచ్చేది కాదు. కాని నువ్వు భయపడవలసిన గానం ప్రపంచంలో ప్రతి ఒక్క మూలనుంచీ వినబడేదే. నువ్వు దాటిపోవలసింది, నిన్ను ప్రలోభపరుస్తుందేమో అనుకునే ఏ ఒక్క ప్రాంతాన్నో కాదు, ప్రతి ఒక్క నగరాన్నీ దాటిపోవలసిందే. అన్నిటికన్నా ముఖ్యం నువ్వు అందరికన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తావో, వాళ్ళ పట్ల మరింత చెవిటిగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశాలు మంచివే అయి ఉండవచ్చుగాని, వాళ్ళు నీకోసం కోరుకునేది చెడ్డవాటినే. నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటే, వాళ్ళ కోరికలు ఎంత మాత్రం ఫలించకూడదని దేవుళ్ళకు మొక్కుకో.

ఈ మాటల్లో ఉన్నది వినగానే మనల్ని సమ్మోహపరిచే వాగ్ధాటి మాత్రమే కాదు, ఎంతో ఆచరణాత్మకమైన వివేకం కూడా. ఒడెస్యూస్ కథ ఒక్కటీ మా నాన్నగారికి తెలియదు గాని, ఆయన కూడా నా చిన్నప్పుడూ, నా యవ్వనకాలంలోనూ నాకివే మాటలు ఇంత తీవ్ర హృదయంతోనూ చెప్పేవాడు. ఇంకా వినండి:

వాళ్ళు నీమీద ముంచెత్తాలని చూస్తున్నవి నిజంగా మంచి విషయాలు కావు. సంతోషప్రదమైన జీవితానికి దారితీసేదీ, దాన్ని నిలబెట్టేదీ ఒకే ఒక్క మంచిదంటూ ఉంటే అది నీలో నువ్వు పెట్టుకునే నమ్మకం ఒక్కటే. ఇది సాధ్యం కావాలంటే తాపత్రయాలు వదిలిపెట్టాలి. ఊరికినే ఏదో ఒక పనిచేస్తూ ఉండటం, దానికదే మంచిదీ కాదు, చెడ్డదీ కాదు. ఎందుకంటే ఏకకాలంలోనే ఒక విషయం, మంచిదిగానూ, చెడ్డదిగానూ, భరించదగ్గదిగానూ, భయపెట్టేదిగానూ ఉండటం అసాధ్యం.

నిజానికి ఇక్కడ తాపత్రయం అని నేను అనువదించాను గాని, సెనెకా దాన్ని పని అనే అన్నాడు. పనిని ఆయన ఎందుకు నిరసిస్తున్నాడు? ఈ మాటలు వినండి.

పని మంచిది కాదు. మరేది మంచిది? పనిని పక్కన పెట్టడం. అందుకనే నిరర్థకంగా పనిచేసేవాళ్ళని నేను ఈసడించుకుంటూ ఉంటాను. అదే ఒక మనిషి గౌరవించదగ్గ వాటికోసం కృషిచేస్తున్నాడనుకో, అప్పుడు అతడు ఎంతగా కష్టపడితే, అంతగా పురోగమిస్తాడు. నేనతడి ప్రయత్నాల్ని మెచ్చుకుంటూ, ‘లే, గట్టిగా ఊపిరి పీల్చుకో, ఆ కొండ ఎక్కెయ్యి, ఇంకా వీలయితే, ఒక్క అంగలో పైకి ఎగబాకు’ అని అరిచి మరీ ప్రోత్సహిస్తాను.

కాబట్టి సెనెకా తిరస్కరిస్తున్నది పనిని కాదు, తాపత్రయాన్ని, నిరర్థకంగా చెమటోడ్చడాన్ని. అందుకనే ఆ తర్వాత పేరాలో ఇలా రాస్తున్నాడు:

పని ఉత్తమమానసాలకు పోషకాహారం.

ఇందాకా నిరర్థకమైన పనిని తిరస్కరించమన్నాడు కదా, ఇప్పుడు ఏమంటున్నాడో చూడండి:

కాని చిన్నపాటి పని, అనవసరమైన పని, మరీ ఏమంత గొప్ప ప్రయోజనాల కోసం ఉద్దేశించబడని పని, అది చెడ్డపని కాదా అని అడగొచ్చు నువ్వు. కాదంటాను. గొప్ప పనులకోసం చేసే పని కన్నా తక్కువదేమీ కాదంటాను. ఎందుకంటే నీతో చెమటోడించేది, ఏటికి ఎదురీదేలా చేసేదీ, ఆ శక్తి నిజానికి ఆత్మశక్తి.  ‘నువ్వెందుకు మందగిస్తున్నావు? స్వేదానికి భయపడటం మనుషుల లక్షణం కాదు’ అని చెప్తుంది అది. అంతేకాక, నడత పరిపూర్ణం కావాలంటే, నీ మనఃస్థితి సమగానూ, నీ జీవన ప్రణాళిక ఎప్పటికీ తనకు తాను అనుగుణంగానూ  ఉండాలి. ఇది సాధ్యం కావాలంటే, కేవలం విషయాల గురించిన పరిజ్ఞానం ఉంటే సరిపోదు. ఏవి మనుష్య విషయాలో, ఏవి దైవ విషయాలో గుర్తుపట్టగలిగే కళ కూడా ఉండాలి. మంచి అంటే ఇదే అసలైన మంచి. ఒకసారి నువ్వు ఈ మంచిని పట్టుకోగలిగితే, నువ్వు దేవుళ్ళకి, దాసుడివి కావు, సహచరుడివి కాగలుగుతావు.

మరి ఆ స్థితికి చేరడం ఎలా సాధ్యపడుతుంది అని మనం తప్పనిసరిగానే ఆలోచిస్తాం. ఆ ప్రశ్న కూడా తనే వేసుకుని, సెనెకా ఇలా అంటున్నాడు:

ప్రకృతి నీకు అందుకు తగ్గ సాధనసంపత్తి సమకూర్చింది. నువ్వు వాటి పట్ల మొహం చాటెయ్యకపోతే, అవి నిన్ను దేవుడిస్థాయికి తీసుకువెళ్తాయి. నీ డబ్బు నిన్ను దేవుడికి సమానం చెయ్యలేదు. ఎందుకంటే దేవుడికి ఆస్తిపాస్తుల్లేవు. నీ రాజవస్త్రాలు ఆ పనిచెయ్యలేవు. దేవుడు ఏ వస్త్రాలూ ధరించడు కాబట్టి.  లేదా నీ సంకల్పాలు, నీ కీర్తిప్రతిష్టలు, నీ పటాటోపం, ప్రపంచమంతా మార్మ్రోగే నీ పేరు ఇవేవీ కూడా పనిచెయ్యవు, ఎందుకంటే, ప్రపంచంలో ఎవరికీ దేవుడి గురించి తెలియదు. చాలామందికి ఆయనంటే చిన్నచూపు. అలా దేవుణ్ణి కించపరుస్తున్నందుకు వాళ్ళేమీ కష్టాలకు గురికావడం లేదు కూడా. వీథుల్లోనూ, విదేశాల్లోనూ, నీ సామాను మోసుకు తిరిగే నీ బానిసల మంద కూడా నీకు ఈ విషయంలో సాయం చెయ్యలేరు. ఎందుకంటే, నేను మాట్లాడుతున్న ఈ దేవుడు, ప్రాణులన్నిటిలోనూ అత్యున్నతుడు, అత్యంత శక్తిమంతుడు, సమస్తాన్నీ తన భుజాల మీద తానే మోస్తుంటాడు. అలాగని అందం, బలం లాంటివి కూడా నీకు ధన్యత చేకూర్చలేవు, కారణం, అవి కనీసం నీ వృద్ధాప్యం దాకా కూడా నీతో కలిసి రావు కనుక.

బహుశా దైవప్రేమికులు అన్ని కాలాల్లోనూ, అన్ని సంస్కృతుల్లోనూ దేవుడి గురించి ఇలానే కీర్తించారు. అయితే, సెనెకా ఉద్దేశ్యం మనల్ని భక్తులుగా మార్చడం కాదు. మనం దైవానికి సహచరులం కావడం ఎలా అన్నదే అతడి ప్రశ్న. ఉత్తరంలో ఈ చివరి వాక్యాలు చూడండి:

కాబట్టి మరొకరి అదుపులో ఉండే శక్తిని, కాలం తాకిడికి వీగిపోని శక్తిని మనం కోరుకోవాలి. ఏమిటది? అది మన ఆత్మ, మన అంతరంగం, మన అంతఃకరణ. ప్రతి ఒక్కరి హృదయంలో అతిథిగా నివసించే దేవుణ్ణి కాక మరి దేనిని మనం ఆత్మ అని పిలవగలుగుతాం? మనం రోమన్ ప్రభువు అనీ, అప్పుడే స్వేచ్ఛ పొందినవాడి కొడుకు అనీ, బానిస అనీ అంటున్నామంటే ఆ మాటలకి అర్థమేమిటి? అవి ప్రాపంచిక ఆరాటాలనుంచో, అన్యాయాలనుంచో పుట్టిపెరిగిన సామాజిక అంతస్తులు తప్ప మరేమీ కాదు కదా. ఈ మురికివాడలనుంచే మనిషి ఒక్క గెంతులో స్వర్గానికి ఎగబాకగలడు. లే, భగవంతుడితో బాంధవ్యానికి తగ్గట్టుగా నిన్ను నువ్వు మలుచుకో. అలాగని ఈ అనుకృతి వెండితోనో, బంగారంతోనో మలఛఢలిగేది కాదు. భగవంతుడి అనుకృతి అట్లాంటి వస్తువులతో సాధ్యపడేది కాదు. గుర్తుందా, దేవతలు మనుషుల పట్ల దయగా ఉన్నరోజుల్లో వాళ్ళని చెక్కడానికి మట్టిబొమ్మలు సరిపొయ్యేవి.

23-12-2022

2 Replies to “సెనెకా ఉత్తరాలు-8”

  1. ఒకసారి ఎవరైన ఈ మంచిని ( Chinaveerabhadrudu అనే పేరుగల Website ) పట్టుకోగలిగితే, వాళ్లు దేవుళ్లకి దాసులు కారు, సహచరులు అవుతారు. ధర్మరాజును అనుసరించి ఒ శునకం స్వర్గం చేరినట్టు.. 💯👍🙏

Leave a Reply

%d bloggers like this: