సెనెకా ఉత్తరాలు-7

ఇరవై మూడవ ఉత్తరం

జ్ఞానాన్ని ఇష్టపడటం వల్ల కలిగే ఆనందం అనేది ఒకటుంది. మనిషి పొందగల అన్ని ఆనందాల్లోనూ అది అత్యున్నతమైన ఆనందం అని చాలామంది ఆలోచనాపరులు, తత్త్వవేత్తలు చెప్తూ వచ్చారు. సెనెకా కూడా ఆ విషయాన్నే ఇరవై మూడవ ఉత్తరమంతా రాసాడు. ఆ ఉత్తరం మొత్తం ఒక మంగళమయ ప్రసంగం. అసలు ఆ మొత్తరం మొత్తం అనువదించాలని ఉంది. ఇదిగో, కొన్ని వాక్యాలు చూడండి:

ఆరోగ్యవంతమైన మనస్సుకి ఆధారం ఏది అని అడుగుతావా? అయితే విను, అనవసరమైన విషయాల్లో సంతోషం పొందకపోవడమే చక్కటి మనస్సుకి పునాది. ఏమన్నాను? పునాది అని కదా? కాదు, అది గోపురం కూడా.

నా తొలియవ్వనకాలంలో, డిగ్రీలో చేరిన కొత్తలో, వివేకానందుల రచనలు చదువుతూ ఉంటే, నాకొక వాక్యం కనిపించింది. జీవి క్షుద్రమయ్యే కొద్దీ ఇంద్రియాల ద్వారా సంతోషాన్ని కోరుకుంటుంది అని. ఆ వాక్యం నాకు అంత సులభంగా అర్థం కాలేదు. నిజం చెప్పాలంటే భయపెట్టింది కూడా. ఇనుపనరాలూ, ఉక్కుకండరాలూ కోరుకున్న మనిషి శారీరిక ఆనందాన్ని ఎందుకింత హీనంగా పరిగణించేడు అని. కాని ఏళ్ళు గడిచాక, ఎన్నో ఆటుపోట్లకు గురయ్యాక, నాకు ఆయన ఒక ప్రాచీన ఉపనిషద్వాక్యాన్నే తన మాటల్లో చెప్పాడనిపించింది. ఉపనిషత్తు ‘నాల్పే సుఖం అస్తి, యోవై భూమా, తత్సుఖం’ అంది. అంటే ‘అల్పమైనదానిలో సుఖంలేదు. ఈ విశ్వమంతా ఆవరించిన మహావిషయం ఏముందో, దానిలో మాత్రమే సుఖం ఉంది’ అని.

చిన్న చిన్న సుఖాలు, సరదాలు, సంతోషాలు ఆ క్షణానికి, ఆ రోజుకి, ఆ రోజులకి ఎంతో విలువైనవి అనిపించవచ్చుగాక, కాని వాటికోసం మనం వ్యయపరిచే జీవశక్తి, వాటికోసం పడ్డ సంఘర్షణ, ఒకసారి ఆ కాలం గడిచిపోగానే ఎంతో వృథాచేసినట్టుగానూ, అనవసరమైన వాటికోసం తపన పడ్డట్టుగాను అనిపించడం దాదాపుగా ప్రతి ఒక్కరికీ అనుభవంలోకి వచ్చే ఉంటుంది. కాని, అలా మర్నాడు పశ్చాత్తాపానికి లోనుకాని సంతోషాలు జీవితంలో కొన్నైనా మనం లోనుకాకుండా ఉండేవి లేకపోలేదు. కాని ఆ సంతోషం బయటివాటి మీద కాక నీ అంతరంగసంతోషం మీద ఆధారపడ్డవి కావడమే వాటి విశిష్టత. సెనెకా అదే రాస్తున్నాడు:

మన సంతోషానికి మనం బయటివస్తువుల మీద ఆధారపడటం లేదని గ్రహించగలిగితే మనం నిజంగా ఎంతో ఔన్నత్యానికి చేరుకున్నట్టు. అలాకాక, బయటిదానిమీద, అది ఎంత అందుబాటులో ఉండనీ, ఎంత సులభంగా చేతికి అందనీ, అలాంటి ఆకాంక్షలు నిన్నెప్పుడూ మోసం చేసి ఉండకపోనీ, అయినా కూడా అలాంటి వాటి విషయంలో మనిషి తన సంతోషం నిజంగా నిశ్చయమని భావించలేడు.

ఇంకా ఇలా రాస్తున్నాడు:

అన్నిటికన్నా ముఖ్యంగా,లుసిలియస్, నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో. సంతోషాన్ని ఎలా అనుభూతి చెందాలో నేర్చుకో. మన హృదయాల్ని ఆహ్లాదపరచగల ఏదో ఒక ఆశని పట్టుకు వేలాడవద్దని చెప్తున్నప్పుడు నీకు ఆకస్మికంగా నీకు లభించగల సంతోషాలకి అడ్డుపడుతున్నానా? కానేకాదు. ఆ మాటకొస్తే నువ్వు సంతోషానికి ఎప్పటికీ దూరం కాకూడనే నా కోరిక. కాని ఆ సంతోషమేదో నిజంగా నీలో ఉంటే అది నీకు నీ ఇంట్లోనే దొరికేది కావాలన్నదే నా ఉద్దేశ్యం. బయటివస్తువులేవీ కూడా ఒక మనిషి హృదయాన్ని నిజంగా సంతోషపెట్టగలిగినవి కావు. అవి అతడి అలసటని తగ్గించగలవేమోగాని, అవి స్థిరంగా సంతోషపెడతాయని మాత్రం చెప్పలేను.  పైకి నవ్వుతూ కనిపించే ప్రతి ఒక్కడూ సంతోషంగా ఉన్నట్టే అని నువ్వనుకుంటే మాత్రం నేనేమీ చెప్పలేను. కాని నిజంగా బయటి పరిస్థితుల్తో సంబంధం లేకుండా సదా నిశ్చయంగానూ, సంతోషంగా ఉండవలసింది అంతరంగం తప్ప మరొకటి కాదు.

ఈ మాటలు ఎన్నో యుగాలుగా, మానవప్రేమికులు, శ్రేయోభిలాషులు చెప్తూ వస్తున్న మాటలే. కాని సెనెకా చెప్తున్నప్పుడు వినడం కూడా బావుంది. ఆయన ఇంకా ఇలా రాస్తున్నాడు:

నిజమైన సంతోషం, నిజానికి, గంభీరమైన విషయం. ఎవరేనా బలాదూరుగా మొహం పెట్టి మృత్యువుని నిరాకరించగలరా? లేదా నవ్వుతూ, తుళ్ళుతూ? ఎవరేనా అలాంటి చిత్తంతోనే పేదరికానికి తలుపులు తెరవగలరా? తన సుఖాల్ని నియంత్రించుకోగలరా? వేదనని, నొప్పిని సహించగలరా? ఎవరు తన హృదయంతో వీటిని సంభావించగలడో అతడు నిజంగా ఆనందమయుడు అని చెప్పవచ్చు. అయితే అది ఉల్లాసకరమైన ఆనందం కాకపోవచ్చు. కాని నువ్వు పొందాలని కోరుకుంటున్న ఆనందం మాత్రం ఇదే. అది ఎక్కణ్ణుంచి పుడుతుందో ఒకసారి తెలుసుకుంటే అది ఇక నిన్నెప్పటికీ నిరాశపర్చదు.

ఉల్లాసకరమైన సంతోషమూ, గంభీరమైన సంతోషమూ అని సెనెకా విడగొట్టిన ఈ రెండు రకాల సంతోషాల్నీ కఠోపనిషత్తు ప్రేయస్సు, శ్రేయస్సు అన్నది. రెండూ సంతోషకరమైనవే. కాని మొదటిది inconsistent, రెండోది consistent. కాలాన్ని బట్టి గతులు మార్చుకోనిది. ఆ గంభీరమైన సంతోషం ఎలా సాధ్యపడుతుంది? ఇదిగో, ఈ మాటలు వినండి:

కాబట్టి, లుసిలియస్, నిన్ను ప్రార్థిస్తున్నాను, నిన్ను నిజంగా సంతోషంగా ఉంచే ఆ ఒక్క పనీ చెయ్యి. బయటికి మిరుమిట్లు గొల్పుతూ నిన్ను చేరబిలుస్తున్న ఆ విషయాలన్నిటినీ కాలితో మట్టెయ్యి. మరొకరు చూపించేవిగానీ లేదా మరొకరిద్వారా పొందగలవు అనుకునేవి కానీ, వాటన్నటినీ పక్కకు నెట్టెయ్యి. ఆ పరమశుభప్రద సంతోషంకోసం నీ లోపలకి చూసుకో. నీ లోపలనుంచి ఏది ఊటలూరుతున్నదో దానిలోనే సంతోషించు. ‘నీ లోంచి ‘అని అంటున్నప్పుడు నేను దేన్ని సూచిస్తున్నాను? నేను చెప్తున్నది నీ అంతరంగం గురించి. నీ అంతరంగమే నీలోని అత్యుత్తమ భాగం. నీ దేహమంటావా, అది లేకపోతే, నువ్వేదీ చెయ్యలేవు, సాధించలేవు, నిజమే, కాని, అది అవసరమైనదే తప్ప, ముఖ్యమైంది కాదు. మన దేహం మనల్ని వృథాసుఖాలవైపూ, తాత్కాలిక సంతోషాలవైపూ లాగుతుంది. అవన్నీ తర్వాత మనల్ని పశ్చాత్తాపానికి గురిచేసేవే. కఠోరమైన ఆత్మనియంత్రణ లేకపోతే, సుఖాల్ని వాటి హద్దుల్లో ఉంచకపోతే, అవి తొందరలోనే దుఃఖాలుగా మారిపోతాయి.

ఈ మాటలు మనం ఎన్నో సార్లు ఎందరో పెద్దవారిద్వారా విన్నవే. కాని సమస్య ఎక్కడ వస్తుందంటే, తాత్కాలిక సుఖానికీ, శాశ్వత సంతోషానికీ మధ్య సరిహద్దు ఏదో గుర్తుపట్టడం దగ్గర. మనల్ని నియంత్రించుకుంటున్నప్పుడు, అది మరీ మన జీవితాల్ని ఎండగట్టుకోవడమూ కాకూడదు, అలాగని కూరుకుపోవడమూ కాకూడదు అనుకున్నప్పుడు, ఆ మధ్యేమార్గం ఎలా ఉండాలో తెలుసుకోవడం దగ్గర. ఈ విషయంలో సెనెకా చెప్పే మాటలు ఇలా ఉన్నాయి:

నిజంగా శ్రేయోదాయకమైంది ఎలా ఉంటుంది, అది ఎక్కణ్ణుంచి ప్రభవిస్తుంది అని అడుగుతున్నావా? అయితే విను: అది నిర్మలమైన అంతఃకరణలోంచి ప్రభవిస్తుంది. గౌరవించదగ్గ సంకల్పాలనుంచి ఉద్భవిస్తుంది. సరైన పనులనుంచీ, ఆకస్మికంగానూ, యాథాలాపంగానూ మనకి లభించే కానుకలని నిరాకరించడం నుంచీ, కేవలం ఒకే ఒక్కదారిని పట్టుకుని సమంగానూ, తొట్రుపాటులేకుండానూ సాగించే జీవితగమనం నుంచీ ప్రసరిస్తుంది. ఒక పని నుంచి మరొక పనికి ఊరికే గెంతుకుంటూపోయే మనుషులు గెంతడం కూడా కాదు, కొట్టుకుపోతారు. తమ ఉద్దేశ్యాలు, ఆచరణ స్థిరంగా ఉండని మనుషులకి స్థిరమైన శుభాలు ఎలా చేకూరుతాయి?

బుద్ధుడు దీన్ని అష్టాంగమార్గం అన్నాడు. సెనెకా అంత సమగ్రమైన తత్త్వదృష్టితో మాటాడలేదుగాని, తన మాటల్లో అతడు అన్నిటికన్నా ముఖ్యంగా, స్థిరత్వానికి, పొందికకి ఎక్కువ ప్రాధాన్యమిచ్చినట్టుగా కనిపిస్తున్నది. నీ ఆనందం శాశ్వతమైనది కావాలంటే, నీ ఆలోచనల్లో స్థిరత్వం, ఏకరూపత, ఒక ఒద్దిక, ఒక పొందిక ఉండాలి. ఇంతకు ముందు ఒక ఉత్తరంలో కూడా ఈ విషయమే చెప్పాడు. ఏది కోరుకున్నా ఎప్పుడూ అదే కోరుకుంటూ ఉండటం, ఏది నిరాకరించినా ఎప్పుడూ దాన్నే నిరాకరిస్తూ ఉండటం అని.

నైతికమైన జీవితం గురించి ఎవరు రాసినా ఎందుకు చదవాలంటే, ఆ విషయాలు మనకు తెలియనివి అని కాదు. కాని తెలిసి కూడా ఎందుకు మనం ఆచరణలోకి తెచ్చుకోలేకపోతునన్నామో పరిశీలించుకోవటానికి. ఆ అంతర్దృష్టి, ఒక్కొక్కరిని చదువుతున్నప్పుడు, ఒక్కోలా మనలో తేటపడుతుంది. ఈ ఉత్తరమే చూడండి. ఇందులో చివరికి ఎపిక్యూరస్ రాసిన ఒక వాక్యంతో ముగిస్తాడు. ఎపిక్యూరస్ అన్నాడట: ‘ప్రతి సారీ బతకడం మొదలుపెట్టడంలో చెప్పలేనంత చికాకు ఉంటుంది’ అని. దాని అర్థం ఎప్పటికప్పుడు జీవితం మీద కొత్త ఆశలు పెట్టుకోకూడదని కాదు, అసలు ఇప్పటిదాకా జీవించిన జీవితాన్ని ఒక్కసారేనా నువ్వు మనస్ఫూర్తిగా నెమరువేసుకున్నావా? ‘హా, నేను జీవించినంతమేరకు తృప్తిగా జీవించాను’ అని ఒక్కసారేనా అనుకున్నావా? అలా అనుకున్నట్లయితే, ప్రతి రోజూ నీకు అదనపు బహుమానమే అవుతుంది. లేదా, ఇప్పటిదాకా ఏదీ పొందలేదనీ ఇక మీదట రేపన్నా బతకడం మొదలుపెడదామనీ అనుకుంటే, ఆ రేపు ఎప్పటికీ రానేరాదు.

మనవాళ్ళు జన్మరాహిత్యం కోరుకున్నారు అంటే దాని అర్థం, మనం చనిపోయేక, మరొక జన్మ ఎత్తకూడదని కాదు. అసలు ఈ జన్మలోనే, మళ్ళా గానుగెద్దులాగా తిరిగిన ఈ దారిలోనే, ఈ నలుగులాట మరొకసారి పడవలసిన అవసరం లేకుండా ఉండాలనే. నిజంగా జీవన్ముక్తి అంటూ ఉంటే, అది నువ్వు జీవించిన జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగిచూసుకుని, ఏది పొందావో దానికి కృతజ్ఞతగా కైమోడ్చి ఈ ప్రపంచం నుంచి ఎప్పుడు సెలవు తీసుకోడానికైనా మానసికంగా సిద్ధంగా ఉండటం. అప్పుడు మాత్రమే టాగోర్ గీతాంజలి (16) లో రాసినట్టుగా ఇలా అనుకోగలుగుతాం:

ఈ జీవితోత్సవానికి నాకు పిలుపు వచ్చింది. నా జీవితం ధన్యమయింది. నా కళ్ళు చూసాయి, నా చెవులు విన్నాయి.

ఈ పండగలో మంగళవాద్యం వాయించడం నా వొంతయింది. నేను శాయశక్తులా నా బాధ్యత నెరవేర్చాను.

ఇక ఇప్పుడు ఇక్కణ్ణుంచి సెలవు తీసుకుని నీ ఎదట నిలబడి నిశ్శబ్దంగా నీ ముందు మోకరిల్లే సమయం వచ్చిందా అని అడుగుతాను.

22-12-2022

2 Replies to “సెనెకా ఉత్తరాలు-7”

Leave a Reply

%d bloggers like this: