సెనెకా ఉత్తరాలు-6

పదహారో ఉత్తరం

గత శతాబ్దంలో ప్రపంచ యుద్ధాల కాలంలో సైనికులకీ, సైనికాధికారులకీ స్టోయిక్కులు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. ఎటువంటి పరిస్థితులనైనా ధీరచిత్తంతో ఎదుర్కోవడం నేర్పారు. ఈ శతాబ్దం మొదలయ్యాక మేనేజిమెంటు రంగంలో పెద్ద పెద్ద కంపెనీల సియిఓలు తమకి స్ఫూర్తికోసం స్టోయిక్కుల వైపు చూస్తున్నారు. తమ విధినిర్వహణలోనూ, బాధ్యతల్ని నెరవేర్చడంలోనూ తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యేవాళ్ళు ఎవరైనా, ఏ రంగంలో ఉన్నా, వారు తమని తాము కూడదీసుకోవడానికి స్టోయిక్కులకి దగ్గరగా జరుగుతున్నారు. గత పదేళ్ళల్లో ఈ ధోరణి మరింత బలపడుతూ ఉంది. ఎందుకని? ఎందుకో చెప్పాలంటే, సెనెకా రాసిన పదహారో ఉత్తరం మొత్తం అనువదించవలసి ఉంటుంది. ఆ ఉత్తరంలో ఇలా అంటున్నాడు:

విధి అంటూ ఒకటి ఉన్నప్పుడు తత్త్వశాస్త్రం నాకు ఏ విధంగా సాయం చేస్తుంది? ఈ ప్రపంచాన్ని దేవుడు శాసిస్తున్నప్పుడు తత్త్వశాస్త్రానికి ఇంక ఏమి ప్రత్యేకత ఉంది? ఒకవేళ ఈ ప్రపంచ గమనం పూర్తిగా యాదృచ్ఛికతమీదనే ఆధారపడి ఉంటే, ఇక తత్త్వశాస్త్రం మటుకు చెయ్యగలిగేదేముంది? ఎందుకంటే ముందే నిర్ణయమైపోయిన విషయాల్ని మార్చడమే కాదు, ముందే ఏవిధంగానూ నిర్ణయం కాని అంశాల్ని మార్చడం కూడా అసాధ్యమే కదా. అంటే నా ప్రయత్నాల్ని దేవుడు ముందే నిర్ణయించి ఉండాలి, నేనేం చెయ్యాలో ఆయనే నిశ్చయించి ఉండాలి, లేదా అసలు నా ప్రణాళికలు నేను సంకల్పించినట్టు నడవకుండా విధి అడ్డుపడుతూనే ఉండాలి కదా ‘ అని ఎవరేనా అడగవచ్చు. సత్యం ఈ దృక్పథాల్లో ఎక్కడైనా ఉండవచ్చుగాని, లుసిలియస్, మనం తత్త్వవేత్తలుగా జీవించక తప్పదు. ఒక అనుల్లంఘ్యనీయమైన శాసనానికి విధి మనల్ని కట్టివెయ్యవచ్చుగాక, దేవుడు ఒక న్యాయప్రదాతగా ఈ విశ్వాన్ని చక్కదిద్ది ఉండవచ్చుగాక, ఏ పద్ధతీ లేకుండా యాదృచ్ఛికత తన ఇష్టం వచ్చినట్టు మనుషుల జీవితాల్ని తల్లకిందులు చేస్తూ ఉండవచ్చుగాక, తత్త్వశాస్త్రం మాత్రం మన రక్షణకు రావలసిందే. ఆమె వల్లనే మనం దైవాజ్ఞను సంతోషంగా అనుసరించగలుగుతాం. విధిని ధిక్కరించగలుగుతాం. యాదృచ్ఛికతను సహించగలుగుతాం.

తత్త్వశాస్త్రం, అంటే మనలోకి మనం చూసుకోగలడం, వస్తువుల, పై పై పూతల దగ్గర ఆగిపోకుండా,విషయాల లోతుకి వెళ్ళి పరిశీలించగలగడం, అని అనుకుంటే అది మనల్ని ఈ మూడింటి ఎదటా, అంటే నిష్ఠుర కార్యకారణ సంబంధం ఎదుటా, దేవుడి ఎదటా, యాదృచ్ఛికత ఎదటా కూడా నిర్భయంగా నిలబెట్టగలుగుతుంది. ఈ మాటలు చూడండి:

లుసిలియస్, నీకు ఇప్పటికి స్పష్టమైందనుకుంటాను. తత్త్వశాస్త్ర అధ్యయనం లేకుండా ఏ మనిషీ కూడా సంతోషకరంగా జీవించలేడు, ఇంకా చెప్పాలంటే, జీవితాన్ని నడుపుకోలేడు.  మన వివేకం, మన జ్ఞానం ఎప్పుడు పరిపూర్ణత పొందుతాయో అప్పుడు మనం సంతోషకర జీవితాన్ని అందుకున్నట్టు అని గుర్తుపెట్టుకో. కనీసం మన వివేకం ఉదయించడం మొదలయినా కూడా మన జీవితం జీవించదగ్గదిగా మారుతుంది. ఎంతో విశదంగా ఉన్న ఈ విషయం రోజురోజుకీ నీ మనసులో మరింత బలపడాలి, నీ దైనందిన చింతనవల్ల లోతుగా వేళ్ళుతన్నుకోవాలి.   ఇప్పుడు నీలో మంచి సంకల్పంగా ఉన్నది దృఢనిశ్చయంగా మారేదాకా కొత్త తీర్మానాలు చేసుకోవడం కన్నా నువ్వు ఇప్పటికే గ్రహించిన సత్యాల్ని పరిరక్షించుకోవడం ఎక్కువ అవసరం… నిన్ను నువ్వు పరిశీలించుకో, పరీక్షించుకో, రకరాల మార్గాల్లో నిన్ను నువ్వు పరికించుకో, నువ్వు పురోగతి సాధించింది వయసులోనో లేక నీ వివేకంలోనా అన్నది తేల్చుకో. తత్త్వశాస్త్రమంటే ప్రజల్ని ఆకట్టుకునే ఇంద్రజాలం కాదు, అది ప్రదర్శన కోసం రూపొందింది కాదు. అది మాటల గారడి కాదు. యథార్థాలకూ, వాస్తవాలకూ చెందిన వ్యవహారం. మనం దాన్ని సాధన చెయ్యవలసింది, రోజు గడిచిపొయ్యేలోగా ఇంత వినోదం పొందడానికి కాదు, లేదా, మన పని ఒత్తిడినుంచి విశ్రాంతి పొందడానికి కాదు. అది మన ఆత్మని మలుస్తుంది, నిర్మిస్తుంది, మన జీవితాన్ని చక్కదిద్దుతుంది, మన ప్రవర్తనకి దారి చూపుతుంది. మనం ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో తెలియపరుస్తుంది. అనేక అనిశ్చయాల మధ్య మనం ఊగిసలాడుతున్నప్పుడు చుక్కాని తన చేతుల్లోకి తీసుకుని అది మనని సరైన తోవన నడిపిస్తుంది. తత్త్వశాస్త్రం లేకుండా ఎవరూ ప్రశాంతచిత్తంతో గాని, నిర్భయంగా గాని జీవించలేరు. పొద్దున్న లేచినప్పణ్ణుంచి అసంఖ్యాకమైన విషయాల్లో మనకి సలహా సూచనలు అవసరమవుతాయి. ఆ సలహాల కోసం మనం తత్త్వశాస్త్రం వైపే చూడవలసి ఉంటుంది.

నిజానికి ఫిలాసఫీ అనే పదానికి తత్త్వశాస్త్రం లేదా దర్శనం రెండూ కూడా సమానార్థకాలు కావు. దాని అసలు అర్థం జ్ఞానం పట్ల ప్రేమ అని. జ్ఞానం అంటే వాక్చాతుర్యం కాదు. లేదా నీతి సూత్రాలు బోధించడమూ కాదు. అది నీ దైనందిన జీవితాన్ని దాటిన ఒక సంతోషం. జీవితం గురించీ, జీవిత ప్రయోజనం గురించీ, విలువల గురించీ మరిదేని గురించైనా సరే లోతుగా ఆలోచించడం. పై పై భ్రమల్లో కూరుకుపోకుండా నిన్ను నువ్వు కాపాడుకోవడం. దానివల్ల నీ మనసుకొక నిశ్చలత సిద్ధిస్తుంది. దాన్ని గ్రీకులో ataraxia అంటారు. ఎపిక్టెటస్ దృష్టిలో తత్త్వశాస్త్రం వల్ల మనిషికి లభించే సిద్ధి అది.

దుఃఖాలకి కుంగిపోకుండానూ, సుఖాలకి పొంగిపోకుండానూ ఉండే ఆ మనస్థితిని భగవద్గీత స్థితప్రజ్ఞత అంది. అటువంటి స్థితి వల్ల మనిషి సాధించేదేమిటి? అప్పుడు అతడు తనను తాను గుర్తుపట్టడానికి బయటి పరిస్థితులమీద ఆధారపడడు. దానివల్ల అతడికి జీవితం మరింత స్థిరంగానూ, స్పష్టంగానూ అనుభవానికి వస్తుంది.

ఈ విషయాన్నే ఈ ఉత్తరంలో మరింత చక్కగా ఇలా వివరిస్తున్నాడు:

ఇది కూడా ఎపిక్యూరస్ చెప్పిన వాక్యమే. నువ్వు ప్రకృతికి అనుగుణంగా జీవిస్తే నిన్నెప్పటికీ లేమి బాధించదు. ఇతరుల అభిప్రాయాల ప్రకారం జీవిస్తే ఎప్పటికీ కలిమి పొందలేవు. ప్రకృతి అవసరాలు బహుస్వల్పం. ఇతరుల అభిప్రాయాల గొంతెమ్మ కోరికలు అసంఖ్యాకం. ఉదాహరణకి ఎందరో కోటీశ్వరుల ఆస్తిపాస్తులు నీకు సంక్రమించాయి అనుకుందాం. నీ భాగ్యం కలీసి వచ్చి నీ సంపదకి హద్దులేదనుకుందాం. బంగారం, చీనిచీనాంబరాలు, నువ్వు మొయ్యలేనంత రత్నాల రాశులు నీ ఇంట్లో పాలరాతి నేలమాళిగలో కప్పెట్టారనుకుందాం, అంటే నువ్వు సంపదలమీదనే నడుస్తుంటావన్నమాట. వీటికి తోడు ఇంకా శిల్పాలు, చిత్రలేఖనాలు, విలాసవంతమైన కళాఖండాలూ వీటన్నిటినీ కూడా జోడించు. అయినా కూడా నీ దాహం చల్లారడం లేదని నీకు బోధపడుతుంది. అదే ప్రాకృతిక అవసరాలంటావా. పరిమితం. అదే దోషపూరితమైన అభిప్రాయాలు నీమీద మోపే బరువుకి మాత్రం అంతం ఉండదు. నువ్వు రహదారిమీద పోతున్నావనుకో, ఆ దారి ఎక్కడో ఒకచోట ముగిసి తీరుతుంది. అదే దారితప్పావనుకో, ఇక నీ తిరుగులాటకి అంతే ఉండదు.

మనమేదైనా కోరుకుంటున్నప్పుడు అది ప్రకృతికి అనుగుణంగా ఉందా లేక అభిప్రాయాల ఉరవడిలో పడిపోతున్నామా ఎలా తెలుస్తుంది? ఇదిగో, ఈ మాటలు చూడండి:

కాబట్టి సోమరి కోరికలనుంచి వెనకడుగు వెయ్యి. నువ్వు కోరుకుంటున్నది ప్రకృతికి అనుగుణంగానా, లేక అభిప్రాయాల ఒత్తిడిమీదనా అన్నది తెలుసుకోవాలనుకుంటే, ముందు ఆ కోరిక ఎక్కడో ఒకచోట ఆగుతుందా లేదా చూసుకో. నువ్వు చాలా దూరం ప్రయాణించాక కూడా, ఆ గమ్యం ఇంకా దూరంగా కనబడుతోందనుకో, ఆ కోరిక ప్రకృతికి అనుగుణంగా లేదని నువ్వు నిశ్చయంగా నమ్మొచ్చు.

పదిహేడో ఉత్తరం

జీవితంలో దేన్నైనా వాయిదా వెయ్యవచ్చుగాని, జ్ఞాన సముపార్జన మాత్రం వాయిదా వెయ్యకూడదనేది పదిహేడో ఉత్తరంలో సారాంశం. తత్త్వదృష్టిని పెంపొందించుకోవడానికి సంపదలు ఎంత మాత్రమూ సహకరించవనీ, పేదరికం- ఐచ్ఛికంగా స్వీకరించే పేదరికం- మాత్రమే దానికి పూర్తి సహకారం అందించగలదని చెప్తాడు. సైన్యాలు యుద్ధం చేస్తున్నప్పుడు అన్నిరకాల కష్టనష్టాల్నీ భరిస్తాయనీ, పేదరికాన్నీ, కొరతనీ పూర్తిగా అనుభవిస్తాయనీ చెప్తూ, అదంతా ఎందుకు, మరొకరి రాజ్యాన్ని కైవసం చేసుకోవడం కోసమే కదా అంటాడు. కాబట్టి ముందు సంపదలు సమకూర్చుకుని ఆ తర్వాత తత్త్వచింతన చేస్తాననడంలో అర్థం లేదనీ, తత్త్వశాస్త్రం జీవితంలో కోరుకోవలసిన వాటిల్లో చిట్టచివరిది కాదనీ, నిజానికి అదే మొదటి అవసరం కావాలనీ చెప్తూ, ఇలా అంటున్నాడు:

ఎపిక్యూరస్ అంటున్నాడు: చాలామందికి సంపదలు కూడగట్టుకోవడం వాళ్ళ సమస్యలకి ముగింపు కాక మార్పు మాత్రమే అని. అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే సమస్య సంపదతో కాదు, మనఃస్థితితో. పేదరికాన్ని మనకు ఏది దుర్భరంగా చేసిందో, అది సంపదల్ని కూడా దుర్భరం చెయ్యగలదు. నువ్వు రోగిని చెక్కబల్లమీద పడుకోబెట్టినా, బంగారపు బల్లమీద పడుకోబెట్టినా రోగమయితే తగ్గిపోదు కదా. కాబట్టి రోగిష్టి మనస్సు బీదరికంలోగాని, సంపదల మధ్యగాని రోగిష్టిగానే కొనసాగుతుంది.

(పద్ధెనిమిదవ ఉత్తరం గురించి మనం మొదటి వ్యాసంలోనే చర్చించుకున్నాం)

పందొమ్మిదో ఉత్తరం

ప్రాపంచిక జీవితం నుంచి, ప్రాపంచిక కార్యకలాపాలనుంచి బయటపడి వీలైనంత తొందరగా వ్యవహార విరమణ చేపట్టమని చెప్పడం పందొమ్మిదో ఉత్తరంలో సారాంశం. అయితే ప్రాపంచిక వ్యవహారాలనుంచి విరమిస్తున్నానని బాహాటంగా ప్రకటించవలసిన అవసరంగాని లేదా రహస్యంగా చేయవలసిన పని గానీ లేదంటాడు.

ఇరవయ్యవ ఉత్తరం

సెనెకా మీద ఉన్న ప్రధానమైన ఆరోపణ ఏమిటంటే ఆయన మాట్లాడినమాటలకీ, ఆయన జీవనశైలికీ మధ్య చాలా తేడా ఉందని. ఆయన చాలా సంపన్నుడనీ, భోగభాగ్యాలతో తులతూగుతూ, పేదరికం గురించీ, ఐచ్ఛికంగా పేదరికాన్ని స్వీకరించడం గురించీ మాట్లాడేడని. ఆ సంపద అతడు అన్యాయంగా ఆర్జించిందని కొందరన్నారు, కాదు, న్యాయబద్ధగానే సంపాదించాడని మరికొందరన్నారు, కాని, అతడు సంపదల మధ్య జీవించాడనడంలో సందేహం లేదు.

నిజానికి సెనెకా ఉత్తరాల్లో మనం ఇంతదాకా చూసినదాన్ని బట్టి కూడా అతడేమీ పేదరికంలోనే జీవితమంతా గడిపాడని ఎక్కడా లేదు. నిజానికి సంపదల మధ్య ఉంటూ కూడా జ్ఞానిగా గడపడం ఎలాగు, రాజ్యవ్యవహారాల్లో తలమునకలుగా ఉంటూ కూడా మానసిక ప్రశాంతి సాధించడం ఎలాగు అన్నదానిమీదనే అతడి దృష్టి లగ్నమై ఉందని ఆ ఉత్తరాలు సాక్ష్యమిస్తున్నాయి.

అందుకనే ఇరవయ్యవ ఉత్తరంలో ప్రధానంగా మనం మాట్లాడుతున్నదాన్ని ఆచరణలో పెట్టడం ఎలా అన్నదానిగురించే చర్చించాడు. మాటల్లోనూ చేతల్లోనూ ఒక్కలాగే ఉండటం అనేది అత్యున్నత జ్ఞానానికి గుర్తు మాత్రమే కాక, ఒక మనిషి నిర్వహించగల అత్యున్నత బాధ్యత అని కూడా అన్నాడు. ఇక్కడే ఒక చక్కటి మాట కూడా రాసాడు:

జ్ఞానం గురించిన పాతకాలపు నిర్వచనాలన్నీ పక్కనపెట్టి ఒక మనిషి మొత్తం జీవితానికి వర్తించేలాగా ఒక మాట చెప్పమంటే, నేనిలా చెప్తాను: జ్ఞానమంటే ఏమిటి? నువ్వేది కోరుకుంటున్నావో, ఎప్పుడూ అదే కోరుకోవడం, ఏది వద్దనుకుంటున్నావో, ఎప్పటికీ దాన్నే వద్దనుకోవడం. ఈ మాటకి అదనంగా ఒక షరతు చేరిస్తే నువ్వేమీ అనుకోవనుకుంటాను. అదేమంటే, నువ్వలా కోరుకునేది ఎప్పటికీ సవ్యమైనదే అయి ఉండాలి, ఎందుకంటే, మనిషి ఒకసారి కోరుకున్నదాన్నే ఎప్పటికీ కోరుకుంటూ ఉండాలంటే అది సవ్యమైంది కాకపోతే అలా కోరుకోవడం సాధ్యం కాదు కాబట్టి.

ఒకరకంగా ఇది చాలా చక్కటి నిర్వచనం. ఎందుకంటే మన పత్లా, ఇతరుల పట్లా నిజజీవితంలో మనకి ఎదురయ్యే ప్రధాన సమస్య inconsistency నే. మనుషులు ఒకప్పుడు ఉన్నట్టుగా మరొకప్పుడు ఉండకపోవడం. నీక్కూడా ఒకప్పుడు నచ్చింది మరొకప్పుడు నచ్చకపోవడం. ఎల్లవేళలా నిన్ను తృప్తి పరచే కోరిక అంటూ నిజంగా ఉంటుందా? ఒకవేళ ఉన్నా సెనెకా చెప్పినట్టు అది సవ్యమైన కోరిక అని ఎలా తెలుస్తుంది? గాంధీ కూడా సత్యం  విషయంలో ఇదే సందిగ్ధావస్థకు లోనయ్యాడు. చివరికి ఆయన తేల్చుకున్నదేమంటే, అహింసాముఖంలో నీ అంతఃకరణ నీకు ఏమి చెప్తుందో అది మాత్రమే సత్యమవుతుందని. సెనెకా కూడా అటువంటి ఒక కొలబద్ద పెట్టుకున్నాడనీ, అది ఐచ్ఛిక దారిద్య్రం అనీ మనం అనుకోవచ్చు. అంటే నీ అంతట నువ్వు పేదరికాన్ని వరించినప్పుడు, నీకు కోరుకోవలసిన వస్తుగత విషయమేదీ లేదన్నప్పుడు, అప్పుడు నీకు ఏ కోరిక కలుగుతుందో అది తప్పకుండా సవ్యమైన కోరికనే అవుతుందని ఆయన భావించాడనిపిస్తుంది.

స్వచ్ఛంద దారిద్య్రం గురించీ, వ్యవహారాలనుంచి బయటపడటం గురించీ పదే పదే మాట్లాడుతున్న ఈ మాటలు మనం అర్థం చేసుకోగలిగినవే. ఎందుకంటే రోమ్ నైతికంగా అత్యంత పతనావస్థకు లోనవుతున్న కాలాన్ని అతడు కళ్ళారా చూసాడు. సంపదలు సమకూర్చుకోవడం కోసం మనుషులు దేనికైనా సిద్ధపడటాన్ని ఆయన చాలా దగ్గరగా చూసాడు. అతడు ఏ రాజుని పెంచి పెద్దచేసాడో, ఆ రాజు తన తల్లినీ, భార్యనీ వధించడమే కాక, చివరికి తన గురువుని కూడా వధించడానికి సిద్ధపడ్డాడు. సంపదలు, అధికారం- ఈ రెండింటినీ విడదియ్యలేం. ఈ రెండూ కలిస్తే అది సమాజాన్ని పెట్టే హింస మామూలుగా ఉండదని మనకు తెలుసు. కాబట్టి ఎలా అయితే బుద్ధుడు లోకంలో దుఃఖాన్ని నివారించాలంటే కోరికలు లేకుండా ఉండటమొక్కటే మార్గం అనుకున్నాడో, సెనెకా కూడా మనుషులు హింసనుంచి బయటపడాలంటే ఐచ్ఛికంగా దారిద్ర్యాన్ని స్వీకరించడమొక్కటే మార్గమని భావించాడు. ఈ మాటలు వినండి:

నువ్వు నా వైపు అయోమయంగా చూస్తున్నావని తెలుసుగాని, నేను ఎపిక్యూరస్ వాక్యాలకే ఋణపడి ఉన్నాను.. ఆయన అంటున్నాడు: ‘నా మాట నమ్ము. నువ్వు నిజంగా నులకమంచం మీద పడుకుని కంబళి కప్పుకున్నప్పుడే నీ మాటలు మరింత ప్రభావశీలంగా ఉంటాయ’ని. అప్పుడు నువ్వు ఏదో ఒకటి ఊరికే చెప్తూండటం కాదు, చెప్పినదాన్ని నిరూపిస్తున్నట్టు కూడా. కాని నేను ఈ సందర్భంగా డెమిట్రియస్ మాటల్ని తలుచుకుంటున్నాను. ఆయనకి కనీసం కప్పుకోడానికి కంబళి, పడుకోడానికి బొంతా కూడా లేకపోవడం చూసాన్నేను. కాని అతడు సత్యం చెప్పడమే కాదు, సత్యాన్ని చూసాడు కూడా. అతడిలా అంటున్నాడు: ‘మనిషి తన జేబులో సంపదలు ఉన్నప్పుడు వాటిని ఏవగించుకోగలడా? తన చుట్టూ సంపద పోగుపడినా కూడా, అవి తనవే అని నలుగురూ అంటూ ఉంటే కూడా, వింటూ చిరునవ్వుతూ, కాని ఎట్టిపరిస్థితిలోనూ అవి తనవి అని నమ్మకుండా ఎవరు ఉండగలరో అతడు నిజంగా మహాత్ముడు. సంపదలవల్ల కలుషితుడు కాకుండా ఉండటం మామూలు విషయం కాదు. సంపదల మధ్య కూడా నిరుపేదగా జీవించగలిగినవాడు నిజంగా మహనీయుడు.

తన మీద తన సమకాలికులూ, రాబోయే కాలాల్లో తలెత్తబోయే విమర్శకులూ, మోపుతున్న అభియోగాలకు సెనెకా ఇచ్చిన జవాబుగా మనం ఈ మాటల్ని భావించవచ్చు.

21-12-2022

Leave a Reply

%d bloggers like this: